కెనడాలో మండుతున్న ఎండలు.. వడ దెబ్బకు పదుల సంఖ్యలో మృతి

కెనడా

ఫొటో సోర్స్, Reuters

కెనడాలో మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

బ్రిటిష్‌ కొలంబియాలోని లిట్టన్‌లో మంగళవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత గరిష్ఠంగా 49.5 డిగ్రీలకు చేరుకుంది. గతవారానికంటే ముందు కెనడాలో ఎప్పుడూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటలేదు.

వాంకూవర్‌లో గత శుక్రవారం నుంచి 130 మంది వరకు ఆకస్మికంగా మరణించినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. మృతుల్లో ఎక్కువగా వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నట్టు చెప్పారు.

వడగాల్పుల ప్రభావంతోనే ఎక్కువ మంది మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.

‘‘వాంకూవర్‌లో ఇంతలా భానుడి ప్రతాపాన్ని మునుపెన్నడూ చూడలేదు. డజన్లకొద్ది ప్రజలు వడగాల్పులకు చనిపోతున్నారు’’ అని పోలీసు అధికారి స్టీవ్‌ అడిసన్‌ అన్నారు.

కెనడా

ఫొటో సోర్స్, Reuters

ఒక్కసారిగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

బ్రిటిష్‌ కొలంబియా, అల్బర్టా ప్రావిన్స్‌లు, సస్కట్చేవాన్‌, వాయువ్య భూభాగం, మానిటోబాలలో వడగాల్పులపై కెనడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

‘‘ప్రపంచంలోనే రెండో అతిశీతల దేశమైన కెనడాలో మంచు తుపానులను తరచూ చూస్తుంటాము. కానీ ఇంతలా భానుడి ప్రతాపంపై ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలతో పోల్చితే దుబాయిలో ఇంకాస్త చల్లగా ఉంటుంది కావొచ్చు’’ అని కెనడాకు చెందిన సీనియర్‌ వాతావరణ నిపుణుడు డేవిడ్‌ ఫిలిప్స్‌ అన్నారు.

కెనడా

ఫొటో సోర్స్, Reuters

లిట్టన్‌లో వడగాల్పుల దాటికి ఇంట్లోనుంచి కాలు బయట పెట్టే పరిస్థితిలేదని స్థానికురాలు మేఘన్‌ ఫెండ్రిచ్‌, గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ వార్తా పత్రికతో చెప్పారు. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండటానికి ప్రయత్నిస్తున్నామని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)