నేషనల్ డాక్టర్స్ డే: వైద్యులపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి.. చట్టాలతో వీటిని ఆపడం ఎందుకు సాధ్యం కావడం లేదు?

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జూన్ 18 న 'జాతీయ నిరసన దినం' నిర్వహించింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జూన్ 18న 'జాతీయ నిరసన దినం' పాటించింది.
    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అస్సాంలోని హోజాయి జిల్లాలో ఒక కోవిడ్ కేర్ సెంటర్‌లో పని చేస్తున్న డాక్టర్ సేయుజ్ కుమార్‌ సేనాపతి తన తొలి ఉద్యోగంలో రెండో రోజు విధుల్లో ఉన్నారు.

ఆ రోజు జరిగిన ఘటనలను గుర్తు చేసుకున్న సేనాపతి, ఆ మధ్యాహ్నం తాను చనిపోవడం ఖాయమని భావించినట్లు చెప్పారు.

ఉదయం కోవిడ్ సెంటర్‌లో చేరిన ఓ పేషెంట్‌ను పరిశీలించమని ఆయనకు ఆదేశాలు వచ్చాయి. సేనాపతి ఆయన్ను పరీక్షించడానికి వెళ్లినప్పుడు ఆ పేషెంట్‌లో కదలికలు కనిపించ లేదు.

సదరు రోగి చనిపోయాడని చెప్పగానే, అతని బంధువులు ముందు షాకయ్యారు. ఆ తర్వాత ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడున్న కుర్చీలు, బెంచీలను విరగ్గొట్టడం మొదలుపెట్టారు. పెద్దగా అరుస్తూ, కిటికీ అద్దాలు పగలగొడుతున్నారు.

వారి నుంచి తనను రక్షించుకోవడానికి సేనాపతి ఆసుపత్రి లోపలికి పరుగు పెట్టారు. కాసేపటికి రోగి కుటుంబ సభ్యులకు మరికొంత మంది జత కలిశారు.

ఆ దాడి వీడియోలో కొందరు వ్యక్తులు ఆయన్ను బెడ్‌ పాన్‌లతో దారుణంగా కొడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఆసుపత్రి నుంచి బయటకు లాగి సేనాపతిపై పిడిగుద్దులు కురిపించారు.

డాక్టర్ సేనాపతి దుస్తులు చిరిగిపోయాయి. గాయాలై ఒంటి మీద రక్తం కారుతోంది. బాధతో ఆయన అరుస్తున్న అరుపులను వినిపించుకునే వారే లేరు.

''ఇక నేను బతకడం అసాధ్యమనుకున్నా'' అన్నారు సేనాపతి.

పేషెంట్ బంధువులు జరిపిన దాడిలో డాక్టర్ సేనాపతికి తీవ్ర గాయాలయ్యాయి.

ఫొటో సోర్స్, Dr. Seuj Kumar Senapati

ఫొటో క్యాప్షన్, రోగి బంధువులు చేసిన దాడిలో డాక్టర్ సేనాపతికి గాయాలయ్యాయి.

ఎందుకీ దాడులు?

కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కోవిడ్‌ రోగుల బంధువుల నుంచి చాలామంది డాక్టర్లు ఇలాంటి దాడులను ఎదుర్కొన్నారు.

రోగికి సరైన చికిత్స అందించలేదని, సకాలంలో ఐసీయూ బెడ్ ఇవ్వలేదని, ప్రాణాలను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకోలేదనీ... ఇలా రకరకాల ఆరోపణలు చేశారు.

రోగి బంధువుల ఆగ్రహం దాడులుగా మారినప్పుడు వారి నుంచి డాక్టర్లను, వైద్య సిబ్బందిని రక్షించడానికి ఆసుపత్రులలో ఎలాంటి ఏర్పాట్లు లేవు.

డాక్టర్ సేనాపతిపై దాడి జరుగుతున్నప్పుడు ఆయన్ను రక్షించడానికి ఎవరూ రాలేదు. ఎందుకంటే మిగిలిన సిబ్బందిపై ఆ సమయంలో కొందరు దాడి చేశారు.

సిబ్బందిలో కొంతమంది భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఆ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక సెక్యూరిటీ గార్డు దాడులు చేస్తున్న వారిని ఆపలేక పోయారు.

''నా దుస్తులు చింపేశారు. బంగారం గొలుసు లాగారు. కళ్లద్దాలు, మొబైల్ ఫోన్‌లను పగలగొట్టారు. ఇరవై నిమిషాల తర్వాత నేను అక్కడి నుంచి బైట పడగలిగాను'' అని డాక్టర్ సేనాపతి వివరించారు.

ఆ తర్వాత ఆయన నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దాడి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది.

ముగ్గురు మైనర్లు సహా 36 మందిపై దాడి కేసు నమోదైంది. కానీ ఇలాంటి చర్యలు చాలా అరుదుగా మాత్రమే జరుగుతాయి.

తమపై దాడులు జరుగుతుండటంపై వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Dr. Vikas Reddy

ఫొటో క్యాప్షన్, తమపై దాడులు జరుగుతుండటంపై వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చట్టాలు ఏం చేస్తున్నాయి?

కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఆరోగ్య కార్యకర్తలపై దాడులు చాలాచోట్ల వెలుగులోకి వచ్చాయి. కానీ అంతకు ముందు కూడా డాక్టర్లపై దాడులు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

కానీ చాలా ఘటనల్లో పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఒకవేళ నమోదై అరెస్టులు జరిగినా నిందితులు వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేవారు. ఇరు వర్గాల చర్చలతో సమస్యకు ముగింపు పలికే వారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒక కోవిడ్‌ రోగి మరణించడంతో దిల్లీలోని అపోలో ఆసుపత్రిపై కొందరు వ్యక్తులు దాడికి దిగారు. సిబ్బందిని తీవ్రంగా కొట్టారు.

అపోలో ఆసుపత్రి పెద్ద కార్పొరేట్ సంస్థ అయినప్పటికీ అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు లేవు. పైగా దాడి చేసిన వారిపై కేసు పెట్టలేదు. ఆసుపత్రి యాజమాన్యం ఇలాంటి వాటికి దూరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సిబ్బందికి రక్షణ ఉండదు.

ఇలాంటి దాడులను నిరోధించడానికి ప్రత్యేకంగా చట్టం లేకపోవడం వల్లే ఇవి తరచూ జరుగుతున్నాయని కొందరు వైద్యులు అభిప్రాయపడ్డారు.

''ప్రస్తుతం ఉన్న చట్టాలు ఇలాంటి దాడులను నిరోధించడంలో పని చేయవని మాకు అర్థమైంది. అందుకే దాడులను నిరోధించలేక పోతున్నారు. ఒక డాక్టర్‌ను కొట్టడం వల్ల భయంకరమైన పరిణామాలు ఉంటాయని ప్రజలు అర్థం చేసుకోవాలంటే బలమైన చట్టం అవసరం'' అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయేశ్ లేలే అన్నారు.

3,30,000 మంది సభ్యులున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. వైద్యులపై దాడులను అడ్డుకునేందుకు ప్రత్యేక చట్టం చేయాలంటూ చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది. ఇటీవలి దాడులకు నిరసనగా అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఒక రోజు నిరసన ప్రదర్శనలు చేసింది.

కోవిడ్ సర్వీసులో డాక్టర్లు ఎక్కువ గంటలు పని చేసి అలసి పోతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోవిడ్ సేవల్లో డాక్టర్లు ఎక్కువ గంటలు పని చేసి అలసి పోతున్నారు.

ప్రత్యేక చట్టమే పరిష్కారమా?

''ఇలాంటి హింసాత్మక ఘటనలన్నీ ముందస్తు ప్రణాళికతో చేసేవి కావు. ఒక వ్యక్తి మరణం కారణంగా భావోద్వేగంతో చేసిన దాడులు. ఈ దాడులు చేసేవారు చట్టాలకు భయపడరు'' అని శ్రేయ శ్రీవాస్తవ అన్నారు.

శ్రేయ ఇలాంటి దాడులపై పరిశోధన చేసే 'విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ' సంస్థ పరిశోధనా బృందంలో సభ్యురాలు. ఈ తరహా దాడులు జరగడానికి కారణమేంటి అన్న అంశంపై ఈ సంస్థ పరిశోధిస్తోంది.

ఈ దాడులకు సంబంధించి ప్రత్యేకంగా గణాంకాలు అందుబాటులో లేకపోవడంతో ఆమె తన పరిశోధన కోసం వార్తా పత్రికలపై ఆధారపడ్డారు. 2018 జనవరి నుంచి 2019 సెప్టెంబర్ మధ్య కాలంలో జరిగిన 56 దాడుల సమాచారాన్ని ఆమె సేకరించారు.

కోవిడ్ రోగులకు చికిత్స చేసే డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డ వారికి గరిష్టంగా ఏడు సంవత్సరాల శిక్ష విధించేలా భారత ప్రభుత్వం అంటువ్యాధుల చట్టాన్ని సవరించిందని శ్రేయా గుర్తుచేశారు. కానీ, దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు.

ఏడాది కిందట, హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ వికాస్ రెడ్డిపై కొందరు వ్యక్తులు ఇలాగే దాడి చేశారు. ఇనుము, ప్లాస్టిక్ కుర్చీలతో ఆయనపై దాడికి దిగారు.

ఆయన ఎలాగో తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

''డ్యూటీకి వెళ్లాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తోంది. నేను అదే క్రిటికల్ కేర్ యూనిట్‌లో పని చేయాలి. నాకు ఆ దాడి ఘటనలన్నీ గుర్తొస్తాయి. ఇది ఇక్కడితో ఆగేది కూడా కాదు'' అన్నారు వికాస్ రెడ్డి.

దాడికి సంబంధించిన ఆలోచనలు పదే పదే వస్తున్నట్లు వికాస్ రెడ్డి చెప్పారు.

''నా మనసంతా గందరగోళంగా ఉంది'' అన్నారాయన.

