కశ్మీర్ రాజకీయ నాయకులతో నేడు నరేంద్ర మోదీ సమావేశం... తర్వాత ఏం జరగబోతోంది

పీపుల్స్ అలియన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్

ఫొటో సోర్స్, EPA/FAROOQ KHAN

    • రచయిత, రియాజ్ మస్రూర్
    • హోదా, బీబీసీ ఉర్దూ, శ్రీనగర్

కశ్మీర్ రాజకీయ నాయకులతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు (24.06.2021) సమావేశం కాబోతున్నారు.

ఈ సమావేశానికి హాజరుకావాలని గుప్కార్ అలయెన్స్‌ నిర్ణయించింది.

జమ్మూ కశ్మీర్‌లోని సుమారు ఆరు పార్టీలు కలిసి 2019 ఆగస్టు 4న, అంటే ఆర్టికల్ 370 రద్దుకు ఒక రోజు ముందు గుప్కార్ కూటమిని ఏర్పాటు చేశాయి.

ఈ సమావేశంలో ప్రధానమంత్రి అజెండా ఏమిటో, ఆయన ఏ విషయాలపై మాట్లాడతారో తమకు ఇంకా తెలియదని ఆ కూటమి చెబుతోంది.

అయితే రద్దయిన ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలన్నదే తమ ఏకైక అజెండా అని కూటమి స్పష్టం చేసింది.

మోదీ ప్రభుత్వం 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.

మరి ఈ సమావేశం ద్వారా జమ్మూ కశ్మీర్‌లో ఏమైనా మార్పులు వస్తాయా? రాజకీయ ప్రతిష్టంభన తొలగిపోతుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.

సమావేశం తర్వాత ఏం జరుగుతుందన్న దానిపై అనేక రకాల అంచనాలు, విశ్లేషణనలు వినిపిస్తున్నాయి.

మెహబూబా ముఫ్తీ, ఫరూఖ్ అబ్దుల్లా

ఫొటో సోర్స్, EPA/FAROOQ KHAN

1. కొత్త ఆరంభానికి పిలుపు

జమ్మూ కశ్మీర్‌లో శాంతి, అభివృద్ధి కోసం, గతాన్ని విడిచిపెట్టి కేంద్రంతో సహకరించమని ప్రధాని మోదీ అఖిలపక్ష నాయకులను కోరవచ్చని చాలామంది భావిస్తున్నారు.

అయితే, జమ్మూ కశ్మీర్‌కు తిరిగి స్వయంప్రతిపత్తి కల్పించి, రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు జరుపుతామనే హామీ ఇస్తేనే ఆ సహకారం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

జమ్మూ కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రాజ్యాంగబద్ధంగా తిరిగి ఇవ్వడం వల్ల తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని కశ్మీర్ పరిశీలకులు భావిస్తున్నారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, PTI

2. కొన్ని ముఖ్యమైన హామీలు

కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజల ఉద్యోగాలకు గాని, భూ యాజమాన్య హక్కులకు గాని ఎటువంటి భంగం వాటిల్లదనే హామీ కేంద్రం నుంచి జమ్మూ కశ్మీర్ నాయకులకు రావొచ్చు.

మాట హామీ ఇవ్వడంతో పాటు దానికి చట్టబద్ధత కల్పిస్తామని కూడా మోదీ భరోసా ఇవ్వొచ్చు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టి ఆ హామీకి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పొచ్చు.

అలాంటి, హామీ ఇస్తే కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగించిన తర్వాత కొందరు కశ్మీర్ రాజకీయ నాయకులు, దిల్లీకి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కొంత తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

మెహబూబా ముఫ్తీ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, మెహబూబా ముఫ్తీ

3. కశ్మీర్ పాలసీలో మార్పు

కశ్మీర్‌ విధానం ఏకపక్షంగా ఉండకూడదని, దక్షిణాసియాలో భారత్‌కున్న వ్యూహాత్మక ఆసక్తులను కూడా దృష్టిలో పెట్టుకుని చూడాల్సిన అవసరం ఉందని మోదీ అర్థం చేసుకున్నారని కొంతమంది పరిశీలకులు భావిస్తున్నారు.

ఒకవేళ అలా భావిస్తూ ఉన్నట్లయితే, మోదీ తన రాజకీయ, సైద్ధాంతిక అభిప్రాయాలపై కచ్చితంగా ఉంటూనే జమ్మూ కశ్మీర్ రాజకీయ నేతలకు కొన్ని రాయితీలు ఇవ్వవచ్చు అంటున్నారు.

