ఏపీ-తెలంగాణ జల వివాదం: రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు? రెండు రాష్ట్రాల వాదనలు ఏమిటి

శ్రీశైలం
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

కృష్ణా నదీ జలాలపై వివాదం చాలాకాలంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనుగడలో ఉండగా ఇది మూడు రాష్ట్రాల సమస్యగా ఉండేది. ప్రస్తుతం అది మహారాష్ట్ర, కర్ణాటకతో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య వివాదంగా మారింది.

కర్ణాటకకి దిగువన తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలు 'కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డు' నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్లాయి.

అదే సమయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల్లో అన్ని సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలనే నిర్ణయాలు కూడా జరిగాయి.

కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం మాత్రం అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందని అంటోంది.

ఇంతకీ ఈ లిఫ్ట్ స్కీమ్ ఎందుకు నిర్మిస్తున్నారు? వివాదానికి కారణాలేంటి?

శ్రీశైలం

ఎక్కడ, ఎందుకు నిర్మిస్తున్నారు?

కృష్ణా జలాల పంపిణీలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందనే వాదన ఉంది.

రెండో ప్రధానమైన నది ప్రవాహం ఏపీలో కొనసాగుతున్నప్పటికీ ఇక్కడి నాలుగు జిల్లాలకు సాగునీటి లభ్యత అంతంతమాత్రంగానే ఉండడం దానికి ఉదాహరణగా చెబుతుంటారు.

కృష్ణా నదిలో మిగులు జలాలు ఏటా సముద్రంలోకి వెళుతున్నా, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో వైఫల్యం సమస్యకు మూలంగా భావిస్తారు.

ఇప్పటికే శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, తెలుగు గంగ, గాలేరు-నగరి వంటివి అందుబాటులో ఉన్నప్పటికీ వాటి అసలు లక్ష్యాలకు మాత్రం చేరువ కాలేదు.

మొత్తంగా 131 టీఎంసీల నికర జలాల వాటా రావాల్సి ఉంటే.. 100 టీఎంసీల నీటిని కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా వరదల సమయంలో వృథాగా సముద్రం పాలయ్యే నీటిని వినియోగించుకోవడానికి కూడా అవకాశం లేదని, ఈ లిఫ్ట్ దానికి ఉపయోగపడుతుందని ఏపీ ప్రభుత్వం అంటోంది.

వరదల సమయంలో ప్రస్తుతం పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 4 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. అదే విధంగా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ద్వారా మరో 3 టీఎంసీల నీటిని తరలించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది.

దానికి అనుగుణంగా 2000 సంవత్సరంలో మే 5న జీఓ 203 విడుదల చేసి నిర్మాణానికి పూనుకుంది.

శ్రీశైలం జలాశయంలో 797 అడుగుల స్థాయి నుంచి రోజుకి 3 టీఎంసీల చొప్పున నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువనున్న శ్రీశైలం కుడి ప్రధాన కాలువలోకి తరలించాలనేది ప్రతిపాదన.

శ్రీశైలం ఎగువన లిఫ్ట్ చేసే నీటిని 4 కిలోమీటర్ల మేర తరలించి అక్కడి నుంచి తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, గాలేరు నగరి కాలువల ద్వారా కృష్ణా జలాలను తరలిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

కృష్ణా జలాలు
ఫొటో క్యాప్షన్, పోతిరెడ్డిపాడు కాలువ

పనులకు శ్రీకారం, వరుస వివాదాలు

ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాల్లో తన వాటాను వినియోగించుకోవడం కోసమంటూ రాయలసీమ లిఫ్ట్‌కి శ్రీకారం చుట్టింది. రూ.3,307 కోట్లతో ఎస్సీఎంఎల్ సంస్థకి నిర్మాణ కాంట్రాక్ట్ ఇచ్చింది. 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా ఒప్పందం చేసుకున్నారు.

