పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకమన్న మలేసియా ప్రధాని.. తప్పుపట్టిన సొంత దేశం నేతలు

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై మలేసియా ప్రధాని మహాతిర్ మహమ్మద్ విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలను భారత ప్రభుత్వమే కాదు, సొంత దేశంలోని నేతలే తప్పుపడుతున్నారు.
కౌలాలాంపూర్ సదస్సు సందర్భంగా మహాతిర్ భారత పౌరసత్వ సవరణ చట్టంపై స్పందించారు. 70 ఏళ్లుగా భారత్‌లో పౌరులు ఐకమత్యంగా ఉంటున్నారని, ఈ చట్టం తేవాల్సిన అవసరం ఏముందని ఆయన వ్యాఖ్యానించారు.
''ఈ చట్టం వల్ల భారత్‌లో ప్రాణాలు పోతున్నాయి. పౌరసత్వం విషయంలో ఇన్నేళ్లుగా అక్కడ ఏ సమస్యా లేదు. ఇప్పుడు కొత్తగా ఏం సమస్య వచ్చింది?'' అని మహాతిర్ అన్నారు.
''మతం ఆధారంగా పౌరసత్వాన్ని లాక్కుంటూ భారత్ తాము లౌకిక దేశమని చెప్పుకోవడం చాలా బాధ కలిగిస్తోంది. అదే పని మేం ఇక్కడ మలేసియాలో చేస్తే, ఏం జరుగుతుందో తెలియదు. భారత్ చేసిన ఆ చట్టం ముస్లింలకు వ్యతిరేకమైంది'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మలేసియాలోని పెనాంగ్ ప్రావిన్సు ఉపముఖ్యమంత్రి పి.రామసామి, బగాన్ డాలమ్ అసెంబ్లీ సభ్యుడు సతీశ్ మునివందీ ఈ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈ ఇద్దరు నాయకులు ఇదివరకు వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్ విషయంలోనూ మలేసియా ప్రభుత్వ తీరును విమర్శించారు. ప్రస్తుతం జకీర్ నాయక్ మలేసియాలోనే ఉంటున్నారు.
మహాతిర్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ భారత విదేశాంగ శాఖ శుక్రవారమే దిల్లీలోని మలేసియా హైకమిషన్‌కు సమన్లు జారీ చేసింది.
మలేసియా ప్రధాని పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడుతున్నారని, ఇది భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని భారత్ వ్యాఖ్యానించింది.
''మహాతిర్ ప్రకటనలో తప్పులు ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోకుండా భారత్ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడొద్దని మలేసియాకు చెబుతున్నాం'' అని భారత విదేశాంగశాఖ వ్యాఖ్యానించింది.
మహాతిర్ భారత పౌరసత్వ సవరణ చట్టం గురించి చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ ఫ్రీ మలేసియా టుడే అనే వార్తా వెబ్‌సైట్‌లో రామసామి ఓ వ్యాసం రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
పౌరసత్వ సవరణ చట్టాన్ని అర్థం చేసుకోవడంలో మహాతిర్ విఫలమయ్యారని, 'ముస్లింల పౌరసత్వాన్ని రద్దు చేయొద్దు' అంటూ ఆయన వ్యాఖ్యానించడం అతిగా స్పందించడమేనని రామసామి అన్నారు.
