ఇరాన్: అణు శాస్త్రవేత్త ఫఖ్రిజాదేను హత్య ఇజ్రాయెలే.. ప్రతీకారం తీర్చుకుంటామన్న హసన్ రూహానీ

ఫొటో సోర్స్, HAMSHAHRIONLINE
ఇరాన్ అత్యంత సీనియర్ అణు శాస్త్రవేత్త మొహ్సేన్ ఫఖ్రిజాదే హత్యకు గురయ్యారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో కొందరు సాయుధులు చేసిన దాడిలో ఆయన చనిపోయినట్టు ఆ దేశ రక్షణ శాఖ ధృవీకరించింది.
దమవాండ్ కౌంటీలోని అబ్సార్డ్‌లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఫఖ్రిజాదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఇరాన్ అగ్ర అణు శాస్త్రవేత్త ఫఖ్రిజాదే హత్యకు ఇజ్రాయెలే కారణమని ఇరాన్ అధ్యక్షుడు ఆరోపించారు. అయితే, ఆయన్ను చంపినంత మాత్రాన తమ అణు కార్యక్రమం నెమ్మదించదని హెచ్చరించారు.
మొహ్సేన్ ఫఖ్రిజా హత్యకు ఇరాన్ తగిన సమయం చూసి ప్రతీకారం తీర్చుకుంటుందని హసన్ రూహానీ అన్నారు.
ఇజ్రాయెల్ దీనిపై ఇంకా స్పందించలేదు. కానీ, ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమం వెనుక ఆయన ఉన్నాడని అది గతంలో ఆరోపించింది.
ఇరాన్ రహస్య అణ్వాయుధ కార్యక్రమం వెనుక ఉన్న కీలకమైన వ్యక్తి ఫఖ్రిజాదే అని పాశ్చాత్య దేశాల గూడచార సంస్థలు అనుమానిస్తూ వచ్చాయి.
"ఇరాన్ అణ్వాయుధాలను ఎంచుకుంటే, ఆ బాంబుకు పితామహుడిగా ఫఖ్రిజాదే అవుతారు" అని ఒక పశ్చిమ దేశ దౌత్యవేత్త 2014లో రాయిటర్స్ వార్తా సంస్థతో అన్నారు.
అయితే, తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమేనని ఇరాన్ నొక్కి చెప్పింది.

ఫొటో సోర్స్, EPA
2010 నుంచి 2012 మధ్య నలుగురు ఇరాన్ అణు శాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు, ఈ హత్యల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ ఆరోపించింది.
2018 ఏప్రిల్‌లో ఇరాన్ అణు కార్యక్రమం గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విడుదల చేసిన నివేదికలో ఫఖ్రిజాదే పేరు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఫఖ్రిజాదే హత్య వార్తలపై ఇజ్రాయెల్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ కూడా దీనిపై స్పందించడానికి నిరాకరించిందని రాయిటర్స్ తెలిపింది.
హత్య ఎలా జరిగింది?
ఇరాన్ రక్షణ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. "రక్షణ శాఖ పరిశోధన, ఆవిష్కరణల విభాగం అధిపతి మొహ్సేన్ ఫఖ్రిజాదే ప్రయాణిస్తున్న కారును సాయుధులైన తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. తీవ్రవాదులకు ఫఖ్రిజాదే అంగరక్షకులకు మధ్య జరిగిన ఘర్షణలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాంతో స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. కానీ, దురదృష్టవశాత్తు ఆయన్ను రక్షించేందుకు వైద్య బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి" అని తెలిపింది.
మొదట పేలుళ్ల శబ్దం వినించిందని, ఆ తర్వాత మెషిన్ గన్లతో కాల్పులు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ పేర్కొంది.
ముగ్గురు నలుగురు తీవ్రవాదులు కూడా హతమయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు ఏజెన్సీ తెలిపింది.

