కరోనావైరస్ - వర్చువల్‌ హబ్‌: భారత్‌లో వైద్య సిబ్బందిపై ఒత్తిడిని తగ్గిస్తున్న ప్రవాస భారతీయ డాక్టర్లు

ఇంగ్లాండ్-ఎన్నారై డాక్టర్లు

ఫొటో సోర్స్, REUTERS/DANISH SIDDIQUI

    • రచయిత, గగన్ సబర్వాల్
    • హోదా, బీబీసీ దక్షిణాసియా కరస్పాండెంట్

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌కు ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో విదేశాలలో ఉంటున్న ప్రవాస భారతీయ డాక్టర్లు మాతృభూమికి సేవ చేసేందుకు ముందుకొచ్చారు.

బ్రిటన్‌లోని 160 మందికి పైగా డాక్టర్లు ఒక వర్చువల్ హబ్‌గా ఏర్పడి, రిపోర్టుల పరిశీలన, సలహాల ద్వారా భారత్‌లోని డాక్టర్లపై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.

వీడియో కాల్స్ ద్వారా స్వచ్ఛందంగా వీరు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ప్రొఫెసర్ పరాగ్ సింఘాల్‌కు ఈ ఆన్‌లైన్ ప్రాజెక్ట్ ఆలోచన రాగా, ఇంగ్లండ్‌లో ఉంటున్న ప్రవాస భారతీయ డాక్టర్లు తమ మద్ధతు తెలిపారు.

ఇంగ్లాండ్-ఎన్నారై డాక్టర్లు
ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ పరాగ్ సింఘాల్

ప్రొఫెసర్ సింఘాల్ ఇంగ్లండ్‌లోని వెస్టన్ జనరల్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ ఫిజీషియన్‌గా పని చేస్తున్నారు. బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (BAPIO-బాపియో) అనే స్వచ్ఛంద సంస్థకు ఆయన సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఇది జాతీయ స్థాయి స్వచ్ఛంద సంస్థ.

ఇంగ్లాండ్-ఎన్నారై డాక్టర్లు

ఫొటో సోర్స్, Kingsway Hospitals Nagpur

మాతృభూమి కోసం...

దిల్లీ నగరానికి చెందిన ప్రొఫెసర్ సింఘాల్, కోవిడ్ కారణంగా ఇక్కడి ప్రజలు పడుతున్న అవస్థలు చూసి తన సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు. తనతోపాటు మరికొందరిని కూడా ఇందులో పాల్గొనేలా చేశారు.

''భారత్‌లోనే పుట్టి పెరిగాను. చదువుకున్నాను. మా స్నేహితులు, బంధువులు అక్కడే అన్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి'' అన్నారు ప్రొఫెసర్ సింఘాల్.

భారత్‌లో డాక్టర్లు కోవిడ్ సర్వీసుల కారణంగా అలసిపోతున్నారని, అందుకే తమ స్వచ్ఛంద సంస్థ తరఫున అక్కడి వైద్య సిబ్బందికి, బాధితులకు సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారాయన.

తక్కువ సమస్యలు ఉన్న కోవిడ్ పేషెంట్లకు ఇంగ్లండ్‌ నుంచి టెలీ మెడిసిన్ ద్వారా సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా, వారి రిపోర్టులు పరిశీలించడం ద్వారా భారతీయ డాక్టర్లపై ఒత్తిడిని తగ్గిస్తున్నామని ప్రొఫెసర్ సింఘాల్ తెలిపారు.

ప్రొఫెసర్ సింఘాల్, ఆయన మిత్రులు అందిస్తున్న సాయం చిన్నది కాదని, వారి సేవా భావానికి కృతజ్ఞతలు తెలపాల్సిన బాధ్యత తమ మీద ఉందని డాక్టర్ విమ్మీ గోయెల్ అభిప్రాయపడ్డారు.

ఇంగ్లాండ్-ఎన్నారై డాక్టర్లు

ఫొటో సోర్స్, Kingsway Hospitals Nagpur

ఫొటో క్యాప్షన్, డాక్టర్ ఖండేల్వాల్, డాక్టర్ విమ్మీ గోయెల్

ఇక్కడి డాక్టర్లు ఏమంటున్నారు?

