గుజరాత్‌లో కోవిడ్: ఈ రెండు గ్రామాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రుషి బెనర్జీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
గుజరాత్‌లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఆసుపత్రుల ముందు ఎక్కడ చూసినా అంబులెన్స్‌లు కనిపిస్తున్నాయి. పట్టణాల్లోని శ్మశానాలు శవాలతో నిండిపోతున్నాయి.
మీడియా రిపోర్టుల ప్రకారం అహ్మదాబాద్, సూరత్, వదోదర, రాజ్‌కోట్ సహా అనేక పట్టణాల్లో కోవిడ్ బాధితులు ఆక్సిజన్, మందులు, బెడ్స్ కోసం ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు.
ఒక పక్క రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఉంటే అదే రాష్ట్రంలోని రెండు గ్రామాలలో మాత్రం సీన్ పూర్తి భిన్నంగా ఉంది.
షియాల్, అలియా అనే రెండు లంక గ్రామాలలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
ఆ రెండు గ్రామాలు ఉన్న భౌగోళిక స్థితిగతులు, గ్రామస్తుల చైతన్యం కారణంగా ఆ ఊళ్లలో ఎవరి మీదా వైరస్ ప్రభావం లేదని అధికారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, FARUK KADRI/AMRELI
షియాల్ గ్రామంలో....
అమ్రేలి జిల్లా జాఫ్రాబాద్ తాలూకాలో షియాల్ అనే లంక గ్రామం ఉంది. కరోనా రాకుండా తాము ఎలా జాగ్రత్త పడ్డారో ఆ గ్రామ సర్పంచ్ హమీర్ భాయ్ బీబీసీకి వివరించారు.
''మా ఊళ్లోకి బయటి వారిని ఎవరినీ రానివ్వ వద్దని తీర్మానించాం. దాన్ని అమలు చేశాం'' అని అన్నారు.
నేటికీ ఆ గ్రామ ప్రజలు కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు. కరోనా మొదటి వేవ్‌లోనే కాదు రెండో వేవ్‌లో కూడా ఈ గ్రామంలో ఒక్క కేసు కూడా లేదు.
''కరోనావైరస్ గురించి తెలియగానే మేం 5వేల మాస్క్‌లు, శానిటైజర్లను తెచ్చి గ్రామంలో పంపిణీ చేశాము. డాక్టర్ సలహా మేరకు గ్రామంలో ముందు జాగ్రత్తగా మందులు కూడా పంపిణీ చేశాం'' అని సర్పంచ్ హమీర్ భాయ్ వివరించారు.
2011 జనాభా లెక్కల ప్రకారం షియాల్ జనాభా 5,551. ఊరు మొత్తంలో 1,314 ఇళ్లున్నాయి. ఇక్కడ నివసించే వారిలో చాలామంది చేపలు పట్టి జీవనం సాగిస్తుంటారు.
స్థానికుల అభిప్రాయం ప్రకారం కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించడం వల్లే ఇది సాధ్యమైంది.

ఫొటో సోర్స్, FARUK KADRI
పట్టుదలగా కట్టుబాటు అమలు...
అవసరమైనప్పుడు మాత్రమే గ్రామస్తులు బయటకు వెళతారు. దానికి అనుమతి తీసుకోవాలి. బయటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఊరు లోపలికి అనుమతించరు.
ఏడాది కాలంగా ఊరి ప్రజలు తప్ప కొత్తవారు ఎవరూ తమ గ్రామంలోకి రాలేదని షియాల్ సర్పంచ్ హమీర్ భాయ్ పేర్కొన్నారు.
''ప్రజలు కరోనా తీవ్రతను అర్ధం చేసుకుని నిబంధనలను కచ్చితంగా పాటించారు. వారి సహకారం వల్లే ఇది సాధ్యమైంది" అని హమీర్ భాయ్ అన్నారు.
వేడుకలు, పెళ్లిళ్లు వంటి సామాజిక కార్యక్రమాలు కూడా పరిమిత సంఖ్యలోనే జరుగుతాయని ఆయన వెల్లడించారు.
''ఒక వ్యక్తి గ్రామం నుంచి బయటకు వెళ్లాలనుకుంటే కారణం అడుగుతారు. ఆ కారణం సహేతుకంగా ఉంటేనే వెళ్లనిస్తారు'' అని షియాల్ గ్రామానికి చెందిన జయంతి వెల్లడించారు.
''గ్రామ ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని పెద్దలు విజ్జప్తి చేశారు. గ్రామ పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటాయి'' అని ఆమె చెప్పారు.
