దిల్లీ అల్లర్లకు ఏడాది: ఇప్పటి వరకు ఎంతమంది అరెస్టయ్యారు, ఎవరెవరి మీద ఛార్జిషీట్లు వేశారు? అందులో ఏముంది?

దిల్లీ అల్లర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గత ఏడాది ఫిబ్రవరి నాటి దిల్లీ అల్లర్లలో 53మంది మరణించారు
    • రచయిత, కీర్తి దూబే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ఈశాన్య దిల్లీలో అల్లర్ల కుట్ర కేసులో యూఏపీఏ చట్టం కింద కేసులు నమోదైన విద్యార్థి కార్యకర్తలు నటాషా నార్వాల్, దేవాంగన కలిత, ఆసిఫ్ ఇక్బాల్ తన్హాలకు దిల్లీ హైకోర్ట్ మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.

"రాజ్యాంగబద్ధంగా నిరసన వ్యక్తం చేసే హక్కు, ఉగ్రవాద కార్యకలాపాల మధ్య ఉన్న రేఖ విషయంలో ప్రభుత్వానికి కొంత అస్పష్టత ఉన్నట్లు అనిపిస్తోందని" కోర్టు వ్యాఖ్యానించింది.

జస్టిస్ సిద్దార్థ మృదుల్, జస్టిస్ అనూప్ జైరామ్ భంబనీ ధర్మాసనం నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.

ముగ్గురు నిందితుల్లో ఒక్కొక్కరికి రూ.50 వేల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని, ఇద్దరు పూచీకత్తుగా ఉండాలని కోర్టు ఆదేశించింది.

నిందితులు దేశం వీడి వెళ్లకూడదన్న కోర్టు, స్థానిక పోలీస్ స్టేషన్లలో వారి ఫోన్ నంబర్లు ఇవ్వాలని, సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించకూడదని సూచించింది.

అంతకు ముందు ఏం జరిగింది...

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీ ఈశాన్య ప్రాంతంలో మొదలైన నిరసనలు చివరకు అల్లర్లుగా రూపాంతరం చెందడంతో గత ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 26 మధ్య 53మంది చనిపోయారు.

జులై 13న దిల్లీ పోలీసులు హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, మృతుల్లో 40మంది ముస్లింలు, 13మంది హిందువులు ఉన్నారు.

అల్లర్లపై దిల్లీ పోలీసులు 751 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. అయితే ఆ పత్రాలలో ఏముందో చూపించడానికి పోలీసులు నిరాకరించారు.

ఇందులో ఎక్కువ సమాచారం సున్నితమైందని, అందుకే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయలేదని సీపీఎం నేత బృందా కరాత్‌ వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా పోలీసులు కోర్టుకు తెలిపారు.

దీంతో దిల్లీ అల్లర్లకు సంబంధించిన దర్యాప్తుపై సమాచారం సేకరించడం సవాలుగా మారింది. అయితే పోలీసులు కోర్టుకు సమర్పించిన పత్రాలు, కోర్టు ఆదేశాలను పరిశీలించడం ద్వారా దర్యాప్తు స్థితిగతులను తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.

దిల్లీ అల్లర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఎఫ్‌ఐఆర్‌-59: 'కుట్ర' కోణం

అల్లర్ల వెనక భారీ కుట్ర ఉందని దిల్లీ పోలీసులు తాము దాఖలు చేసిన 59వ నెంబర్‌ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. చట్ట విరుద్ధ కార్యక్రమాల నిరోధక చట్టం (UAPA)లోని మూడు సెక్షన్లను ఇందులో పేర్కొన్నారు.

అనుమానిత ఉగ్రవాదులకు బెయిల్ లేకుండా ఎక్కువకాలం జైలులో ఉంచడానికి ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు.

సీఏఏకు వ్యతిరేకంగా దిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో విద్యార్ధి సంఘాల నాయకుల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయి. 2020 మార్చి 26న నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో జేఎన్‌యూ విద్యార్ధి సంఘం మాజీ నేత ఒమర్‌ ఖాలిద్‌, పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియాకు చెందిన నేత మహ్మద్‌ డానిష్‌ పేర్లు ఉన్నాయి.

ఎఫ్‌ఐఆర్‌-59 ఆధారంగా ఇప్పటి వరకు 22 మందిని అరెస్టు చేశారు. అందులో సఫూరా జర్గార్‌, మహ్మద్ డానిష్, పర్వేజ్, ఇలియాస్‌లు బెయిల్‌పై విడుదలయ్యారు. మిగతా వారంతా ఇంకా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.

వీరిలో చాలామందిని దిల్లీ అల్లర్లకు సంబంధించి మొదట రూపొందించిన ప్రత్యేక ఎఫ్‌ఐఆర్‌ కింద అరెస్టు చేశారు. వీరు బెయిల్‌ పొందే అవకాశం ఉండటంతో తర్వాత వీరిని ఎఫ్‌ఐఆర్‌-59లో కూడా చేర్చారు.

ఒమర్‌ ఖాలిద్‌ను 2020 సెప్టెంబర్‌ 13న అరెస్టు చేశారు. ఆయనపై యూఏపీఏ లోని సెక్షన్ల కింద అభియోగాలు మోపడంతో ఆయన ఇంకా జ్యుడీషియల్‌ కస్టడీలోనే ఉన్నారు.

