పెళ్లిలో సూటు ధరించిన వధువు.. సంభ్రమాశ్చార్యాల్లో వరుడు.. ట్రోల్ చేసిన సోషల్ మీడియా...

సంజనా రిషి

ఫొటో సోర్స్, SANJANA RISHI

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతదేశంలో పెళ్లి అనగానే పట్టు చీరలు కానీ, పట్టు పావడాలు ధరించిన వధువు రూపం ఊహల్లో మెదులుతుంది. కానీ, సంప్రదాయానికి భిన్నంగా.. సంజన రిషి తన వివాహంలో ప్యాంటు, సూటు ధరించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు.

ఇండో-అమెరికన్ వ్యాపారవేత్త అయిన సంజన సంప్రదాయ దుస్తులను వదిలిపెట్టి మొదలుపెట్టిన కొత్త పంథాను మరింత మంది అనుసరిస్తారా? అనే సందేహం చాలా మందికి కలిగింది.

పశ్చిమ దేశాలలో గత కొన్ని సంవత్సరాలలో బ్రైడల్ ప్యాంట్ సూట్లు ఫ్యాషన్‌లోకి వచ్చాయి. డిజైనర్లు కూడా పెళ్లి కోసం ప్రత్యేక ట్రౌజర్ల వస్త్రధారణను ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వీటికి కొంత మంది సెలబ్రిటీలు మద్దతు కూడా పలికారు.

గత సంవత్సరం గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటి సోఫీ టర్నర్ ఆమె వివాహానికి తెలుపు రంగు ప్యాంటు ధరించారు. ఆమె సంగీతకారుడు జో జెనాస్‌ని లాస్ వెగాస్‌లో పెళ్లి చేసుకున్నారు.

కానీ సంజన రిషి ధరించిన దుస్తులు మాత్రం భారతదేశంలో సాధారణం కాదు. ఇక్కడ సాధారణంగా వివాహానికి వధువు పట్టు చీరలు కానీ, పొడవాటి లెహంగాలను కానీ ధరిస్తారు. వాటిలో మళ్ళీ బంగారపు జరీతో కానీ, సిల్కుతో కానీ ఎంబ్రాయిడరీ చేసిన ఎరుపు రంగు వస్త్రాలను ధరించడానికి ప్రాముఖ్యతనిస్తారు.

"సంజనా లాగ ప్యాంటు సూటు ధరించిన వధువులను నేనెప్పుడూ చూడలేదు. భారతదేశంలో సాధారణంగా అమ్మాయిలు భారతీయ దుస్తులను, తమకు అమ్మమ్మలు, నానమ్మల దగ్గర నుంచి వచ్చిన సంప్రదాయ నగలను ధరించడానికి ఇష్టపడతారు. ఇది చాలా వినూత్నంగా ఉంది. అందులో సంజనా చాలా విలక్షణంగా కనిపించారు" అని బ్రైడల్ మ్యాగజైన్ మాజీ ఎడిటర్ నూపుర్ మెహతా అన్నారు.

సంజన రిషి వయసు 29 సంవత్సరాలు. ఇండో అమెరికన్ వ్యాపారవేత్త ఆమె. దిల్లీ వ్యాపార వేత్త, 33 సంవత్సరాల ధృవ్ మహాజన్‌ని సెప్టెంబరు 20న వివాహం చేసుకున్నారు. వీరి వివాహం దిల్లీలో జరిగింది.

ఆమె ఇండియాకి తిరిగి రాక ముందు అమెరికాలో కార్పొరేట్ న్యాయవాదిగా పని చేసేవారు. వీరిద్దరూ వివాహానికి ముందు ఒక సంవత్సరం నుంచి కలిసి జీవిస్తున్నారు.

సంజన కుటుంబ సభ్యులు, స్నేహతులు చాలా మంది అమెరికాలోనే ఉండటంతో వీరు ముందు వివాహాన్ని అమెరికాలో చేసుకోవాలని అనుకున్నారు. నవంబరులో దిల్లీలో సంప్రదాయ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ, కోవిడ్ వారి ప్రణాళికలన్నిటినీ తారు మారు చేసింది.

