డిసెంబర్ ఆకాశంలో ఉల్కాపాతాల వర్షం, రెండు గ్రహాలు కలిసిపోయే విచిత్రం, సంపూర్ణ సూర్య గ్రహణం

ఆకాశంలో వింతలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇవా యాంటీవిరోస్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

2020 అంటే చాలామందికి నచ్చకపోవచ్చు.

అయితే, ఖగోళ ప్రియులకు మాత్రం ఈ డిసెంబరు నెల ఒక పండుగ లాంటిదనే చెప్పాలి. ఎందుకంటే ఇంటిలో నుంచి కాలు కదపకుండానే ఎన్నో వింతలు ఈ నెల ఆకాశంలో కనిపించబోతున్నాయి. కొన్నింటిని చూడటానికి టెలిస్కోప్ కూడా అవసరం లేదు.

రెండు గ్రహాలు ఒకటైపోయినట్లు కనిపించడం, కళ్లు తిప్పుకోనివ్వని ఉల్కాపాతాలు, సంపూర్ణ సూర్యగ్రహణం ఇలా చాలా ఘట్టాలకు ఈ డిసెంబరు నెల వేదిక కాబోతోంది. ఆకాశం మేఘాలు లేకుండా నిర్మలంగా ఉంటే చాలు. వీటిని హాయిగా ఆస్వాదించొచ్చు.

డిసెంబరులో కనివిందుచేయబోయే ఘట్టాలను ఇప్పుడు వరుసగా చూద్దాం..

జెమినిడ్ ఉల్కాపాతం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జెమినిడ్ ఉల్కాపాతం

డిసెంబరు 13-14: ఉల్కాపాతాల వర్షం.. ప్రపంచమంతటా కనిపిస్తుంది

గత కొన్ని నెలలుగా మీరు ఉల్కాపాతాలను చూస్తూనే ఉండొచ్చు. కానీ ఉల్కాపాతాల వర్షాన్ని ఎప్పుడైనా చూశారా? అయితే దీన్ని ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండండి.

‘‘తోకచుక్కల నుంచి వేరేపడిన ఉల్కలు ప్రయాణిస్తున్న మార్గాలకు సమీపంగా భూమి ఒక్కోసారి వెళ్తుంది. భూమి ఆకర్షణ శక్తి వల్ల కొన్నిసార్లు ఆ ఉల్కలు భూమివైపుగా వస్తాయి. ఫలితంగా మనకు ఉల్కాపాతాలు కనిపిస్తాయి’’అని బ్రిటన్‌లోని రాయల్ అబ్జర్వేటరీ గ్రీన్‌విచ్‌లో పనిచేస్తున్న ప్యాట్రీషియా స్కెల్‌టెన్ చెప్పారు.

‘‘జెమినిడ్స్ ఉల్కాపాతంగా పిలిచే తాజా ఉల్కాపాతం భిన్నమైనది. ఎందుకంటే 3200 ఫేటాన్‌గా పిలిచే ఓ గ్రహశకలం నుంచి వేరుపడిన ఉల్కల నుంచి ఈ ఉల్కాపాతం వస్తోంది’’అని ఆమె వివరించారు.

ఏటా ఇదే సమయంలో మన భూమి ఆ గ్రహశకలానికి దగ్గర నుంచి వెళ్తుంది. ఫలితంగా మనకు చాలా ఉల్కాపాతాలు కనిపిస్తాయి. అయితే డిసెంబరు 13, 14 తేదీల్లో ఈ ఉల్కాపాతం పతాకస్థాయికి చేరుతుంది. ఆ సమయంలో మనకు గంటకు 150 వరకు ఉల్కలు కనిపించొచ్చు.

అరిజోనాలో జమినిడ్ ఉల్కాపాతం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అరిజోనాలో జమినిడ్ ఉల్కాపాతం

‘‘ఈ ఉల్కలు సెకనుకు 35 కి.మీ.ల వేగంతో భూమివైపు దూసుకువస్తాయి. అంటే గంటకు 130,000 కి.మీ.’’అని ఆమె వివరించారు.

ఇవి సాధారణంగా పసుపు రంగులో కనిపిస్తాయి. కొన్నిసార్లు నీలం, ఆకుపచ్చ రంగుల్లోనూ దర్శనమిస్తాయి.

