కోవిడ్: రోగుల ఆర్తనాదాల మధ్య నిర్విరామంగా పనిచేస్తూ అలసిపోతున్న డాక్టర్లు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి
గత ఏడాది జులైలో బాంబే ఆస్పత్రిలోని డయాబెటిస్ డాక్టర్ రాహుల్ బక్షి కోవిడ్ వార్డులో రౌండ్స్‌లో ఉన్నారు.
పీపీఈ కిట్ వేసుకున్న ఆస్పత్రి సిబ్బంది ఒకరు టేబుల్ ఫ్యాన్‌కు ఎదురుగా కుర్చీలో కూర్చుని ఉండడం ఆయనకు కనిపించింది.
బహుశా కోవిడ్ రోగుల వార్డులో తన 8 గంటల షిఫ్ట్ పూర్తి చేసిన తర్వాత ఆయన అలసిపోయి కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారేమో.
కోవిడ్ చికిత్సలో ఇచ్చే స్టెరాయిడ్స్ వల్ల రోగుల షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. అందుకే, డాక్టర్ బక్షి లాంటి వైద్య నిపుణుల పాత్ర చాలా కీలకం.
కోవిడ్ వార్డులో రౌండ్స్‌కు వెళ్తున్నప్పుడు, ఆయన సాధారణంగా తన దగ్గర ఫోన్ ఉంచుకోరు. దాంతో, నర్సింగ్ స్టేషన్ దగ్గరున్న ఒక జూనియర్ డాక్టర్ ఫోన్ అడిగి తీసుకున్న డాక్టర్ బక్షి ఫ్యాన్ ముందు కూర్చున్న ఆ సిబ్బందిని ఫొటో తీశారు.
పీపీఈలో ఎన్-95 మాస్క్, సర్జికల్ మాస్క్, గాగుల్స్, ఫేస్ షీల్డ్, గౌన్, కాప్ అన్నీ ఉంటాయి.
పీపీఈ కిట్ వేసుకుంటే తినడం, తాగడం, వాష్ రూమ్‌కు వెళ్లడం, వేరేవారి సాయం తీసుకోవడం కూడా కుదరదు.
మనం అలాంటి పనినే నెలల తరబడి ప్రమాదాల మధ్య చేయాల్సొస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి.

ఫొటో సోర్స్, DR SANDEEP DOGRA
పీపీఈ వేసుకోవాలంటేనే భయం
డాక్టర్ బక్షి ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసి దాని కింద "పీపీఈ వేసుకున్న అరగంటకే చెమటతో తడిసి ముద్దవుతాం" అని రాశారు.
"ఒక వార్డ్ నుంచి ఇంకో వార్డుకు వెళ్లే డాక్టర్, నర్స్, వార్డ్ హెల్పర్స్, లాబ్ అసిస్టెంట్, రేడియాలజీ స్టాఫ్, పారిశుద్ధ్య సిబ్బంది లాంటివారికి ఇది చాలా పెద్ద సమస్య. వంద మీటర్లకంటే ఎక్కువ నడిస్తే, ఆయాసం వచ్చేస్తుంది.. రెండు అంతస్తులు మెట్లు ఎక్కితే చాలు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది"
"పీపీఈ కిట్ వేసుకుని తిరిగే ఫ్యాన్ ముందు నిలుచున్నప్పుడు, మనకు ఫ్యాన్ సౌండ్ వినిపిస్తున్నా, గాలి మాత్రం రాదు. బయట ఎంత గాలి వీస్తున్నా, మనకు అది తెలీదు. అలాంటి పరిస్థితుల్లో పనిచేయడం వల్ల మానసికంగా తీవ్ర ప్రభావం పడుతుంది" అని డాక్టర్ బక్షి చెప్పారు.
దాదాపు గత 13 నెలలుగా కరోనా మహమ్మారితో పోరాడుతున్న దేశంలోని లక్షల మంది డాక్టర్లు, మెడికల్ సిబ్బంది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు.
"కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల నేను నా జీవితంలో మొదటిసారి ఎంతో ఇబ్బంది పడుతున్న రోగులకు కూడా 'నో' చెప్పాల్సి వచ్చింది. వెంటిలేటర్, ఆక్సిజన్, పడకల కోసం ఎంతోమంది వస్తున్నారు. అంత కష్టాల్లో ఉన్నా వారికి నేను 'నో' చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే అన్ని బెడ్స్ నిండిపోయాయి. అది చాలా బాధాకరం" అని ముంబయికి చెందిన రెసిడెంట్ డాక్టర్ భాగ్యలక్ష్మి చెప్పారు.

ఫొటో సోర్స్, DR RAHUL BAXI
కరోనా చనిపోతున్న వైద్యులు
అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటివరకూ దేశంలో కరోనా వల్ల 1.87 లక్షల మంది చనిపోయారు.
దేశంలో కరోనా మృతుల్లో 780 మంది డాక్టర్లు కూడా ఉన్నారని భారత మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జేఏ జయాలాల్ చెప్పారు.
కరోనా వల్ల నర్సులు, మిగతా మెడికల్ సిబ్బంది ఎంతమంది చనిపోయారో తెలీదు.
దాదాపు గత 13 నెలలుగా వైద్య రంగంలో పనిచేస్తున్నవారు కుటుంబ సమస్యలు, పని ఒత్తిడి, ఆస్పత్రుల్లో మరణాలు లాంటివి భయాలు ఉన్నా తమ పనిని కొనసాగిస్తూనే ఉన్నారు.
"మేం చాలా కాలంగా ఎంత ఒత్తిడి వాతావరణంలో పనిచేస్తున్నాం, అంతా నైరాశ్యంలో కూరుకుపోయాం" అని డాక్టర్ భాగ్యలక్ష్మి చెప్పారు.
డాక్టర్ భాగ్యలక్ష్మికి చాలాసార్లు పది గంటల పాటు పీపీఈ కిట్ వేసుకునే పనిచేయాల్సి వచ్చింది.

ఒత్తిడి వాతావరణం
ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడం చాలా కష్టంగా ఉంటుందని కశ్మీర్‌లోని బారాముల్లా ఆస్పత్రిలోని పిల్లల డాక్టర్ సుహైల్ నాయక్ చెప్పారు.
"చుట్టుపక్కల ఎక్కడ చూసినా కరోనా రోగులే ఉంటారు. వారంతా శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. దాని వల్ల చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది" అన్నారు.
వరసగా అలాంటి పరిస్థితుల్లోనే పనిచేయడం వల్ల డిప్రెషన్ పెరుగుతుందని ముంబయికి చెందిన మరో రెసిడెంట్ డాక్టర్ రోహిత్ జోషి అన్నారు. అప్పుడప్పుడు తనకు ఈ పని చేయాలా లేక వదిలేయాలా అనిపిస్తుందని అన్నారు.
సీనియర్ డాక్టర్లు, కన్సల్టెంట్లతో పోలిస్తే రెసిడెంట్ డాక్టర్ 24 గంటలూ డ్యూటీలో ఉంటారు. వరుసగా చాలా రోజులపాటు పదేసి గంటలపాటు పీపీఈ కిట్ వేసుకుని కోవిడ్ రోగుల మధ్య పనిచేయాల్సి ఉంటుంది.
కావాలనుకున్నా ఎవరికీ సాయం చేయలేకపోవడం, రాత్రి ఎప్పుడు కాల్ వచ్చినా డ్యూటీకి వెళ్లడం, చాలా రోజులు సరిగా నిద్రపోకపోవడం, ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఒత్తిడి వాతావరణంలో పనిచేయడం, ఆరోగ్యం సరిగా లేకున్నా విధులకు వెళ్లడం, తమ చుట్టుపక్కల రోగుల మరణాలు, వారి బంధువుల రోదనలు చూడడం లాంటివి వైద్య సిబ్బందిని అత్యంత ఒత్తిడికి గురిచేస్తాయి. అలాంటి వాతావరణంలో పనిచేయడం ఎవరినైనా అలసిపోయేలా చేస్తుంది.