డాక్టర్ గోయెల్ నాగ్‌పూర్‌లోని కింగ్స్‌వే ఆసుపత్రిలో ఫిజీషియన్‌గా పని చేస్తున్నారు. బ్రిటన్‌కు చెందిన ప్రవాస భారతీయ డాక్టర్లు అందిస్తున్న సహకారం తమకు ఎంతో ఉపయోగపడుతోందని ఆమె అన్నారు.

''ఇంగ్లండ్‌లోని డాక్టర్లు ఇప్పటికే ఈ వేవ్‌ను చూసి ఉన్నారు. కాబట్టి, వారికి ఈ వైరస్ ప్రవర్తన మీద అవగాహన ఉంటుంది. రాబోయే రోజుల్లో వైరస్ ప్రవర్తన తీరుతెన్నులు తెలిసి ఉండటం వల్ల వారి సలహాలు భారత్‌లో డాక్టర్లకు బాగా ఉపయోగ పడతాయి'' అన్నారు డాక్టర్ విమ్మీ గోయెల్.

''ఆసుపత్రులకు పేషెంట్ల వెల్లువతో మేం అలసిపోయి ఉన్నాం. మాకు కొంత సహకారం ఉంటే మరింత సమర్ధవంతంగా పని చేయగలం. అది మాకు 'బాపియో' నుంచి అందుతోంది'' అన్నారామె.

'బాపియో' నుంచి సహకారం పొందుతున్నవారిలో విమ్మీ గోయెల్‌లాంటి వారు అనేకమంది ఉన్నారు. కింగ్స్‌వే హాస్పిటల్‌లో రేడియాలజిస్టుగా పని చేస్తున్న డాక్టర్ రాజ్‌కుమార్ ఖండేల్వాల్ కూడా ఈ సలహాలు, సూచనలను పొందుతున్న వారిలో ఒకరు.

''కోవిడ్ హెచ్‌ఆర్‌సీటీ స్కాన్స్ విషయంలో ఇంగ్లండ్‌ డాక్టర్ల సహకారం మాకు చాలా విలువైంది. కుప్పలు తెప్పలుగా వస్తున్న స్కానింగ్ రిపోర్ట్‌లను పరిశీలించడం పెద్ద శ్రమతో కూడుకున్న వ్యవహారం. వాళ్లు వాటిని చెక్ చేసి, ఏం చేయాలో మాకు సలహా ఇస్తున్నారు. ఇది మా శ్రమను తగ్గిస్తోంది'' అన్నారాయన.

ఇంగ్లాండ్-ఎన్నారై డాక్టర్లు

ఫొటో సోర్స్, Kingsway Hospitals Nagpur

ఆక్సిజన్ కొరత తీర్చే ప్రయత్నం

ఒకపక్క వర్చువల్ హబ్ ద్వారా టెలీ మెడిసిన్ అందించడమే కాకుండా, భారత్‌లో తీవ్రంగా ఉన్న ఆక్సిజన్ కొరత సమస్యను పరిష్కరించేందుకు కూడా 'బాపియో' ప్రయత్నిస్తోంది.

వైరస్ బాధితులకు ఆహారంతోపాటు, ఆసుపత్రులలో ఆక్సిజన్ ఎక్విప్‌మెంట్ సమకూర్చేందుకు కొంత నిధిని కూడా సేకరిస్తోంది 'బాపియో'. ఇప్పటికే 1,80,000 పౌండ్లు (సుమారు ఒక కోటీ 86 లక్షలు) నిధిని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో మరిన్ని నిధులను సేకరిస్తామని బ్రిటన్‌లోని ప్రవాస భారతీయ డాక్టర్లు చెబుతున్నారు.

వర్చువల్ హబ్ మొదలు పెట్టిన కొద్ది వారాల్లోనే 500 మందికిపైగా డాక్టర్లు ఈ ప్రాజెక్టులో భాగం పంచుకోవడానికి ముందుకొచ్చారని ప్రొఫెసర్ సింఘాల్ చెప్పారు. భవిష్యత్తులో తమ సేవలను మరింత విస్తరింపజేసి, ఈ కష్టకాలంలో భారత్‌లోని వైద్య సిబ్బందిపై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తామని సింఘాల్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)