CAA-సోనియా గాంధీ: ప్రజాందోళనను బీజేపీ అణచివేయాలని చూస్తోంది

ఫొటో సోర్స్, Twitter/congress
సీఏఏపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలను బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. స్వచ్ఛందంగా జరుగుతున్న నిరసనలను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందంటూ ట్విటర్ ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు.
ఆ వీడియోలో సోనియా ఏమన్నారంటే...
"దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత, పౌరులపై బీజేపీ ప్రభుత్వం చేపట్టిన దారుణ అణచివేత చర్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తోంది. యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంల వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో అప్పటికప్పుడు స్వచ్ఛందంగా నిరసనలు జరుగుతున్నాయి. బీజేపీ అనుసరిస్తున్న విభజన రాజకీయాల అజెండాకు, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన, విధానాల పైనా ప్రజలకు తమ గళం వినిపించే హక్కు, నిరసనను తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుంది.
అదే సమయంలో, ప్రజల అభిప్రాయాలను, ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, వాటికి పరిష్కారాలను చూపించడం కూడా ప్రభుత్వ విధి. కానీ ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. పైగా తీవ్రమైన శక్తులతో వారిని ఆలోచనలను అణచివేయాలని ప్రయత్నిస్తోంది. ఇది ప్రజాస్వామ్యంలో ఏమాత్రం ఆమోదనీయం కాదు.
బీజేపీ చర్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. విద్యార్థులు, దేశ పౌరులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు పలుకుతోంది. పౌరసత్వ సవరణ చట్టం పూర్తిగా వివక్షాపూరితంగా ఉంది. ప్రతిపాదిత దేశవ్యాప్త ఎన్ఆర్సీ కూడా పేదలు, బలహీనులను ఉద్దేశించిందే.
నోట్ల రద్దు సమయంలో మాదిరిగానే ఇప్పుడు కూడా వీరంతా లైన్లలో నిలబడి వాళ్లు, వాళ్ల పూర్వీకుల పౌరసత్వం ఎక్కడ ఉందో నిరూపించుకోవాలి. ప్రజలు భయపడటంలో న్యాయం ఉంది.
పౌరుల ప్రాథమిక హక్కులను, రాజ్యాంగ మౌలిక నియమాలను కాపాడేందుకు మేం కట్టుబడి ఉన్నామని భారత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది" అని సోనియా తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
మరోవైపు, దిల్లీలోని ఇండియా గేట్ దగ్గర జరిగిన నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు.
ఎన్ఆర్సీ పేదల వ్యతిరేకం అని ఆమె వ్యాఖ్యానించారు.
"పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ.. ఈ రెండూ పేదల వ్యతిరేక చర్యలు. వీటితో ఎక్కువగా నష్టపోయేది పేదలే. రోజుకూలీలు ఏం చెయ్యాలి? నిరసన ప్రదర్శనలు శాంతియుతంగా జరగాలి" అని ప్రియాంక అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి.
- పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు: అసోంలో మొబైల్ ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ
- ఉన్నావ్ అత్యాచారం: బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్‌కు యావజ్జీవ కారాగార శిక్ష
- గూఢచర్యం ఆరోపణలపై విశాఖలో ఏడుగురు నౌకాదళ సిబ్బంది అరెస్ట్
- అత్యాచారం కేసులో జర్నలిస్టుకు రూ. 21.5 లక్షల పరిహారం
- విద్యార్థులతో 'బాబ్రీ పోస్టర్ కూల్చివేత'... ఇలాంటి పనులు దేశభక్తిని పెంచుతాయా?
- "ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజధాని మారుస్తారా?".. సీఎం జగన్ వ్యాఖ్యలపై అమరావతి రైతుల నిరసన
- ఆంధ్రప్రదేశ్ రాజధాని: 'దక్షిణాఫ్రికా మోడల్ ఏపీకి పనికిరాదు, మనమే కొత్త మోడల్ చూసుకోవాలి'- ఈఏఎస్ శర్మ
- 'హైదరాబాద్ ఎన్కౌంటర్' బూటకం, పోలీసులపై చర్యలు తీసుకోవాలి.. సుప్రీం కోర్టులో నిందితుల కుటుంబ సభ్యుల పిటిషన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