"రోగులు చాలా మంది ఉంటారు, స్టాఫ్ చాలా తక్కువ ఉంటారు. ఒక్కో డాక్టర్ చాలా మంది రోగులను చుసుకోవాల్సి వస్తోంది. ఆ సమయంలో ఇద్దరు, ముగ్గురు రోగుల పరిస్థితి దిగజారితే సమస్య మరింత తీవ్రం అవుతుంది" అని రోహిత్ జోషి చెప్పారు.
"మేం వీలైనంత ఎక్కువమంది రోగులను చూసుకోవాలని అనుకుంటాం. కానీ మా దగ్గర అంత సమయం ఉండదు. వేగంగా పనిచేయాల్సుంటుంది. అందుకే, మేం ఒక్కో రోగికి 15-20 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇవ్వలేం" అన్నారు.
ఆస్పత్రుల్లో కోవిడ్ రోగుల సంఖ్య మాత్రమే పెరగలేదు. కోవిడ్ నెగటివ్ వచ్చినవారిని కూడా మెరుగైన వైద్య పర్యవేక్షణ కోసం నాన్ కోవిడ్ వార్డుకు పంపిస్తున్నారు. దాంతో, అక్కడ కూడా రోగుల సంఖ్య పెరుగుతోంది.
ఇలా ఎప్పటివరకు
కానీ, కోవిడ్ సెకండ్ వేవ్ ఎంత తీవ్రంగా ఉందంటే... ఆక్సిజన్, ఆస్పత్రుల్లో పడకలు, మందుల కొరత వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
అయితే, డాక్టర్లు తాము ఇలా ఎప్పటివరకూ చేయాల్సుంటుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు.
"ఇది ఇలా చాలా రోజులపాటూ కొనసాగితే, మేం మా కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉండలేం" అని బిహార్ భాగల్పూర్‌లో చాలాకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటూ పనిచేస్తున్న ఒక మహిళా వైద్య సిబ్బంది అన్నారు.
ఆరోగ్య సిబ్బంది సేవలను ప్రశంసిస్తూ ప్రజలు చప్పట్లు కొట్టారు, పళ్లాలు మోగించారు. కానీ వైరస్‌ను అడ్డుకోడానికి మీ భాగస్వామ్యం కూడా ఉండాలని డాక్టర్లు వేడుకుంటున్నారు.
అందరూ సోషల్ డిస్టెన్సింగ్ నియమాలను పాటించాలని, మాస్క్ ధరించాలని కోరుతున్నారు.

ఫొటో సోర్స్, AMANDEEP
"మొదటి వేవ్ సమయంలో మేం మా ప్రాణాలకు తెగించి పనిచేశాం. కానీ ఈసారీ మేం మా కుటుంబ సభ్యుల జీవితాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నాం" అని జమ్మూలో గైనకాలజిస్ట్ అమన్‌దీప్ కౌర్ ఆనంద్ అంటున్నారు.
జమ్మూలోని గాంధీ నగర్‌లో పనిచేస్తున్న అమన్ దీప్ తల్లిదండ్రుల వయసు 60 ఏళ్లకు పైనే ఉంటుంది. ఆమె తల్లి డయాబెటిక్. దాంతో ఆమె వాళ్లను కలవడం కూడా మానేశారు.
ఆగస్టులో కోవిడ్ వచ్చిన ఒక గర్భిణికి సర్జరీ చేసినప్పుడు అమన్ దీప్ కౌర్ కోవిడ్‌కు గురయ్యారు.
