హైదరాబాద్ యువతిపై తొమ్మిదేళ్లుగా 139 మంది అత్యాచారం... బాధితురాలికి న్యాయం జరగడం సాధ్యమేనా?

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
తొమ్మిదేళ్లలో 139 మంది చేతిలో అత్యాచారం. 15 ఏళ్ల వయసులో బాల్య వివాహంతో మొదలై అడుగడుగునా సమస్యల సుడిగుండమే కనిపించింది. తన శరీరాన్ని వ్యాపార వస్తువుగా మార్చిన వారిపై చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీబీసీ కరస్పాండెంట్ దీప్తి బత్తిని బాధితురాలితో మాట్లాడారు.
తనపై అత్యాచారం జరిగిందని హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ చెప్పిన విషయాలు విని పోలీసులే ఆశ్చర్యపోయే పరిస్థితి. రేపిస్టులు ఒకరిద్దరు కాదు 139 మంది, జరిగింది ఒక నెలో, సంవత్సరమో కాదు తొమ్మిది సంవత్సరాలు.
నల్గొండ జిల్లాకు చెందిన ఆ మహిళ ఓ స్వచ్చంద సంస్థ సహకారంతో శుక్రవారంనాడు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై అత్యాచారానికి పాల్పడ్డవారి నుంచి ప్రాణభయం ఉందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధిత మహిళను, స్వచ్ఛంద సంస్థకు చెందిన రాజా శ్రీకర్‌రెడ్డిని బీబీసీ ఫోన్ ద్వారా సంప్రదించింది. వివరాలు అడిగి తెలుసుకుంది.
బాధితురాలు చెప్పినదాని ప్రకారం ఆమెకు 15 ఏళ్ల వయసులోనే వివాహమైంది. అబ్బాయి కుటుంబం వాళ్లు తల్లిదండ్రులను బలవంతంగా ఒప్పించారు. “మా అమ్మానాన్న కూలీలు. వేరే దారిలేక ఒప్పుకున్నారు’’ అని ఆమె బీబీసీతో అన్నారు.

“పెళ్లినాటికి పదో తరగతి చదివాను. కాలేజీలో చేర్పించారు. కానీ ఇంట్లో నన్ను పని మనిషిలాగా చూసేవారు. కట్నం కోసం వేధించేవారు. అమ్మానాన్న ఎంతో కొంత పంపేవారు. అవి చాలవని కొట్టేవారు’’ అని బాధితురాలు వెల్లడించారు.
కట్నం వేధింపుల తర్వాత డబ్బు కోసం బలవంతంగా ఆమెను వ్యభిచారంలోకి దింపారు.
“మీ అమ్మానాన్నలకు చెబితే చంపేస్తామని బెదిరించే వారు. ధైర్యం చాలక అలా సంవత్సరానికి పైగానే గడిపాను’’ అని ఆమె చెప్పారు.
డిసెంబర్ 2010 లో పెద్దల సమక్షంలో ఆమె భర్త నుంచి విడిపోయారు.
ఆ తర్వాత డిగ్రీ చదివేందుకు కాలేజీలో చేరారామె. భర్త, సంసారం, వేధింపుల నుంచి బయటికి వచ్చాననుకున్న తరుణంలోనే ఆమెకు మరో రూపంలో సమస్య మొదలైంది.
“ఇంటర్ చదివేటప్పుడు ఒక అమ్మాయి పరిచయమైంది. తనకు నా పెళ్లి జీవితంలో కష్టాలన్నీ తెలుసు. తనను వాళ్ల అన్నయ్య మీసాల సుమన్‌ను పరిచయం చేసింది. వారిద్దరు నన్ను ఒక రోజు నగ్నంగా ఫోటోలు వీడియోలు తీశారు. తమకు సహకరించకపోతే ఆ వీడియోలు అందరికి పంపుతామని బెదిరించారు’’ అని ఆమె వెల్లడించారు.