సెప్టెంబర్‌ 16న నమోదైన 17 పేజీల ఎఫ్‌ఐఆర్‌-59లో 15మంది పేర్లను పేర్కొన్నారు. మొదట ఒమర్‌ ఖాలిద్‌, షార్జిల్‌ ఇమామ్‌లపై అభియోగాలు మోపలేదు. కానీ నవంబర్‌ 22న వీరిద్దరి పాత్రపై 200 పేజీల అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేశారు. ఇందులో యూఏపీఏలోని మూడు సెక్షన్లతోపాటు మొత్తం 26 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు.

జామియా కోఆర్డినేషన్ కమిటీ (జేసీసీ), పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ), పింజ్రా తోడ్, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్‌కు సంబంధించిన ఉద్యమ నేతలు దిల్లీ అల్లర్లకు కుట్ర చేశారంటూ స్పెషల్‌ పోలీస్‌ సెల్ కేసులు నమోదు చేసింది.

ఈ కింది జాబితాలోని వ్యక్తులను వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా అరెస్టు చేశారు. తర్వాత వారిని ఎఫ్‌ఐఆర్‌-59లోకి చేర్చారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఒక్క ఒమర్‌ ఖాలిద్‌ మాత్రమే మొదటి నుంచి ఉన్న వ్యక్తి.

దిల్లీ అల్లర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఎవరెవరి మీద కేసులు?

  • ఖలీద్ సైఫీ - యునైడెట్ అగైనెస్ట్ హేట్‌
  • ఇష్రత్ జహాన్ - కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్
  • సఫూరా జర్గర్‌ -ఎంఫిల్ విద్యార్థిని, జామియా
  • మిరాన్ హైదర్- పీహెచ్‌డీ విద్యార్థి, జామియా
  • గల్ఫిషా ఫాతిమా - ఎంబీఏ విద్యార్థిని, ఘాజియాబాద్
  • షాదాబ్ అహ్మద్ - జామియా విద్యార్థి
  • షిఫా-ఉర్-రెహ్మాన్ - జామియా పూర్వ విద్యార్థి
  • నటాషా నార్వాల్ - జేఎన్‌యూ విద్యార్థిని, 'పింజ్రా తోడ్' సభ్యురాలు
  • దేవంగన కలిత - జేఎన్‌యూ విద్యార్థిని, 'పింజ్రా తోడ్' సభ్యురాలు
  • ఆసిఫ్ ఇక్బాల్ తన్హా - జామియా విద్యార్థి
  • ఒమర్ ఖాలిద్- జేఎన్‌యూ పూర్వ విద్యార్థి
  • షార్జిల్ ఇమామ్- జేఎన్‌యూ విద్యార్థి
  • తాహిర్ హుస్సేన్ - 'ఆప్' మాజీ కౌన్సిలర్
ఉమర్ ఖలీద్
ఫొటో క్యాప్షన్, దిల్లీ అల్లర్ల కుట్రలో ఒమర్‌ ఖాలిద్‌ ప్రధాన సూత్రధారిగా పోలీసులు అభియోగాలు మోపారు.

ఈ కేసుల్లో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను అధ్యయనం చేయడానికి ఈ ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన కోర్టు ప్రొసీడింగ్స్‌ను బీబీసీ పరిశీలించింది.

2020 మార్చి 6 నుంచి ఇప్పటి వరకు కేసులో ఏం జరిగింది, పోలీసుల వాదనేంటి, బెయిల్ అప్పీళ్లను కోర్టు ఎప్పుడు కొట్టేసింది, ఇద్దరి మీద నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో 14మందిని ఎలా అరెస్టు చేశారు అన్న విషయాలను పరిశీలించింది.

అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా దిల్లీలో అల్లర్లు సృష్టించేందుకు ఒమర్‌ ఖాలిద్‌ ప్రయత్నించారని, దీనికి పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా నేత మహ్మద్‌ డానిష్ ప్రజలను సమీకరించారని పోలీసులు ఆరోపించారు. 148 (మారణాయుధాల వాడకం), 149 (చట్ట విరుద్ధంగా ప్రజలను సమీకరించడం) 120-బి (నేరపూరిత కుట్ర) సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.

ఈ కేసులో మహ్మద్‌ డానిష్‌ సహా ముగ్గురు పీఎఫ్‌ఐ కార్యకర్తలు అరెస్టు కాగా, దేశం విడిచి వెళ్లబోమన్న హామీతో వీరికి 2020 మార్చి 13న మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు బెయిల్‌ ఇచ్చింది. క్రైమ్‌ బ్రాంచ్‌లో నమోదైన ఈ కేసు.. తర్వాత దిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌కు బదిలీ అయ్యింది.

కుట్ర, ఉగ్రవాద కార్యక్రమాలలాంటి కేసులను దిల్లీ పోలీస్‌ స్పెషల్ సెల్ దర్యాప్తు చేస్తుంది. దిల్లీలో పోలీసులు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేస్తారు.

