ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: కోవిడ్ మరణాలపై రెండు రాష్ట్రాలవీ కాకిలెక్కలే- బీబీసీ పరిశోధనలో వెల్లడి

- రచయిత, బళ్ల సతీశ్, వి.శంకర్, ఎస్.ప్రవీణ్ కుమార్
- హోదా, బీబీసీ తెలుగు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మరణాల సంఖ్య విషయంలో ప్రభుత్వాలు చెబుతోన్న దానికీ వాస్తవానికీ పొంతన లేదని బీబీసీ పరిశీలనలో తేలింది.
పోయినేడు ప్రభుత్వం ప్రకటించిన సంఖ్యకు మరణాలు రెట్టింపులో కనిపిస్తుంటే ఈ ఏడు, ముఖ్యంగా మే నెలలో ప్రభుత్వాలు ప్రకటించిన సంఖ్య కంటే అనేక రెట్లు వాస్తవమరణాలు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వాల లెక్కలోకి రాని కరోనా మరణాలు చాలా అధికంగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, DEFODI IMAGES/GETTY
తెలంగాణ సంగతి తొలుత చూద్దాం.
2014 నుంచి 2019 వరకు హైదరాబాద్ మినహా మిగిలిన తెలంగాణలో ఏటా సగటున 41 వేల మరణాలు నమోదు అయ్యేవి.
ఇది జనన మరణాల రిజిస్టర్ లెక్క. కానీ ఒక్క 2020లో 79 వేల మరణాలు నమోదు అయ్యాయి.
అంటే మొదటి వేవ్ వచ్చిన 2020లోనే రెట్టింపు మరణాలు నమోదు అయ్యాయి. కానీ 2020 డిసెంబరు 31 నాటికి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కరోనా మరణాలు 1544 అని ప్రభుత్వ లెక్క.
మరి 2020లో కరోనా వల్ల కేవలం 1544 మంది మాత్రమే చనిపోతే, ప్రతీ ఏటా కంటే రెట్టింపు సంఖ్యలో నమోదయిన ఆ మరణాలు ఎందువల్ల జరిగినట్టు. కరోనా కాకుండా అంత ఉత్పాతాలు, ప్రళయాలు ఏమొచ్చాయి తెలంగాణలో అంత భారీ సంఖ్యలో మరణాల సంఖ్య పెరగడానికి?

ఇక నడుస్తున్న ఏడాది 2021 సంగతి చూద్దాం.
2021లో జూన్ 15 వరకే తెలంగాణలో 49 వేల మరణాలు నమోదు అయ్యాయి.
ఇది ఏడాది సగటు మరణాలకు సమానం. అంటే మామూలుగా ఒక ఏడాది మొత్తంలో నమోదయ్యే మరణాలు, మొదటి ఆరు నెలల్లోనే రికార్డు అయ్యాయి.
కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం 2021 జూన్ 15 నాటికి తెలంగాణలో కరోనా మరణాలు కేవలం 1966 మాత్రమే. మరి మిగిలిన వేలాది మంది ఎలా మరణించారు?

ముఖ్యంగా కరోనా విజృంభించిన నెలల వారీగా లెక్కలు తీసినప్పుడు ఈ విషయం మనకు మరింత స్పష్టంగా తెలుస్తుంది. తేడా మరింత ఎక్కువగా కనిపిస్తుంది.
తెలంగాణలో 2014-2020 వరకు ఏప్రిల్ నెలలో సగటున 3 వేల మంది వరకూ చనిపోతుంటారని రికార్డులు ఉంటే.. 2021లో మాత్రం 6 వేల 300 మంది చనిపోయారు.
అంటే సగటు కంటే రెట్టింపు. కానీ అదే నెలలో ప్రభుత్వ అధికారిక కరోనా మృతుల లెక్క మాత్రం 608. మరి మిగిలిన వాళ్లు ఎలా చనిపోయారు?

2021 మేలో 12,304 మరణాలు నమోదయ్యాయి. అంటే సగటు కంటే నాలుగు రెట్లు ఎక్కువ.
9 వేల మంది ఎక్కువగా చనిపోయారు. కానీ అదే నెలలో ప్రభుత్వ అధికారిక కరోనా లెక్కలు మాత్రం 913.
మరి ఆ మిగిలిన వేలాది మంది ఎలా చనిపోయారు?
ఇక 2014-19 వరకు జూన్ నెలలో సగటున 3400 మరణాలు నమోదయ్యాయి.