''భౌగోళికంగా ఆ గ్రామం ఉన్న స్థితి, నిబంధనలు కచ్చితంగా పాటించడం వల్ల షియాల్‌కు వైరస్ చేరలేదు'' అని అమ్రేలీ జిల్లా కలెక్టర్ ఆయుష్ ఓక్ అన్నారు.
''గ్రామస్తులు చైతన్యంతో వ్యవహరించారు. అది మంచి ఫలితాలు ఇచ్చింది. జిల్లా యంత్రాంగం కూడా వారికి అన్ని విధాలా సాయం చేస్తోంది. గ్రామస్తులు బయటకు వెళ్లకుండా అన్నీ అందుబాటులో ఉంచుతోంది'' అన్నారు జిల్లా కలెక్టర్.

ఫొటో సోర్స్, FARUK KADRI
అలియా గ్రామంలోనూ....
బరూచ్ జిల్లాలోని అలియా అనే లంక గ్రామంలో పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. షియాల్ గ్రామంలో మాదిరిగానే ఇక్కడ కూడా ఒక్క వైరస్ కేసు నమోదు కాలేదు.
కచ్ ప్రాంతానికి చెందిన కొందరు 350 ఏళ్ల కిందట పశువులతో ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఈ గ్రామంలో 100 ఇళ్లు, 500మంది ప్రజలు ఉంటారు.
''ఏడాది కాలంగా కరోనా మహమ్మారి కొనసాగుతోంది. కానీ ఇక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు'' అని గ్రామ పెద్ద మహమ్మద్ జాట్ బీబీసీతో అన్నారు.
షియాల్ గ్రామస్థులు మాదిరిగానే ఇక్కడ ప్రజలు సామాజిక దూరం కచ్చితంగా పాటిస్తారు. గ్రామాన్ని దాటి వెళ్లరు. ఎవరినీ లోపలికి రానివ్వరు.
అలియా గ్రామస్తులు ఎక్కువమంది పశువులను పెంచుతూ, పాలు అమ్మి జీవనం సాగిస్తారు. పాలు అమ్మాలంటే గ్రామం దాటి వెళ్లాలి. అయితే వారు బైటికి వెళ్లి వచ్చినప్పుడు కరోనా నిబంధనల ప్రకారం వారికి టెస్టులు చేస్తారు.
స్థానిక సంస్థలు కూడా తమకు సహకరిస్తున్నాయని, అవసరమైన వస్తువులు, మందులను అందిస్తున్నాయని మహమ్మద్ జాట్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
గుజరాత్‌లో కరోనా తీవ్రత
గుజరాత్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం సాయంత్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 24 గంటల్లో 13,105 కొత్త కేసులు నమోదయ్యాయి.
గుజరాత్‌లో మరణించిన వారి సంఖ్య 5,615 దాటింది. సూరత్ (కార్పొరేషన్)లో రాష్ట్రంలో అత్యధికంగా 24 మరణాలు సంభవించగా, అహ్మదాబాద్ (కార్పొరేషన్)లో 23 మంది మరణించారు.
ఇక యాక్టివ్ కేసుల విషయానికొస్తే, ప్రస్తుతం రాష్ట్రంలో 92084 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో 376 మంది రోగులు వెంటిలేటర్‌పై ఉండగా, 76,147 మంది రోగుల పరిస్థితి స్థిరంగా ఉంది.
రాష్ట్రంలో మొత్తం 3,46,063 మంది రోగులు కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 80.82 శాతంగా నమోదైంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: సెకండ్ వేవ్‌లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- బెల్లం: ఆహారమా... ఔషధమా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- తెలంగాణ: పదో తరగతి పరీక్షలు రద్దు.. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా
- దీర్ఘకాలిక కోవిడ్: ‘రిపోర్టులన్నీ నార్మల్‌గానే వచ్చాయి. కానీ అడుగేస్తే నరకం కనిపించేది’
- స్పుత్నిక్ V: రష్యా వ్యాక్సీన్‌కు భారత్ అనుమతి.. ఈ టీకా గురించి తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
- కరోనావైరస్ సెకండ్ వేవ్: 'గత ఏడాది లాక్డౌన్ వల్ల అడుక్కోవాల్సి వచ్చింది... మళ్లీ విధిస్తారా'
- కరోనా వ్యాక్సీన్ : అన్ని ముస్లిం దేశాలు టీకా తీసుకుంటాయా ? హలాల్, హరామ్ చర్చ ఎందుకు మొదలైంది ? బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో
- టీకా ఉత్సవ్: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే.. 580 మందికి మాత్రమే ఇచ్చారు.. భారత్‌లో టీకాల కొరతకు కారణమేంటి..
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









