భారీ కృత్రిమ దీవి నిర్మాణానికి డెన్మార్క్ పార్లమెంట్ ఆమోదం

లినెట్‌హోమ్ నిర్మాణ ప్రణాళిక

ఫొటో సోర్స్, Danish government

ఫొటో క్యాప్షన్, లినెట్‌హోమ్ నిర్మాణ ప్రణాళిక

డెన్మార్క్ రాజధాని కోపెన్‌హేగెన్‌కు అవతల ఒక కృత్రిమ దీవిని నిర్మించడానికి ఆ దేశ పార్లమెంటు ఆమోదం తెలిపింది.

35 వేల మంది జనాభా నివసించేందుకు వీలుగా నిర్మించే ఈ దీవి, పెరుగుతున్న సముద్రమట్టం నుంచి కోపెన్‌హేగెన్ రేవును కాపాడేందుకు కూడా పనికొస్తుంది.

ఈ భారీ దీవికి 'లినెట్‌హోమ్' అని పేరు పెట్టారు. దీనిని రింగ్ రోడ్, సొరంగాలు, మెట్రో మార్గం ద్వారా ప్రధాన భూభాగానికి అనుసంధానిస్తారు.

ఈ దీవి నిర్మాణానికి పార్లమెంట్ ఆమోదం తెలపడంతో, ఈ ఏడాది చివర్లో 2.6 చదరపు కిలోమీటర్లలో జరిగే ప్రాజెక్టు పనులు మొదలవనున్నాయి.

కానీ, ఈ నిర్మాణం వల్ల ఏర్పడే ప్రభావం గురించి పర్యావరణవేత్తల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది.

'లినెట్‌హోమ్' నిర్మాణ ప్రణాళికలో దీవి చుట్టూ ఒక ఆనకట్ట నిర్మించే ప్రతిపాదన కూడా ఉంది. పెరుగుతున్న సముద్రమట్టపు స్థాయి, ఆటుపోట్ల నుంచి కోపెన్‌హేగెన్ ఓడ రేవును కాపాడే లక్ష్యంతో దీనిని నిర్మిస్తున్నారు.

అనుకున్నట్లుగా నిర్మాణ పనులు మొదలైతే, 2035 నాటికి ఈ దీవిలో చాలా వరకు భవనాలకు పునాదులు వేయడం పూర్తవుతుంది. ఈ ప్రాజెక్టును 2070 కల్లా పూర్తి చేయాలని భావిస్తున్నారు.

లినెట్‌హోమ్ నిర్మాణ ప్రణాళిక

ఫొటో సోర్స్, Danish government

ఫొటో క్యాప్షన్, లినెట్‌హోమ్ నిర్మాణ ప్రణాళిక

అయితే, లినెట్‌హోమ్ నిర్మాణానికి వ్యతిరేకంగా పర్యావరణవేత్తలు యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో కేసు వేశారు.

ఈ దీవి నిర్మాణానికి రోడ్డు ద్వారా భారీ వాహనాల్లో తరలించే రవాణా చేసే నిర్మాణ సామగ్రి గురించి కూడా ఇందులో ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకసారి, ఈ నిర్మాణం మొదలయితే సామగ్రి రవాణాకు కోపెన్‌హేగెన్ మీదుగా రోజుకు 350 లారీలు ప్రయాణించాల్సి ఉంటుంది.

ఈ కృత్రిమ దీవి పరిమాణం 400 ఫుట్ బాల్ మైదానాల విస్తీర్ణంతో సమానంగా ఉంటుంది. ఈ ఒక్క దీవిని నిర్మించడానికి 80 మిలియన్ టన్నుల ఇసుక అవసరమవుతుందని స్థానిక మీడియా కథనాలు ఇచ్చాయి.

దీనివల్ల సముద్రం అడుగున ఉన్న బురద మట్టి, కదిలి నీటి నాణ్యత, పర్యావరణంపై ప్రభావం పడవచ్చని కూడా పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

లినెట్‌హోమ్ నిర్మాణ ప్రతిపాదిత స్థలం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కోపెన్‌హాగెన్ ఓడరేవు

శుక్రవారం ఈ బిల్లు ఆమోదం పొందగానే, నిరసనకారులు పార్లమెంటు ముందు గుమిగూడారు. ఈ బిల్లుకు 85 మంది ఎంపీలు ఆమోదం తెలుపగా, 12 మంది వ్యతిరేకంగా ఓటు వేశారని డేనిష్ బ్రాడ్ కాస్ట్ సంస్థ డిఆర్ తెలిపింది.

నిర్మాణ పనుల కోసం వెళ్లే లారీల గురించి తమకు చాలా ఆందోళనగా ఉందని కోపెన్‌హేగెన్‌లో నిరసనలు చేస్తున్న ల్కారిణి ఏవా లార్సెన్ అన్నట్లు డిఆర్ చెప్పింది.

"నవంబరులో స్థానిక ఎన్నికలకు ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా వుండాల్సింది" అని నికోలస్ వూల్ హెడ్ అనే నిరసనకారుడు తెలిపారు.

"ఇది కోపెన్‌హేగెన్ చరిత్రలోనే ఇది ఒక అతిపెద్ద ప్రాజెక్టు. దేశంలోని భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఇదొకటి. ఎన్నికల సమయం మధ్యలో దీనిని మా నెత్తి మీద రుద్దుతున్నారు. దీంతో మా గొంతు వినిపించే అవకాశం కూడా ఉండదు" అని అన్నారు.

"అయితే, సామగ్రి రవాణాకు పర్యావరణహితమైన రవాణా సాధనాలు వాడే ఒక దారి ఉంది. కానీ, అలా జరగాలంటే, ప్రభుత్వ అధికారుల నుంచి ఆమోదం లభించాలి" అని అని కరీనా క్రిస్టెన్ సెన్ చెప్పారు.

"ఎలక్ట్రిక్ ట్రక్కులు వాడటం వల్ల కర్బన ఉద్గారాలు వెలువడవు, వాటితో శబ్దం కూడా తగ్గుతుంది. కానీ, ఇవి ఎక్కువ ట్రిప్పులు వేయాల్సి ఉంటుంది. వ్యయం కూడా పెరుగుతుంది" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)