ఒకప్పుడు పార్ట్‌టైం జాబ్ చేశారు, ఇప్పుడు ఈయన 560 కోట్ల డాలర్ల కంపెనీకి అధిపతి

జానీ బౌఫర్హాట్

ఫొటో సోర్స్, Anna Huix

ఫొటో క్యాప్షన్, జానీ బౌఫర్హాట్
    • రచయిత, డగల్ షా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కేవలం రెండేళ్లలో కోటీశ్వరుడు అయిపోయారు జానీ బౌఫర్హాట్. తన స్టార్టప్‌ సంస్థ హోపిన్‌ను రెండంటే రెండే సంవత్సరాల్లో ఆయన 560 కోట్ల డాలర్ల విలువైన కంపెనీగా మార్చేశారు.

ఆయన సంస్థలో 650 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కానీ వారిలో కొందరిని ఇప్పటి వరకు ఆయన కలవలేదు. అంతేకాదు వాళ్లెవరూ ఒక ఆఫీసులో కూర్చుని పని చేయరు.

ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్‌ ప్రకారం జానీ బ్రిటన్‌లో అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్. ప్రైవేటు ఇన్వెస్టర్ల నుంచి ఆయన ఇటీవల 400 మిలియన్ డాలర్లను సమీకరించారు. దాంతో ఆయన హోపిన్ సంస్థ విలువ 5.65 బిలియన్ డాలర్లకు పెరిగింది.

హోపిన్ సంస్థ ఆన్‌లైన్‌లో కాన్ఫరెన్సులకు వేదికగా సేవలు అందిస్తోంది. దానికి జానీ సీఈవోగా ఉన్నారు.

అద్దె నివాసంలో జానీ బౌఫర్హాట్
ఫొటో క్యాప్షన్, జానీ బౌఫర్హాట్

ఏమిటా సంస్థ ? ఆయనెవరు?

జానీ బౌఫర్హాట్‌కు పనులను విభిన్నంగా చేయడం ఇష్టం.

"గతంలో ఇతర సంస్థలేవీ పని చేయని విధంగా మా సంస్థ పూర్తిగా రిమోట్‌గా పని చేస్తుంది" అని జానీ వివరించారు.

ఇంత కోటీశ్వర్వరుడైనా ఆయనకు సొంత ఆఫీస్‌ లేదు. చివరికి ఇల్లు కూడా లేదు. ఆయన స్పెయిన్‌లోని బార్సిలోనాలో అద్దెకు ఉంటున్నారు.

ఆయన డిజిటల్ సంచారిలా ఒకచోటు నుంచి మరొక చోటుకు తిరుగుతూనే ఉంటారు.

ఆయన ఎక్కడుంటే, అక్కడ నుంచే సంస్థ వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటారు.

బార్సిలోనాలో అద్దెకు ఉంటున్న ఎయిర్ బి‌ఎన్‌బి నివాసం నుంచే ఆయన బీబీసీతో మాట్లాడారు.

"ఇదే పనిని 10 సంవత్సరాల క్రితం చేసి ఉండగలిగేవాళ్లం కాదు. అప్పట్లో రిమోట్ వర్కింగ్‌కి సరిపోయేంత సాఫ్ట్‌వేర్ ఉండేది కాదు" అని బౌఫర్హాట్ చెప్పారు.

అయితే ఈ సంస్థ స్థాపనేమీ ఆయన ఒక ఆదర్శం కోసం తీసుకున్న నిర్ణయం కాదు. ఈ సంస్థ విస్తరిస్తున్న క్రమంలో రిమోట్‌గా పని చేయడం మంచిదని నిరూపితమయింది.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

కలిసొచ్చిన సమయం

2019లో కేవలం ఆరుగురు ఉద్యోగులతో హోపిన్ మొదలయింది. కానీ కోవిడ్ మహమ్మారి సమయంలో గణనీయంగా విస్తరించింది.

కోవిడ్ సమయంలో సమావేశాలు నిర్వహించడం కష్టంగా మారింది. అప్పటికే ఉన్న సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

అదే సమయంలో జానీ కూడా హోపిన్ ద్వారా ఈ సమావేశాలకు ఆన్‌లైన్ ప్రత్యామ్నాయం కల్పించడానికి ముందడుగు వేశారు.

జూమ్ తరహాలో ఇది కూడా సరైన సమయంలో టెక్నాలజీ స్పేస్‌లో మొదలయిన సంస్థ అని చెప్పవచ్చు.

ఐక్యరాజ్యసమితి, నాటో, స్లాక్, యూనిలీవర్ లాంటి సంస్థలు హోపిన్ ద్వారా వర్చువల్ సమావేశాలు నిర్వహించాయి. 2020 సంవత్సరం నుంచి హోపిన్ 80,000కు పైగా సమావేశాలకు వేదికగా నిలిచింది.

ఆన్‌లైన్ సమావేశం

ఫొటో సోర్స్, Hopin

ఫొటో క్యాప్షన్, హోపిన్ వేదికపై వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తారు.

జానీ కథ ఆసక్తికరం

తన స్టార్టప్ వృద్ధి చెందడానికి కారణమైన ఈ రిమోట్ వర్కింగ్ విధానాన్ని ఇప్పట్లో మార్చే ఆలోచనేదీ తనకు లేదని ఆయన చెప్పారు.

రిమోట్ వర్కింగ్ సంస్కృతిని సమర్ధించేందుకు విభిన్నమైన డిజిటల్ కంపెనీని ఆయన అభివృద్ధి చేశారు.

భవిష్యత్తులో మరిన్ని సంస్థలను ప్రారంభించి నిర్వహించడానికి ఇదొక నమూనాగా పని చేస్తుంది.