సాధారణంగా ఏ ఎఫ్‌ఐఆర్‌లోనైనా 90 రోజుల వ్యవధిలో ఛార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కాని ఎఫ్‌ఐఆర్‌-59 దాఖలు చేయడానికి ఆరు నెలల సమయం పట్టింది. న్యాయమూర్తి ఆగస్టు 14 వరకు సమయం ఇవ్వగా, కోర్టు అనుమతితో సెప్టెంబర్‌ 17న స్పెషల్ సెల్‌ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

ఖలీద్ సైఫీ
ఫొటో క్యాప్షన్, ఖలీద్ సైఫీ

ఎఫ్‌ఐఆర్‌-59లో బెయిల్ పొందిన వారెవరు?

ఖలీద్ సైఫీ

ఈశాన్య దిల్లీకి చెందిన వ్యాపారవేత్త. యునైటెడ్ అగైనెస్ట్ హేట్ సభ్యులలో ఒకరు. 2017లో, ఈ సంస్థ మూకదాడులకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించింది. సైఫీ ఈ సంస్థ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.

ఫిబ్రవరి 26న ఎఫ్ఐఆర్-44 ప్రకారం సైఫీని అరెస్టు చేశారు. చట్టవిరుద్దంగా ప్రజలను సమీకరించడం, పోలీసులపై రాళ్లు రువ్వడం, పోలీసుల విధులకు అడ్డు తగలడంలాంటి చర్యలకు పాల్పడ్డారని ఎఫ్ఐఆర్ 44 పేర్కొంది.

ఇందులో ఐపీసీ సెక్షన్ 307 (హత్య చేయాలన్న ఉద్దేశంతో దాడి), అక్రమ ఆయుధాలు అనే సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.

మార్చి10న కర్‌కార్‌డుమా కోర్టు ఆవరణలో కనిపించిన సైఫీ కాళ్లకు దెబ్బలతో వీల్ చైర్లో ఉన్నారు. ఫిబ్రవరి 26న పోలీసులు అరెస్టు చేసి తీసుకెళుతున్నప్పుడు సైఫీ బాగానే నడుస్తూ వెళ్లారు. ఎఫ్ఐఆర్-44లో మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు.

మార్చి 21న ఈ కేసులో ఖలీద్ సైఫీ మినహా నిందితులందరికీ కర్‌కార్‌డుమా కోర్టు బెయిల్ ఇచ్చింది. అదే రోజు సైఫీ పేరును ఎఫ్‌ఐఆర్‌-59లో చేర్చారు.

ఇష్రత్ జహాన్
ఫొటో క్యాప్షన్, ఇష్రత్ జహాన్

ఇష్రత్ జహాన్

వృత్తిపరంగా న్యాయవాది, మాజీ కాంగ్రెస్ కౌన్సిలర్ అయిన ఇష్రత్ జహాన్... ఖలీద్ సైఫీతోపాటు 26 ఫిబ్రవరి 2020న అరెస్టయ్యారు. మార్చి 21 కర్‌కార్‌డుమా కోర్టు బెయిల్ ఇవ్వగా ఎఫ్‌ఐఆర్‌-59లో ఆమె పేరు కూడా చేర్చడంతో విడుదలకు ముందే అరెస్ట్ చేసి తిహార్ జైలుకు తరలించారు.

2020 మే 30న ఇష్రత్‌ జహాన్‌కు సెషన్స్ కోర్టు 10 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. వివాహం కోసం బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా జూన్ 10 నుంచి 19 వరకు బెయిల్ ఇచ్చారు. ప్రస్తుతం ఇష్రత్‌ తిహార్‌ జైలులో ఉన్నారు.

సఫూరా జర్గర్‌
ఫొటో క్యాప్షన్, సఫూరా జర్గర్‌

సఫూరా జర్గర్‌

27 ఏళ్ల సఫురా జర్గర్‌ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ విద్యార్థిని. ఆమె జామియా కోఆర్డినేషన్ కమిటీ (జేసీసీ) మీడియా కోఆర్డినేటర్ కూడా.

గర్భవతి కావడంతో సఫురా అరెస్టు గురించి ఎక్కువగా చర్చ జరిగింది. 2020 ఫిబ్రవరి 24న జఫరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్-48 నమోదు కాగా, ఏప్రిల్ 10న విచారణకు పిలిచి అరెస్టు చేశారు. ఏప్రిల్ 13న బెయిల్ రాగా, ఎఫ్‌ఐఆర్‌-59 కింద మళ్లీ అరెస్టు చేశారు.

మూడుసార్లు బెయిల్ పిటిషన్‌ తిరస్కరణకు గురికాగా, గర్భవతి కావడంతో మానవతా దృక్పథంతో జూన్ 23న బెయిల్ లభించింది. అయితే తిహార్ జైలులో గత 10 సంవత్సరాలలో 39మంది పిల్లలు జన్మించారని పోలీసులు కోర్టులో వాదించారు. కాగా బెయిల్ మంజూరు చేస్తే తమకు అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ చెప్పడంతో కోర్టు బెయిల్ ఇచ్చింది.

