షివోరి ఇటో: అత్యాచారం కేసులో జపాన్ జర్నలిస్టుకు రూ. 21.5 లక్షల పరిహారం

ఫొటో సోర్స్, Getty Images
ఒక మహిళా జర్నలిస్టుకు 33 లక్షల యెన్లు (సుమారు రూ. 21.5 లక్షలు) పరిహారంగా చెల్లించాలని నిందితుడైన ఒక ప్రముఖ పాత్రికేయుడిని జపాన్ కోర్టు ఆదేశించింది.
తాను స్పృహలో లేనప్పుడు నోరియుకీ యమాగుచి అనే సదరు పాత్రికేయుడు 2015లో తనపై అత్యాచారం చేశాడని షివోరి ఆరోపించారు.
దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేయటానికి తగినన్ని ఆధారాలు లేవని ప్రాసిక్యూటర్లు చెప్పటంతో షివోరి ఇటో సివిల్ కేసు వేశారు.
దీంతో.. లైంగిక దాడుల గురించి ఫిర్యాదు చేయటం చాలా అరుదుగా ఉండే జపాన్‌లో.. #MeToo ఉద్యమానికి ఒక ప్రతీకగా మారారు 30 ఏళ్ల షివోరి.
ఈ తీర్పు పట్ల షివోరి సంతోషం వ్యక్తంచేశారు. ఆమె 'విజయం' అని రాసిన బోర్డును ప్రదర్శించారు.
అయితే.. ఈ తీర్పు మీద తాను అప్పీలు చేయబోతున్నానని యమాగుచి విలేకరుల సమావేశంలో చెప్పారు. తనపై ఆరోపణలను ఆయన మళ్లీ తిరస్కరించారు.

ఫొటో సోర్స్, Getty Images
యమాగుచి వయసు ప్రస్తుతం 53 ఏళ్లు. ఆయనకి ప్రధానమంత్రి షింజో అబేతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెప్తారు. షివోరి కథనం ప్రకారం.. 2015లో ఒక ఉద్యోగ అవకాశం గురించి చర్చించటానికి ఆమెను రాత్రి విందుకు ఆహ్వానించారు యమాగుచి.
అప్పుడు తనకు మత్తుమందు ఇచ్చివుంటారని ఆమె అనుమానిస్తున్నారు. తనకు మెలకువ వచ్చేసరికి ''నేను ఒక హోటల్ గదిలో ఉన్నాను.. అతడు నా మీద ఉన్నాడు'' అని ఆమె చెప్పారు.
ఆరోపిత అత్యాచారం జరిగినపుడు షివోరి రాయిటర్స్ వార్తా సంస్థలో ఇన్‌టర్న్‌గా ఉన్నారు.
యమాగుచి అప్పుడు.. జపాన్‌లో ప్రముఖ మీడియా సంస్థ అయిన టోక్యో బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్‌కి వాషింగ్టన్ బ్యూరో చీఫ్‌గా ఉన్నారు.
షివోరి ఆరోపణలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ తగినన్ని ఆధారాలు లేవంటూ కేసును మూసివేశారు.
ఆరోపిత అత్యాచారం ఎలా జరిగిందో.. పురుష పోలీసు అధికారులు చూస్తుండగా.. మనిషి పరిమాణంలో ఉన్న బొమ్మతో మళ్లీ చేసి చూపించాలని పోలీసులు తన మీద ఒత్తిడి తెచ్చారని షివోరి చెప్పారు.
జపాన్‌లో 2017లో ప్రభుత్వం నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. అత్యాచార బాధితుల్లో కేవలం 4 శాతం మంది మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

