బురఖాపై ఇక శాశ్వత నిషేధం... 1,000 పైగా మదర్సాల పైనా నిషేధం: శ్రీలంక హోంమంత్రి

బురఖా

ఫొటో సోర్స్, Getty Images

దేశ భద్రత రీత్యా.. బహిరంగ ప్రదేశాల్లో బురఖా సహా ముఖాన్ని కప్పివుంచే ఇతర ముసుగులు ఏవీ వాడరాదంటూ నిషేధం విధించే దిశగా శ్రీలంక చర్యలు చేపడుతోంది.

ఈ నిషేధం అమలులోకి తేవటానికి సంబంధించిన కేబినెట్ ఉత్తర్వు మీద తాను సంతకం చేశానని.. దీనికి పార్లమెంటు ఆమోదం లభించాల్సి ఉందని ప్రజా భద్రత మంత్రి శరత్ వీరశేకర బీబీసీకి చెప్పారు.

అతి త్వరలోనే ఈ నిషేధం అములులోకి వస్తుందని తాము భావిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.

బౌద్ధులు మెజారిటీ గల శ్రీలంకలో దాదాపు రెండేళ్ల కిందట ఈస్టర్ సండే రోజున పలు హోటళ్లు, చర్చిల మీద వరుస ఆత్మాహుతి దాడులు జరిగాయి. 2009 ఏప్రిల్ నెలలో క్యాథలిక్ చర్చిలు, టూరిస్టు హోటళ్లు లక్ష్యంగా ఆత్మాహుతి బాంబర్లు చేసిన దాడుల్లో 250 మందికి పైగా జనం చనిపోయారు.

ఈ దాడులకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మిలిటెంట్లను వేటాడిన అధికార వ్యవస్థలు.. బురఖా, ముసుగుల మీద అత్యవసరంగా తాత్కాలిక నిషేధం విధించాయి.

బురఖా

ఫొటో సోర్స్, Reuters

ఈ నిషేధాన్ని శాశ్వత ప్రాతిపదికగా మళ్లీ తీసుకురావటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ''బురఖా అనేది ఇటీవలి కాలంలో పెచ్చుమీరిన మతపరమైన తీవ్రవాదానికి చిహ్నంగా మారింది. అది దేశ భద్రత మీద ప్రభావం చూపుతోంది. వాటిపై శాశ్వత నిషేధం విధించాలి. అందుకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశాను. దీనిని అతి త్వరలోనే అమలు చేస్తాం'' అని వీరశేకర మీడియాతో పేర్కొన్నారు.

దేశంలో జాతీయ విద్యా విధానాన్ని ఉల్లంఘిస్తున్న 1,000కి పైగా మదరసా ఇస్లామిక్ స్కూళ్ల మీద కూడా నిషేధం విధించాలని ప్రభుత్వం యోచించినట్లు ఆయన తెలిపారు.

''ఎవరైనా ఒక స్కూలు తెరిచి పిల్లలకు ఏదంటే అది బోధించటానికి వీలు లేదు. ఆ స్కూలు, బోధన ప్రభుత్వం నిర్దేశించిన విధానాలకు అనుగుణంగా ఉండి తీరాలి'' అని స్పష్టంచేశారు.

రిజిస్టరు చేసుకోని స్కూళ్లలో చాలా వరకూ ''కేవలం అరబిక్ భాష, ఖురాన్ మాత్రమే బోధిస్తారు.. అది సరికాదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

బురఖా

ఇదిలావుంటే.. ''బురఖాల్లో ఉన్న వ్యక్తులను గుర్తించటంలో అధికారులకు సమస్యలు ఎదురవుతున్నట్లయితే.. వారిని గుర్తించటం కోసం ముఖం మీది ముసుగులను తొలగించటానికి ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండద'' అని ముస్లిం కౌన్సిల్ ఆఫ్ శ్రీలంక ఉపాధ్యక్షుడు హిల్మీ అహ్మద్ బీబీసీతో పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరికీ తమ మతంతో సంబంధం లేకుండా ముఖానికి ముసుగు ధరించే హక్కు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ''దీనిని హక్కుల దృక్కోణంలో చూడాల్సి ఉంది.. మతపరమైన దృక్కోణంతో కాదు'' అన్నారు.

మదరసాల అంశం గురించి ప్రస్తావించినపుడు.. ముస్లిం స్కూళ్లలో అత్యధిక స్కూళ్లు ప్రభుత్వం వద్ద రిజిస్టరు చేసుకున్నవేనని హిల్మీ అహ్మద్ చెప్పారు.

''నిబంధనలను పాటించని స్కూళ్లు ఒక ఐదు శాతం ఉంటాయేమో. వాటి మీద చర్యలు చేపట్టవచ్చు'' అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)