పాకిస్తాన్: ఫ్రెండ్స్ సమక్షంలో పువ్వులతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన లాహోర్ యూనివర్సిటీ

ఫొటో సోర్స్, TWITTER
పాకిస్తాన్‌లోని లాహోర్ విశ్వవిద్యాలయం. అక్కడ ఒక అమ్మాయి చేతిలో పువ్వులు పట్టుకుని మోకాళ్లపై కూర్చుని తన స్నేహితుడికి ప్రపోజ్ చేసింది. ఆ అమ్మాయి ప్రేమను అంగీకరించిన ఆ అబ్బాయి.. ఆమెను కౌగిలించుకున్నాడు. చుట్టూ ఉన్న వారి స్నేహితులంతా నిల్చుని చప్పట్లు కొట్టారు.
ఆ ప్రేమ జంటను యూనివర్సిటీ తక్షణం బహిష్కరించింది. వాళ్లిద్దరూ విశ్వవిద్యాలయం నిబంధనలను ఉల్లంఘించారంటూ.. లాహోర్ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని క్యాంపస్‌లలోనూ వారి ప్రవేశాన్ని నిషేధిస్తూ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆ విద్యార్థులిద్దరినీ యూనివర్సిటీ డిసిప్లిన్ కమిటీ విచారణకు పిలిచిందని.. కానీ వారు హాజరు కాలేదని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ విషయంలో సదరు విద్యార్థులిద్దరితోనూ మాట్లాడడానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ, వారి నుంచీ ఇంతవరకు ఏ జవాబూ రాలేదు. అయితే, ఇద్దరూ కూడా ట్విట్టర్‌లో "మేమేం తప్పు చేయలేదు" అని ప్రకటించారు.

ఫొటో సోర్స్, TWITTER \ @HADIQAZJAVAID
సోషల్ మీడియాలో చర్చ
ఈ యువతీయువకుల ప్రేమ పకటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ట్విట్టర్‌లో దీనిపై చర్చ నడుస్తోంది. అనేకమంది నెటిజన్లు వీరికి మద్దతు పలుకుతున్నారు. స్వదేశం నుంచే కాక, ఇరుగు పొరుగు దేశాల నుంచీ కూడా వీరికి మద్దతు లభిస్తోంది.
"ఈ దేశంలోని విశ్వవిద్యాలయాలు.. లైంగిక హింస, ఇతర రకాల హింసలు, రహస్య కెమేరాలు (బ్లాక్‌మెయిల్ చేయడానికి) వీటిన్నింటినీ సహిస్తున్నాయి. కానీ గీత ఎక్కడ గీశాయి? ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరుచుకోవడం పైన" అని లాయరు జైనబ్ మజారీ హాజిర్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, TWITTER \ @IMAANZHAZIR
అయితే, వీరిని చాలామంది విమర్శిస్తున్నారు కూడా. విశ్వవిద్యాలయం మంచి పని చేసిందని ప్రశంసిస్తున్నారు.
పాకిస్తాన్‌లో ఇటీవల కాలంలో మగ టీచర్లు, ఇతర సిబ్బంది విద్యార్థినులపై అత్యాచారాలు జరిపిన పలు సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.
2017లో అబ్దుల్ వలీ ఖాన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని మషాల్ ఖాన్‌ను ఒక గుంపు హత్య చేసింది. ఆమె దైవ దూషణ చేశారన్న నెపంతో చంపేశారు.
ఇదే కాకుండా విశ్వవిద్యాలయాల్లో రాజకీయ, మతపరమైన హింసల గురించి అనేక వార్తలు వచ్చాయి.

ఫొటో సోర్స్, TWITTER \ @DENNISCRICKET_
ఉపఖండంలో ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్‌పై విశ్లేషణలు చేసే క్రికెట్ విశ్లేషకుడు డెన్నిస్ ఫ్రీడ్మాన్ తన పేరును డెన్నిస్ లాహోర్ యూనివర్సిటీగా మార్చుకున్నారు.
విశ్వవిద్యాలయాలు మ్యారేజ్ బ్యూరోలు కావు కాబట్టి ఈ సంస్థలను వాటి పని వాటిని చెయ్యనివ్వండి ఒక యూజర్ అభిప్రాయం వెలిబుచ్చారు.
దానిపై డెన్నిస్ స్పందిస్తూ.. "విశ్వవిద్యాలయాలు రెస్టారెంట్లు కావు, కాబట్టి అక్కడ ఆహారాన్ని అనుమతించకండి" అని జవాబిచ్చారు.