అయితే రాయలసీమ లిఫ్ట్‌ నిర్మాణంపై ప్రారంభం నుంచి తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ లిఫ్ట్ స్కీమ్ మూలంగా పర్యావరణ సమస్యలు వస్తాయంటూ తెలంగాణకి చెందిన జి. శ్రీనివాస్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ)కి ఫిర్యాదు చేశారు. ట్రైబ్యునల్ ఆదేశాలతో కేంద్ర పర్యావరణ శాఖ ఓ కమిటీని నియమించింది.

కమిటీ ప్రతిపాదనల మేరకు తెలుగు గంగ ప్రాజెక్ట్‌ 29 టీఎంసీలు, ఎస్ఆర్బీసీ 19 టీఎంసీలు, గాలేరు-నగరి సుజల స్రవంతి 38 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుంటున్నాయి. వాటికి పర్యావరణ అనుమతులున్నాయి. ప్రస్తుతం రాయలసీమ లిఫ్ట్‌ కూడా వాటికి నీరందించే లక్ష్యంతోనే మొదలుపెట్టామని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది.

అదే సమయంలో శ్రీశైలం నుంచి 854 అడుగుల స్థాయి నుంచి నీటిని తరలించాల్సి ఉండగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు దానికి భిన్నంగా సాగుతున్నాయి.

పైగా 800 అడుగుల స్థాయి నుంచే నీటిని తరలించేందుకు ఈ లిఫ్ట్ స్కీమ్ నిర్మిస్తున్నారు. కాబట్టి ఆయా రాష్ట్రాల వాటాలకు అనుగుణంగా నీటిని వినియోగించుకునేలా కృష్ణా బోర్డు పర్యవేక్షించాలని ట్రైబ్యునల్ సూచించింది.

పోతిరెడ్డిపాడు కోసం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో మోటార్లు పెడితే, రాయలసీమ లిఫ్ట్ పేరుతో ప్రాజెక్టు నుంచి 4 కిలోమీటర్ల వద్ద మోటర్లు పెట్టి నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి కేటాయింపులకు మించి నీటిని తరలించకుండా కృష్ణా బోర్డు చూడాలని తెలిపింది.

రాయలసీమ లిఫ్ట్‌కి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని ఎన్జీటీ తుది తీర్పు వెలువరించింది. ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించి, అనుమతులు తీసుకోవాలని చెన్నైలోని ఎన్జీటీ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.

పోతిరెడ్డిపాడు
ఫొటో క్యాప్షన్, పోతిరెడ్డిపాడు కాలువ

కేఆర్ఎంబీ పరిశీలనపై లేఖల పర్వం

రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకు సాగడంపై తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

టెండర్లు ఖరారు చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఈ నిర్మాణంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) స్వయంగా పరిశీలించాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేఆర్ఎంబీ, ఏపీ ఇరిగేషన్ శాఖల మధ్య లేఖల పర్వం సాగింది.

రాయలసీమ ఎత్తిపోతలు ఒక్కటే కాకుండా, అన్ని ప్రాజెక్టులు పరిశీలించాలని ఏపీ ఇరిగేషన్ శాఖ కోరింది. అంతేగాకుండా ఈ పరిశీలనపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోవాలంటూ లేఖలు రాసింది.

అదే సమయంలో కమిటీని నియమించి, పరిశీలనకు సిద్ధమయిన కేఆర్ఎంబీ చైర్మన్ వైఖరిని కూడా తప్పుబట్టింది. చైర్మన్‌ని తొలగించాలని కూడా జలశక్తి శాఖకు లేఖ రాసింది. ఒక్క రాయలసీమ లిఫ్ట్ మాత్రమే కాకుండా అన్ని పథకాలు పరిశీలించాలని డిమాండ్ చేసింది. ఈలోగా కరోనా ఉద్ధృతితో ఈ ప్రయత్నం ఆగినట్టు కనిపిస్తోంది.

