పాస్‌వర్డ్‌లు తరచూ మారిస్తే మీ అకౌంట్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఎందుకు ఎక్కువ?

పాస్‌వర్డ్‌ గుర్తు పెట్టుకోవడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎక్కువసార్లు పాస్‌వర్డ్ మార్చడం కూడా ప్రమాదకరమేనని నిపుణులు అంటున్నారు.
    • రచయిత, లూసియా బ్లాస్కో
    • హోదా, బీబీసీ న్యూస్

ఈ పాస్‌వర్డ్ తప్పు...

మీ పాస్‌వర్డ్ మార్చుకోండి...

మీ కొత్త పాస్వర్డ్, పాత పాస్వర్డ్ తరహాలోనే ఉండకూడదు...

మీ పాస్‌వర్డ్ ను మర్చిపోయి, దాన్ని రెండు మూడు సార్లు తప్పుగా టైపు చేశారా? చివరకు మీ పాస్‌వర్డ్ మార్చుకున్నారా? ఇలాంటి అనుభవం మీకెన్నిసార్లు ఎదురై ఉంటుంది?

మనం ఈ-మెయిల్, జూమ్ అకౌంట్, సోషల్ నెట్‌వర్క్ లాంటి చాలా రకాల డిజిటల్ మాధ్యమాలను వాడుతూ ఉంటాం. రకరకాల మాధ్యమాల నుంచి పాస్‌వర్డ్‌ను మార్చుకోమని మనకు తరచూ అభ్యర్ధనలు వస్తూనే ఉంటాయి.

ఇదంతా పెద్ద తలనొప్పి వ్యవహారం. వీటన్నింటినీ గుర్తు పెట్టుకోవడం ఎలా?

పాస్‌వర్డ్ గుర్తు పెట్టుకోవడం ఒక ఇబ్బంది. అయితే, తరచూ పాస్‌వర్డ్‌ను మార్చడం వల్ల కూడా హ్యాకర్ల బారిన పడే ముప్పు ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు.

కొత్త పాస్‌వర్డ్‌ల వల్ల మీ ఇంటర్నెట్ సెక్యూరిటీకి ఎలాంటి ముప్పు వస్తుంది?

పాస్‌వర్డ్ గుర్తు పెట్టుకోవడం ఒక ఇబ్బంది అయితే, ఇలా తరచుగా పాస్‌వర్డ్‌ను మార్చడం వల్ల హ్యాకర్ల బారిన పడే ముప్పు కూడా ఉందని, సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిర్ణీత కాలంలో పాస్‌వర్డ్ మార్చుకోవాలనే సూచనలు భవిష్యత్తులో ఉండకపోవచ్చు.

పాత పాస్‌వర్డ్‌కే మార్పులూ చేర్పులూ

సాధారణంగా మనం పాస్‌వర్డ్ మారుస్తున్నప్పుడు పాత పాస్‌వర్డ్‌నే అటూ ఇటుగా మార్చి పెట్టుకుంటూ ఉంటాం. ఇలా చేయడం వల్ల సైబర్ నేరస్థులకు పాస్‌వర్డ్‌ కనిపెట్టడం పెద్ద కష్టమైన పనేమీ కాదని నిపుణులు అంటున్నారు.

ఉదాహరణకు మన పాస్‌వర్డ్ సిడిఎంఎక్స్ 1 నుంచి సిడిఎంఎక్స్ 2 గా మారుస్తాం. లేదా పాస్‌వర్డ్ చివర పుట్టిన సంవత్సరం చేరుస్తూ ఉంటాం. లేదా కేవలం చివరి ఒక్క అక్షరాన్ని మార్చడమో, లేదా నెలను మార్చడమో చేస్తూ ఉంటాం.

ఇంకా సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌లు ఉంటే, కొందరు వాటిని స్టికీ నోట్స్‌పై రాసుకుని, కంప్యూటర్‌కే అతికించుకుంటారు.

మనం వాడే రకరకాల డిజిటల్ సేవలకు కొత్త పాస్‌వర్డ్‌లను గుర్తు పెట్టుకోలేక చివరకు పాత పాస్‌వర్డ్‌నే అటూ ఇటుగా మార్చి పెట్టేస్తుంటామని యూర్‌క్యాట్ టెక్నాలజీ సెంటర్ ఐటీ సెక్యూరిటీ యూనిట్ డైరెక్టర్ యువాన్ కౌబెట్ బీబీసీకి చెప్పారు.

"అంటే, సాధారణంగా చాలా రకాల మాధ్యమాలకు ఒకే రకమైన పాస్‌వర్డ్‌ను వాడుతూ ఉంటాం, పిషింగ్ (సైబర్ దాడులు చేసి యూజర్ల డేటాను దొంగిలించడం) చేసేవారు, హ్యాకర్లు సెక్యూరిటీ బ్రీచ్, లేదా పాస్‌వర్డ్‌ను దొంగలిస్తే, దానికి అక్షరాలు, అంకెలు మార్చడం లేదా చేర్చడం ద్వారా మీ ఇతర ప్లాట్‌ఫామ్స్ పాస్‌వర్డ్‌లు కూడా సులభంగా గుర్తించగలరు" అన్నారు.