ఫొటో సోర్స్, TWITTER \ @AFZALKHANJAMALI
"పిల్లలపై అత్యాచారం చేయవచ్చు, హత్యలకు పాల్పడవచ్చు, దోపిడీలు చెయ్యొచ్చుగానీ ప్రేమ విషయానికి వచ్చేసరికి ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అంటున్నారు. బహిరంగంగా ప్రేమ, పెళ్లి గురించి వ్యక్తపరచడంలో తప్పేముంది?" అని అఫ్జల్ ఖాన్ జమాలి అనే యూజర్ ట్వీట్ చేశారు.
"ఇంత చిన్న విషయానికి వాళ్లను బహిష్కరించడం అన్యాయం. వీరికి ఎంతో జీవితం ముందుంది. విశ్వవిద్యాలయం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటుందని ఆశిస్తున్నాను" అంటూ ఎజాజ్ అలీ అనే యూజర్ ట్వీట్ చేశారు.
అయితే, కొందరు దీన్ని "విలువల పతనంగా"గా జమ కడుతున్నారు. "యువత వినాశనం వైపు అడుగులు వేస్తోంది. ఇలాంటి చర్యలు సమాజాన్ని నైతికంగా, మతపరంగా దిగజార్చుతాయి" అంటూ మోమినా అనే యూజర్ ట్వీట్ చేశారు.
ప్రేమను వ్యక్తపరచడంలో తప్పేం లేదుగానీ, అందుకు విశ్వవిద్యాలయం సరైన చోటు కాదు అని మరొక యూజర్ అన్నారు.
ఈ విషయంపై అప్పుడే మీమ్స్ కూడా వచ్చేశాయి. ట్విట్టర్‌లో పలువురు యూనివర్సిటీ తీరుపై వ్యంగ్యపూరిత మీమ్స్ షేర్ చేశారు.

ఫొటో సోర్స్, TWITTER \ @THEADILMEMON
ఇవి కూడా చదవండి:
- బురఖాపై ఇక శాశ్వత నిషేధం... 1,000 పైగా మదర్సాల పైనా నిషేధం: శ్రీలంక హోంమంత్రి
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- మార్చి 15, 16 తేదీల్లో ప్రభుత్వ బ్యాంకుల సమ్మె.. ఎందుకు, యూనియన్ల వాదన ఏంటి?
- మోదీకి జగన్ లేఖ: విశాఖ ఉక్కు కోసం అఖిలపక్షంతో వస్తాను.. అపాయింట్మెంట్ ఇవ్వండి
- ఇది సరికొత్త ప్రేమ ఫార్ములా
- ‘నేను లెస్బియన్‌ని అని చెబుతున్నా బలవంతంగా అబ్బాయితో పెళ్లి చేసేశారు’
- సంస్కృతం: భాష నేర్చుకోవడానికి భారత్ వచ్చి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన ఎయిర్ హోస్టెస్
- రివెంజ్ పోర్న్: నమ్మినవారే ఆన్లైన్లో అవమానాలకు గురిచేశారు, వేధింపులు భరించిన యువతుల కథ
- దిల్లీ అల్లర్లలో మరణించిన అంకిత్ శర్మ, రతన్‌లాల్ కుటుంబాలు ఇప్పుడెలా ఉన్నాయి
- ‘రెండు కాళ్లూ కట్టేసి గోళ్లు పీకేశారు.. మూడు రోజుల పాటు నిద్రపోనివ్వలేదు’
- భారత్ నుంచి వెళ్లే పెట్రోల్‌ను నేపాల్‌లో అంత చౌకగా ఎలా అమ్ముతున్నారు
- ఇంటి పనులు చేసిన భార్యకు రూ. 5.6 లక్షలు చెల్లించాలని భర్తను ఆదేశించిన కోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








