నోదీప్ కౌర్: భారత్‌లోని జైలులో ఉన్న ఈ యువతి ఎవరు? మీనా హారిస్ ఎందుకు ట్వీట్ చేశారు?

ఫొటో సోర్స్, Harveer Kaur
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఈ నెల ఆరంభంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ ఒక ట్వీట్ చేశారు. నెల రోజులకు పైగా జైలులో ఉన్న 25 ఏళ్ల భారత కార్మిక హక్కుల కార్యకర్త నోదీప్ కౌర్‌ను విడుదల చేయాలని ఆ ట్వీట్‌లో కోరారు. నోదీప్ కౌర్ అరెస్ట్ మీద అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
#ReleaseNodeepKaur అనే హ్యాష్‌ట్యాగ్‌తో మీనా హారిస్ ట్వీట్ చేస్తూ.. ఆ కార్యకర్తను ‘‘అరెస్ట్ చేసి, హింసించారు, పోలీసు కస్టడీలో లైంగికంగా దాడి చేశారు’’ అని పేర్కొన్నారు.
అంతకు కొన్ని రోజుల ముందు బ్రిటన్ పార్లమెంటులో సైతం లేబర్ పార్టీ ఎంపీ తన్మన్‌జీత్ సింగ్ దేశి కూడా నోదీప్ అరెస్టు విషయాన్ని ప్రస్తావించారు.
నోదీప్ కౌర్ కేసు గురించి వేలాది మంది ట్వీట్ చేశారు. పంజాబ్ రాష్ట్రంలో రైతు సంఘాల నాయకులు, విద్యార్థి నేతలు ఆమెకు సంఘీభావం తెలిపారు.
బుధవారం నాడు పంజాబ్, హరియాణా హైకోర్టు ఆమె బెయిల్ పిటిషన్‌ను విచారించింది. అదే కోర్టు మరో విచారణను కూడా ప్రారంభించింది. ఆమెను అక్రమంగా నిర్బంధించారని, కస్టడీలో హింసించారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈ-మెయిల్ ఫిర్యాదులు అందటంతో.. దీనిపై వివరణ ఇవ్వాలని హరియాణా పోలీసులను హైకోర్టు అడిగింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దేశ రాజధాని దిల్లీ సివార్లలో గల కుండ్లీ ఇండస్ట్రియల్ ఏరియా (కేఐఏ)లో ఒక ఫ్యాక్టరీ వెలుపల నిరసనలో పాల్గొన్న నోదీప్ కౌర్‌ను జనవరి 12వ తేదీన అరెస్ట్ చేశారు.
ఆమెను అరెస్ట్ చేసిన పరిస్థితులు, ఆమెపై లైంగికంగా దాడిచేశారని, హింసించారనే ఆరోపణలు ట్విటర్‌లో దుమారం రేపాయి. ఈ ఆరోపణలను పోలీసులు తీవ్రంగా ఖండించారు.
‘‘మగ పోలీసులు ఆమెను బహిరంగంగా కొట్టారు. జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్‌లో వేశారు’’ అని ఆమె అక్క రాజ్‌వీర్ కౌర్ నాతో చెప్పారు.
‘‘ఆ మరుసటి రోజు ఆమెను నేను జైలులో కలిసినపుడు.. వ్యాన్ లోపల, పోలీస్ స్టేషన్‌లోనూ తనను తీవ్రంగా కొట్టారని ఆమె నాకు చెప్పారు. ఆమెను చేతులతో కొట్టారు. పిడిగుద్దులు కురిపించారు. బూటు కాళ్లతో తన్నారు. లాఠీలతో కొట్టారు. ఆమె గోప్య శరీరభాగాల మీద కూడా ఈ హింసకు పాల్పడ్డారు. దీనివల్ల కొన్ని రోజుల పాటు తీవ్రంగా రక్తస్రావమైంది’’ అని రాజ్‌వీర్ వివరించారు.
నోదీప్ కౌర్ వైద్య నివేదికను ఆమె కుటుంబానికి ఇంకా అందించాల్సి ఉంది. అయితే.. ఆ నివేదికను చూసిన క అధికారి నాతో మాట్లాడుతూ.. ‘‘ఆమెను హింసించారని, ఆమె గోప్య శరీరభాగాలపై తీవ్రంగా కొట్టారని ఆమె గాయాలు సూచిస్తున్నాయి’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, Harveer Kaur
అసలు ఎవరీ నోదీప్ కౌర్? ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు?
ఇదో సంక్లిష్టమైన కథ. కులం, పేదరికం, రాజకీయాలు, నిరసనలు, వేర్వేరు పార్టీల పాలనలో ఉన్న రెండు రాష్ట్రాల మధ్య వైరం, కార్మికులు, రైతుల హక్కులు.. ఇవన్నీ కలగలసి ఉన్న కథ.
నోదీప్ కౌర్‌ది గ్రామీణ పంజాబ్‌లోని ఒక పేద దళిత (భారతదేశపు నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో గతంలో అట్టడుగున ఉన్న అంటరానివారు) కుటుంబ నేపథ్యం. హైస్కూల్ విద్య తర్వాత ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఆమె చదువు మానేయాల్సి వచ్చింది.
సిక్కు మతం సమానత్వాన్ని బోధిస్తున్నా కానీ.. పంజాబ్‌లో కుల వివక్ష పాతుకుపోయి ఉంది. రాష్ట్ర జనాభాలో దళితులు మూడో వంతు ఉన్నారు. వారిలో సగం మందికి పైగా సిక్కులే. నోదీప్ కుటుంబం కూడా సిక్కులే.
‘‘దళితులమైనందున మేం ఎల్లప్పుడూ కుల వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నాం. పైగా మహిళలం అయినందున లింగ వివక్షకూ గురవుతున్నాం. ఆపైన మేం పేదవాళ్లం. ఈ అంశాలన్నిటినీ నోదీప్ కౌర్ ఎప్పుడూ గట్టిగా పట్టించుకునేది’’ అని ఆమె చెల్లెలు హర్వీర్ కౌర్ చెప్తున్నారు.
గత ఏడాది శరత్కాలంలో తన అక్క కుండ్లీలోని ఒక గ్లాస్ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరిందని, ఆ తర్వాత ఎప్పటికైనా కాలేజీలో చేరాలని ఆకాంక్షించేదని హర్వీర్ చెప్తున్నారు.
అక్కడ ఆమె కార్మికుల సంఘం మజ్దూర్ అధికార్ సంఘటన్ (ఎంఏఎస్)లో చేరారు. ఈ సంఘం బకాయిల చెల్లింపుల కోసం ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఒత్తిడి తేవటానికి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుంటుంది.
నోదీప్ కూడా చాలాసార్లు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఒక సందర్భంలో తనకు రావాల్సిన బకాయిల కోసం కూడా ఆమె నిరసనల్లో పాల్గొన్నారు.
డిసెంబరులో రెండు సార్లు కార్మికులకు, ఫ్యాక్టరీ యాజమాన్యం నియమించుకున్న బౌన్సర్లకు మధ్య తోపులాట, ముష్టియుద్ధం చోటుచేసుకుంది. పోలీసులు ఫ్యాక్టరీల యాజమాన్యానికి అనుకూలంగా పనిచేస్తున్నారని, కార్మికులు సంఘాలుగా ఏర్పడటాన్ని, వారి అసమ్మతిని అణచివేయటానికి ప్రయత్నిస్తున్నారని ఈ కార్మిక సంఘం ఆరోపించింది.

