కోవిడ్ సెకండ్ వేవ్: భారత్‌లో కరోనా కేసులు వేగంగా పెరగడానికి ఎన్నికల ర్యాలీలే కారణమా: Reality Check

పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రచారం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శ్రుతి మీనన్, జాక్ గుడ్‌మాన్
    • హోదా, బీబీసీ రియాలిటీ చెక్

భారత్‌లో కరోనావైరస్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. కోవిడ్ రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి.

బెడ్స్ దొరకడం కష్టంగా మారుతోంది. ఆక్సిజన్ కొరత కొందరి ప్రాణాలు తీస్తోంది.

అయితే, కరోనా కేసులు ఈ స్థాయిలో పెరగడానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారీగా ర్యాలీలు నిర్వహించడమే కారణమని కొందరు ఆరోపిస్తున్నారు.

అధికార బీజేపీ మాత్రం కోవిడ్ కేసులకు, ర్యాలీలకు ఎలాంటి సంబంధం లేదంటోంది.

"దేశంలో పెరుగుతున్న కరోనా కేసులకు, మతపరమైన, రాజకీయ కార్యక్రమాలకు ఎలాంటి సంబంధం లేదు" అని బీజేపీ నేత డాక్టర్ విజయ్ చౌతైవాలే బీబీసీతో అన్నారు.

కరోనా

కేసు సంఖ్య పెరగడానికి కారణం?

2020 సెప్టెంబర్ మధ్య నుంచి ఫిబ్రవరి చివరి నాటికి భారత్‌లో రోజువారీ కేసుల సంఖ్య స్థిరంగా తగ్గుతూ వచ్చింది.

మార్చిలో కేసులు మళ్లీ పెరిగాయి. ఈ నెలలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది.

2020లో భారత్‌లో కనిపించిన మొదటి వేవ్‌తో పోలిస్తే ఈ ఏడాది కరోనా కేసుల సంఖ్య చాలా వేగంగా పెరిగింది.

సరిగ్గా అదే సమయంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.

మార్చి మొదటి నుంచి ఈ ప్రచారం కొనసాగుతోంది. మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ వరకు దశలవారిగా పోలింగ్ నిర్వహిస్తున్నారు.

కేసులు పెరగడానికి ఎన్నికల ర్యాలీలే కారణమా?

ఎన్నికల ర్యాలీల కోసం జనాన్ని పెద్ద ఎత్తున సమీకరిస్తారు. అలాంటి చోట సామాజిక దూరం పాటించడానికి తక్కువ అవకాశం ఉంటుంది. పైగా మాస్కులు కూడా చాలా తక్కువ మంది పెట్టుకున్నారు.

ప్రచారం చేస్తున్న నాయకులు, పార్టీల అభ్యర్థులు కూడా కోవిడ్ నిబంధనలను పాటించకపోవడం కనిపించింది.

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ర్యాలీల్లో జనం భారీగా గుమిగూడడంపై ఎన్నికల కమిషన్ హెచ్చరికలు కూడా జారీ చేసింది.

చాలా పార్టీలు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో ఏప్రిల్ 22 నుంచి ఎన్నికల ర్యాలీలను నిషేధిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.

పశ్చిమ బెంగాల్‌లో నమోదయ్యే రోజువారీ కేసులు మార్చి మూడో వారం, ఆ తర్వాత నుంచి వేగంగా పెరగడం స్పష్టంగా కనిపించింది.

పశ్చిమ బెంగాల్లో కరోనా కేసులు

అలాగే, ఎన్నికలు జరిగిన మిగతా రాష్ట్రాలైన అస్సాం, కేరళ, తమిళనాడులో కూడా మార్చి చివర్లో లేదంటే ఏప్రిల్ ప్రారంభంలో కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి.

ఆయా రాష్ట్రాల్లో ర్యాలీలు జరిగిన ప్రాంతాల్లో నివసిస్తున్న(ర్యాలీలకు హాజరయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నవారు) ప్రజల్లో ఇన్ఫెక్షన్ రేటు గురించి మాకు స్థానిక గణాంకాలు అందలేదు.