సంజనా రిషి

ఫొటో సోర్స్, SANJANA RISHI

భారతదేశంలో సహజీవనాన్ని అంత త్వరగా ఆమోదించరు. రిషి తల్లితండ్రులు చాలా అభ్యుదయ భావాలు కలిగిన వారైనప్పటికీ, వారి మీద స్నేహితులు, ఇరుగు పొరుగు, బంధువుల నుంచి వీరికి వివాహం చేయండనే ఒత్తిడి వచ్చినట్లు రిషి చెప్పారు.

"దాంతో, ఆగస్టు చివరలో, ఒక రోజు పొద్దున లేవగానే, ‘మనం పెళ్లి చేసుకుందాం’ అని నా భాగస్వామితో చెప్పాను. నేను పెళ్లి చేసుకుందాం అనుకోగానే, నేను నా వివాహానికి ఏం ధరించాలని అనుకుంటున్నానో కూడా నేను నిర్ణయించేసుకున్నాను. నేను ఏ ప్యాంటు సూటు ధరించాలని అనుకుంటున్నానో ఆ క్షణమే నాకు తెలుసు" అని రిషి చెప్పారు.

పర్యావరణ హితమైన ఫ్యాషన్’ని ఇష్టపడే రిషి సాధారణంగా సెకండ్ హ్యాండ్ దుస్తులను కొనుక్కుంటూ ఉంటానని చెప్పారు. ఆమె ఇటలీ లోని ఒక బొటిక్ లో చాలా కాలం క్రితం ఒక సూటును చూసినట్లు చెప్పారు.

"అది 1990లలో ఇటాలియన్ డిజైనర్ జియాన్ ఫ్రాంకో ఫెర్రీ తయారు చేసిన పాత కాలపు నాటి సూటు. నేను వివాహం చేసుకుందామని అనుకున్నప్పుడు అది ఇంకా అమ్మకానికి ఉందని తెలిసి ఆశ్చర్యపోయాను" అని తెలిపారు.

"నేను ఆదర్శంగా తీసుకున్న దృఢమైన మహిళలందరూ సూట్లనే ధరించడం వలన నేను అమెరికాలో కార్పొరేట్ లాయర్ గా పని చేస్తున్నప్పుడు సూట్లు ధరించడాన్ని ఇష్టపడేదానిని" అని రిషి సూట్లపై తనకున్న మక్కువను వివరించారు.

"ప్యాంటు సూటు ధరించిన మహిళలో ఏదో శక్తి ఉంటుందని నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను. నాకవి ధరించడం ఇష్టం. నేనెప్పుడూ అవే ధరిస్తాను. ఈ వివాహం కేవలం 11 మంది సమక్షంలో చిన్న స్థాయిలో జరగడం వలన నాకు ఈ దుస్తులు ధరించడం అర్ధవంతంగానే అనిపించింది" అని చెప్పారు.

సంజనా రిషి

ఫొటో సోర్స్, SANJANA RISHI

‘‘వివాహంలో కేవలం మా అమ్మ నాన్నలు, తాత మామ్మలు ఉన్నారు. ఈ వివాహం కూడా ధృవ్ వాళ్ళ ఇంటి పెరట్లో జరిగింది. అందరూ చాలా సాధారణమైన దుస్తులు ధరించారు. అలాంటి సమయంలో నేను భారీ వస్త్రధారణ చేసుకుంటే కూడా చాలా ఇబ్బందిగా ఉండి ఉండేది. చాలా అతిగా అనిపించి ఉండేది" అని రిషి అన్నారు.

రిషి ప్యాంటు సూటు ధరిస్తుందని ఊహించలేదని మహాజన్ చెప్పారు.

