విద్యార్థులతో 'బాబ్రీ పోస్టర్ కూల్చివేత'... ఇలాంటి పనులు దేశభక్తిని పెంచుతాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కర్ణాటకలోని మంగళూరులో ఓ ఉన్నత పాఠశాల విద్యార్థులు బాబ్రీ మసీదు చిత్రపటాన్ని చించివేస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ 'భక్తి'ని పెంపొందించేందుకే అలా చేశామని ఆ పాఠశాల నిర్వాహకులు చెబుతున్నారు.
డిసెంబర్ 15న ఆ పాఠశాలలో క్రీడా, సాంస్కృతిక వేడుకలు నిర్వహించారు. ఆ సందర్భంలో బాబ్రీ నిర్మాణాన్ని చూపుతున్న చిత్రపటాన్ని పిల్లలు చించివేయడం ఆ వీడియోలో కనిపిస్తుంది.
"వాళ్లు (కరసేవకులు) చేతికి ఏది దొరికితే అది అందుకుని ఆ కట్టడాన్ని కూల్చివేయడం మొదలుపెట్టారు. ఎంతో ఉత్సాహంతో, హనుమంతుడి భక్తులు హనుమంతుడి శక్తితో బాబ్రీనీ కూల్చారు. బోలో.. శ్రీ రామచంద్రుడికీ జై" అంటూ మైకులో వ్యాఖ్యాత చెబుతుండటం కూడా ఇందులో వినొచ్చు.
ఆయన మాటలు విన్న తర్వాత విద్యార్థులు అందరూ కలిసి పోస్టర్‌ను కూల్చివేస్తూ కేరింతలు కొట్టారు.
ఈ కార్యక్రమం శ్రీ రామ విద్యాకేంద్ర హైస్కూలులో జరిగింది. కర్ణాటకలోని కోస్తా జిల్లాల్లో బాగా పట్టున్న ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు కలడ్క ప్రభాకర్ భట్ ఈ పాఠశాలను నడిపిస్తున్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ... "కూల్చిన నిర్మాణాన్ని మేము బాబ్రీ మసీదుగా పరిగణించడం లేదు. అదొక చారిత్రక ఘట్టం. మేము ముస్లింలకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు. మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆ కట్టడం కూల్చివేత ఎలా జరిగిందన్నది మాత్రమే చూపించాం" అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మహిళా కాంగ్రెస్ నాయకురాలు లావన్య బల్లాల్ ట్వీట్ చేసిన తర్వాత ఈ వీడియో వైరల్ అయ్యింది. "వాళ్లు విద్వేషాన్ని ఎలా నాటుతారు? కలడ్క ప్రభాకర్‌కు చెందిన పాఠశాలలో ఏం జరిగిందో చూడండి" అంటూ లావన్య ఆ వీడియోను ట్వీట్ చేశారు.
"ఏటా ఒక భారీ కార్యక్రమం నిర్వహిస్తుంటాం. ఒకసారి చంద్రయాన్ ప్రయోగానికి సంబంధించిన కార్యక్రమం చేశాం. ఈసారి బాబ్రీ వివాదం మీద న్యాయస్థానం తీర్పు ఇచ్చింది కాబట్టి ఇలా చేశాం. ఈ కార్యక్రమంలో ఎల్‌కే అడ్వాణీ ప్రసంగం వినిపించాం, ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం వెల్లడించిన తీర్పు వివరాలను వివరించాం. అందులో భాగంగా ఇది కూడా చూపించాం" అని ప్రభాకర్ భట్ చెప్పారు.
అయితే, ఈ కార్యక్రమంపై శివ విశ్వనాథన్ లాంటి సామాజిక వేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అది 'అభ్యంతరకరమైన పని' అని, అమాయకపు చిన్నారులకు 'హానికరం' అని ప్రముఖ సామాజికవేత్త, విమర్శకులు శివ విశ్వనాథన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చిన్నారుల ఆలోచనలపై అది ఎలాంటి ప్రభావం చూపుతుంది?
"ఇలాంటి కార్యక్రమాల ప్రభావం ఎలా ఉంటుందంటే... దేశం కోసం ఎలా బతకాలో పిల్లలు తెలుసుకుంటారు. జాతి గౌరవాన్ని ఎలా పెంపొందించాలో నేర్చుకుంటారు. అంతే తప్పితే, ఇదేదో ముస్లింల పట్ల ద్వేషాన్ని పెంచేందుకు చేసిన కార్యక్రమం కాదు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, జార్జ్ ఫెర్నాండేజ్ లాంటివారు నెలకొల్పిన సంప్రదాయాలను మేము నమ్ముతాం. కసబ్ లాంటి ఉగ్రవాదులను, దేశ ద్రోహులను ప్రోత్సహించే కార్యక్రమం కాదు ఇది" అని ప్రభాకర్ భట్ అన్నారు.
అయితే, ఇలాంటి పనులు అమాయకపు చిన్నారుల మనసులను చెడగొడతాయని సామాజిక వేత్త శివ విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. "విద్యను ఒక భావజాల వ్యాప్తిగా చూపిస్తున్నారు. అది పిల్లల మనసులను దెబ్బతీస్తుంది" అని ఆయన అన్నారు.
"ప్రస్తుత కాలంలో ప్రజాస్వామిక నియమాలకు, ప్లూరలిజానికి, పౌరసత్వ నియమాలకు, చరిత్రకు విరుద్ధంగా ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. ప్రజలు అవన్నీ సాధారణమే అని అనుకుంటున్నారనిపిస్తోంది" అని విశ్వనాథన్ చెప్పారు.
ఇది "చాలా సున్నితమైన విషయం" అంటూ కొందరు మానసిక నిపుణులు దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. అయితే, వారిలో ఒకరు తన పేరును బయటపెట్టొద్దన్న షరతుతో మాట్లాడారు. "అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పిల్లల్లో ఆవేశం పెరుగుతుంది. వాళ్లు ఒక సంఘటనకు సంబంధించి వేర్వేరు కోణాలను, అంశాలను తెలుసుకోలేరు" అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘జుగాడ్’ విధానంలో ఉద్ధభ్ భరలి వినూత్న ఆవిష్కరణలు
- పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్‌కు మరణశిక్ష
- ఈ చట్టంతో ఎవరూ పౌరసత్వం కోల్పోరు: అమిత్ షా
- నిర్భయ ఘటనకు ఏడేళ్లు.. మహిళలపై నేరాల విషయంలో దేశం ఎంత మారింది
- కశ్మీర్ వేర్పాటువాది మక్బూల్ భట్: ఒక వ్యక్తిని ఉరి తీసి, జైలులోనే ఖననం చేయడం తీహార్ జైలు చరిత్రలో అదే తొలిసారి
- రోహింజ్యాల మారణహోమం ఆరోపణలు అవాస్తవం.. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆంగ్ సాన్ సూచీ
- మిస్ యూనివర్స్ 2019 జోజిబిని తుంజీ: ఫైనల్ రౌండ్ ప్రశ్న, సమాధానం ఏంటి?
- హైదరాబాద్ ఎన్కౌంటర్: ‘పోలీసుల కథనం చిన్నపిల్లలు కూడా నమ్మేలా లేదు’
- ‘చిన్న పాప సార్... సెక్స్ అంటే ఏంటో తెలీదు.. అట్లాంటి బిడ్డను రేప్ చేసి చంపినారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