"హ్యాకర్లకు అంత తేలిగ్గా దొరక్కూడదు. పాస్‌వర్డ్ మార్చాలని అభ్యర్ధన వచ్చిన ప్రతిసారీ మనం పటిష్టంగా ఉండే పూర్తిగా కొత్త పాస్‌వర్డ్‌ను తయారు చేసుకోవాలి. అవి బలంగా కూడా ఉండాలి" అని అని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు.

"సమస్య ఏంటంటే, ఇది చాలా కష్టమైన పని, ఎందుకంటే మనం చాలా పాస్‌వర్డ్స్ ఉపయోగిస్తాం" అని యువాన్ అన్నారు.

línea

మీ పాస్‌వర్డ్‌ బలంగా ఉండాలంటే

  • పాస్‌వర్డ్‌లో కనీసం 8 క్యారెక్టర్లు ఉండాలి.
  • అందులో అక్షరాలు, అంకెలు, ప్రత్యేక గుర్తులు ఉండాలి.
  • క్యాపిటల్ అక్షరాలు, చిన్న అక్షరాలతో కలిసి ఉండేలా చూసుకోవాలి.
  • మీ పేరు, పుట్టిన సంవత్సరం లాంటి వివరాలతో పాస్‌వర్డ్ పెట్టుకోకూడదు.
  • అలాగే, ఒకే పాస్‌వర్డ్‌ను అన్ని మాధ్యమాలకూ వాడవద్దు.
  • అన్నింటికీ, ఒకే పాస్‌వర్డ్ ఉండటం వల్ల ఒక అకౌంట్ హ్యాక్ అయితే, మిగిలిన వాటికి కూడా ముప్పు ఉంటుంది.

ఆధారం: యువాన్ కౌబెట్ , సైబర్ సెక్యూరిటీ నిపుణులు (యూర్ క్యాట్ )

línea

"పాస్‌వర్డ్‌లు ఎక్కువ కాలం పాటు మరింత సురక్షితంగా ఉంచడం ఎలా అనేది తెలుసుకోడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ, పాస్‌వర్డ్‌ కచ్చితంగా మార్చి తీరాలనే నియమం కొన్ని రోజుల్లో వాడుకలోంచి పోయే అవకాశం ఉంది. బలహీనంగా ఉండే రకరకాల పాస్‌వర్డ్‌ల కంటే, బలంగా ఉండే ఒక పాస్‌వర్డ్ ఉత్తమం" అని కౌబెట్ అన్నారు.

ఈ విధంగా ఆలోచిస్తున్నది, కౌబెట్ మాత్రమే కాదు.

రకరకాల డిజిటల్ సేవలకు కొత్త పాస్‌వర్డ్‌లను గుర్తు పెట్టుకోలేక కొందరు పాత పాస్‌వర్డ్‌నే అటూ ఇటుగా మార్చి పెట్టుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాస్‌వర్డ్ పదే పదే మార్చడం వల్ల హ్యాకర్లకు దొరికిపోయే అవకాశం ఉంది.

నిపుణులు ఏం చెబుతున్నారు

పదే పదే పాస్‌వర్డ్ మార్చేయడం గురించి ఐటీ నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు.

కొన్నేళ్ల క్రితం బిల్ బర్ రాసిన "ఇన్‌ఫ్లుయెన్షియల్ గైడ్ టూ కంప్యూటర్ పాస్‌వర్డ్స్"‌ అనే పుస్తకాన్ని యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ (ఎన్‌ఐఎస్‌టి) పంపిణీ చేసింది. వారు కూడా అందులో ఉన్న కొన్ని సలహాలను ఉపసంహరించుకున్నారు.

ఉదాహరణకు, అందులో పాస్‌వర్డ్‌ను ప్రతి 90 రోజులకు ఒకసారి మార్చుకోవాలని సలహా ఇచ్చారు. పాస్‌వర్డ్‌ను మార్చుకునేటప్పుడు క్యాపిటల్ అక్షరాలూ, సంఖ్యలు, గుర్తులు ఉండేలా చూసుకోవాలని సూచించారు.

కానీ, సులభంగా గుర్తు పెట్టుకోగలిగే సాధారణ పాస్‌వర్డ్‌ కంటే, అస్తవ్యస్తంగా ఉన్న పదాల అమరికను గుర్తించడానికి కంప్యూటర్‌కు కూడా కాస్త ఎక్కువ సమయం పడుతుంది.

"నేను సూచించిన చాలా విషయాల గురించి నేను చింతిస్తున్నాను. ఈ సలహా చాలా మందికి అసౌకర్యంగా కూడా అనిపించి ఉండచ్చు" అని 2003లో తను 2017లో ప్రచురించిన మాన్యువల్‌లో బిల్ బర్ విచారం వ్యక్తం చేశారు.

చాలా డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లు, సంస్థలు తరచుగా పాస్‌వర్డ్‌ మార్చుకోమని చెబుతుంటాయి. కానీ, కొన్ని సంస్థలు అలాంటి నిబంధనలను పాటించడం మానేశాయి.

కొన్ని దశాబ్దాల పాటూ పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని సూచించిన మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా 2019 నుంచి ఈ నిబంధనలకు స్వస్తి పలికింది.

"ఆ అలవాటు పాతబడింది" అని మైక్రోసాఫ్ట్ చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)