అమిత్ షా సమీక్ష

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అమిత్ షా సమీక్ష

4. తెలివైన ఎత్తుగడ

కొందరు మోదీ ప్రత్యర్థులు ప్రస్తుత చర్యను కశ్మీర్ విషయంలో రాజీగా చూస్తుండొచ్చు. కానీ బీజేపీతో సంబంధాలు ఉన్న కశ్మీరీలు మాత్రం దీన్ని తెలివైన ఎత్తుగడ అని అభివర్ణిస్తున్నారు.

కశ్మీర్‌లోని రాజకీయ పరిస్థితిని చక్కదిద్దే అవకాశం మోదీకి ఉందని వాళ్లు చెబుతున్నారు.

విభజిత రాజకీయాలు చేసే వారు ఇప్పటికే ఏకాకిగా మారిపోయారని, కశ్మీర్‌లో సంప్రదాయ రాజకీయ నాయకులతో వ్యవహరించడం సులభమైన విషయం కావడంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను సాధారణ స్థితికి తేవడానికి మోదీ సరైన స్థానంలో ఉన్నారని వారు అంటున్నారు.

ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ లాంటి నాయకులతో పెద్దగా ప్రమాదం లేదని వాళ్లు చెబుతున్నారు.

2019 ఆగస్ట్ తర్వాత నెలకొన్న విబేధాల నేపథ్యంలో ఈ రకమైన వాదన ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది.

కశ్మీర్‌లో వివిధ పార్టీల రాజకీయ నాయకులంతా కలిసి పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్‌గా ఏర్పడ్డారు. ఆ కూటమికి రాజకీయ నాయకులు ఎక్కువగా నివసించే విలాసవంతమైన ప్రాంతం గుప్కార్ పేరును పెట్టారు. జమ్మూ కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తికి భంగం కలిగించే ఎటువంటి చర్యనైనా తిప్పి కొట్టాలని ఈ కూటమిలో 2019 ఆగస్ట్ 4న తీర్మానించారు.

ఈ కూటమిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా "గుప్కార్ గ్యాంగ్" అని అభివర్ణించారు. వంశపారంపర్య పాలన నుంచి కశ్మీర్‌కు బీజేపీ విముక్తి కలిగిస్తుందని ప్రధాని మోదీ కూడా అన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న ఫరూఖ్ అబ్దుల్లా

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, విలేకరులతో మాట్లాడుతున్న ఫరూఖ్ అబ్దుల్లా

ఏం జరగబోతోంది

ఈ సమావేశం గురించి, తర్వాత జరగబోయే పరిణామాల గురించి ఎన్నో అంచనాలు, విశ్లేషణలు జరుగుతున్నాయి.

ఈ చర్చలు రాష్ట్రంలో నిజంగా ఏమైనా మార్పులు తెస్తాయా అన్న విషయంలో మాత్రం ప్రజలు అనుమానంగానే ఉన్నారు.

ఇక్కడ నెలకొన్న పరిస్థితులను మార్చడానికి దిల్లీ చేస్తున్న ప్రయత్నం గురించి కశ్మీర్ సుదీర్ఘ చరిత్ర మిగిల్చిన అనుభవాల వల్లే ఈ అనుమానాలు పుడుతున్నాయి.

1947 తర్వాత ఫరూఖ్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లా, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి తొలి 'ప్రధానమంత్రి'గా పని చేశారు.

ఆయన చేస్తున్న భారత వ్యతిరేక కార్యకలాపాలకు గాను, ఆయనను 1953లో పదవి నుంచి తప్పించి 20ఏళ్ల పాటు జైలులో పెట్టారు.

ఆయన జైలులో ఉంటూనే ఐక్యరాజ్యసమితి సూచించినట్లు జమ్మూ కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలన్న ఉద్యమం నడిపించారు.

1975లో జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తిరిగి పునరుద్ధరించాలని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని షేక్ అబ్దుల్లా కోరారు. 1960లో ఆయన జైలులో ఉన్నప్పుడు దీన్ని తొలగించారు.

అయితే, "గడియారం ముల్లు వెనక్కి తిప్పడానికి కుదరదు" అని ఇందిర సమాధానమిచ్చారు.

గురువారం నాటి సమావేశాల ఫలితం ఎలా ఉన్నప్పటికీ కూడా, కశ్మీర్‌లో ప్రజలు మాత్రం గడియారం ముల్లు వెనక్కి తిరుగుతుందని ఆశించటం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)