ఆ సమయంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం అనేది ప్రత్యేకంగా ఈ నాలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. భారత్‌లోని మిగతా రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి కనిపించింది.

ఉదాహరణకు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటకలో కూడా కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. అక్కడ ఎలాంటి ఎన్నికలూ జరగకపోయినా తక్కువ సమయంలోనే అక్కడ కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయి.

మనకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం పార్టీల ప్రచారానికి, కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరగడానికి సంబంధం ఉందనడానికి బలమైన ఆధారాలేవీ లేవు.

బీజేపీ ర్యాలీలో మాస్కులు లేకుండా జనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బీజేపీ ర్యాలీలో పెద్దగా మాస్కులు ధరించని జనం

బహిరంగ కార్యక్రమాలతో రిస్క్ ఉంటుందా

నాలుగు గోడల మధ్య జరిగే కార్యక్రమాలతో పోలిస్తే బహిరంగ ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాల వల్ల వైరస్ వ్యాపించే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే, పార్టీలు నిర్వహించిన ఎన్నికలతో వైరస్ వ్యాప్తి పెరుగుతుంది అనడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.

రద్దీ ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించకుండా ఇతరులకు చాలాసేపు దగ్గరగా ఉంటే వైరస్ వ్యాపించే అవకాశం ఉంది.

"జనం పక్కపక్కనే ఉండే బహిరంగ సభ లాంటి కార్యక్రమాల్లో వైరస్‌ సోకిన వ్యక్తులకు దగ్గరగా ఉన్నవారికి కోవిడ్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి" అని వార్విక్ మెడికల్ స్కూల్‌ ప్రొఫెసర్ లారెన్స్ యంగ్ చెప్పారు.

బహిరంగ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ వైరస్ ఉన్న వారికి దగ్గరగా నిలబడడం, ముఖ్యంగా గాలివీచే దిశలో, ఎవరికైనా ఒక మీటర్ లోపలే ఎదురెదురుగా ఉండడం చాలా ప్రమాదం" అని బ్రిస్టల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జొనాథన్ అన్నారు.

"సభల్లో గట్టిగా అరుస్తుంటారు. అలాంటప్పుడు ఆ వ్యక్తి నోటి నుంచి తుంపర్లు భారీ సంఖ్యలో విడుదలవుతుంటే అవి పక్కనున్నవారిపై పడతాయి" అని వివరించారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

కేసుల పెరుగుదల వెనుక కొత్త వేరియంట్లు ఉన్నాయా

గత ఏడాది తొలిసారిగా కనిపించిన కొత్త వేరియంట్ భారత్‌లో సెకండ్ వేవ్‌కు కారణమా అనే దానిపై కూడా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.

"కారణం అయ్యుండచ్చు. కానీ అదే దీనికి కారణం అని చెప్పడానికి ఇంకా తగినన్ని ఆధారాలు దొరకలేదు" అంటున్నారు.

భారత వేరియంట్‌కు సంబంధించి తగిన డేటా లేకపోవడంతో పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ దానిని ప్రస్తుతానికి 'ఆందోళన కరమైన వేరియంట్ల' (వేరియంట్ ఆఫ్ కన్సర్న్) జాబితాలో చేర్చలేదు.

బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వేరియంట్ల గురించి వర్ణించడానికి 'వేరియంట్ ఆఫ్ కన్సర్న్' అనేది ఉపయోగిస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లో జరిగిన కుంభమేళా కూడా ఈ ఏడాది మార్చి మొదట్లోనే జరిగిందనేది గమనించాల్సిన విషయం.

పుణ్యస్నానాలకు దేశవ్యాప్తంగా లక్షలాది భక్తులు తరలివచ్చారు. అక్కడ కోవిడ్ నిబంధనలు పెద్దగా పాటించినట్లు కనిపించలేదు.

ఏప్రిల్ 10 నుంచి 14 మధ్య కుంభమేళాలో 1600 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Reality Check branding

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)