ఇరాన్ సుప్రీం లీడర్: అయతొల్లా అలీ ఖమైనీ వారసుడెవరు?

అయతొల్లా ఖమైనీ

ఫొటో సోర్స్, epa

ఫొటో క్యాప్షన్, అయతొల్లా ఖమైనీ
    • రచయిత, రనా రహింపోర్
    • హోదా, బీబీసీ పర్షియన్

ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమైనీ ఆరోగ్యంపై ఇటీవల వదంతులు వ్యాపించాయి.

దీంతో ఆయన పాలన సాగించలేనంతగా తీవ్ర అనారోగ్యం పాలైనా, మరణించినా పరిస్థితి ఏమిటి, ప్రత్యామ్నాయాలు ఏమిటన్న చర్చ సాగుతోంది.

81 ఏళ్ల ఖమైనీ మధ్య ప్రాచ్యంలోని శక్తిమంతమైన దేశాల్లో ఒకటైన ఇరాన్‌లో అత్యున్నత రాజకీయ పదవిలో ఉన్న నేత. ఆయన తరువాత ఆ స్థానంలోకి వచ్చేదెవరన్నది ఇరాన్‌కు, మధ్య ప్రాచ్యానికే కాకుండా మిగతా ప్రపంచానికీ కీలకమే.

సుప్రీం లీడర్‌ను ఎలా ఎన్నుకుంటారు?

1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తరువాత సుప్రీం లీడర్ పదవి చేపట్టిన రెండో నేత ఖమైనీ.

అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌గా పిలిచే 88 మంది మతాధికారుల బృందం ఆయన్ను ఎంపిక చేసింది. ఇరాన్ ప్రజలు ఎనిమిదేళ్లకు ఒకసారి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సభ్యులను ఎన్నుకుంటారు.

ఈ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులను తొలుత గార్డియన్ కౌన్సిల్ అనే మరో కమిటీ ఆమోదించాలి.

గార్డియన్ కౌన్సిల్ సభ్యులను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సుప్రీం లీడర్ నియమిస్తారు.కాబట్టి సుప్రీం లీడర్‌ ప్రభావం రెండు కమిటీలపైనా ఉంటుంది.

గత మూడు దశాబ్దాలుగా ఖమైనీ తన వారసుడిని ఎన్నుకోవడంలో తన మార్గదర్శకత్వాన్ని పాటించేలా అసెంబ్లీకి ప్రతినిధులను ఎన్నుకుంటూ వచ్చారు.

ఖమైనీ విషయంలో ఏం జరిగిందంటే..

సుప్రీంలీడర్‌గా ఒకసారి ఎన్నికైతే జీవిత కాలం ఆ పదవిలో ఉంటారు.

ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ పదవిలోకి వచ్చే వ్యక్తి అయతొల్లా అయి ఉండాలి.

అయతొల్లా అంటే షియా మతవర్గానికి చెందిన ఉన్నతమైన పదవి.

కానీ, ఖమైనీ సుప్రీం లీడర్ అయ్యేనాటికి ఆయన అయతొల్లాగా లేరు. దాంతో చట్టాలను మార్చి ఆయన్ను అయతొల్లా చేసి సుప్రీం లీడర్ పదవిలోకి తెచ్చారు.

మొజ్తాబా ఖమైనీ

ఫొటో సోర్స్, DPA/ALAMY LIVE NEWS

ఫొటో క్యాప్షన్, మొజ్తాబా ఖమైనీ

ఇరాన్‌లో సుప్రీం లీడర్‌కు అందరికంటే ఎక్కువ అధికారాలుంటాయి.

అత్యంత కీలకమైన అంశాలలో తుది నిర్ణయం ఆయనదే.. ఆయన మాటే శిలాశాసనంగా ఉంటుంది.

షియా ముస్లిం దేశాల్లో ఇరానే అత్యంత శక్తిమంతమైనది. అలీ ఖమైనీ నాయకత్వంలో ఆ దేశం మధ్య ప్రాచ్యంలో మరింత ప్రభావవంతమైన దేశంగా మారింది.

ఖమైనీ మరణిస్తే అది ఆ ప్రాంత చరిత్రను మార్చడమే కాకుండా మిగతా ప్రపంచంపైనా ఆ ప్రభావం కొంత పడొచ్చు.

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌ల మధ్య శత్రుత్వాలు.. ఉదాహరణకు ఖమైనీకి అమెరికా, ఇజ్రాయెల్‌లపై ఉన్న వ్యక్తిగత అయిష్టం కూడా సుదీర్ఘ కాలంగా ఉద్రిక్తతలు, అస్థిరతకు కారణమయ్యాయి.

అయితే, ఖమైనీ వారసులుగా ఎవరు వచ్చినా కూడా వారు ఆయన మార్గాన్నే అనుసరిస్తారు.

సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియే అలా ఉంటుంది.

