ఇరాన్ ఎన్నికలు: హసన్ రౌహానీ తరువాత అధ్యక్ష పదవిని చేపట్టేదెవరు?

ఇరాన్ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్‌లో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. హసన్ రౌహానీ తరువాత ప్రెసిడెంట్ పదవికి నలుగురు పోటీ పడుతుండగా ఇబ్రహీం రైసీ ఫేవరెట్‌గా కనిపిస్తున్నారని ఒపినియన్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి.

నలుగురిలో ఒకరు తప్ప మిగిలిన ముగ్గురూ సంప్రదాయవాదులే.

సంప్రదాయ షియా మతాధికారి అయిన ఇబ్రహీం రైసీ, ప్రస్తుతం ఇరాన్‌లో ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.

మాజీ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దోల్నాజర్ హెమ్మతి, ఇబ్రహీం రైసీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు.

అయితే, ఆ దేశంలోని సంస్కరణవాదులు, అసమ్మతి వర్గం ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

చాలామంది పోటీదారులను ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించి, రైసీకి తగిన పోటీ లేకుండా చేశారని వీరు వాదిస్తున్నారు.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమైనీ శుక్రవారం ఉదయం టెహ్రాన్‌లో ఓటు వేశారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.

"ప్రతీ ఓటుకు విలువ ఉంటుంది.. ఓటు వేసి మీ అధ్యక్షుడిని ఎన్నుకోండి. మీ దేశ భవిష్యత్తుకు ఇది ఎంతో ముఖ్యం" అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

మూడేళ్ల క్రితం అమెరికా ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి తప్పుకుని, పలు ఆంక్షలు విధించినప్పటి నుంచి తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం పట్ల ఇరానియన్ ప్రజల్లో అసంతృప్తి ఉంది.

ప్రస్తుతం పోటీ చేస్తున్న సంప్రదాయవాదుల్లో ఎవరు గెలిచినా ఇరాన్‌కు, మిగతా శక్తివంతమైన దేశాలకు వియన్నాలో జరగబోయే చర్చలకు ఆటంకం కలగదనే భావిస్తున్నారు.

తమ దేశంపై ఉన్న ఆంక్షలను తొలగిస్తే, తాము చేపట్టిన అణు కార్యక్రమాలను పరిమితం చేసేందుకు ఇరాన్ అంగీకరించింది.

ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో నెగ్గిన రౌహానీ, ఎనిమిదేళ్లు పాలన సాగించడంతో ఆయన మళ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేదు.

పశ్చిమ దేశాలతో చర్చలకు రౌహానీ ప్రయత్నాలు చేశారు.

ఇరాన్ ఎన్నికలు

ఫొటో సోర్స్, EPA

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎవరు ఎన్నుకుంటారు?

ఎన్నికల్లో పోటీ చేయడానికి సుమారు 600 మంది నమోదు చేసుకున్నారు. వీరిలో 40 మంది మహిళలు.

ఈ విషయంలో 12 మంది న్యాయవాదులు, సిద్ధాంతకర్తలతో కూడిన సంప్రదాయవాద సంస్థ గార్డియన్ కౌన్సిల్‌ తుది నిర్ణయం తీసుకుంటుంది. అది వీరిలో చివరికి ఏడుగురు పురుషులను మాత్రమే ఎంపిక చేసింది.

అభ్యర్థులుగా ఎంపిక కాని ప్రముఖుల్లో రౌహానీ మొదటి పాలనలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఇషాక్ జహంగిరి, మాజీ స్పీకర్ అలీ లారిజని కూడా ఉన్నారు.

గురువారం నాటికి, ఎన్నికల్లో పోటీకి ఎంపికైన వారిలో ముగ్గురు... సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ సయీద్ జలీలి, ఎంపీ అలీరేజా జకాని, మాజీ ఉపరాష్ట్రపతి, సంస్కరణవాది మొహ్సేన్ మెహ్రాలిజాదే కూడా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు.

జలీలి, జకాని ఇబ్రహీం రైసీకి మద్దతు ఇవ్వగా, సంస్కరణవాద ఓటును "ఏకం" చేయాలని తాను కోరుకుంటున్నట్లు మెహ్రాలిజాదే వెల్లడించారు. అంటే, ఆయన హెమ్మతికి మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో ఏ అభ్యర్థికీ 50% శాతానికి మించి ఎక్కువ ఓట్లు రాకపోతే రెండో రౌండ్ ఎన్నికలు నిర్వహిస్తారు.

ఇబ్రహీం రైసీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇబ్రహీం రైసీ

పోటీలో ఉన్నవారెవరు?