మిరాన్ హైదర్
ఫొటో క్యాప్షన్, మిరాన్ హైదర్

మిరాన్ హైదర్

జామియాలో పీహెచ్‌డీ విద్యార్థి అయిన హైదర్ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) దిల్లీ విద్యార్ధి విభాగానికి నాయకుడు. జామియా గేట్ నంబర్ 7 వద్ద జరిగిన సీఏఏ నిరసనల్లో మిరాన్ పాల్గొన్నారు.

2020 ఏప్రిల్1న మిరాన్‌ను అరెస్టు చేశారు. నాన్-బెయిలబుల్ సెక్షన్లు విధించారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

గల్ఫిషా ఫాతిమా
ఫొటో క్యాప్షన్, గల్ఫిషా ఫాతిమా

గల్ఫిషా ఫాతిమా

28 ఏళ్ల గల్ఫిషా ఫాతిమాను ఏప్రిల్ 9న ఎఫ్ఐఆర్-48 కింద అరెస్టు చేశారు. 12 మే 2020న ఈ కేసులో ఆమె సెషన్స్ కోర్టు నుండి బెయిల్ పొందారు. అయితే తిహార్ జైలులో ఉన్న సమయంలోనే ఎఫ్‌ఐఆర్‌-59 కింద అరెస్టు చేశారు.

యూఏపీఏ చట్టంలోని నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఆమె ఇప్పటికీ తిహార్‌ జైలులోనే ఉన్నారు.

ఆసిఫ్ ఇక్బాల్ తన్హా
ఫొటో క్యాప్షన్, ఆసిఫ్ ఇక్బాల్ తన్హా

ఆసిఫ్ ఇక్బాల్ తన్హా

ఆసిఫ్ ఇక్బాల్ తన్హా పర్షియన్ భాషా విద్యార్థి. జామియా నగర్ పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 16, 2019న నమోదైన ఎఫ్ఐఆర్-298 కింద మే 17న అరెస్టు చేశారు. ఈ కేసు డిసెంబర్ 15, 2019న జామియా విశ్వవిద్యాలయ ప్రాంతంలో సీఏఏకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణకు సంబంధించినది.

మే 20న ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌-59లో చేర్చారు. ఎఫ్ఐఆర్-298 కింద బెయిల్ మంజూరైనా, ఎఫ్‌ఐఆర్‌-59 లోని అభియోగాల కింద ఆయన ఇంకా జైలులోనే ఉన్నారు.

నటాషా నార్వాల్
ఫొటో క్యాప్షన్, నటాషా నార్వాల్

నటాషా నార్వాల్

మే 23న దేవంగన కలిత, నటాషాలను ఎఫ్‌ఐఆర్-48 కింద అరెస్టు చేశారు. జఫరాబాద్ మెట్రో స్టేషన్‌లో హింసకు ఒక రోజు ముందు వీరిద్దరు సీఏఏ వ్యతిరేక ప్రదర్శనను నిర్వహించినట్లు ఆరోపణలు వచ్చాయి.

మే 24న మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నటాషాకు బెయిల్ మంజూరు చేశారు. అయితే పోలీసులు అదే రోజు ఎఫ్ఐఆర్-50 కింద వీరిద్దరినీ అరెస్టు చేశారు. దిల్లీ అల్లర్లకు కుట్రపన్నారన్నది వీరిపై ఆరోపణ. ఆ తర్వాత మే 29న నటాషా నార్వాల్‌ను ఎఫ్‌ఐఆర్‌-59లో చేరుస్తూ అరెస్టు చేశారు.

దేవంగన కలిత
ఫొటో క్యాప్షన్, దేవంగన కలిత

దేవంగన కలిత

దరియాగంజ్‌లో సీఏఏ వ్యతిరేక నిరసనలకు సంబంధించిన హింస కేసులో దేవంగనను మే 30న అరెస్టు చేశారు. ఈ సంఘటన 2019 డిసెంబర్ 20న జరిగింది. ఇందులో అల్లర్లకు పాల్పడటం, ప్రభుత్వ అధికారుల విధులకు అడ్డు తగిలారన్న ఆరోపణలు చేశారు.

జూన్ 2న ఈ కేసులో ఆమెకు బెయిల్ వచ్చింది. ఇది జరిగిన మూడు రోజుల తరువాత, అంటే జూన్ 5న, స్పెషల్ సెల్ ఆమె పేరును ఎఫ్‌ఐఆర్‌-59లో చేర్చి అరెస్ట్ చేసింది.

ఇలా నిందితులందరిని ప్రాథమికంగా వేరువేరు కేసుల్లో అరెస్టు చేశారు. తర్వాత వారందరినీ ఎఫ్‌ఐఆర్‌-59లో చేర్చారు. దీంతో వీరంతా నెలల తరబడి జైలులో ఉంటున్నారు.

వాట్సాప్‌ చాట్, ఫేస్‌బుక్ పోస్టులే ఛార్జిషీట్‌లో ఆధారాలు

సాధారణంగా దర్యాప్తు అధికారి 90రోజులలో ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే నిందితుడికి ఆటోమేటిక్‌గా బెయిల్ లభిస్తుంది. UAPA చట్టంలో ఉన్న ప్రత్యేక వెసులుబాటుతో 180 రోజుల వరకు ఛార్జిషీటుకు దర్యాప్తు అధికారులు సమయం కోరవచ్చు.