"ఆగస్టులో ఆ వారం నేను 10 మంది కోవిడ్ పాజిటివ్ మహిళలకు సిజేరియన్ చేశాను. వాళ్ల పిల్లలకు కోవిడ్ నెగటివ్ వచ్చింది. దానితో ఆ పైవాడు మనకు అండగా ఉంటాడు అని నాకు ఒక నమ్మకం వచ్చింది" అని అమన్ దీప్ అన్నారు.
ఆ సమయంలో మొత్తం జమ్మూలో కోవిడ్ రోగులకు ఆమె ఆస్పత్రిలో మాత్రమే సర్జరీలు జరిగాయి. ఆమె ప్రతి సర్జరీ తర్వాత స్నానం చేసేవారు. మళ్లీ ఆపరేషన్ చేసేవారు.
జనం పూంఛ్, రాజౌరీ, కిశ్త్‌వాడ్, డోడా నుంచి ఆస్పత్రికి వచ్చేవాళ్లు. అమన్ దీప్ రోజుకు రెండు మూడు సర్జరీలు చేసేవారు.
లాక్ డౌన్‌లో ఆమె అర్థరాత్రి కూడా సర్జరీ కోసం ఆస్పత్రికి చేరుకునేవారు. అప్పటి వాతావరణం, పని ఒత్తిడి, కొంత కాలంపాటు అందరికీ దూరంగా అన్నీ ఆమె చిన్న కొడుకుపై ప్రభావం చూపించాయి. దాంతో అమన్ దీప్ కొడుకు టీచర్లతో కూడా మాట్లాడాల్సి వచ్చింది.
పీపీఈ కిట్ వేసుకుని సర్జరీ చేస్తున్నప్పుడు, ఆమెకు కళ్లు తిరగడం లాంటి సమస్యలు కూడా వచ్చాయి. అయితే, ఆమె కాసేపు కూర్చుని, మళ్లీ పనిలోకి దిగేవారు.

ఫొటో సోర్స్, YAHYA DIWER/AFP VIA GETTY IMAGES
పీపీఈ కిట్‌తో కూడా జాగ్రత్తలు
పీపీఈ కిట్ వేసుకోవడం వల్ల డాక్టర్లు చెమటలో తడిసి ముద్దవుతారు. వారి శరీరం లవణాలు, నీటిని చాలా వేగంగా విసర్జిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్లు మాస్క్ తీయకూడదు.
అయితే, అమన్‌దీప్ ఆమె సహచరులు కరోనాకు గురయ్యారు. పీపీఈ కిట్ వేసుకున్నంత మాత్రాన ఏ ప్రమాదం ఉండదని చెప్పలేం. నిజానికి, కోవిడ్ వార్డులో ఆరోగ్య సిబ్బంది చాలా ప్రమాదకరమైన వైరల్ లోడ్ వాతావరణంలో పనిచేయాల్సి వస్తుంది.
రోగుల దగ్గు, తుమ్ముల వల్ల బయటికొచ్చే వైరస్ గాలిలో తుంపర్లుగా కలిసిపోతుంది. పీపీఈ డ్రెస్ మీద ఉండిపోతుంది. వేసుకున్న మాస్క్ పై భాగంపై కూడా అవి ఉంటాయి.
పీపీఈ తీయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. వాళ్లు గౌన్, గ్లోవ్స్ లాంటివి ఒక క్రమం ప్రకారం తీయాల్సుంటుంది. ఎందుకంటే పీపీఈ ఓపెన్ చేస్తున్న సమయంలో గాలి తుంపరలు, పార్టికల్స్ ఆ గదిలోనే ఉంటాయి.
"కరోనా మొదటి వేవ్‌లో పీపీఈ వేసుకున్నప్పటికీ డాక్టర్లు చాలామందికి పాజిటివ్ వచ్చింది. ఎందుకంటే వార్డు నుంచి బయిటికి రాగానే, బయటికొచ్చేశాం, ఏం కాదులే అని మాస్క్ తీసేసేవారు. కానీ గదిలో మనం మాస్క్ తీయకూడదు. అది అప్పుడు తెలియలేదు. కానీ ఇప్పుడు తెలుస్తోంది" అని డాక్టర్ అమన్‌దీప్ భర్త డాక్టర్ సందీప్ డోగ్రా అన్నారు.