''మహాతిర్ ఒకవేళ మలేసియా చైనీయులకు, భారతీయులకు పౌరసత్వం నిరాకరిస్తే ఏమవుతుందోనని అన్నారు. భారత్‌లోని ముస్లింలకు.. ఇక్కడి చైనీయులు, భారతీయులతో పోలిక పెట్టడం పూర్తిగా అసంబద్ధం. ఇదివరకు కశ్మీర్‌ను భారత్ ఆక్రమించిందంటూ మహాతిర్ తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ చట్టం విషయంలో మరోసారి పొరపాటు చేశారు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
''పౌరసత్వ సవరణ చట్టం ముస్లింల పౌరసత్వాన్ని లాక్కునేది కాదు. ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో వేధింపులు తాళలేక, 2014 కన్నా ముందు భారత్‌కు వచ్చిన మైనార్టీలకు పౌరసత్వం కల్పించేది. భారతీయ పౌరులైన ముస్లింలకు ఈ చట్టం వల్ల కలిగే నష్టమేమీ లేదు. మయన్మార్ రోహింగ్యాలు, పాకిస్తాన్ షియా ముస్లింలు, శ్రీలంక తమిళులకు ఈ చట్టంలో ఎందుకు చేర్చలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏటా పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వలస వచ్చిన వేల మంది ముస్లింలకు భారత్ పౌరసత్వం ఇస్తోందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. వాళ్లు సాధారణ ప్రక్రియల ద్వారా పౌరసత్వం కోసం అభ్యర్థనలు చేసుకోవచ్చు'' అని రామసామి ఈ వ్యాసంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
''ప్రత్యేకంగా ఆ మూడు దేశాల్లోని మైనార్టీల కోసం తీసుకువచ్చిన చట్టం ఇది. దీని వల్ల భారత్ లౌకికవాద ఇమేజ్ ఏమీ మారదు. అది ఎప్పటికీ లౌకికదేశమే. ఇండోనేసియా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక మంది ముస్లింలు భారత్‌లోనే ఉన్నారు.. పాకిస్తాన్‌లో కాదు'' అని వ్యాఖ్యానించారు.
''పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్‌ల్లో ఏ దేశాన్ని ఎంచుకుంటారని ముస్లింలను ప్రశ్నిస్తే.. వాళ్లు భారత్ అనే చెబుతారు. కొత్తం చట్టంపై కొన్ని న్యాయమైన అభ్యంతరాలు ఉండొచ్చు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నా. మహాతిర్ బాగా బిజీ మనిషి. చట్టాన్ని అర్థం చేసుకునే సమయం లేక ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేసి ఉండొచ్చు'' అని రామసామి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మహాతిర్ వ్యాఖ్యలను విమర్శిస్తూ బగాన్ డాలమ్ అసెంబ్లీ సభ్యుడు సతీశ్ మనివాందీ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
''90 ఏళ్లు పైబడిన ప్రధాని విదేశాంగ విధానాలపై ఎవరి సలహాలతో ముందుకువెళ్తున్నారు. ఆయన వ్యాఖ్యలు రెండు దేశాల సంబంధాలను మెరుగుపరిచేందుకు ఏ మాత్రం ఉపయోగపడేవి కావు'' అని అందులో వ్యాఖ్యానించారు.
మలేసియాలోని డెమోక్రటిక్ యాక్షన్ పార్టీ యూత్ ఇంటర్నేషనల్ బ్యూరోకు సతీశ్ కార్యదర్శిగా కూడా ఉన్నారు.
''మహాతిర్ వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేయడం చాలా సహజమైన విషయం. ఇవి ఆయన స్థాయికి తగ్గ వ్యాఖ్యలు కావు. మహాతిర్ భారత్ గురించి ఇలా తప్పుగా మాట్లాడటం ఇదేమీ మొదటిసారి కూడా కాదు. భారత్‌తో మన భాగస్వామ్యం కేవలం వాణిజ్యపరమైంది కాదు. ఆ దేశం దశాబ్దాలుగా మనకు సంప్రదాయ భాగస్వామిగా ఉంది'' అని మలేసియా కినీ వార్తా వెబ్‌సైట్‌లో సతీశ్ రాశారు.
ఇవి కూడా చదవండి:
- దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయి?
- CAA-సోనియా గాంధీ: ప్రజాందోళనను బీజేపీ అణచివేయాలని చూస్తోంది
- నుదిటిపై గాటు సీరియల్ కిల్లర్‌ను పట్టిచ్చింది
- హైదరాబాద్ నిజాం సొమ్ము కేసు: పాకిస్తాన్‌కు రూ.53.7 కోట్లు జరిమానా విధించిన బ్రిటన్ కోర్టు
- రియాన్స్ వరల్డ్: ఎనిమిదేళ్ల ఈ అబ్బాయి ఏడాదిలో రూ. 184 కోట్లు సంపాదించాడు
- పౌరసత్వ సవరణ చట్టం: బీజేపీ తొందరపడిందా.. ఈ స్థాయి వ్యతిరేకతను ఊహించలేదా
- ఉల్లి మన ఆహారంలో ఎలా భాగమైంది? దాని చరిత్ర ఏంటి...
- ముస్లింలలో ఆందోళన కలిగిస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ మూడు నిర్ణయాలు
- అమరావతిలో భూముల ధరలు: ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత, ఇప్పుడు ఎలా మారాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








