పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసు: 2012 నుంచి 'యువతుల ఆత్మహత్య' కేసులన్నింటీనీ తిరిగి దర్యాప్తు చేస్తాం: పోలీసులు

నిరసన తెలుపుతున్న యువతి

ఫొటో సోర్స్, CHANDAN KHANNA

తనను వేధించొద్దంటూ ఓ అమ్మాయి.. తన బాయ్‌ఫ్రెండ్‌ను వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వార్త తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రముఖంగా వినిపించింది.

ఓ అమ్మాయిని వేధించిన కేసులో వసంత కుమార్, శబరీష్, సతీష్, తిరునవుక్కరసు అనే నలుగురిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు.

సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలతో స్నేహం చేసి, తర్వాత వారిని ఏకాంత ప్రదేశాలకు తీసుకువెళ్లి, వారిని లైంగికంగా వేధించి, ఆ వీడియోలను చూపి, బ్లాక్‌మెయిల్‌ చేస్తారన్న ఆరోపణలమీద ఈ నలుగురు యువకులను అరెస్టు చేశారు.

ఈ నలుగురూ తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లా పొల్లాచ్చి పట్టణానికి చెందినవారు.

ఈ వీడియో వైరల్ అయ్యాక, బాధితురాలి సోదరుడు పొల్లాచ్చి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 24న నలుగురు యువకులపై కేసు నమోదైంది. ఫిబ్రవరి 28న ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వీరిలో తిరునవుక్కరసును మార్చి 5న అరెస్ట్ చేశారు.

వీరిపై 59/19, యు/ఎస్, 354(ఏ), 354(బీ) ఐపీసీ ఆర్/డబ్ల్యూ 66(ఇ) ఐ.టి.చట్టం 2000, 2004, తమిళనాడు మహిళలపై వేధింపుల చట్టం కింద అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

సోదరుడిపై దాడి

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాక, బాధితురాలి సోదరుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. దాడికి పాల్పడ్డ వసంత కుమార్, సెంథిల్, నాగరాజ్ అనే వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

దాడి చేసినవారిలో ఒకరైన నాగరాజ్.. అధికార పార్టీ ఏఐఏడీఎంకేకు చెందిన వ్యక్తి. ఈ కేసులో అధికార పార్టీ ప్రమేయం ఉందని పలువురు విమర్శించారు. ఈ నేపథ్యంలో నాగరాజ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఏఐఏడీఎంకే పార్టీ సోమవారంనాడు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

నిరసన తెలుపుతున్న కనిమొళి, ఇతర నేతలు

పోలీసుల ఏమంటున్నారు?

ఈ కేసుకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, మరుసటి రోజునే కోయంబత్తూర్ డీఎస్పీ పాండ్యరాజన్ మీడియాకు చెప్పారు.

నిందితుల వద్ద నుంచి 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, వాటిలో నలుగురు మహిళల వీడియోలు ఉన్నాయని పోలీసులు వివరించారు. వీరిలో ఇంతవరకు ఇద్దర్ని గుర్తించామని, మరో ఇద్దరు మహిళలను గుర్తించాల్సి ఉందన్నారు.

ఆ మహిళల ఆచూకీ లభ్యమయ్యాక, వారివద్ద నుంచి కూడా స్టేట్‌మెంట్ తీసుకుని, గూండా చట్టం కింద కేసు నమోదు చేస్తామన్నారు.

బాధితులు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకువచ్చి ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు చెప్పారు.

''కేసులో ప్రధాన నిందితుడు తిరునవుక్కరసు ప్రవర్తన, తన కాలేజ్ దశ నుంచి ఇలానే ఉంది. కానీ ఇంతవరకూ బాధితుల వివరాలు, వారెందరున్నారన్న విషయంలో స్పష్టత లేదు'' అని పోలీసు అధికారులు తెలిపారు.

పొల్లాచ్చి పట్టణంలో 2012 నుంచి ఆత్మహత్య చేసుకున్న యువతుల కేసులన్నింటినీ రీఓపెన్ చేయాలని ఆల్ ఇండియా డెమొక్రటిక్ విమెన్ అసోసియేషన్‌కు చెందిన రాధిక కోరారు.

పోలీసులు కూడా.. 2012 నుంచి 'యువతుల ఆత్మహత్య' కేసులన్నింటీనీ తిరిగి దర్యాప్తు చేస్తామని, ఒకవేళ ఆ కేసులకు, ఈ నిందితులకు సంబంధం ఉందని తేలితే, శిక్షలు మరింత కఠినంగా ఉంటాయని అన్నారు.

నిరసన తెలుపుతున్న నటీమణులుఅ

ఫొటో సోర్స్, Getty Images

పోలీసులకు దొరక్కుండా మార్చి 5వరకు తప్పించుకు తిరిగిన ప్రధాన నిందితుడు తిరునవుక్కరసుకు ఓ మహిళ ఆశ్రయం ఇచ్చారు. కానీ ఆమె వివరాలు వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు.

బాధితురాలి వీడియో వైరల్ అవ్వటం, ఆమె మానసిక ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని, ఈ నేపథ్యంలో ఈ వీడియోను సోషలో మీడియాలో ఎవరైనా షేర్ చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఈ కేసుకు సంబంధించి నిర్వహించిన మొదటి మీడియా సమావేశంలో, బాధితురాలి వివరాలు వెల్లడించిన పోలీసులు, తర్వాత తమ తప్పు తెలుసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించి, కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఈ ఘటనను నిరసిస్తూ.. తమిళనాడు ప్రజలు ర్యాలీలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)