మోదీకి జగన్ లేఖ: విశాఖ ఉక్కు కోసం అఖిలపక్షంతో వస్తాను.. అపాయింట్‌మెంట్ ఇవ్వండి - Newsreel

జగన్

ఫొటో సోర్స్, ysrcongressparty

మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

విశాఖ ఉక్కులో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో స్పష్టం చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు.

అఖిల పక్షంతో కలిసి వస్తానని.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో తమకు ఉన్న ఆందోళనలను నేరుగా వచ్చి చెబుతామని, అపాయింట్‌మెంట్ ఇవ్వాలంటూ ఆ లేఖలో కోరారు.

తాజా లేఖలో ఆయన తాను గతంలో(ఈ ఏడాది ఫిబ్రవరి 6న) లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేస్తూ అందులో పేర్కొన్న అంశాలను మరోసారి ప్రస్తావించారు.

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్ఐఎన్ఎల్) ఎదుర్కొంటున్న సమస్యలను ఆ లేఖలో స్పష్టంగా తెలియజెప్పానని.. ఆ సంస్థ కోలుకునేలా చేయడానికి వివిధ పరిష్కార మార్గాలూ చూపుతూ 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయంపై పునరాలోచించాలని కోరానని జగన్ తన తాజా లేఖలో గుర్తు చేశారు.

మోదీకి జగన్ లేఖ

ఫొటో సోర్స్, ysrcongressparty

లేఖలో ఏముందంటే..

''ఆర్ఐఎన్ఎల్ పునరుద్ధరణ ఆవశ్యకత, ఆ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న సెంటిమెంటును మరోసారి మీ దృష్టికి తెస్తున్నాను.

సంస్థ ఆర్థికంగా కోలుకుని, తిరిగి సుస్థిరత సాధించేలా చేయడానికి వివిధ ప్రత్యామ్నాయాలున్నాయి. 2002-2015 మధ్య ప్లాంట్ మంచి పనితీరు కనబరిచి లాభాలు ఆర్జించింది.

సంస్థకు 19,700 ఎకరాల భూములున్నాయి.. వాటి విలువే లక్ష కోట్ల రూపాయలు ఉంటుంది.

సొంతంగా కేప్టివ్ మైన్స్ లేకపోవడమన్నది సంస్థ లాభాల సాధనకు ఆటంకంగా ఉంది.

పెట్టుబడుల ఉపసంహరణకు బదులు కేంద్రం నుంచి మద్దతు కనుక అందిస్తే సంస్థను మళ్లీ లాభాల బాట పట్టించొచ్చు.

సంస్థకు గనులను కేటాయించడం, ఇన్‌పుట్ వ్యయం తగ్గించే చర్యలు చేపట్టడం, అధిక వడ్డీ అప్పులను తక్కువ వడ్డీ అప్పులతో తీర్చేలా సహకరించడం, భూముల విక్రయంతో రుణాలను ఈక్విటీగా మార్చడం వంటి చర్యలతో వంటి మార్గాలను పరిశీలించొచ్చు.

ఇవన్నీ నేరుగా మీకు వివరించేందుకు కార్మిక సంఘాలు సహా అన్ని పార్టీల ప్రతినిధులతో వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం. వీలైనంత వేగంగా అపాయింట్‌మెంట్ ఇవ్వగలరు'' అని ముఖ్యమంత్రి జగన్ ఆ లేఖలో కోరారు.

రమేశ్

ఫొటో సోర్స్, FB/RAMESH JARKIHOLI

సెక్స్ టేప్‌ల కేసు: 'నాలుగు నెలల కిందటే ఆ సీడీల సంగతి నాకు తెలుసు.. అదంతా కుట్ర'

ఓ యువతితో తాను పడకపై ఉన్నట్లు విడుదల చేసిన దృశ్యాలు ఫేక్ అని కర్ణాటక మంత్రి రమేశ్ జార్కిహొళి చెప్పారు. అదంతా తనపై కుట్ర అని ఆయన అన్నారు.

నాలుగు నెలల కిందటే ఆ సీడీల విషయం తన దృష్టికి వచ్చిందని.. దాన్ని వారు మీడియాకు విడుదల చేయడానికి 24 గంటల ముందు కూడా తనకు తెలుసని రమేశ్ చెప్పారంటూ ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి ఇదంతా చేశారని.. ప్రస్తుతం తాను ఇంతకుమించి ఏమీ చెప్పబోనని ఆయన అన్నారు.