ఈ కేసుల్లో మొదటి ఛార్జిషీట్ సెప్టెంబర్ 17, 2020న, రెండో అనుబంధ ఛార్జిషీటును నవంబర్ 2020లో దాఖలు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కుట్ర 2019 డిసెంబర్ 4న మొదలైంది. అదే రోజున 'ముస్లిం స్టూడెంట్ ఆఫ్ జేఎన్‌యూ' (ఎంఎస్‌జే) ప్రారంభమైంది.

ఎంఎస్‌జే గ్రూప్ ద్వారా షార్జీల్ ఇమామ్... స్టూడెంట్స్ ఆఫ్ జామియా గ్రూపులో చేరినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ రెండు గ్రూపులు సీఏఏకు వ్యతిరేకంగా ఒక కరపత్రాన్ని పంపిణీ చేశాయి. దీనినే కుట్రకు రుజువుగా పోలీసులు చూపిస్తున్నారు.

ఛార్జిషీట్‌లో ఒమర్ ఖాలీద్‌ను షార్జిల్ ఇమామ్‌కు గురువుగా అభివర్ణించారు. ఆయన షార్జీల్ ఇమామ్‌ను యోగేంద్ర యాదవ్‌కు పరిచయం చేశారని పోలీసులు చెబుతున్నారు.

డిసెంబర్ 8న జంగ్‌పురాలో షార్జిల్ ఇమామ్, యోగేంద్ర యాదవ్, ఒమర్‌ ఖాలీద్, నదీమ్‌ ఖాన్, పర్వేజ్ ఆలం తదితరులు ఒక సమావేశం నిర్వహించి, 'చక్కాజామ్' కుట్రను అమలు చేయడానికి నిర్ణయించారు.

యునైటెడ్ అగైనెస్ట్ హేట్, స్వరాజ్ అభియాన్ సహా విద్యార్థులను, పౌర సంఘాల కార్యకర్తలను సమీకరించే పని షార్జీల్‌కు అప్పజెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన మొదటి నిరసనను కుట్ర మొదటి దశగా పోలీసులు అభివర్ణించారు.

ఛార్జిషీట్లో వాట్సాప్ చాట్స్, ఫేస్బుక్ పోస్టుల స్క్రీన్ షాట్లను పదేపదే ప్రస్తావించారు పోలీసులు. దిల్లీ ప్రొటెస్ట్ సాలిడారిటీ గ్రూప్‌ (DPSG) అనే వాట్సాప్ గ్రూప్‌ను పోలీసులు పలుమార్లు పేర్కొన్నారు.

జామియా కోఆర్డినేషన్ కమిటీ, ముస్లిం స్టూడెంట్ ఆఫ్ జేఎన్‌యూ, స్టూడెంట్ ఆఫ్ జామియా, యునైటెడ్ అగైనెస్ట్ హేట్, దిల్లీ ప్రొటెస్ట్‌ సాలిడారిటీ గ్రూప్‌లు ఒక జట్టుగా ఏర్పడి అల్లర్ల కుట్రకు పాల్పడ్డాయని పోలీసులు చెప్పారు.

ఈ అల్లర్ల కుట్రకు జేఎన్‌యూ విద్యార్ధి సంఘం మాజీ నేత ఒమర్‌ ఖాలిద్‌ నాయకత్వం వహించారని, ఆయనతో సంబంధం ఉన్న అనేక గ్రూపులు ఈ అల్లర్లో పాల్గొన్నాయని పోలీసులు తెలిపారు.

ఫిబ్రవరి 24-25 తేదీలలో డోనల్డ్‌ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఒమర్ ఖాలిద్ రెచ్చగొట్టే ప్రసంగం చేసి ప్రజలను అల్లర్ల దిశగా నడిపించారని, భారతదేశంలో మైనారిటీలు హింసకు గురవుతున్నారన్న సందేశం వచ్చేలా ఆందోళనలు సృష్టించారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఆందోళన కోసం పెట్రోలు బాంబులు, యాసిడ్‌ బాటిళ్లను కూడా సిద్దం చేసుకున్నట్లు దిల్లీ పోలీసులు పేర్కొన్నారు.

జాకిర్‌ నాయక్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జాకిర్‌ నాయక్‌

జాకిర్‌ నాయక్‌ పాత్ర

దిల్లీ అల్లర్ల వెనక ఇస్లామిక్‌ మత బోధకుడు జాకిర్‌ నాయక్‌ కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తన ప్రసంగాల ద్వారా ఆయన ప్రజలను రెచ్చగొట్టారని, ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించారని చెప్పారు.

ప్రస్తుతం ఆయన మలేషియాలో ఉండగా, ఆయన అప్పగింతకు భారతదేశం చేసిన విజ్జప్తిని ఆ దేశ ప్రభుత్వం తిరస్కరించింది. "ఈ అల్లర్లకు ఖలీద్ సైఫీ.. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా నుంచి నిధులు సేకరించారు. ఆయన పాస్‌పోర్ట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా, నిధుల కోసం సైఫీ దేశం దాటి జాకిర్‌ నాయక్‌ను కూడా కలిశారు’’ అని దిల్లీ పోలీసులు తెలిపారు.

