కోవిడ్-19: చనిపోయిన తరువాత కూడా పడిగాపులు కాస్తున్న సామాన్యుడు... వాస్తవాలకు అద్దం పట్టే చిత్రాలు

ఫొటో సోర్స్, SUMIT KUMAR
- రచయిత, అనంత్ ఝనానే
- హోదా, బీబీసీ కోసం
లఖ్‌నవూలో 31 ఏళ్ల సుమిత కుమార్ గత ఎనిమిది ఏళ్లుగా ప్రెస్ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఇంత భయంకరమైన దృశ్యాలను తన కెరీర్‌లోనే చూడలేదని ఆయన అంటున్నారు.
గత ఐదారు రోజులుగా సుమిత్ మార్చురీలకు, శ్మశానవాటికలకు వెళ్లి వస్తున్నారు. ఆయన లఖ్‌నవూలో తన బంధువుల ఇంట ఉంటున్నారు. తనను తాను ఐసొలేట్ చేసుకుని వేరే గదిలో ఉంటున్నారు.
ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఆఫీస్‌కు వెళ్తున్నానని అబద్ధం చెప్పి బయటకు వస్తున్నారు సుమిత్.
నగరంలో ఎక్కడా చూసినా చావులు, బంధువులు ఏడుపులు, ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న రోగులు.. లఖ్‌నవూ వాస్తవాన్ని చూడాలంటే ఇంట్లో అబద్ధం చెప్పక తప్పడం లేదని ఆయన అన్నారు.
లఖ్‌నవూలో భైంసా కుండ్‌లో పని చేస్తున్న మున్నా కన్నా తన పని కష్టమేం కాదని సుమిత్ అంటున్నారు.
గత పది రోజులుగా ఇంటికే వెళ్లకుండా మున్నా భైంసా కుండ్ శ్మశానవాటికలో మృతదేహాలను దహనం చేస్తున్నారు.
ఎన్ని మృతదేహాలు వస్తున్నాయో, ఎంతమందికి దహన సంస్కారాలు చేస్తున్నారో మున్నా లెక్క పెట్టడం మానేశారని సుమిత్ తెలిపారు.
శవం వచ్చిందా, కాల్చి బూడిద చేశామా అన్నట్లు నిర్వికారంగా తన పని తాను చేసుకుపోతున్నారు మున్నా.

ఫొటో సోర్స్, SUMIT KUMAR
సుమిత్ లఖ్‌నవూలో వీధి వీధి తిరుగుతూ ఇలాంటి ఎన్నో దృశ్యాలను తన కెమేరాలో బంధిస్తున్నారు. నగర వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు.
ఇటీవల సుమిత్ తీసిన ఒక ఫొటో వైరల్ అయింది.
ఏప్రిల్ 14న తాల్‌కటోరా ప్రాంతంలో ఒక ఆక్సిజన్ గొడౌన్ బయట కారులో కూర్చుని భారంగా ఊపిరి తీసుకుంటున్న 70 ఏళ్ల సుశీల్ కుమార్ శ్రీవాస్తవ ఫొటో అది.
సుశీల్ కుమార్‌ను ఆస్పత్రిలో చేర్చేందుకు ఆయన కుమారులు కారులో బయలుదేరారు. దారిలో ఆక్సిజన్ సిలిండర్ కోసం హోల్‌సేల్ గొడౌన్ దగ్గర ఆగారు.
రోజంతా బెడ్ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. మర్నాటి వరకూ వాళ్లకు బెడ్ దొరకలేదు.
బీపీ, డయాబెటిస్ ఉండడంతో ఆస్పత్రిలో చేర్చినా కూడా సుశీల్ కుమార్ పరిస్థితి మెరుగవలేదు.
ఏప్రిల్ 16 ఉదయం ఆయన చనిపోయారు.

ఫొటో సోర్స్, SUMIT KUMAR
సుశీల్ కుమార్ మరణం తనకు దిగ్భ్రాంతి కలుగజేసిందని సుమిత్ తెలిపారు.
"ఆ వార్త వినగానే షాక్ అయిపోయాను. ఆయనకు నేనేమీ సహాయం చేయలేకపోయాను. ఎవరికీ ఏ సహాయం చేయలేకపోతున్నాం. ఏదో తమాషా చూస్తున్నట్లు నిలబడిపోతున్నాం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం. ఇవన్నీ ఇంట్లోవాళ్లతో చెప్పలేం. నేనైతే అబద్ధం చెప్పి బయటకు వస్తున్నాను. ఈ దుఃఖాన్నంతా మనసులోనే అదిమిపెట్టుకోవాలి తప్పితే ఎవరితోనూ పంచుకోలేను" అని సుమిత్ అన్నారు.
ఇలాంటి ఫొటోలు తీస్తున్నప్పుడు మానసికంగా కుంగిపోతున్నానని ఆయన చెప్పారు.
"మనం చనిపోతే నలుగురు మనల్ని భుజాల మీద మోస్తారనే నమ్మకం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరే మోస్తున్నారు. వాళ్లు కూడా మన కుటుంబ సభ్యులు కారు, స్నేహితులు కారు. వ్యవస్థ విఫలమైందని చెప్పడానికి ఇంతకన్నా ఇంకేమీ అక్కర్లేదు" అని సుమిత్ అన్నారు.