ఇబ్రహీం రైసీ

మతాధికారి అయిన 60 ఏళ్ల రైసీ తన కెరీర్‌లో ఎక్కువభాగం ప్రాసిక్యూటర్‌గా పని చేశారు.

2017లో జరిగిన ఎన్నికల్లో కూడా రైసీ పోటీ చేశారు. కానీ రౌహాని చేతిలో ఘోర పరాజయం చవిచూశారు.

ఆ తరువాత రెండేళ్లకు 2019లో చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు.

ఇరాన్ ఆర్థిక సమస్యలను పరిష్కరించి, అవినీతిని రూపుమాపడంలో తాను మెరుగైన అభ్యర్థినని రైసీ ప్రచారం చేసుకున్నారు.

అయితే, 1980లలో రాజకీయ ఖైదీలను సామూహికంగా ఉరితీయడంలో రైసీ పాత్ర ఉందని భావిస్తూ అనేకమంది ఇరానియన్లు, మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అబ్దోల్నాజర్ హెమ్మతి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అబ్దోల్నాజర్ హెమ్మతి

అబ్దోల్నాజర్ హెమ్మతి

64 నాలుగేళ్ల హెమ్మతి 2018లో ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసిన తరువాత ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు.

మహమూద్ అహ్మదీనేజాద్ ప్రభుత్వంలో, రౌహానీ పాలనలో కూడా హెమ్మతి కీలక పదవుల్లో పని చేశారు. ఇరాన్‌లోని అన్ని వర్గాలతో కలిసి పని చేయగల సామర్థ్యం హెమ్మతికి ఉందనడానికి ఇదే నిదర్శనం.

అయితే, ఇరాన్ కరెన్సీపై అమెరికా ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడంలో ఆయన విఫలమయ్యారని మిగతా అభ్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

మొహ్సెన్ రెజై

సంప్రదాయవాది అయిన 66 ఏళ్ల రెజై ఎక్స్పెడియెన్సీ కౌన్సిల్ సెక్రటరీగా ఉన్నారు. ఈ కౌన్సిల్ సుప్రీం లీడర్‌కు సలహాదారుగా వ్యవహరిస్తుంది. చట్టపరమైన వివాదాల్లో అంతిమ తీర్పు ఈ కౌన్సిల్ చేతిలో ఉంటుంది.

1980-88 మధ్య జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కమాండర్‌గా రైజై వ్యవహరించారు. ఆధ్యక్ష పదవి ఎన్నికల్లో మూడుసార్లు పోటీ చేశారు.

ఆమిర్‌హొసైన్ కజిజాదే హషేమి

హషేమి ఈఎన్‌టీ సర్జన్. 2008 నుంచి ఎంపీగా ఉన్నారు. ఈ ఏడాది మే నుంచి తొలి డిప్యుటీ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు.

50 ఏళ్ల హషేమీ నలుగురు అభ్యర్థుల్లో చిన్నవారు.

ఓటు వేసే వారి సంఖ్య ఎందుకు అంత ముఖ్యం?

ఇరాన్‌లో సుమారు 5 కోట్ల 90 లక్షల మందికి ఓటు హక్కు ఉంది. ఇరాన్ జనాభా 8 కోట్లు.

2017లో జరిగిన ఎన్నికల్లో 73 శాతం మంది ఓటు వేశారు. అయితే, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే 'ఇరానియన్ స్టూడెంట్స్ పోలింగ్ ఏజెన్సీ' (ఐఎస్‌పీఏ) ఇటీవలి సర్వేలో శుక్రవారం 42 శాతం మందే ఓట్లు వేయవచ్చని అంచనా వేసింది.

అదే జరిగితే, 1979 ఇస్లామిక్ విప్లవం తరువాత ఇరాన్‌లో తక్కువ శాతం ఓట్లు పోల్ అవ్వడం ఇదే తొలిసారి అవుతుంది.

ఇది ఇరాన్ నాయకులకు సమస్యగా మారవచ్చు. ఎందుకంటే, వారు ఓటును చట్టబద్ధతకు చిహ్నంగా భావిస్తారు.

"ఒక సంస్థ లేదా సమూహం లోపాలు" ఓటు వేసే హక్కును నిరోధించకూడదని రౌహానీ గురువారం ఇరానియిన్లకు పిలుపునిచ్చారు. ఆయన గార్డియన్ కౌన్సిల్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్య చేశారనేది స్పష్టం అవుతోంది.

"ప్రస్తుతానికి రేపటి బాధల గురించి ఆలోచించకండి" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)