ఫిబ్రవరి 17న మహారాష్ట్రలోని అమ్రావతిలో ఒమర్‌ ఖాలిద్‌ చేసిన ప్రసంగాన్ని కూడా పోలీసులు ఈ కుట్రకు సాక్ష్యంగా పేర్కొన్నారు.

ఒమర్‌ ఖాలిద్ ఆరోజు తన ప్రసంగంలో... "అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశానికి వచ్చినప్పుడు మనం వీధుల్లోకి రావాలి. భారతదేశాన్ని విభిజిస్తున్నారని మనం ఆయనకు చెబుదాం. ఆ రోజు వీధుల్లోకి వచ్చి భారత ప్రజలు భారత పాలకులపై పోరాడుతున్నారని తెలియజేద్దాం” అంటూ ప్రసంగించారు. ఒమర్‌ ఖాలీద్‌ పేరు ప్రస్తావించకుండా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అదే రోజు లోక్‌సభలో చేసిన ప్రసంగాన్ని పోలీసులు దీనికి జత చేశారు.

మసీదుపై దాడి

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీ పోలీసులు చెప్పిన కేసు పాత క్రోనాలజీ

ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేస్తున్న అంకిత్ శర్మ హత్య కేసుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌-65ను సమర్పించారు. కానీ, అంకిత్ శర్మ హత్య కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి ముందే పోలీసులు అల్లర్ల కాలక్రమాన్ని వెల్లడించారు.

ఛార్జిషీట్ ప్రారంభంలోని ఐదు పేజీలు హత్య దర్యాప్తు వివరాలను ఇవ్వలేదు. కానీ, 2019 డిసెంబర్ నుంచి జరుగుతున్న సీఏఏ వ్యతిరేక నిరసనలు, సామాజిక కార్యకర్త హర్ష్ మందర్ ప్రసంగాలు, దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ చేసిన ప్రసంగాలను పేర్కొన్నారు.

"డిసెంబర్ 13న జరిగిన నిరసనకు పునాది పడింది. 2000 మంది ప్రజలు అనుమతి లేకుండా జామియా మెట్రో స్టేషన్ సమీపంలో గుమిగూడి పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లారు. పోలీసులపై రాళ్ళు విసిరి, ప్రజల ఆస్తులను ధ్వంసం చేశారు" అని పేర్కొన్నారు.

2019 డిసెంబర్ 15న దిల్లీ పోలీసులు, జామియా విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణను పోలీసులు తమ క్రోనాలజీలో వివరించారు.

పోలీసులు చెప్పిన దాని ప్రకా,రం సాయంత్రం 5.30 నుంచి 6 గంటల మధ్య, జామియాకు చెందిన కొందరు పూర్వ విద్యార్ధులు, స్థానికులు జామియా, న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని వివిధ మార్గాల్లో ప్రదర్శనల సందర్భంగా బస్సులకు నిప్పంటించారు.

పోలీసులు నిరసనకారులను వెంబడించినప్పుడు వారు ఒక ప్రణాళిక ప్రకారం, జామియా క్యాంపస్‌లోకి ప్రవేశించి అక్కడి నుంచి పోలీసులపై రాళ్ళురువ్వారు, ట్యూబ్ లైట్లతో దాడి చేశారు"

డిసెంబర్ 15న జామియాలోని జాకీర్ హుస్సేన్ లైబ్రరీలో విద్యార్థులపై జరిగిన బలప్రయోగం గురించి పోలీసులు ప్రస్తావించలేదు. కొన్ని నెలల తరువాత ఈ పోలీసు చర్యకు సంబంధించిన వీడియో బైటికొచ్చింది. పోలీసులు, లైబ్రరీలో చదువుతున్న విద్యార్థులు కొట్టుకోవడం ఇందులో ఉంది.

మాజీ ఐఎఎస్ అధికారి, సామాజిక కార్యకర్త హర్ష్‌ మందర్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని నిరసనకారులు వీధుల్లోకి వచ్చి పోరాడాలని పురికొల్పారని పోలీసులు ఆరోపించారు. హర్ష్ మందర్‌పై ఆరోపణలకు ఆధారంగా డిసెంబర్ 16నాటి ఆయన ప్రసంగాన్ని చూపించారు.

సీఏఏ-ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా షాహీన్ బాగ్‌లో జరిగిన 101 రోజుల ఆందోళనను కూడా పోలీసులు అల్లర్ల కుట్రలో భాగంగా పేర్కొన్నారు.

కపిల్ మిశ్రా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కపిల్ మిశ్రా

కపిల్ మిశ్రా ఎపిసోడ్

ఫిబ్రవరి 22న జఫరాబాద్ మెట్రో సమీపంలో గుమిగూడిన వేలాదిమంది ఆందోళన పోలీసుల 'క్రోనాలజీ'లో వస్తుంది. "66 ఫుటారోడ్‌లో దళిత నేత చంద్రశేఖర్ ఆజాద్ భారత్ బంద్‌కు పిలుపునిచ్చారని, ఈ సభ సందర్భంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీని తరువాత, ఫిబ్రవరి 23 సాయంత్రం జఫరాబాద్-మౌజ్‌పూర్‌ సరిహద్దులో హింస పోలీసు నివేదికలో కనిపిస్తుంది.

