మజ్దూర్ అధికార్ సంఘటన్ అధ్యక్షుడు శివ్ కుమార్ శరీరమంతా గాయాలు.. వైద్య నివేదికలో వెల్లడి

ఫొటో సోర్స్, MaS
- రచయిత, అరవింద్ ఛాబ్డా
- హోదా, బీబీసీ ప్రతినిధి
గత నెలలో పోలీసులు అరెస్ట్ చేసిన మజ్దూర్ అధికార్ సంఘటన్ ప్రెసిడెంట్ శివ్ కుమార్ (24)కు తీవ్రమైన గాయాలయ్యాయని మెడికల్ రిపోర్ట్‌లో బయటపడింది.
ఆయన చేతులకు, కాళ్లకు ఫ్రాక్చర్లు.. గోళ్లు విరిగిపోవడంతో పాటూ పోస్ట్-ట్రామాటిక్ డిజార్డర్‌లాంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
"పంజాబ్, హరియాణా హైకోర్టుకు సమర్పించిన మెడికల్ రిపోర్ట్‌లో వీటన్నింటినీ ప్రస్తావించారని" శివ్ కుమార్ లాయర్ అర్షదీప్ చీమా తెలిపారు.
అయితే, అంతకుముందు హరియాణా పోలీసులు నివేదించిన రిపోర్ట్‌లో శివ్ కుమార్ శరీరంపై గాయాలేవీ లేవని రాశారు.
ఇప్పుడు ఆ రిపోర్ట్ కూడా చూపించమని కోర్టు కోరినట్లు లాయర్ అర్షదీప్ చెప్పారు.
ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు అప్పగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌ను హైకోర్టు విచారించింది.
భారత కార్మిక హక్కుల కార్యకర్త నోదీప్ కౌర్ (25) కేసుతో పాటూ ఈ కేసు కూడా విచారణకు వచ్చింది.
గత బుధవారం పంజాబ్, హరియాణా హైకోర్టు నోదీప్ కౌర్ బెయిల్ పిటిషన్‌ను విచారించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 26న జరగనుంది.

ఫొటో సోర్స్, MaS
శివ్ కుమార్ మెడికల్ రిపోర్ట్ ప్రకారం.. ఆయన "ఎడమ చేతికి, కుడి పాదానికి ఫ్రాక్చర్లు అయ్యాయి. కుడి పాదంలో వాపు కనిపిస్తోంది. కొంచం కుంటుతూ నడుస్తున్నారు. ఎడమ పాదం వాచి, తాకితే నొప్పెట్టేలా ఉంది. ఎడమ కాలి బొటన వేలు నల్లగా కమిలింది. కుడి చేతి బొటనవేలు, చూపుడు వేలి గోర్లు నల్లగా కమిలాయి. కుడి చేతి మణికట్టు తాకితే నొప్పెట్టేలా ఉంది. ఎడమ తొడపై నల్లగా కమిలిన భాగం కనిపిస్తోంది"
ఈ గాయాలు తగిలి రెండు వారాలకు పైనే అయ్యిందని, ఏదైనా ఆయుధం లేక వస్తువు వలన అయినవని రిపోర్ట్‌లో తెలిపారు.
శివ్ కుమార్‌ను అరెస్ట్ చేసిన నెల తరువాత కూడా ఈ గాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నది గమనించాల్సిన విషయమని లాయర్ అన్నారు.
ఆయనకు వైద్య పరీక్షలు జరపాలని హైకోర్టు ఛండీగఢ్ డాక్టర్లను ఆదేశించింది.
ఇంతకీ ఏమిటీ కేసు?
శివ్ కుమార్‌ను ఫిబ్రవరి 2న అరెస్ట్ చేసి జైలుకు తీసుకొచ్చారని సోనిపట్ (హరియాణా) జైలు అధికారులు కోర్టుకు తెలిపారు.
అల్లర్లు, నేరపూరిత బెదిరింపులు, ఇతర నేరాలకు పాల్పడినందుకుగానూ భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 148, 149, 323, 384, 506 కింద కుండ్లి పోలీస్ స్టేషన్‌లో డిసెంబర్ 28న ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యినట్లు తెలిపారు.
అల్లర్లు, హత్యాయత్నం, ఇతర నేరాలకు పాల్పడినట్లు జనవరి 12న మరొక ఎఫ్ఐఆర్ నమోదైంది. అదే రోజు కుండ్లి పోలీస్ స్టేషన్‌లో శివ్ కుమార్‌పై మూడో కేసు కూడా నమోదు చేశారు.

ఫొటో సోర్స్, facebook/mas
అసలేం జరిగింది?
జనవరి 12న సోనిపట్‌లో మజ్దూర్ యూనియన్ ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు, ప్రదర్శనకారుల మధ్య వాగ్వాదాలు జరిగాయని.. కానీ, ఆ సమయంలో తాను అక్కడ లేనని శివ్ కుమార్ డాక్టర్లకు చెప్పారు.
"కుండ్లి పోలీసులు వచ్చి కొందరిని అరెస్ట్ చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్ఓ) నా స్నేహితుడిపై దౌర్జన్యం చేశారు" అని శివ్ కుమార్ తెలిపారు.
జనవరి 16న కుండ్లి సమీపంలో రైతుల నిరసనల్లో పాల్గొంటున్న శివ్ కుమార్‌ను పోలీసులు తీసుకెళ్లి, ఆయనపై దౌర్జన్యం చేశారని.. రెండు కాళ్లూ కట్టేసి, నేల మీద పడుకోబెట్టి పాదాలపై కొట్టారని, గోళ్లు పీకేశారని, చేతులు కట్టేసి కర్రలతో కొట్టారని, మూడు రోజుల పాటూ శివ్ కుమార్ నిద్ర పోవడానికి అనుమతించలేదని ఆయన లాయర్లు, కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
శివ కుమార్ ఎదుర్కొన్న శారీరక, మానసిక హింసకు సంబంధించిన వివరాలన్నీ ఈ రిపోర్ట్‌లో విపులంగా రాశారు.
కుండ్లిలోని ఒక కర్మాగారంలోకి వెళ్లేందుకు శివ్ కుమార్ ప్రయత్నిస్తుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారని అధికారులు పేర్కొన్నారు.
కానీ, శివ్ కుమార్, నోదీప్ కౌర్‌లను దిల్లీ బోర్డర్లో రైతుల ఆందోళనల్లో పాల్గొన్నందుకే అరెస్ట్ చేశారని ఆయన తరఫు లాయర్లు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇవికూడాచదవండి:
- దిశా రవి ఎవరు? ఏమిటీ టూల్‌కిట్ కేసు?
- రైతుల నిరసనలు: ఉద్యమం నడిపేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- ప్రిన్సెస్ లతీఫా: దుబాయ్ పాలకుడి కుమార్తె 'నిర్బంధం' వ్యవహారంలో కొత్త మలుపు
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు
- సద్దాం హుస్సేన్ ఇరాన్‌పై ఎందుకు దాడి చేశారు
- భవిష్యత్ బాగుండాలంటే ప్రజాస్వామ్యాన్ని మార్చాల్సిందేనా?
- భవిష్యత్తులో అన్నీ రసాయన యుద్ధాలేనా?
- 'రసాయన దాడి': సిరియా, రష్యాలను హెచ్చరించిన ట్రంప్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