ఆకాశం ఎంత చీకటిగా ఉంటే ఇవి అంత అందంగా, అంత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. కృత్రిమ కాంతులతో వెలుగులీనే పట్టణ ప్రాంతాల్లోని ఆకాశంలోనూ ఇవి కొంతవరకు కనిపించే అవకాశముంది.

ఇంకో శుభవార్త ఏమిటంటే.. గతేడాది పౌర్ణమి సమయంలో ఈ ఉల్కాపాతం సంభవించింది. కానీ ఈ సారి అమావాస్య సమయంలో ఇది జరగబోతోంది. అంటే ఉల్కాపాతాలు స్పష్టంగా కనిపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లే.

సూర్యగ్రహణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సూర్యగ్రహణం

డిసెంబరు 14: సంపూర్ణ సూర్య గ్రహణం.. చిలీ, అర్జెంటీనాల్లో మాత్రమే

దక్షిణ అమెరికా దేశాలైన చిలీ, అర్జెంటీనాల్లో మాత్రమే ఈ సూర్య గ్రహణాన్ని చూడొచ్చు. అయితే, ఇంటర్నెట్ సాయంతో మనం ఎక్కడినుంచైనా హాయిగా వీక్షించొచ్చు.

కరోనావైరస్ వ్యాప్తికి ముందు ఈ దృశ్యాన్ని చూసేందుకు చాలా మంది చిలీ, అర్జెంటీనాలకు వెళ్లేవారు.

కానీ ఇది 2020. మిగతా పనుల్లానే దీన్ని కూడా మనం ఇంట్లో నుంచే కూర్చొని చూడాలి.

ఒకవేళ మీకు అర్జెంటీనా లేదా చిలీల్లో నుంచి చూసే అవకాశం దక్కితే.. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేరుగా గ్రహణాన్ని చూడొద్దు. కంటికి రక్షణ కల్పించే పరికరాలను ఉపయోగించాలి.

‘’24 నిమిషాలపాటు సూర్యుణ్ని.. అమావాస్య చంద్రుడు కప్పేస్తాడు. అయితే.. సూర్యుణ్ని పూర్తిగా కప్పివుంచే సమయం రెండు నిమిషాల 9.6 సెకన్లు ఉంటుంది’’అని రాయల్ అబ్జర్వేటరీ గ్రీన్‌విచ్‌కు చెందిన తానియా డీ సేల్స్ మార్క్స్ చెప్పారు.

‘‘చంద్రుడికంటే సూర్యుడు 400 రెట్లు పెద్దగా ఉంటాడు. కానీ చంద్రుడు మనకు దగ్గరగా ఉండటంతో పెద్దగా కనిపిస్తాడు’’అని ఆమె అన్నారు.

సూర్యగ్రహణం

ఫొటో సోర్స్, Getty Images

సూర్యుడి ముందు నుంచి చంద్రుడు వెళ్లినప్పుడు కొన్ని ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకుంటాయి. దక్షిణ అమెరికాలోని చిట్టచివరన ఉండే ప్రాంతాల్లో మట్ట మధ్యాహ్నం ఇది కనిపిస్తుంది.

సూర్యగ్రహణాన్ని ఇక్కడి పెటగోనియాలోని మపుచే జాతి ప్రజలు చాలా తీక్షణంగా గమనిస్తుంటారు.

‘‘సూర్యుడు పురుష శక్తికి, చంద్రుడు స్త్రీ శక్తికి ప్రతి రూపంగా మేం భావిస్తాం. ఈ రెండింటి మధ్య విభేదాలను మేం చాలా లోతుగా విశ్లేషిస్తాం’’అని మపుచే విద్యావేత్త మర్సెలో హ్యూక్వెన్‌మ్యాన్ చెప్పారు.

‘‘ఈ సూర్య గ్రహణాన్ని మపుచే ప్రజలు చెడు పరిణామంగా భావిస్తారు. ఈ పరిణామాన్ని స్థానిక భాషలో ఇహాన్ అంతు అని చెబుతారు.. అంటే సూర్యుడి మరణం అని అర్థం’’అని మర్సెలో వివరించారు.

‘‘5000ఏళ్ల నుంచీ సూర్య గ్రహణాలను ప్రజలు చూస్తున్నట్లు చరిత్ర చెబుతోంది’’అని తానియా అన్నారు.