అదే రోజు సీఏఏకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నవారికి వ్యతిరేకంగా పోలీసుల సమక్షంలో మాట్లాడిన బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా కామెంట్లను పోలీసులు అందులో పేర్కొనలేదు. “ట్రంప్‌ వెళ్లేలోగా జఫరాబాద్‌, చాంద్‌బాగ్‌లను ఖాళీ చేయకపోతే మేం వీధుల్లోకి రావలసి ఉంటుంది." అని కపిల్‌ మిశ్రా ఆ రోజు ఆందోళనకారులను హెచ్చరించారు.

అదే రోజు సాయంత్రం సీఏఏ వ్యతిరేకులకు, మద్దతుదారులకు మధ్య హింస చెలరేగింది. కానీ పోలీసులు తమ క్రోనాలజీలో కపిల్ మిశ్రా ప్రకటనను పేర్కొనలేదు.

దీనిపై దాఖలైన పిటిషన్‌కు సమాధానంగా ఆయన ప్రసంగానికి సంబంధించి సరైన ఆధారాలు దొరకలేదని కోర్టుకు వెల్లడించారు పోలీసులు.

కపిల్ మిశ్రా ప్రసంగం పోలీసు రికార్డులలో ఎక్కడా నమోదు కాలేదు. కానీ సెప్టెంబర్‌లో ఎఫ్‌ఐఆర్‌-59 కపిల్ మిశ్రా పేరు ప్రస్తావనకు వచ్చింది. ఛార్జిషీట్ ఆధారంగా 2020 జూలై 28న కపిల్ మిశ్రాను ప్రశ్నించగా, తాను అసలు అలా ప్రసంగం చేయలేదని ఆయన చెప్పారు.

ట్రంప్ భారత పర్యటన

ఫొటో సోర్స్, Getty Images

ట్రంప్ భారత పర్యటన

జూన్‌లో పోలీసులు 'క్రోనాలజీ' ప్రకారం "అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా ఈ అల్లర్లు జరిగాయి. ఇది యాదృచ్చికం కాదు, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను నాశనం చేసే ఆలోచన'' అని పోలీసులు పేర్కొన్నారు.

కానీ సెప్టెంబరులో దాఖలైన స్పెషల్ సెల్ ఛార్జిషీట్ ప్రకారం, అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పర్యటనకు ముందు అంటే జనవరి 8, 2020న అల్లర్లను కుట్రకు నిందితులు సమావేశమయ్యారు.

ట్రంప్ పర్యటనపై మీడియాలో అప్పటి వరకు ఎటువంటి వార్తలు లేవు. కానీ దిల్లీ పోలీలసులు మాత్రం ''అల్లర్లు జరపాలని జనవరి 8న ఒమర్ ఖలీద్-తాహిర్ హుస్సేన్-ఖలీద్ సైఫీ నిర్ణయించారు. ట్రంప్ భారత పర్యటన సందర్భంగా బిగ్ బ్యాంగ్ జరుగుతుందని అన్నారు"అని పేర్కొన్నారు.

ట్రంప్ పర్యటన గురించి మొదటి వార్త జనవరి 14న వచ్చింది. పోలీసులు మాత్రం కుట్రదారులకు ఈ పర్యటన గురించి జనవరి 8నే తెలుసని చెబుతున్నారు. ఫిబ్రవరి 11న అమెరికా ప్రభుత్వం ఈ పర్యటన గురించి మొదటి అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

ట్రంప్ భారత పర్యటన

ఫొటో సోర్స్, Getty Images

న్యాయవాదిబింద్రా 'కుట్ర'

హెడ్ ​​కానిస్టేబుల్ రతన్‌ లాల్ హత్య కేసులో దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ -60 ప్రకారం 17 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసు ఛార్జిషీటులో షాహీన్ బాగ్, చాంద్‌బాగ్‌లోని సీఏఏ వ్యతిరేక నిరసనకారుల తరఫు వాడైన న్యాయవాది డిఎస్ బింద్రాను అల్లర్లకు ప్రధాన కుట్రదారుగా పోలీసులు అభివర్ణించారు.

సామాజిక కార్యకర్త, స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్, దిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడు కన్వాల్‌ప్రీత్ కౌర్, జామియా కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు సఫురా జర్గర్, పింజ్రాతోడ్ సభ్యురాలు దేవంగన కలిత, నటాషా నార్వాల్, జామియా విద్యార్థి మీరాన్ హైదర్ పేర్లు కూడా చార్జిషీట్‌లో ఉన్నాయి. అయితే వీరిని ఇంకా నిందితులుగా పేర్కొనలేదు. పేర్లు మాత్రమే ప్రస్తావించారు.

42 ఏళ్ల రతన్‌లాల్‌ను హింస చెలరేగిన చాంద్‌బాగ్‌ ప్రాంతంలో పోస్ట్ చేశారు. నిరసనకారులు ఆయనపై దాడి చేశారు. తీవ్రగాయాలతో ఆసుపత్రికి తీసుకురాగా ఆయన మరణించారు. దిల్లీ అల్లర్లలో మరణించిన మొదటి వ్యక్తులలో కానిస్టేబుల్‌ రతన్‌లాల్ ఒకరు.

