కరోనావైరస్ వ్యాక్సీన్: రష్యా ప్రజలు స్పుత్నిక్-వి టీకా వేయించుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారు?

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, EPA

డిసెంబరు ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ఓ ప్రకటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

డిసెంబరు 5 నుంచి దేశమంతటా విస్తృత స్థాయిలో కోవిడ్-19 వ్యాక్సీన్లు వేయడం ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు.

‘‘వచ్చేవారం నుంచి సామూహిక టీకాల కార్యక్రమం ప్రారంభించేద్దాం’’ అంటూ ఆయన ఆ దేశ ఉప ప్రధాని తాతియానా గోలికోవాతో అన్నారు.

స్పుత్నిక్-వి వ్యాక్సీన్‌ విడుదలకు సంబంధించి అక్కడ ప్రచారం మొదలైనప్పటికీ ప్రజల్లో అనుమానాలు, అనాసక్తి ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న కరోనావైరస్ నుంచి రక్షణకు తమ దేశంలో వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ రష్యా ప్రజలు ఎందుకు ఆ వ్యాక్సీన్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు?

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, EPA

వ్యాక్సీన్ వేసుకోవడానికి గాభరా ఏమీ లేదు. రష్యాలో కనీసం రాజధాని మాస్కో ప్రజల వరకు వ్యాక్సీన్ వేసుకోవడానికి రిజిష్టర్ చేసుకోవడం సులభమే.

మాస్కో నగరవాసులు ఆ నగర వెబ్‌సైట్‌లో ‘స్పుత్నిక్-వి’ వ్యాక్సీన్ కోసం నమోదు చేసుకోవచ్చు.

మొదట వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, సామాజిక సేవా కార్యకర్తలు, 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులకు తొలి దశలో వ్యాక్సీన్ వేయాల్సి ఉంటుంది.

పూర్తిగా ఉచితంగా వేసే ఈ వ్యాక్సీన్ కోసం మొదటి కొద్ది గంటల్లోనే 5000 మంది మాస్కోవాసులు నమోదు చేసుకున్నారని ఆ నగర మేయర్ కార్యాలయం తెలిపింది.అయితే, సామూహిక టీకాల కార్యక్రమం ప్రారంభం కావాల్సిన తొలి రోజున మాస్కోవాసులు దాని కోసం బారులు తీరినట్లు ఏమీ కనిపించలేదు.

మాస్కోలోని క్లినిక్‌లలో వచ్చే రెండు వారాల్లో టీకాలు వేయించుకోవడానికి అందుబాటులో ఉంచిన స్లాట్లు కావాల్సినన్ని ఖాళీగా ఉన్నాయని బీబీసీ ప్రతినిధులు గుర్తించారు.

నోవాయా గెజెటా అనే ఒక నర్సు స్పుత్నిక్-వి టీకాను ఎవరికైనా వేయడం కోసం వీలుగా డీఫ్రాస్ట్ చేయగా ఎవరూ సిద్ధంగా లేకపోవడంతో దాన్ని వృథాగా పడేయాల్సివచ్చిందని స్థానిక పత్రికల్లో వార్తలు వచ్చాయి.

‘‘కోవిడ్-19 ఉద్ధృతంగా ఉన్నప్పుడు రష్యాలో రోజుకు 30 వేల కొత్త కేసులు నమోదైన సందర్భాలున్నాయి.

అయితే, అంత తీవ్రంగా ప్రభావితమైన దేశంలో ప్రజలు ఇప్పుడు వ్యాక్సీన్ వేయించుకోవడం కోసం మరికొంత కాలం వేచి చూడాలనుకుంటున్నట్లు అనిపిస్తోంది’’ అని బీబీసీ మాస్కో ప్రతినిధి సారా రీయిన్ఫోర్డ్ చెప్పారు.

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, EPA

స్పందన అంతంతమాత్రమే..

సామూహిక టీకాల కార్యక్రమం ప్రారంభమైన తొలి రోజున బీబీసీ ప్రతినిధులు వివిధ కేంద్రాలకు వెళ్లారు.

అక్కడ టీకాపై పూర్తి విశ్వాసం కనబర్చిన రోగులు కనిపించారు. కానీ, అలాంటివారి సంఖ్య చాలా తక్కువగా ఉండడం ప్రజలందరిలో ఇంకా తగిన విశ్వాసం కలగలేదనడాన్ని సూచిస్తోంది.

అంతేకాదు.. తొలి దశలో వేయాలనుకున్న వర్గాలకే కాకుండా ఎవరొచ్చినా టీకా వేస్తున్నారు.. తొలి దశలోని లక్ష్యిత వర్గాల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ఎవరికైనా టీకాలు వేస్తుండడం కనిపిస్తోంది.

తొలి దశ లక్ష్యిత వర్గాలకు సంబంధించినట్లుగా ఆధారాలేమీ అడగడం లేదని చాలామంది బీబీసీకి చెప్పారు.

ఓ రోగి మాత్రం తాను ఉపాధ్యాయుడిని, వైద్య ఉద్యోగిని, సామాజిక కార్యకర్తను కాకపోవడంతో తొలుత తనకు వ్యాక్సీన్ వేయబోమని చెప్పారని..కానీ, అంతలోనే తనకూ టీకా వేశారని అన్నారు.