ఫొటో సోర్స్, SUMIT KUMAR
సుమిత్ ఇంతకుముందు ఎన్నో ఫొటోలు తీశారు. వాటిల్లో హృదయ్యవిదారకమైనవీ ఉన్నాయి. కానీ ఇలాంటి భయంకర దృశ్యాలను మునుపునెప్పడూ చూడలేదని ఆయన అంటున్నారు.
"నేను గోరఖ్‌పూర్‌లో బీఆర్‌డీ మెడికల్ కాలేజీకి వెళ్లి ఫొటోలు తీశాను. అక్కడ ఎన్సెఫాలిటీస్‌తో బాధపడుతున్న పిల్లలను చూశాను. చాలా బాధ కలిగింది. కానీ ఇప్పుడు చూస్తున్నది వేరు. ఇక్కడ మనందరం నిస్సహాయులైపోయాం. ఏమీ చేయలేకపోతున్నాం. పూర్తిగా నిస్సత్తువ ఆవరిస్తోంది. అయినా సరే, మహమ్మారి పరిస్థితులను కవర్ చేయాలి. వాస్తవాలను ప్రజలకు చూపించాలి. కెమేరా పట్టుకుని తిరుగుతూ ఫొటోలు తీయాలి. ఇది చాలా దారుణమైన పరిస్థితి" అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, SUMIT KUMAR
తన ఫొటోలపై ప్రతికూల స్పందనలు కూడా వస్తున్నాయని సుమిత్ చెప్పారు.
"నాకు మెసేజ్‌లు వస్తుంటాయి. ఎందుకింత నెగెటివ్ అంశాలను చూపిస్తున్నావు? పాజిటివ్ విషయాలను చూపించొచ్చు కదా అని అంటారు. పాజిటివ్ విషయాలు ఎక్కడున్నాయి? ఎక్కడ చూసినా నెగెటివ్ విషయాలే కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా సామాన్యుడికి దెబ్బలే తగులుతున్నాయి.
వెయిటింగ్ లిస్ట్‌లో ఉండడం, క్యూలో నిలబడి పడిగాపులు కాయడం సామాన్యుడికి కొత్తేం కాదు. కానీ శ్మశ్మానవాటికల దగ్గర వెయిటింగ్ లిస్ట్‌లో నిలబడడం జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్నాను.
మరణం తరువాత కూడా మనిషికి పడిగాపులు తప్పట్లేదు" అని సుమిత్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ వ్యాక్సీన్: మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా... కేంద్రం ప్రకటన
- వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య: ఇప్పటి వరకూ ఈ కేసులో ఏం జరిగింది, సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యమవుతోంది?
- భారత ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉంది ఎందుకు
- కరోనావైరస్: సెకండ్ వేవ్‌లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- బెల్లం: ఆహారమా... ఔషధమా?
- తెలంగాణ: పదో తరగతి పరీక్షలు రద్దు.. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా
- దీర్ఘకాలిక కోవిడ్: ‘రిపోర్టులన్నీ నార్మల్‌గానే వచ్చాయి. కానీ అడుగేస్తే నరకం కనిపించేది’
- స్పుత్నిక్ V: రష్యా వ్యాక్సీన్‌కు భారత్ అనుమతి.. ఈ టీకా గురించి తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
- కరోనావైరస్ సెకండ్ వేవ్: 'గత ఏడాది లాక్డౌన్ వల్ల అడుక్కోవాల్సి వచ్చింది... మళ్లీ విధిస్తారా'
- కరోనా వ్యాక్సీన్ : అన్ని ముస్లిం దేశాలు టీకా తీసుకుంటాయా ? హలాల్, హరామ్ చర్చ ఎందుకు మొదలైంది ? బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో
- టీకా ఉత్సవ్: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే.. 580 మందికి మాత్రమే ఇచ్చారు.. భారత్‌లో టీకాల కొరతకు కారణమేంటి..
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