సికార్‌లో నివసిస్తున్న రతన్‌లాల్ తల్లికి దీని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, Dheeraj Bari

ఫొటో క్యాప్షన్, సికార్‌లో నివసిస్తున్న రతన్‌లాల్ తల్లికి దీని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

రతన్‌లాల్‌ను ఎవరు చంపారు?

రతన్‌లాల్ హత్య కేసులో పోలీసులు అరెస్టు చేసిన 17మందిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులుగా పేర్కొన్నారు. వారి చేతుల్లో కర్రలు, రాడ్లు, రాళ్ళు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

హెడ్ ​​కానిస్టేబుల్ రతన్‌లాల్ పోస్టుమార్టం నివేదికలో అతని శరీరంలో 21గాయాలు ఉన్నాయి. అధిక రక్తస్రావం అయింది. ఊపిరితిత్తులలో తుపాకీ గుండు కారణంగా ఆయన చనిపోయారు. కానీ పోలీసుల సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం నిందితుల చేతిలో రైఫిల్, రివాల్వర్‌లాంటి ఆయుధాలు లేవు. అలాగే ఈ 17మందిలో కానిస్టేబుల్ రతన్‌లాల్‌ను ఎవరు చంపారో పోలీసులు ఎక్కడా చెప్పలేదు.

అంకిత్ శర్మ హత్యకు గురయ్యారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అంకిత్ శర్మ హత్యకు గురయ్యారు

అంకిత్ శర్మ హత్య

అంకిత్‌శర్మ తండ్రి రవీందర్ కుమార్‌తోపాటు, ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నదాని ప్రకారం ఫిబ్రవరి 25 సాయంత్రం 5 గంటలకు అంకిత్‌ శర్మ ఇంట్లో సరుకుల కోసం బైటికి వెళ్లారు. ఆయన చాలాసేపు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు.

ఇంటి దగ్గరలో ఉండే 'కలూ' అనే వ్యక్తితో కలిసి ఆయన బయటకు వెళ్లినట్లు తెలిసింది. అంకిత్ కుటుంబం ఆయనను అడగ్గా ఆయన కూడా అంకిత్‌ కోసం వెతికారు.

చివరకు చాంద్‌బాగ్‌లోని మసీదులో ఒక యువకుడిని చంపి కాలువలో పడవేసినట్లు ‘కలూ’కు తెలిసింది. ఈ విషయం తెలిసి అంకిత్‌ తండ్రి రవీందర్ కుమార్ దయాళ్‌పూర్‌ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా ఈతగాళ్ల సాయంతో శవాన్ని బయటకు తీశారు.ఆ మృతదేహం అంకిత్‌దే.

“ఇరువర్గాలు గొడవ పడేందుకు కర్రలు, రాడ్లు పట్టుకుని సిద్దంగా ఉన్నారు. అంకిత్ వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. కానీ తాహిర్‌ హుసేన్‌ రెచ్చగొట్టడంతో కొందరు అంకిత్‌ను లాక్కెళ్లారు. తర్వాత కత్తులతో పొడిచి చంపి కాలువలో పడేశారు.” అని పోలీసులు పేర్కొన్నారు.

తాహిర్ హుస్సేన్, అంకిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తాహిర్ హుస్సేన్, అంకిత్ శర్మ

ఏడుగురు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సమర్పించారు. అంకిత్ ఇంటి సమీపంలో నివసిస్తున్న 'కలూ'అనే వ్యక్తి వాంగ్మూలం కూడా ఇందులో ఉంది.

అయితే చాంద్‌బాగ్‌ మసీదులో ఎవరినో చంపారని తనకు కొందరు వ్యక్తులు చెప్పారంటూ అంకిత్ తండ్రి రవీందర్ కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ మసీదులో అంకిత్ హత్యకు గురయ్యాడని ఆయన తండ్రి చేసిన వాదనను దర్యాప్తు చేశారా అన్నది పోలీసు తమ ఛార్జిషీటులో చెప్పలేదు.

ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని, హింస సమయంలో అవి విరిగిపోయాయని పోలీసులు పేర్కొన్నారు.

ఈ కేసులో మార్చి12, 2020న హసీన్ అనే 20 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ఒకరిని చంపి కాలువలోకి పడేసినట్లు ఫోన్‌ సంభాషణల్లో అతను ఒప్పుకున్నాడు.

మరోవైపు ఈ సంఘటనల్లో నిరసనకారులను రెచ్చగొట్టిన వ్యక్తి తాహిర్‌ హుసేన్‌ అబద్ధాలు ఆడుతున్నారని, ఆందోళనకారులను రెచ్చగొట్టి, తనకేమీ తెలియనట్లుగా పోలీసులకు ఫోన్‌ చేసి ఇక్కడ అల్లర్లు జరుగుతున్నాయని చెప్పారని పోలీసులు చెబుతున్నారు.

చట్టం శిక్ష నుంచి తప్పించుకోవడానికి తాహిర్‌ హుసేన్‌ ఇలా నటించారని పోలీసులు ఆరోపించారు.

BBC Iswoty

ఇవికూడాచదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)