కృష్ణా జలాల పంపిణీ విషయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తెలంగాణ ప్రభుత్వం గత వారమే తన పిటీషన్ ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. అపెక్స్ కౌన్సిల్‌లో వచ్చిన హామీతో తాము పిటిషన్ వెనక్కి తీసుకున్నామని వెల్లడించింది.

రాయలసీమ ఎత్తిపోతల పథకం

ఫొటో సోర్స్, Getty Images

కృష్ణా నీటిని పెన్నా బేసిన్‌కి తరలిస్తున్నారు..

కృష్ణానీటి విషయంలో ఏపీ సర్కార్ తీరు సక్రమంగా లేదని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వమే నిబంధనలను ఉల్లంఘిస్తూ తమ మీద ఆరోపణలు చేస్తోందని అన్నారు.

‘‘ట్రైబ్యునల్, ఎన్జీటీ ఆదేశాలను కూడా ఏపీ ప్రభుత్వం ధిక్కరిస్తోంది. టెలిమెట్రీలు ధ్వంసం చేసి ఏపీ అక్రమంగా నీరు తీసుకుంటోంది. ఏపీ మాకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోము. తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే సీఎం కేసీఆర్ కోరుకున్నారు. కానీ కృష్ణా జలాలను ఎక్కడో ఉన్న నెల్లూరు జిల్లాకు తరలించాలని చూస్తున్నారు. నదీ పరివాహకంలో లేని జిల్లాలకు కృష్ణా జలాలు ఎలా తరలిస్తారు. పెన్నా బేసిన్ కోసం కృష్ణా నీటిని వాడితే నది పక్కనే ఉన్న పాలమూరు ప్రజలు ఏం కావాలి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలే తప్ప ఇలాంటి వైఖరి సరి కాదు’’అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

అంతకుముందు తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కూడా దీనిపై చర్చించారు. ఏపీ ప్రభుత్వ తీరుని తప్పుబట్టారు. అక్రమంగా సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌ స్కీం, ఆర్డీఎస్‌ కుడి కాలువ నిర్మాణాన్ని చేపట్టిందని క్యాబినెట్ సమావేశం విమర్శించింది.

ఏపీ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటికే గ్రీన్‌ ట్రైబ్యునల్‌ను, సుప్రీంకోర్టును ఆశ్రయించామని, ఎన్‌జీటీ ఆదేశాలను అతిక్రమించి ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు కడుతోందని తెలంగాణ కేబినెట్‌ అభిప్రాయపడింది.

ఇంటర్‌స్టేట్‌ వాటర్‌ డిస్ప్యూట్స్‌ యాక్ట్‌ -1956లోని సెక్షన్‌ 3 ప్రకారం ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం నిర్లక్ష్యంతో రాష్ట్ర రైతులకు నష్టం కలిగే పరిస్థితి వచ్చిందని తెలంగాణ క్యాబినెట్ సమావేశం అభిప్రాయపడింది.

రాయలసీమ ఎత్తిపోతల పథకం

ఫొటో సోర్స్, Getty Images

నదీజలాల వినియోగంపై దృష్టి పెట్టాలి

కృష్ణా నదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి 811 టీఎంసీల నీటిని ట్రైబ్యునల్ కేటాయించింది. అందులో తాత్కాలిక ప్రాతిపదికన తెలంగాణకి 299 టీఎంసీలు దక్కాయి. ఇక వరదల కారణంగా సగటు వర్షపాతం నమోదయిన సంవత్సరాల్లో 650 టీఎంసీల వరకూ కృష్ణా నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. గత ఏడాది సుదీర్ఘకాలం పాటు సుమారు 140 రోజులు వరదలు కొనసాగాయి. దాని మూలంగా 1100 టీఎంసీలకు పైబడి నీరు సముద్రం పాలయ్యింది.