బృహస్పతి, శని

ఫొటో సోర్స్, Getty Images

‘‘సంపూర్ణ సూర్య గ్రహణాన్ని ప్రపంచంలో చాలా ప్రాంతాలు చెడు పరిణామంగానే చూస్తాయి. సూర్యుణ్ని ఎవరో తినేస్తున్నట్లు భావిస్తాయి’’అని ఆమె అన్నారు.

‘‘ఒక్కోసారి ఒక ఏడాదిలోనే ఐదు సూర్య గ్రహణాలు వస్తుంటాయి. కానీ సంపూర్ణ సూర్య గ్రహణం 18 నెలలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఆ సమయంలో సూర్యుణ్ని పూర్తిగా చంద్రుడు కప్పేస్తాడు’’అని ఆమె పేర్కొన్నారు.

అంటార్కిటికాలో డింబరు 2021లో.. ఇండోనేషియా, ఆస్ట్రేలియాల్లో ఏప్రిల్ 2023లో.. అమెరికా, కెనడాల్లో ఏప్రిల్ 2024లో.. దక్షిణ యూరప్, గ్రీన్‌లాండ్‌లో 2026లో.. ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియాలో ఆగస్టు 2027లో సంపూర్ణ సూర్య గ్రహణాలను చూడొచ్చు.

బృహస్పతి, శని

ఫొటో సోర్స్, Getty Images

డిసెంబరు 21: బృహస్పతి, శని గ్రహాల కలయిక.. ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుంది

‘‘బృహస్పతి, శని గ్రహాలు చూడటానికి ఆకాశంలో చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయి’’అని రాయల్ అబ్జర్వేటరీ గ్రీన్‌విచ్‌కు చెందిన ఎడ్ బ్లూమర్ అన్నారు.

ఈ రెండు గ్రహాలు ఒకదాని ముందుకు మరొకటి వచ్చీ.. ఈ రెండూ కలిసిపోతున్నాయా? అనే భ్రమను కలిగిస్తాయి.

డిసెంబరు 21 రాత్రి ఈ పరిణామం మనకు కనిపిస్తుంది. ‘‘ఈ రెండు ఒకదానిలో మరొకటి కలిసిపోతున్నాయా అని మనకు అనిపిస్తుంది. దీన్ని ఎలాంటి పరికరాలు అవసరం లేకుండానే చూడొచ్చు’’అని ఎడ్ చెప్పారు.

‘‘భూమి నుంచి బృహస్పతికి మధ్య 800 మిలియన్ కి.మీ.ల కంటే ఎక్కువ దూరమే ఉంటుంది. మరోవైపు బృహస్పతి, శనిల మధ్య కూడా దాదాపు ఇంత దూరమే ఉంటుంది. కానీ ఈ రెండు దాదాపు ఒకే పరిమాణంతో కలిసిపోతున్నట్లు మనకు కనిపిస్తాయి’’అని ఎడ్ వివరించారు.

‘‘ఈ రెండు కలిసే పరిణామాన్ని చూడటం చాలా సరదాగా అనిపిస్తుంది. మీ దగ్గర బైనాక్యులర్స్ ఉంటే బృహస్పతి చుట్టూ ఉండే నాలుగు చంద్రుళ్లను కూడా చూడొచ్చు’’అని ఎడ్ తెలిపారు.

బృహస్పతి చుట్టూ తిరిగే ఈ చంద్రుళ్లను గెలిలియన్ చంద్రుళ్లుగా పిలుస్తారు. ఎందుకంటే వీటిని 1610లో తన కొత్త టెలిస్కోప్‌తో గెలిలియో కనుగొన్నారు.

శని, బృహస్పతిల కలయిక ప్రతి 19.6ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ‘‘కానీ, ఈ 2020 కలయికకు ఒక ప్రత్యేకత ఉంది. 17వ శతాబ్దం తర్వాత ఇవి చాలా దగ్గరగా రాబోతున్నాయి. 397 ఏళ్ల క్రితం ఇలానే జరిగింది’’

మరోవైపు డిసెంబరు 21నే దక్షిణార్థగోళంలో సూర్యాయణం మొదలవుతుంది. అంటే అప్పటి నుంచే ఇక్కడ వేసవి మొదలవుతుంది. ఉత్తరార్థ గోళంలో మాత్రం శీతాకాలం మొదలవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)