మరోవైపు ప్రస్తుతం టీకాలు వేయించుకుంటున్న అందరూ స్వచ్ఛందంగా రావడం లేదన్న వాదనా వినిపిస్తోంది.

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Reuters

స్పుత్నిక్-వి పూర్తిగా రిజిష్టరైన వ్యాక్సీన్ కాకపోవడమూ ఈ సామూహిక టీకాల కార్యక్రమ ప్రచారానికి ప్రతిబంధకంగా ఉంది.

రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ముగిసిన మరునాడు ఆగస్ట్ 11న రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ హడావుడిగా దీన్ని రిజిష్టర్ చేసింది.

సాధారణంగా వ్యాక్సీన్ ట్రయల్స్ మూడు దశల్లో జరుగుతాయి.

మొదటి దశలో సురక్షితమా కాదా అన్నది పరీక్షిస్తారు.

రెండో దశలో ఎంత మోతాదులో ఇవ్వాలో నిర్ణయించడానికి ట్రయల్స్ జరుపుతారు.

మూడో దశలో అసలు అది ఎంతవరకు సమర్థంగా పనిచేస్తుందన్నది చూస్తారు.

సాధారణంగా మూడో దశ ట్రయల్స్ సంతృప్తికర ఫలితాలతో పూర్తయిన తరువాతే పాశ్చాత్య దేశాలు ఆ టీకాను ధ్రువీకరిస్తాయి.

స్పుత్నిక్-వి టీకా మూడో దశ ట్రయల్స్ ఇంకా కొనసాగుతున్నాయి.

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Reuters

ఇతర కోవిడ్-19 వ్యాక్సీన్లతో పోల్చితే స్పుత్నిక్-వి రెండో దశ ట్రయల్స్ కూడా తక్కువ స్థాయిలోనే జరిపారు.

ప్రపంచంలోని మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సీన్‌గా చెప్పే స్పుత్నిక్-వి సామర్థ్యం, సురక్షిత స్థాయిలను నిర్ధరించే తుది పరీక్షలు కేవలం 76 మందిపైనే జరిగాయి.

వారంతా ఆరోగ్యవంతులైన 60 ఏళ్ల లోపు వయసువారు.అదే ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ రెండో దశ ప్రయోగాలు 256 మంది వలంటీర్లపై జరిగాయి.

బయో ఎన్ టెక్(ఫైజర్) వ్యాక్సీన్ రెండో దశ ట్రయల్స్ 456 మందిపైన, మోడెర్నా టీకా ప్రయోగాలు 600 మందిపైన జరిపారు.

అయితే, స్పుత్నిక్-వి మినహా మిగతావేవీ రెండో దశ ట్రయల్స్ అయిన వెంటనే హడావుడిగా రిజిస్ట్రేషన్ చేసేయలేదు.

ఔషధ రంగ నిపుణులు ఇల్యా యాస్నియి ‘బీబీసీ’తో మాట్లాడుతూ 2021 మే, జూన్ నెలల వరకు ఈ వ్యాక్సీన్ల పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్ ఉండకపోవచ్చన్నారు.

అలాంటివాటిని విశ్వసించొచ్చని అన్నారు. ‘విస్తృతమైన క్లినికల్ డాటా అందుబాటులో లేకుంటే ఆ టీకా ఎంతవరకు సమర్థం, సురక్షితం అనేది చెప్పలేం’ అన్నారు ఇల్యా.

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, స్పుత్నిక్ వీ వ్యాక్సీన్‌ను చూపిస్తున్న గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయాలజీ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్

అరకొర డాటాఇప్పుడున్న అన్ని వ్యాక్సీన్లలోనూ స్పుత్నిక్-వి గురించి ప్రపంచానికి తెలిసింది తక్కువే.

ఈ వ్యాక్సీన్‌కు సంబంధించిన పూర్తి డాటాను అంతర్జాతీయ శాస్త్ర సమాజానికి అందివ్వలేదు.

పత్రికా ప్రకటనల్లో వెల్లడించిన వివరాలు మాత్రమే తెలుసు. మిగతా కోవిడ్ వ్యాక్సీన్లు ఇందుకు భిన్నం.

వాటికి సంబంధించిన డాటా అందుబాటులో ఉంది. ఫైజర్ వ్యాక్సీన్ ట్రయల్స్‌లో 20000 మందికి టీకాలు వేశారు.

మోడెర్నా టీకాను 15 వేల మందికి, ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్‌ను 10 వేల మందికి వేశారు.

అయితే, స్పుత్నిక్‌కు అనుకూలంగా మాట్లాడేవారు మాత్రం అది 95 శాతం కరోనా నుంచి రక్షణ ఇస్తుందని చెబుతున్నారు.

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Reuters

స్పుత్నిక్ విషయంలో ఇప్పటివరకు విడుదల చేసిన డాటా అంతా మధ్యంతర ఫలితాలపై ఆధారపడిందే. ట్రయల్స్‌లో పాల్గొన్న 39 మంది వలంటీర్లకు కోవిడ్ సోకడం దీనిపై అనుమానాలను పెంచింది.