"రిషిని చూసే వరకు ఆమె ఏమి ధరిస్తుందో నాకు తెలియదు. నాకు అదేమీ పెద్ద ముఖ్యం కాదు. సంజనా ఏమి ధరించినా అందులో తను అద్భుతంగానే ఉంటుందని నాకు తెలుసు" అని ఆయన అన్నారు.

"నిజానికి ఆమెను చూడగానే.. ఆమె ఏమి ధరించారో కూడా నేను చూడలేదు. ఆమె ఎంతో అందంగా, దేవతలాగా మెరిసిపోతూ కనిపించారు" అంటూ ఆయన నవ్వారు.

రిషి వివాహ దుస్తులు సోషల్ మీడియాలో తుఫాను రేపాయి.

ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్ లో కొన్ని ఫోటోలు పోస్టు చేయగానే ఆమె స్నేహితులు, అనుచరులు ఆమెను కళ్ళు తిప్పుకోలేకుండా ఉన్నారని, అందంగా, అద్భుతంగా , హాయిగా ఉన్నారని ప్రశంసించారు.

కొంత మంది ఫ్యాషన్ డిజైనర్లు కూడా ఆమె ఎన్నుకున్న దుస్తులకు ఆమోదం తెలిపారు.

సంజనా రిషి

ఫొటో సోర్స్, SANJANA RISHI

"దేవుడా! ఎంత గొప్పగా ఉన్నావు?’’ అంటూ మసాబా గుప్త అనే డిజైనరు కామెంట్ చేసారు. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ చెల్లి రియా కపూర్ కూడా ఆమె అద్భుతంగా ఉన్నారని కామెంట్ చేసారు.

రిషి ధరించిన సూటు బాగుందని, ఒక పెళ్లికూతురు అలా కనిపించడం కూడా అద్భుతమేనని మహిళల దుస్తులను డిజైన్ చేసే ఆనంద్ భూషణ్ బీబీసీతో అన్నారు.

"నేను ఆమె ఫొటోగ్రాఫ్ చూడగానే, సెక్స్ అండ్ సిటీలో ఒక ముఖ్య పాత్ర క్యారీ బ్రాడ్ షా భారతీయురాలైతే, ఆమె వివాహానికి ఇలాగే వస్త్రధారణ చేసుకుని ఉండేవారు అనే ఆలోచన వచ్చింది" అని ఆయన అన్నారు.

కానీ, కొన్ని బ్రైడల్ అకౌంట్లు ఆమె ఫోటోలను షేర్ చేయడంతో ఆమెను తిడుతూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

భారతీయ సంస్కృతికి ఆమె అపవాదు తెచ్చిందని, అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఫెమినిజం పేరుతో ఏదైనా చేస్తారని మహాజన్‌ని కామెంట్ల ద్వారా దూషించడం మొదలు పెట్టారు. ఆమె ఎప్పటికీ భారతీయ సంస్కృతిని అర్ధం చేసుకోలేరని, ఆమె పాశ్చాత్య సంస్కృతికి ప్రభావితం అయిన వ్యక్తి అని కామెంట్ చేశారు.

"కొందరైతే, నన్ను చావమని కూడా రాశారు" అని రిషి చెప్పారు.

"భారతదేశంలో పురుషులు వివాహాలలో ప్యాంటు సూట్లు ధరించడాన్ని ఎవరూ ప్రశ్నించరు. కానీ, అదే ఒక అమ్మాయి ధరిస్తే అందరికీ ఆమె లోకువగా మారుతుంది. ఈ వైఖరేమిటో నాకర్ధం కాదు" అని రిషి అన్నారు.

"మహిళలను ఎప్పుడూ ఉన్నతమైన ప్రమాణాలకు లోబడే ఉండాలనే ఆలోచనల వల్ల ఈ పరిస్థితి ఉందేమే’’ అని ఆమె అన్నారు.