సుప్రీం లీడర్ ఎవరు కావొచ్చు?

ఖమైనీకి వారసుడిని నిర్ణయించడంపై ఇరాన్ రాజకీయ వర్గాలు ఆసక్తిగానే ఉన్నాయి.

కానీ, ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి సంక్షోభాలను నివారించేలా కింగ్ మేకర్‌లా వ్యవహరించే నేత ఎవరూ లేరు.

నమ్మకమైన అనుచరుల నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని ఖమైనీ తన ప్రభావాన్ని కొనసాగించారు.

ఆయన అనుచరుల్లో అత్యధికులు ఇరాన్‌లోని అత్యంత శక్తిమంతమైన దళం ‘రివల్యూషనరీ గార్డ్స్’కు చెందినవారే.

తమకు ఇష్టం లేని నేతలు సుప్రీం లీడర్ రేసులో లేకుండా రివల్యూషనరీ గార్డ్స్ నిరోధిస్తుంటుంది.

ఖమైనీ వారుసుడెవరన్న విషయంలో ఇప్పటికే కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయన్న ప్రచారం ఉన్నప్పటికీ ఆ జాబితాలో ఎవరున్నారో ఎవరికీ తెలియదు.

ఖమైనీ కోరుకున్న వారసుడు ఆయన కుమారుడు మొజ్తాబా కానీ, లేదంటే జ్యుడీషియరీ చీఫ్ ఇబ్రహీం రైసీ కానీ కావచ్చన్న అంచనాలున్నాయి.

మరోవైపు రైసీ కంటే ముందు జ్యుడీషియరీ చీఫ్‌గా ఉన్న సాదిక్ లారిజనీ కానీ.. ప్రస్తుత అధ్యక్షుడు హసన్ రౌహానీలకు కూడా తదుపరి సుప్రీం లీడర్ కావాలన్ని ఆశలున్నాయని చెబుతారు.

మొజ్తాబా ఖమైనీ సంగతేంటి?

సుప్రీంలీడర్ అల్ ఖమైనీ కుమారుడు మొజ్తాబాను తెర వెనుక నేతగా చెబుతారు.

51 ఏళ్ల మొజ్తాబా పవిత్ర నగరం మషహాద్‌లో జన్మించారు. ఆయన కూడా మతాధికారి.

2009లో అధ్యక్ష ఎన్నికల వివాదం తరువాత చెలరేగిన హింసాత్మక నిరసనలను అణచివేసిన తరువాత ఆయన అందరి దృష్టిలో పడ్డారు.

ఆ అణచివేత వెనుక ఉన్నది మొజ్తాబానేనని చెబుతారు.ప్రస్తుత సుప్రీంలీడర్ అలీ ఖమైనీ రాజు కానప్పటికీ, తన పదవిని సులభంగా కుమారుడికి అప్పగించే అవకాశం లేనప్పటికీ కూడా మొజ్తాబాకు తన తండ్రి అనుచరుల్లో గట్టి పట్టుండడం, సుప్రీం లీడర్ కార్యాలయంలోనూ మంచి పట్టుండడం అనుకూలాంశాలు.

మొజ్తాబా కనుక రివల్యూషనరీ గార్డ్స్‌ మద్దతు పొందితే వారు ఆయనకు అనుకూలంగా ఎంపిక ప్రక్రియను మలచగలుగుతారు.

రైసీ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, రైసీ

ఇబ్రహీం రైసీ ఎవరు?

ఈ 60 ఏళ్ల మతాధికారి కూడా మషహద్‌లోనే జన్మించారు. సుప్రీం లీడర్ కావాలన్న తన ఆకాంక్షలకు సంబంధించి జరిగే ప్రచారాలను ఆయన ఎన్నడూ ఖండించలేదు.

ఆయన్ను ఈ పదవి చేపట్టేలా సిద్ధం చేస్తున్నారనడానికి సూచనగా ఆయన కదలికలు, చర్యలు ఉంటుంటాయి.

న్యాయ వ్యవస్థలో అనేక పదవులు చేపట్టిన ఆయన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’కు డిప్యూటీ చైర్మన్ కూడా.

1988లో రాజకీయ ఖైదీలను సామూహికంగా ఉరి తీసిన ఘటనలో రైసీ పాత్ర వివాదాస్పదమైంది.

2017 అధ్యక్ష ఎన్నికల్లో రైసీ ఓడిపోయినప్పటికీ సుప్రీం లీడర్ ఖమైనీ ఆయన్ను న్యాయవ్యవస్థకు అధిపతిగా నియమించారు.

ఆ పదవిలోకి వచ్చినప్పటి నుంచి రైసీ మీడియాలో తన ఉనికిని పెంచుకున్నారు. ఖమైనీ మాదిరిగానే రైసీకి కూడా రివల్యూషనరీ గార్డ్స్‌తో మంచి సంబంధాలున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)