కానీ 2020 జూన్‌లో 7,664 మరణాలు, 2021 జూన్‌లో 16వ తేదీ నాటికే 9,286 మరణాలు నమోదయ్యాయి.
ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటిలో కరోనా మరణాలు 2020 జూన్‌లో కేవలం 260 కాగా, 2021 జూన్ 15 వరకూ 225 మాత్రమే. మిగిలిన వేలాది మంది సంగతేంటి?.

ఫొటో సోర్స్, Getty Images
క్షేత్ర స్థాయిలో పరిస్థితి చూద్దాం..
మచ్చుకు కరీంనగర్ పట్టణం. కరీంనగర్‌లో ఉన్న శ్మశాన వాటికల్లో అలకాపురి, రాంనగర్ పెద్దవి. ముస్లిం, సిక్కు, క్రైస్తవ వాటికలు వీటికి అదనం. అలకాపురిలోని శాంతి నివాసం శ్మశాన వాటికలో ఈ ఏడాదే కరోనా, నాన్ కరోనా మృతదేహాలు ప్రత్యేకంగా లెక్కించారు.
ఇక్కడ 2019 వరకు సాధారణంగా మే నెలలో 15 మృతదేహాలకు అటుఇటుగా దహన సంస్కారాలు జరుగుతుంటాయని నిర్వాహకులు చెప్పారు.
కానీ 2020 మేలో 41 జరుగగా, 2021 మేలో 89 జరిగాయి. 2021 మేలో జరిగిన వాటిలో 57 కోవిడ్ మృతదేహాలు కాగా, 32 నాన్ కోవిడ్ మృత దేహాలు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఇక్కడ ఆరు రెట్లు ఎక్కువ అంత్యక్రియలు జరిగాయి.
మానేరు నదీ తీరంలో కరోనా కోసమే ప్రత్యేకంగా ఒక కొత్త శ్మశాన వాటిక ఎందుకు ఏర్పాటు చేశారో ఈ సంఖ్య చూస్తేనే అర్థమవుతుంది. కరోనా రెండవ వేవ్ బలంగా ఉన్న రోజుల్లో ఆ ప్రదేశంలో ఎప్పుడూ కనీసం 10-15 చితులు పేర్చి ఉండేవి.
దేశంలో మిగిలిన చోట్ల పేదలు కరోనా అంత్యక్రియలకు ఇబ్బంది పడ్డారు. కానీ కరీంనగర్ కార్పొరేషన్ మాత్రం పేదలకు ఒక్క రూపాయికే అంత్యక్రియలు చేసే పథకం ఒకటి పెట్టింది. ఆ పథకం లెక్కలు చూసినా విషయం తేలిపోతుంది.