ఫొటో సోర్స్, DR. SHARAN
కుటుంబం గురించి భయం
కానీ, ప్రస్తుతం సెకండ్ వేవ్ ఎంత భయంకరంగా వ్యాపిస్తోందంటే, తమ వల్ల కుటుంబ సభ్యులకు ఎక్కడ వైరస్ వస్తుందేమోనని డాక్టర్లు భయపడిపోతున్నారు.
"ఓపీడీ నుంచి వచ్చిన తర్వాత గౌన్, గ్లౌజ్ అన్నీ మార్చుకుంటా. నన్ను నేను శానిటైజ్ చేసుకుంటా. ఇంటికెళ్లగానే వేడినీళ్లతో స్నానం చేస్తా. ఆ తర్వాతే నేను ఇంట్లోకి అడుగుపెడతాను" అని మోతీహారీలోని సర్జన్ డాక్టర్ అశుతోష్ శరణ్ అన్నారు.
డాక్టర్ శరణ్‌కు తన సొంత నర్సింగ్ హోమ్ ఉంది. తన వల్ల మనవరాలికి, స్టాఫ్‌కి కరోనా వస్తుందని భయపడిన ఆయన కోవిడ్ వ్యాక్సీన్ వేసుకున్నారు.
60 ఏళ్ల డాక్టర్ శరణ్ ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 3 గంటల వరకూ ఆస్పత్రిలోనే ఉంటారు.
"గత 14 నెలలుగా నేను ఒక్కసారి మాత్రమే నా మనవరాలి పుట్టినరోజు కోసం కుటుంబంతో కలిసి సిలిగురి వెళ్లాను. అది కూడా డిసెంబర్, జనవరిలో దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో వెళ్లాను" అని ఆయన చెప్పారు.
మరోవైపు, డాక్టర్ల సాహసం, తెగువను చాలా మంది అర్థం చేసుకోవడం లేదని ముంబయి డాక్టర్ జోషి అన్నారు.
"డాక్టర్ రెమెడెసివీర్ రాస్తే, డబ్బుల కోసమే వాళ్లు దాన్ని రాశారని అంటారు. లేదంటే కోవిడ్ ఆస్పత్రులకు డబ్బు తెచ్చిపెట్టడానికి అదొక పద్ధతని చెబుతారు. అలా అనుకోవడం విన్నప్పుడు నేనేం మాట్లాడను. అలాంటి వాళ్లను మార్చలేం. కానీ, మమ్మల్ని ప్రోత్సహించే వాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్ల వల్లే మాకు ధైర్యం వస్తుంది" అంటున్నారు జోషి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: సెకండ్ వేవ్‌లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- బెల్లం: ఆహారమా... ఔషధమా?
- తెలంగాణ: పదో తరగతి పరీక్షలు రద్దు.. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా
- దీర్ఘకాలిక కోవిడ్: ‘రిపోర్టులన్నీ నార్మల్‌గానే వచ్చాయి. కానీ అడుగేస్తే నరకం కనిపించేది’
- స్పుత్నిక్ V: రష్యా వ్యాక్సీన్‌కు భారత్ అనుమతి.. ఈ టీకా గురించి తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
- కరోనావైరస్ సెకండ్ వేవ్: 'గత ఏడాది లాక్డౌన్ వల్ల అడుక్కోవాల్సి వచ్చింది... మళ్లీ విధిస్తారా'
- కరోనా వ్యాక్సీన్ : అన్ని ముస్లిం దేశాలు టీకా తీసుకుంటాయా ? హలాల్, హరామ్ చర్చ ఎందుకు మొదలైంది ? బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- టీకా ఉత్సవ్: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే.. 580 మందికి మాత్రమే ఇచ్చారు.. భారత్‌లో టీకాల కొరతకు కారణమేంటి..
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