కృష్ణా నదీ జలాలను సద్వినియోగం చేసుకునేందుకు ఇరు రాష్ట్రాలు సమన్వయంతో సాగాల్సిన అవసరం ఉందని నీటిపారుదల రంగ పరిశోధకుడు శివ రాచర్ల అభిప్రాయపడ్డారు. ఆయన బీబీసీతో తాజా వివాదంపై మాట్లాడారు.

‘‘శ్రీశైలం ప్రాజెక్ట్ వాస్తవ నిల్వ సామర్థ్యం 308 టీఎంసీల నుంచి పూడిక కారణంగా ప్రస్తుతం 216 టీఎంసీలకు పరిమితం అయ్యింది. అంటే 92 టీఎంసీల సామర్థ్యం పడిపోయింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెరిగినా కాలువల సామర్థ్యం పెంచలేదు. దాంతో ఏటా 90 టీఎంసీలకు మించి రాయలసీమకు తరలించడం సాధ్యం కావడం లేదు. తుంగభద్ర నీటి కోసం 1952లో అనుమతిచ్చిన గుండ్రేవుల పూర్తి చేయలేదు. దాంతో మళ్లీ తుంగభద్ర నీరు కూడా కృష్ణాలో కలిసిపోతుంది. ఆ తర్వాత వరద నీరు వృథాగా పోతోంది’’ అని ఆయన అన్నారు.

‘‘తెలంగాణలో కూడా శంకుస్థాపన జరిగిన ప్రాజెక్టులను పూర్తిచేయాలి. భీమా వరద కాలువ, సాగర్‌‌ టెయిల్‌‌పాండ్‌‌, పులిచింతల ఎడమ కాల్వ, కల్వకుర్తి రిజర్వాయర్లను సిద్ధం చేసుకోవాలి. మరోవైపు కాళేశ్వరం లిఫ్ట్‌కి కూడా అనుమతులు లేవనే విషయం మరచిపోకూడదు. ఇరు ప్రభుత్వాలు సామరస్యంగా వ్యవహరిస్తే సమస్యలుండవు. సాగునీటి కొరతను తీర్చుకునే అవకాశం ఉంటుంది. రాయలసీమ, దక్షిణ తెలంగాణకి సమస్యలు తీరుతాయి’’ అంటూ శివ రాచర్ల వ్యాఖ్యానించారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం

ఫొటో సోర్స్, IndiaPictures

హుజురాబాద్ ఎన్నికల కోసమే కేసీఆర్ ప్రభుత్వ యత్నాలు: రాయలసీమ మేధావుల ఫోరం

కృష్ణా జలాల పంపిణీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసుని ఇటీవలే ఉపసంహరించుకుని ఇప్పుడు మళ్లీ వివాదం రాజేస్తుండడం వెనుక హుజురాబాద్ ఉప ఎన్నికల అవసరాలు ఉండవచ్చని రాయలసీమ మేధావుల ఫోరం ప్రతినిధి మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి అభిప్రాయపడుతున్నారు.

‘‘నదీ జలాల పంపిణీలో తమకు అన్యాయం జరుగుతుందని సుప్రీం కోర్టుకి వెళ్లిన తెలంగాణ ప్రభుత్వం కొద్దికాలం క్రితమే దానిని ఉపసంహరించుకుంది. ఇప్పుడు ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపిణీపై కమిటీ వేసి సమస్య పరిష్కరించాల్సి ఉంది. ఈలోగానే ఇప్పుడు హఠాత్తుగా రాయలసీమ ప్రాజెక్టుల మీద వివాదం సృష్టించే యత్నం చేయడం, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తుండడం వెనుక ఉప ఎన్నికల అవసరాలే కనిపిస్తున్నాయి. హుజురాబాద్‌లో బీజేపీతో తలపడాల్సి ఉన్న సమయంలో ఆపార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు ఈ అంశాన్ని వినియోగించుకుంటున్నట్టు కనిపిస్తోంది’’ అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)