ఫొటో సోర్స్, EPA
ఇరాన్ ఎలా స్పందించింది?
"ఈ హత్యకు తగిన సమయం చూసి స్పందిస్తాం. ఫఖ్రీజా హత్య తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా ఇరాన్‌ను ప్రేరేపించలేద"ని ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ అన్నారు.
"ఇరాన్ ప్రజలు, అధికారులు ఈ నేరపూరిత చర్యలు సమాధానం ఇవ్వకుండా విడిచిపెట్టగలిగిన దైర్యవంతులని మన శత్రువులకు తెలియాలి. తగిన సమయంలో వారు ఈ నేరానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంద"ని ఆయన ఒక కేబినెట్ సమావేశంలో అన్నారు.
జియోనిస్టు అణచివేత పాలనలో కిరాయి సైనికులు ఈ దాడి వెనుక ఉన్నారని ఆయన ఆరోపించారు.
ఫఖ్రీజా హత్య మా శత్రువుల నైరాశ్యాన్ని, వారి ద్వేషం లోతులను చూపించింది. అమరవీరుడి మరణంతో మా విజయాలు నెమ్మదించవు" అన్నారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమైనీ కూడా దాడి చేసిన నేరస్థులను, దానికి ఆదేశించిన వారిని శిక్షించాలని శనివారం ట్వీట్ చేశారు.
దాడిచేసినవారిపై మెరుపుదాడి చేస్తామని అంతకు ముందు ఆయన సైనిక సలహాదారు హొస్సేన్ దెహ్ఘన్ ప్రతిజ్ఞ చేశారు.
ఇరాన్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దాడి వెనుక ఇజ్రాయెల్ ఉందన్న న్యూయార్క్ టైమ్స్ ఇందులో ఇద్దరు ఇంటెలిజెన్స్ అధికారులతోపాటూ ముగ్గురు అమెరికా అధికారుల ప్రమేయం ఉందని తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
ఆయన్ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?
పాల్ ఆడమ్స్, బీబీసీ డిప్లొమాటిక్ కరస్పాండెంట్
ఇరాన్ రక్షణ శాఖ పరిధిలోని పరిశోధన, ఆవిష్కరణల సంస్థ అధిపతిగా, ఫఖ్రిజాదే కీలక పాత్ర పోషించారు. అందుకే "అతని పేరును గుర్తుంచుకుంటాం" అని బెంజమిన్ నెతన్యాహు రెండేళ్ల క్రితం హెచ్చరించారు.
2015 ఇరాన్ అణు ఒప్పందం నిబంధనలను ఉల్లంఘించినన ఇరాన్, చాలా ముందుకు వెళ్లింది. ఒప్పందంలో నిర్ధేశించిన స్థాయికి మించి యురేనియం స్వచ్ఛతను పెంచుకుంది.
ఇజ్రాయెల్ ఆరోపించిన కీలక వ్యక్తి మొహ్సేన్ ఫఖ్రిజాదే అయితే, ఆయన హత్య ఇరాన్ అణు కార్యక్రమానికి బ్రేకులు వేసే ప్రయత్నం అవుతుంది.
ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఇరాన్ ఒప్పందంలోకి వాషింగ్టన్‌ను తిరిగి తీసుకెళ్లడం గురించి చర్చ నడుస్తోంది. కానీ, ఫఖ్రిజాదే హత్య కారణంగా భవిష్యత్తులో జరిగే చర్చలు క్లిష్టతరమయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- అమూల్ పాల కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తోంది?
- ‘‘నెలలో పదిహేను రోజులు దేవతలా వుంటుంది... మిగిలిన సగం మాత్రం రాక్షసిలా చేస్తుంది...’
- న్యూరోఫైనాన్స్ అంటే ఏమిటి? కొందరు కష్టపడకుండా సులభంగా డబ్బు ఎలా సంపాదిస్తారు?
- హైదరాబాద్‌కు మరో పేరు ఉందా? భాగ్యనగర్, చించలం.. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
- వెస్ట్ బ్యాంక్‌ను ఇజ్రాయెల్ ఎందుకు కలుపుకుంటోంది?
- ఇరాన్ సీజ్ చేసిన బ్రిటన్ నౌకలోని 18 మంది భారతీయుల పరిస్థితి ఏమిటి
- 'ఇరాన్ ఆయుధ వ్యవస్థలపై అమెరికా సైబర్ దాడి'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