2021 ఏప్రిల్ 3వ తేదీ నుంచి 2021 జూన్ 14వ తేదీ వరకు కేవలం కరీంనగర్ పట్టణం నుంచే 341 మంది కోవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు ఈ పథకం కింద. సొంతంగా అంత్యక్రియలు నిర్వహించుకున్న వారు వీటికి అదనం.
సరిగ్గా అవే తేదీల్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో 1784 మంది చనిపోయినట్టు ప్రభుత్వం చెప్పింది. ఈ రెండిటినీ పోలిస్తే ఓ అనుమానం వస్తుంది.
మూడున్నర కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో కరోనా వల్ల చనిపోయిన వారిలో ఐదో వంతు మంది, కేవలం 3 లక్షల జనాభా ఉన్న ఈ ఒక్క పట్టణంలోనే చనిపోయారా? ఇది అసంభవం.
మరి కరీంనగర్‌లో అధికారికంగా ఎందరు కరోనాతో చనిపోయారో తెలిస్తే పోతుందిగా? ఆ ఒక్కటీ అడక్కండి అంటున్నారు అధికారులు. బీబీసీ సంప్రదించిన అధికారులెవరూ కరోనా మరణాలపై మాట్లాడలేదు. దీనిపై నోరు విప్పే సాహసం చేయలేకపోతున్నారు.
రికార్డులు కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి. సాధారణంగా ప్రతీ ఏటా మే 1 నుంచి 15 మధ్య 15 రోజులకుగానూ కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్‌లో సగటున 60-65 డెత్ రిజిస్ట్రేషన్లు జరిగేవి. కానీ 2021లో మాత్రం అదే 15 రోజులకుగానూ 233 డెత్ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఇది నాలుగు రెట్లు ఎక్కువ. ఇక ఏడాదికి సుమారు 2300 డెత్ రిజిస్ట్రేషన్లు అవుతాయిక్కడ. కానీ ఈ ఏడాది జూన్ 16వ తేదీ వరకే 2098 డెత్ రిజిస్ట్రేషన్లు అయ్యాయి కరీంనగర్ కార్పొరేషన్ లో.
కరీంనగర్‌లో 2021లో మరణాలు రెట్టింపు కంటే ఎక్కువ అయ్యాయి అనడానికి ఈ ఒక్క లెక్క చాలు. ఈ మరణాలన్నీ కరోనా కోటాలో వేయలేం అని ప్రభుత్వం అనవచ్చు! మరి ఆ మరణాలన్నీ ఎందువల్ల సంభవించాయి అంటే ఎవరి దగ్గరా సమాధానం ఉండదు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ అంతే..
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఒక్క గత నెలలోనే అంటే 2021 మే నెలలో 13 మంది మరణించినట్టు పంచాయతీ లెక్కలు చెబుతున్నాయి.
అందులో అత్యధికం కరోనా కారణంగానే మృతి చెందినట్టు వారి కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు.
కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోతే, అత్యధికులు ఇంట్లోనే చనిపోయారు. అయితే ఆ గ్రామంలో కరోనా మృతుల సంఖ్య కేవలం ముగ్గురేనని నిర్ధరించారు అధికారులు.
అంతేగాకుండా తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా మృతుల సంఖ్య విషయంలోనూ ప్రభుత్వం ఇదే రీతిన వ్యవహరించింది.
తొలుత వారం రోజుల పాటు వివిధ సందర్భాల్లో మంత్రులు, అధికారులు కేవలం 11 మంది మాత్రమే మరణించినట్టు ప్రకటించారు. కానీ నష్ట పరిహారం మాత్రం 23 మందికి చెల్లించారు.
అంటే ప్రభుత్వం చెప్పిన లెక్కలకు, నష్టపరిహారం చెల్లించిన వారి సంఖ్య రెట్టింపు ఉంది. 23 మందీ అదే రోజు రాత్రి చనిపోయారని రుయా ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరిస్తేనే ఈ పరిహారం ఇచ్చారు.
కానీ ప్రభుత్వం మాత్రం పరిహారం ఇచ్చే రోజు వరకూ మృతుల సంఖ్య విషయంలో నిజం దాస్తూనే వచ్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య విషయమై అస్పష్టత ఉందంటూ హైకోర్టులో కూడా పిటీషన్ దాఖలైంది.
ఈ ఒక్క గ్రామంలోనో లేదా ఒక్క ఆస్పత్రి ఘటనకు సంబంధించిన వివరాల్లో మాత్రమే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ఆరంభం నుంచి ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, వాస్తవానికి పొంతనలేదని లోతుకు వెళ్లి పరిశీలిస్తే తేలుతుంది.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన సివిల్ రిజిస్ట్రేషన్ సర్వీసెస్ (సీఆర్ఎస్) జనన, మరణాలను నమోదు చేస్తుంది. ఆ సంస్థకు చెందిన వెబ్ పోర్టల్లో పేర్కొన్న లెక్కల ప్రకారం గడిచిన ఏడాది కాలంగా నమోదయిన మృతుల సంఖ్యకి, ఏపీ ప్రభుత్వ లెక్కలకు పొంతన కనిపించడం లేదు.
అమాంతంగా పెరగడానికి కోవిడ్ కాకుండా కారణాలు ఏమున్నాయి?
కేంద్ర ప్రభుత్వ జననమరణాల రిజిస్ర్టీ సిఆర్ఎస్ లెక్కల ప్రకారం 2019 మే నెలలో 30, 266 మంది మాత్రమే మృతులున్నారు. 2020 మే నెలలో అయితే ఆ సంఖ్య 29, 980గా ఉంది. అంటే మే నెలలో సగటున ఏపీ మొత్తంగా మరణాల సగటు 30వేలు సుమారు అనుకోవచ్చు. కానీ 2021 మే లో ఆంధ్ర ప్రదేశ్లో చనిపోయిన వారి సంఖ్య 86,757. అంటే గతంలో ఈనెలలో నమోదయ్యే సగటు మరణాల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా మరణాలు నమోదు అయ్యాయి. కరోనా కాకుండా అకస్మాత్తుగా మరణాల సంఖ్య ఇంతగా పెరిగిపోవడానికి వేరే కారణాలుఏమున్నట్టు? కానీ ప్రభుత్వం మాత్రం మే నెలలో కరోనా మృతులు కేవలం 2938 అని ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
నిరుడు కూడా అంతే..
గత ఏడాది మార్చిలో తొలి కరోనా కేసు నమోదయ్యింది. జూలై నాటికి ఉద్ధృతంగా వైరస్ కేసులు పెరిగాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఎక్కువగా కరోనా మరణాలు నమోదయ్యాయి. ఆ సమయంలో కూడా ఆగస్టులో 2,900 మంది మాత్రమే కరోనా మృతులుగా ఏపీ ప్రభుత్వం చెప్పింది.
అదే 2019 ఆగస్టులో 28,713 మరణించినట్టు రికార్డుల్లో ఉంది. సాధారణంగా ఆగస్టు సగటు మరణాలు 30 వేల వరకూ ఉంటాయి. కానీ 2020 ఆగస్టులో మాత్రం 52, 447 మంది చనిపోయినట్టు రికార్డయి ఉంది. అంటే సగటు కంటే రెట్టింపు మరణాలు సంభవించాయి.