‘‘టీకా సమర్థంగా పనిచేయాలని ఆశిస్తున్నాం. కానీ, దీనికి సంబంధించి చెబుతున్న కొన్ని గణాంకాలను మాత్రం నమ్మలేం’’ అన్నారు స్వెత్లనా జావిడోవా.

ట్రయల్స్‌పై అనుమానాలుట్రయల్స్‌పైనా చాలామంది అనుమానాలున్నాయి.

అక్టోబర్‌లో మాస్కోలోని ఓ వ్యాక్సిన్ ట్రయల్ కేంద్రాన్ని బీబీసీ సందర్శించింది.

టీకా వేయించుకోవడానికి అక్కడికి వచ్చినవారిలో చాలామంది స్వచ్ఛందంగా వచ్చినవారు కాదని గుర్తించింది.

నగరంలో రకరకాల పనులు చేసుకుంటున్నవారిని అధికారులు అక్కడికి పంపించారు.

అలా వ్యాక్సీన్ ట్రయల్స్‌లో వారు పాల్గొని.. పాల్గొన్నట్లుగా తమ మేనేజరుకు ఆధారం చూపించాలి.

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Reuters

అధికారులు చెప్పినట్లు చేయకపోతే తమ త్రైమాసిక బోనస్‌ రాదని వారు బీబీసీతో చెప్పారు.

రష్యా కార్మికుల ఆదాయంలో ఈ త్రైమాసిక బోనస్ అత్యంత కీలకమైనది.వైద్య మినహాయింపులుట్రయల్స్‌లో పాల్గొనాలంటూ మేనేజర్ తనను ఒత్తిడి చేశారని మాస్కో నగరంలోని ఒక కార్మికుడు చెప్పారు.

అయితే, టీకాపై నమ్మకం లేక అనారోగ్యం నటించి డబ్బులిచ్చి మరీ వైద్య మినహాయింపు ధ్రువపత్రం పొంది ట్రయల్స్‌కు వెళ్లకుండా తప్పించుకున్నట్లు ఆ కార్మికుడు చెప్పారు.

అంతకుముందు ఏడాది శీతాకాలంలో ఫ్లూ వ్యాక్సీన్ ట్రయల్స్‌లో పాల్గొనమని కూడా తన మేనేజరు ఒత్తిడి చేసినట్లు ఆ కార్మికుడు చెప్పాడు.

అప్పుడు కూడా ఇలాగే డబ్బులు చెల్లించి వైద్య మినహాయింపు ధ్రువపత్రం తీసుకుని తప్పించుకున్నానని ఆ కార్మికుడు చెప్పుకొచ్చాడు.

ఇలా వైద్య మినహాయింపు పత్రాలు డబ్బులిచ్చి మరీ తీసుకోవడం, అధికారుల మాటలపై నమ్మకం లేకపోవడమనేది సోవియట్ యూనియన్ కాలం నుంచి అక్కడ ఉన్నట్లుగా ఉంది.

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, sopa images

ఫొటో క్యాప్షన్, కోవిడ్ వ్యాక్సీన్

రోగికి ఎలాంటి పరీక్షలూ చేయకుండానే ఆన్‌లైన్‌లో వైద్య మినహాయింపు పత్రాలు ఇస్తామన్న ప్రకటనలూ రష్యాలోని వెబ్‌సైట్లలో కనిపిస్తున్నాయి.

గూగుల్‌లో కొంచెం సెర్చ్ చేస్తే చాలు ఇలాంటివి తారసపడతాయి. ప్రపంచంలోని చాలా దేశాల్లో వ్యాక్సీన్‌కు వ్యతిరేకంగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు.

బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇతర యూరప్ దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంది. అమెరికాకు చెందిన సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌజీ కూడా బ్రిటిష్ ప్రభుత్వంపై మొదట్లో విమర్శలు చేశారు.

మేమే మొట్టమొదట వ్యాక్సీన్ తీసుకొచ్చాం అని చెప్పుకోవడానికి తొందరపడుతున్నారంటూ విమర్శలు చేశారు.

అయితే, డాక్టర్ ఫౌజీ ఆ తరువాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పారు.

‘‘బ్రిటన్ శాస్త్రీయంగా చేస్తున్న ప్రయోగాలపై నాకు పూర్తి విశ్వాసం ఉంది’’ అని ఆయన అన్నారు.

అయితే, స్వెత్లనా జావిడోవా మాత్రం రష్యాలో టీకాపై ఉన్న అనుమానాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ‘‘చాలామంది ప్రస్తుతం వ్యాక్సీన్‌ను నమ్మడం లేదు.

వ్యాక్సీన్‌కు సంబంధించిన పూర్తి డాటా అందుబాటులో ఉంచితే వారి ఆలోచనలు మారే అవకాశం ఉంది’’ అన్నారు స్వెత్లనా.

వీడియో క్యాప్షన్, సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తున్న వ్యాక్సీన్‌ను భారతీయులందరికీ ఎలా అందించబోతున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)