అయితే, వారిని జైలుకి పంపించేవరకు వదిలిపెట్టబోనని రమేశ్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

రాజకీయ నాయకులపై జరిగే ఇలాంటి కుట్రలు, బ్లాక్ మెయిళ్లను అరికట్టేలా చట్టం ఉండాలని రమేశ్ అభిప్రాయపడ్డారు.

తమకు సంబంధించిన వీడియోలు ఏవైనా ఉంటే వాటిని మీడియాలో రాకుండా చూడాలంటూ ఆరుగురు మంత్రులు కోర్టుకు వెళ్లడాన్ని తాను మద్దతిస్తున్నానని ఆయన అన్నారు.

హెచ్‌డీ కుమారస్వామిని, ఆయన కుటుంబాన్ని తానేమీ నిందించబోనని.. తనకు సంబంధించిందంటూ సీడీ విడుదలైన తరువాత హెచ్‌డీ రేవన్న, కుమారస్వామి ఇద్దరూ తనతో మాట్లాడారాని రమేశ్ చెప్పారు.

శిథిలాల్లో మృతదేహాల కోసం వెతుకుతున్న సహాయ సిబ్బంది

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, శిథిలాల్లో మృతదేహాల కోసం వెతుకుతున్న సహాయ సిబ్బంది

బాటా పేలుడు: ఈక్వటోరియల్ గినియాలో 98కి చేరిన మృతుల సంఖ్య

ఈక్వటోరియల్ గినియాలో చోటుచేసుకున్న వరుస పేలుళ్ల కారణంగా మరణించినవారి సంఖ్య 98కి పెరిగింది.

ఈ పేలుళ్లలో మరో 615 మంది గాయపడ్డారు. వారిలో 299 మంది ఇంకా ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు.

ఈక్వటోరియల్ గినియాలోని ప్రధాన నగరం బాటా ఉన్న సైనిక స్థావరంలో ఈ పేలుళ్లు జరిగాయి.

సరైన భద్రతాప్రమాణాలు పాటించకుండా డైనమైట్లను నిల్వ చేయడం, సమీపంలోని రైతులు పొలాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం వంటివి పేలుళ్లకు కారణమని అధికారులు చెబుతున్నారు.

ఆదివారం ఈ పేలుళ్లు జరగగా మొదట 31 మంది మరణించారని భావించారు.. కానీ, వలంటీర్లు సోమవారంతా ఘటనా స్థలంలో వెతకగా ఇప్పటికి 98 మృతదేహాలను గుర్తించారు.

ధ్వంసమైన వాహనాలు

ఫొటో సోర్స్, EPA

కాగా ప్రమాద స్థలంలో ముగ్గురు చిన్నారులు సజీవంగా దొరకగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

నగరంలోని అన్ని భవనాలు, ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని దేశాధ్యక్షుడు టియోడొరో ఒబియాంగ్ గ్వీమా చెప్పారు.

''ఎన్‌కొయంటోమాలోని మిలటరీ బేస్‌కి చెందిన డైనమైట్లు, పేలుడు పదార్థాల నిల్వ కేంద్రం భద్రత వ్యవహారాలు చూసే విభాగం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది'' అని అధ్యక్షుడు ఒబియాంగ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

సమీపంలోని రైతులు తమ పొలాల్లో పంట వ్యర్థాలను తగలబెడుతున్నప్పుడు ఈ డైనమైట్ల నిల్వ కేంద్రానికి మంటలు అంటుకున్నాయని ఆయన చెప్పారు.

అంతర్జాతీయ సహాయాన్ని ఆయన కోరారు.

టియోడొరో ఒబియాంగ్ గ్వీమా

ఫొటో సోర్స్, LUDOVIC MARIN/gettyimages

ఫొటో క్యాప్షన్, టియోడొరో ఒబియాంగ్ గ్వీమా

కాగా ఈ పేలుళ్ల తరువాత ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయని స్థానిక టీవీ చానళ్లు చెప్పాయి.

ఈక్వటోరియల్ గినియాలో టియోడొరో ఒబియాంగ్ గ్వీమా 1979 నుంచి అధికారంలో ఉన్నారు. ఈ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన సర్వ సాధారణమని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తుంటాయి.

చమురు, సహజవాయు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నప్పటికీ 15 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో 76 శాతం మంది ప్రజలు దుర్భర దారిద్ర్యంలో ఉన్నట్లు ఐరాస, ప్రపంచ బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)