రోగికి సంబంధించి ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉందంటే, దాన్ని ఎలా చెప్పాలో నేర్చుకోవాలనుకుంటున్నట్లు వికాస్ రెడ్డి వెల్లడించారు. దీనివల్ల దాడులను నివారించ వచ్చని ఆయన అన్నారు.

కరోనా వల్ల కలిగిన భయం, దాని వల్ల ఏర్పడుతున్న ఆందోళనను తాను అర్థం చేసుకోగలనని వికాస్ రెడ్డి అన్నారు.

''రోగి బంధువులతో ఎక్కువ సేపు గడపడం వల్ల కొంత ప్రయోజనం ఉండవచ్చు. పరిస్థితిని వారికి వివరించడం, వారికి నచ్చక పోతే వేరే ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పడం మంచిదని నాకు అర్థమైంది. కానీ, మాకు అంత సమయం దొరకడం లేదు. రోజుకు 20-30మంది రోగులను పరీక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది'' అన్నారు వికాస్ రెడ్డి.

భారతదేశంలో రోగులు, డాక్టర్ల నిష్పత్తి చాలా తక్కువ. వరల్డ్ బ్యాంక్‌ 2018లో ఇచ్చిన నివేదిక ప్రకారం ఇండియాలో ప్రతి లక్ష మందికి 90 మంది వైద్యులు ఉన్నారు. అదే చైనాలో ప్రతి లక్షమందికి 200 మంది, అమెరికాలో 260మంది, రష్యాలో 400మంది డాక్టర్లు ఉన్నారు.

అందుకే కోవిడ్ విజృంభించిన సమయంలో ఆరోగ్య సిబ్బంది తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు.

శ్రేయా పరిశోధన ప్రకారం రోగులు ఎమర్జెన్సీ వార్డులు, ఐసీయూలలో ఉన్నప్పుడు, ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో వైద్య సిబ్బంది ఎక్కువగా దాడులకు గురయ్యారు.

కరోనా కాలంలో ఇవి సర్వసాధారణంగా మారిపోయాయి.

''కోవిడ్ వార్డులో పని చేయడం యుద్ధరంగంలో ఉండటంతో సమానం'' అన్నారు డాక్టర్‌ జయేశ్ లేలే.

ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగు పరచడం, వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

సేవలు సరిగా లేవంటూ వైద్య సిబ్బందితో తరచూ రోగుల బంధువులు వాగ్వాదానికి దిగుతుంటారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సేవలు సరిగా లేవంటూ వైద్య సిబ్బందితో తరచూ రోగుల బంధువులు వాగ్వాదానికి దిగుతుంటారు

భరోసా కావాలి

వైద్య సిబ్బందిపై ప్రజల్లో నమ్మకం లేకపోవడం మరో పెద్ద సమస్య. భారతదేశంలోని మూడింట రెండొంతుల వైద్య సేవలను ప్రైవేటు రంగమే అందిస్తోంది. దీనిపై ప్రభుత్వ నియంత్రణ చాలా తక్కువ. పైగా ఇది అందరికీ అందుబాటులో ఉండదు.

వైద్యం ఖరీదు కావడం కూడా సిబ్బందిపై రోగుల బంధువులకు అపనమ్మకం, అసహనం ఏర్పడటానికి కారణమవుతోందని శ్రేయ అంటున్నారు. కోవిడ్ కారణంగా మరణాలు ఎక్కువ కావడంతో దాడులు కూడా పెరిగాయి.

పైగా వైద్యులు ఎదుర్కొనే సమస్యలకన్నా, వారి నిర్లక్ష్యానికి సంబంధించిన వార్తలు మీడియాలో ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. దీంతో ప్రజల్లో వారిపై సందేహాలు పెరుగుతున్నాయి.

యువ వైద్యులపై ఇలాంటి దాడులకు ఎక్కువగా అవకాశం ఉందని తమ బృందం పరిశోధనలో తేలిందని శ్రేయ చెప్పారు.

డాక్టర్ సేనాపతి, డాక్టర్ వికాస్ రెడ్డికి భయంకరమైన అనుభవాలు మిగిలాయి. వారిలో ఆ భయం ఇంకా పోలేదు. కానీ, వారికి మరో ఆప్షన్ లేదు. ఎందుకంటే, వికాస్ రెడ్డి గత పదేళ్లుగా డాక్టర్ కోర్సు చదివారు. ఇంకా కొత్త కొత్త వైద్యాలు నేర్చుకోవడానికి చదువుతూనే ఉన్నారు.

''రోగికి ఉత్తమమైన చికిత్సను అందించడమే మేం చేయగలిగిన పని. కానీ ప్రతి రోగి బంధువులు చక్కగా ప్రవర్తిస్తారని ఊహించడం కష్టమే. అయితే, చాలామంది ప్రొఫెషనల్‌గా మమ్మల్ని గౌరవిస్తారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి మేం ఈ వృత్తిలో ఉన్నాం'' అన్నారు వికాస్ రెడ్డి.

(అదనపు సమాచారాన్ని అస్సాం నుంచి దిలీప్ శర్మ అందించారు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)