“చదువు పేరుతో మా తల్లిదండ్రులను నమ్మించి మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. అప్పటి నుంచి వేరు వేరు ఇళ్లలో పెట్టి అనేక మందితో అత్యాచారం చేయించారు” అని బాధితురాలు వాపోయారు.
తనపై అఘాయిత్యానికి పాల్పడిన వారిలో సినీనటులు, మీడియా వ్యక్తులు, నేతలు, ఒక మాజీ ప్రజాప్రతినిధి పర్సనల్ సెక్రటరీతో పాటు మహిళలు కూడా ఉన్నారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
“బెదిరించి నగ్నంగా డాన్స్ చేయించేవారు. మద్యం తాగించి వీడియోలు తీసేవారు’’ అని ఆమె బీబీసీతో అన్నారు.
తనను ఈ రొంపిలోకి దింపిన సుమన్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి సెక్స్ రాకెట్ నడుపుతుంటాడని ఆమె బీబీసీతో చెప్పారు. “వేరు వేరు అమ్మాయిలను తీసుకొచ్చేవారు. మూడు నాలుగు రోజులు ఉంచేవారు. తరువాత వారిని వేరే దగ్గరకు పంపేవారు” అని వివరించారు.
“నా పేరు మీద రెండు బ్యాంక్ ఎకౌంట్లు కూడా తెరిచారు. నా నగ్న ఫోటోలు పెట్టి డేటింగ్ సైట్లలో చాటింగ్ చేసేవారు. నగ్నంగా మార్చి వీడియో కాల్స్ చేయించేవారు. నా ఎకౌంట్ నుంచి డబ్బు డ్రా చేసుకునే వారు’’ అని ఆమె వెల్లడించారు.
నిందితులు.. రూ. 9 లక్షలు ఇస్తే ఫోటోలు వీడియోలు ఇచ్చేస్తామని బాధితురాలికి చెప్పారు.
“నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, వాటిని చూపించి ఉద్యోగంలో చేరేందుకు ఎవరినైనా సాయం అడగమని నాకు చెప్పారు. నేను వారు చెప్పింది నిజమేననుకున్నాను. ఏడాదిన్నర కిందట గాడ్ పవర్ ఫౌండేషన్ సంస్థకు చెందిన రాజా శ్రీకర్‌రెడ్డిని కలిశాను. డబ్బు కోసం బతిమాలాను. ఆయన నోట్ రాయించుకుని నాకు రూ. 9 లక్షలు ఇచ్చారు’’ అని బాధితురాలు వెల్లడించారు.
తొమ్మిది లక్షలు తీసుకుని కూడా వీడియోలు, ఫోటోలు ఇవ్వలేదు. ఆమెపై అఘాయిత్యాలు ఆపలేదు. ఆమెను ఒక మహిళా హాస్టల్‌లో చేర్పించారు. చివరకు ఆమె స్వచ్చంద సంస్థకు చెందిన శ్రీకర్‌రెడ్డి ఆఫీసులోనే ఉద్యోగంలో చేరారు.
“ఒక రోజు ఆమె రక్తంతో తడిచిన దుస్తులతో ఆఫీసుకు వచ్చారు. స్పృహ కోల్పోయారు. మేం ప్రథమ చికిత్స చేశాం. మూడు రోజులపాటు మా స్వచ్చంద సంస్థ ఆఫీసులోనే ఉంచాం. అప్పుడు ఆమె తన కథ అంతా చెప్పారు’’ అని శ్రీకర్ రెడ్డి వివరించారు.
హాస్టల్ నుంచి ఆమె సామాన్లన్నీ తెప్పించారు శ్రీకర్‌రెడ్డి.
“గుర్తున్న వివరాలన్నీ రాసిపెట్టమని ఆమెకు చెప్పాము. సాక్ష్యాధారాలు కూడా సేకరించాం. వారికి డబ్బు ఇచ్చాక కూడా ఆమె వీడియోలను వారు వెబ్‌లో పెట్టారు’’ అన్నారు శ్రీకర్ రెడ్డి.
ఫిర్యాదు చేయడానికి వెళ్లినపుడు పోలీసుల దగ్గర కూడా తనకు వెంటనే సాయం అందలేదని చెప్పారామె. బాధితురాలి ఫిర్యాదును తీసుకున్నామని పంజాగుట్ట పోలీస్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- లాక్డౌన్లో పెరిగిన గృహ హింస: ‘‘నా భర్త నన్ను భార్యగా చూడలేదు.. శారీరక అవసరాలు తీర్చుకునే ఒక యంత్రంలాగే చూసేవారు’’
- 'ప్రేమించి గర్భవతి అయిన కూతురిని తల్లిదండ్రులే చంపేశారు'
- మద్యం తాగేవాళ్లు తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను హింసించే అవకాశం ‘ఆరు రెట్లు ఎక్కువ’
- నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి?
- అత్యాచారాలపై కేసులు పెట్టిన బాధితులను కొత్త సమస్యలు వేధిస్తున్నాయా...
- సోనూ పంజాబన్: ఈ మహిళకు వ్యభిచారం ‘ప్రజాసేవ’, 'కామం' ఒక భారీ మార్కెట్
- ఈ తెగలో వ్యభిచారం ఓ ఆచారం, అమ్మాయి పుడితే సంబరాలు చేసుకుంటారు
- ‘వ్యభిచార గృహానికి అమ్మేశాక.. నేను ఆడుకోవడం మర్చిపోయా’
- నేను వేశ్యగానే ఉంటా : వ్యభిచార వృత్తిలో కొనసాగే హక్కు కోసం పోరాడిన మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