హోపిన్‌లో పని చేసే 650 మంది సిబ్బంది కోసం నెలకొకసారి "టౌన్‌హాల్" సమావేశం నిర్వహిస్తారు. ఇదొక టీవీ గేమ్ షోలా ఉంటుందని జానీ అన్నారు.

అలాగే మెరుగుపర్చుకోవాల్సిన అంశాల గురించి తెలుసుకునేందుకు హోపిన్ ప్రతి నెలా ఆన్‌లైన్ స్టాఫ్ సర్వే కూడా నిర్వహిస్తూ ఉంటుంది.

లాక్‌డౌన్ సడలించిన తర్వాత తమ సంస్థలో సహోద్యోగులు సాంఘిక కారణాల రీత్యా ఒకరితో ఒకరు కలవాలని అనుకోవచ్చు. కానీ పని విషయానికొచ్చేసరికి సహోద్యోగులు కలిసే అవసరం రాకపోవచ్చు అని జానీ అన్నారు.

"రిమోట్ వర్క్ చేసే అవకాశం ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంట్ పూల్ నుంచి సిబ్బందిని నియమించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒక సంస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇది చాలా అవసరం" అని ఆయన అన్నారు.

"ఈ పని వ్యక్తిగా నాలో మార్పును తీసుకుని వచ్చింది" అని చెప్పారు.

ఆయన వ్యక్తిగత కథ ఆసక్తికరంగా ఉంటుంది.

వీడియో క్యాప్షన్, పడాల భూదేవి: గిరిజన గూడెం నుంచి రాష్టప్రతి భవన్ వరకూ సాగిన విజయ గాథ

ఆస్ట్రేలియాలో జననం, టీనేజీలో లండన్‌కు..

నిజానికి జానీ తల్లిదండ్రులది లెబనాన్‌. ఆయన ఆస్ట్రేలియాలో పుట్టి, అక్కడే పెరిగారు. టీనేజీలో లండన్‌కు వెళ్లారు.

ఆయన మాంచెస్టర్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేసిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి 2015లో ఆగ్నేయాసియా పర్యటనకు వెళ్లారు.

ఆ పర్యటనలో ఆయన జబ్బుపడ్డారు. కొన్ని నెలల పాటు మంచానికే అతుక్కుని ఉండిపోవలసి వచ్చింది. ఆయన రోగనిరోధక శక్తి తగ్గిపోయే జబ్బు బారిన పడ్డారు.

"ఆ అనారోగ్యమే నన్ను మార్చింది" అని జానీ అన్నారు.

"నేను ఇల్లు దాటి బయటకు వెళ్లలేకపోయేవాడిని. చాలా అలసటగా ఉండేది. వాంతులు అవుతూ ఉండేవి. సంవత్సరం పాటు అనారోగ్యంతో బాధపడిన తర్వాత, మానసికంగా చాలా బలహీనంగా తయారయ్యాను. అలా ఇంటికే అంకితమైన జీవితాన్ని గడపాలని నాకు అనిపించలేదు" అని జానీ బౌఫర్హాట్ చెప్పారు.

అయితే, ఆన్‌లైన్‌లో కొంతవరకు అందరితో మాట్లాడుతూనే ఉన్నప్పటికీ కూడా, నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవడానికి మాత్రం చాలా కష్టం అనిపించేది. ఆయన కెరీర్ విచ్చిన్నమైపోతున్నట్లుగా అనిపించేది.

ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఫ్రీలాన్స్ ఉద్యోగం చేస్తూ ఉండేవారు. కానీ ఆ పని ఆయనకు తగినంత సంతృప్తిని ఇవ్వలేదు.

మంచం మీద ఉన్న సమయంలో కూడా ఆయన వెబినార్లు, వీడియో కాన్ఫరెన్సులకు హాజరవుతూ ఉండేవారు. కానీ, వృత్తిలో పురోగతి సాధించడానికి కీలకమైన కొత్త వ్యక్తులతో పరిచయాలు చేసుకోవడం, కలవడం లాంటివి చేయలేకపోతున్నానని ఆయనకు అర్థమైంది.

"వెబినార్‌లో 1000 మంది ఉండవచ్చు. కానీ నిజానికి అందులో ఇద్దరు మాత్రమే మాట్లాడతారు. ఎవరు మనల్ని చూస్తున్నారో కూడా మనకు అర్థం కాదు" అని బౌఫర్హాట్ అన్నారు.

దాంతో హోపిన్ తొలి వెర్షన్‌ను ఆయన స్వయంగా కోడ్ చేసుకున్నారు.

సమావేశంలో పాల్గొనే వారు సందేశాలు, ఆన్‌లైన్ బ్రేక్ అవుట్ రూమ్స్ ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు వీలుగా ఉండే విధంగా దీనిని రూపొందించారు.

ప్రెజెంటేషన్

ఫొటో సోర్స్, Hopin

నెమ్మదిగా వివిధ రకాల ఆహారపు డైట్‌లను పాటించి ఆయన తన ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకున్నారు.

"వెనక్కి తిరిగి చూస్తే ఈ అనారోగ్యం నాకు పునర్జన్మనిచ్చిందని చెప్పవచ్చు. ప్రపంచాన్ని దగ్గర చేసేందుకు అవసరమైన పనిలో నన్ను నిమగ్నం చేసింది" అని జానీ అన్నారు.

ఆయన నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు రూపొందించిన హోపిన్‌ను చివరకు 2019లో లాంచ్ చేశారు.

అప్పటికి కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతుందని ఆయనకు తెలియదు. కోవిడ్ సంక్షోభం జానీ స్టార్టప్‌ను విజయం వైపు దూసుకెళ్లేలా చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)