షివోరి ఇటో మాటల్లో...
''నా ఆరోపణల మీద దర్యాప్తులో భాగంగా.. ఆ రాత్రి నన్ను తీసుకెళ్లిన హోటల్ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్‌కి నన్ను రావాలని పిలిచారు.
నాకు నైతిక మద్దతు కోసం నా స్నేహితురాలితో కలిసి అక్కడికి వెళ్లాను. అప్పుడు నన్ను స్టేషన్ పైఅంతస్తులో ఉన్న ఒక వ్యాయామశాలకు తీసుకెళ్లారు. అక్కడ ఏం జరగబోతోంది అనే దాని గురించి నేను విని ఉన్నాను. కాబట్టి నాతో పాటు నా స్నేహితురాలిని కూడా అనుమతించాలని అడిగాను.
కానీ పోలీసులు తిరస్కరించారు. నన్ను జిమ్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ ఒక పరుపు మీద పడుకోవాలని నాకు చెప్పారు. మనిషి సైజులో ఉన్న ఒక బొమ్మను తీసుకువచ్చి ముగ్గురు పురుష పోలీసు అధికారులు నా మీద పెట్టి పట్టుకున్నారు. దానిని కదిలిస్తూ.. అత్యాచారం ఎలా జరిగిందో చూపించాలంటూ నన్ను అసభ్యకరమైన ప్రశ్నలు అడుగుతూ ఫొటోలు తీసుకున్నారు.
దర్యాప్తు కోసం ఇది అవసరమని నాకు చెప్పారు.
ఆ సమయంలో నా ఆలోచనను ఫిర్యాదుదారు నుంచి జర్నలిస్టుగా మార్చుకోవాల్సి వచ్చింది.
అప్పుడు నా ఆలోచనలను పూర్తిగా అదిమి పెట్టుకోవటం ద్వారా మాత్రమే నేను అక్కడ ఉండగలిగాను. దానిని నేను పరిశోధిస్తున్న ఒక కథనంగా పరిగణించాల్సి వచ్చింది. ఈ ఉదంతంతో నిమిత్తం లేకుండా, భావోద్వేగాలు లేకుండా ఒక జర్నలిస్టుగా వాస్తవం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లు వ్యవహరించాల్సి వచ్చింది.
ఇప్పటికీ నా ఆలోచనల్లో ఆ సంఘటనను అలాగే చూడటానికి ప్రయత్నిస్తున్నాను.

షివోరి తనకు నష్టపరిహారంగా 1.1 కోట్ల యెన్లు చెల్లించాలంటూ యమాగుచి మీద సివిల్ దావా వేశారు.
యమాగుచి తాను ఎలాంటి తప్పూ చేయలేదని తిరస్కరిస్తూ.. అప్పుడు ఉమ్మడి అంగీకారంతో సెక్స్ జరిగిందని చెప్తున్నారు. తనకు పరిహారంగా 1.3 కోట్ల యెన్లు చెల్లించాలంటూ ప్రతి దావా వేశారు.
ఆయన ఇప్పుడు షివోరికి నష్టపరిహారంగా 33 లక్షల యెన్లు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆయన మీద క్రిమినల్ కేసు ఏదీ ఉండదు.
జపాన్‌లోని అత్యాచార చట్టం కింద.. హింస లేదా బెదిరింపులు జరిగాయని కానీ, బాధితురాలకి ''ప్రతిఘటించే సామర్థ్యం లేదు'' అని కానీ ప్రాసిక్యూటర్లు నిరూపించి తీరాలి.
ఇవి కూడా చదవండి:
- "అమ్మను చూడగానే కన్నీళ్లొచ్చాయి"- పన్నెండేళ్ళ తర్వాత కన్నతల్లిని కలుసుకున్న భవానీ
- పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్‌కు మరణశిక్ష
- పేద దేశాల్లో ప్రజలకు ఊబకాయం ఎందుకు వస్తోంది...
- ఉల్లి మన ఆహారంలో ఎలా భాగమైంది? దాని చరిత్ర ఏంటి...
- యూఎస్బీ కండోమ్ అంటే ఏమిటో తెలుసా?
- సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే తేయాకు కథ: చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- నలుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు పెళ్లి కొడుకులు, ఒకే రోజు పెళ్లి
- ఉరి తాడు ఒక్క బక్సర్ జైల్లోనే ఎందుకు తయారవుతోంది?
- భూమి మీద అత్యంత లోతైన ప్రదేశం... ఈ లోయ లోతు 11,500 అడుగులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