"ఇది భారతదేశంలోనే కాదు. మహిళలు ప్యాంట్లు ధరించాలనే పోరాటం ప్రపంచ వ్యాప్తంగా చాలా సంస్కృతుల్లో జరుగుతోంది. ఎవరైనా సంప్రదాయ దుస్తులను ధరించకూడదనుకుంటే కనురెప్పలు చిట్లించి చూస్తారు" అని రిషి అన్నారు.

సంజనా రిషి

ఫొటో సోర్స్, SANJANA RISHI

ఫ్రాన్స్ లో 2013 వరకు మహిళలు ట్రౌజర్లు ధరించడం చట్ట విరుద్ధం. కానీ, ఈ నిషేధాన్ని కొన్ని దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోవడం లేదు.

దక్షిణ కొరియాలో విద్యార్థులు ఇటీవల కాలంలోనే యూనిఫామ్ కోసం స్కర్ట్ లకు బదులుగా ట్రౌజర్లు కొనుక్కోవడానికి అనుమతి లభించింది.

అమెరికాలోని నార్త్ కరోలినాలో స్కూలులో ట్రౌజర్లు ధరించడానికి అనుమతి పొందడానికి కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. పెన్సిల్వేనియాలో ట్రౌజర్లు ధరించేందుకు 18 సంవత్సరాల అమ్మాయి స్కూలు పై కేసు వేసి గెలిచారు.

ఇలాంటి ప్రతిఘటనే భారతదేశంలో కూడా కొనసాగుతోంది.

"కొన్ని శతాబ్దాలుగా భారతీయ మహిళలు పైజామాలు ధరిస్తున్నప్పటికీ, మెట్రో నగరాల బయట కొన్ని సంప్రదాయ కుటుంబాలలో మాత్రం అమ్మాయిలను ట్రౌజర్లు కానీ, జీన్స్ కానీ ధరించటానికి ఒప్పుకోరు" అని భూషణ్ అంటారు.

"పితృస్వామ్యం వేళ్ళూనుకు పోయిన సమాజంలో , పురుషులు మహిళల నుంచి అభద్రత ఎదుర్కొంటారు. దాంతో, మహిళల ప్రవర్తన, వారి పునరుత్పత్తి హక్కులు, వారు మాట్లాడే విధానం, నవ్వే తీరు, వస్త్రధారణను పురుషులే నిర్ణయిస్తారు" అని ఆయన అంటారు.

ప్యాంటు సూటు ధరించి రాజకీయ ప్రకటన ఏమి చేయాలని అనుకోవడం లేదని రిషి చెప్పినప్పటికీ , ఇది ఆమె ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదని చెబుతున్నారు.

"భారతదేశంలో మహిళలందరికీ వారికి ఇష్టమైన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉండదు. నేను నా ఫోటోలు ఇన్‌స్ట్రాగ్రామ్లో పెట్టగానే, చాలా మంది అమ్మాయిలు, తమ వివాహానికి ఏమి ధరించాలని అనుకుంటున్నారో వారి తల్లితండ్రులకు చెప్పే ధైర్యం వచ్చిందని నాకు సందేశాలు పంపారు" అని రిషి చెప్పారు.

"ఒక వైపు ఇది వినడానికి నాకు చాలా సంతోషం వేసింది. కానీ, మరో వైపు నేనేమన్నా ఇతరుల ఇళ్లల్లో, జీవితాల్లో సమస్యలు సృష్టిస్తున్నానా అనే భయం కూడా వేసింది" అని రిషి అన్నారు.

లేత నీలం రంగు ప్యాంటు సూటు ధరించిన ఈ మహిళ వేరే మహిళలు వివాహ సమయంలో ఇలాంటి తరహా దుస్తులు ధరించడానికి స్ఫూర్తిగా నిలుస్తారా?

"ఆమె అసాధారణ ఎంపిక ఒక నిప్పు రవ్వను రగిలిస్తుంది. అది పెద్ద జ్వాలగా అవ్వవచ్చు. లేదా ఆరిపోవచ్చు" అన్నారు భూషణ్.

"జ్వాలగా రగులుతుందని నేను ఆశిస్తున్నా" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)