ఫొటో సోర్స్, Getty Images
తుది జాబితా కాదు..
కేంద్ర ప్రభుత్వం సీఆర్ఎస్ జాబితాలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న విషయాన్ని అంగీకరిస్తూనే.. డబుల్ ఎంట్రీలు, సాఫ్ట్‌వేర్ ఇతర సమస్యల కారణంగా అది ఎక్కువగా కనిపిస్తోందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
''ప్రతి నెలా మరణాల నమోదులో కొన్ని పేర్లు రెండుసార్లు నమోదవుతూ ఉంటాయి. వాటిని సరిచేస్తుంటాము. ఆస్పత్రిలో ఎవరైనా చికిత్స పొందుతూ చనిపోతే అక్కడా, అదే విధంగా వారి నివాసప్రాంతంలో కూడా మరణాలు నమోదుకావడం ప్రతిసారీ జరుగుతూ ఉంటుంది. వాటిని సరిచేస్తూ ఉంటాం. ఈసారి రిజిస్ట్రేషన్లో సాఫ్ట్‌వేర్ సమస్యలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ సవరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న జాబితా ఫైనల్ కాదు. ఇంకా సవరణలు చేసి, తుది జాబితా సిద్ధం చేసే సరికి వాటి సంఖ్య తగ్గుతుంది'' అంటూ కుటుంబ సంక్షేమ, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ చెప్పుకొచ్చారు.
నిబంధనల ప్రకారం మరణించిన వారి పేరు ఆ జాబితాలో చేర్చేందుకు 21 రోజుల గడువు ఉంటుంది. ఆ తర్వాత కూడా వివరాలు జాబితాలో చేర్చడానికి అవకాశం ఉంది. కాబట్టి గత నెలలో మరణాలు ఈ నెలలో, ఇప్పుడు మరణించిన వారి వివరాలు తదుపరి నెలలో నమోదయ్యే అవకాశాలున్నాయి. అయినప్పటికీ లెక్కల్లో ఇంతటి అసాధారణ వైరుధ్యం ఉండదు. పైగా ఈ ఏడాది మే నెల లెక్కల్లో కొంత మార్పులుంటాయని అధికారులు చెబుతున్నప్పటికీ... మరి గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల లెక్కల్లో ఉన్న తేడా ఏమిటన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది.
ప్రభుత్వాలు ఎంత సమర్థించుకున్నా కరోనా మృతుల సంఖ్యపై వాస్తవాలు చెప్పడం లేదని అయితే అర్థమవుతోంది.
ఇవి కూడా చదవండి:
- రాయలసీమ ఎత్తిపోతల పథకం: ఏపీ, తెలంగాణ మధ్య వివాదానికి కారణమేంటి
- మోదీ ఏడేళ్ల పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో ఈ ఏడు చార్టులు చెప్పేస్తాయి
- కోవాగ్జిన్: దేశీయంగా తయారుచేస్తున్నప్పటికీ ఈ వ్యాక్సీన్ ధర ఎందుకు అంత ఎక్కువగా ఉంది?
- ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?
- కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