ఫొటో సోర్స్, AFP
జనవరి 12న ఏం జరిగింది?
నోదీప్ కౌర్‌తో పాటు డజన్ల మంది కార్మిక సంఘం సభ్యులు ఫ్యాక్టరీ వెలుపల నిరసన చేపడుతున్నపుడు అక్కడ హింస ఎలా మొదలైందనే విషయంలో రెండు భిన్న కథనాలు చెప్తున్నారు.
యాజమాన్యాన్ని, సిబ్బందిని కార్మికులు కొడుతున్నారని, డబ్బులు గుంజుకోవటానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారం అందటంతో తాము ఒక పోలీసు బృందాన్ని ఫ్యాక్టరీకి పంపించామని పోలీసులు చెప్తున్నారు.
అయితే తమ మీద ఫ్యాక్టరీ బౌన్సర్లు, పోలీసులు దాడి చేశారని కార్మిక సంఘం సభ్యులు చెప్తున్నారు. కానీ కార్మికులే తమ మీద దాడిచేశారని పోలీసులు అంటున్నారు. ప్రత్యేకించి నోదీప్ కౌర్ ‘‘పోలీసుల మీద దాడిచేశార’’ని వారు ఆరోపిస్తున్నారు.
సీనియర్ పోలీస్ అధికారి జె.ఎస్.రాంధవ రెండు వీడియోలను బీబీసీ న్యూస్ ప్రతినిధి షాలూయాదవ్‌కు పంపించారు. ఆ వీడియోలను సంఘటన జరిగిన రోజు నిరసన ప్రదేశంలో చిత్రీకరించినవని చెప్పారు.
అందులోని ఒక వీడియోలో పోలీసులను కర్రలతో కొడుతున్నట్లు కనిపిస్తున్న ఒక బృందలో భాగంగా ఉన్న ఒక మహిళ కనిపిస్తున్నారు. రెండో వీడియోలో ‘‘మనం వారిని తిప్పికొట్టాం. వారిని తరిమి కొట్టాం. మళ్లీ ఆ పని చేస్తాం’’ అంటూ ఆ మహిళ ప్రసంగిస్తున్న దృశ్యం ఉంది.
ఆ వీడియోల్లో ఉన్న మహిళ నోదీప్ కౌర్ అని, ఆమె ప్రసంగంలో ‘వారు’ అంటూ ప్రస్తావించింది పోలీసులనేనని రాంధవ పేర్కొన్నారు.
‘‘పోలీసుల మీద దాడి చేయాలని అప్పుడామె ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఆ దాడిలో ఏడుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత సంఘటనా ప్రాంతం నుంచి ఆమెను అరెస్ట్ చేశాం’’ అని ఆయన చెప్పారు.
ఆ వీడియోలను నోదీప్ కౌర్ అక్క రాజ్‌వీర్ తిరస్కరించలేదు. అయితే.. ‘‘నిజానికి పోలీసుల మీద దాడిచేస్తున్న వారిని నిలువరించటానికి నోదీప్ ప్రయత్నించారు’’ అని ఆమె చెప్పారు.

నిరసన చేస్తున్న రైతులతో నోదీప్ సంబంధం ఏమిటి?
దిల్లీ శివార్లలో.. కుండ్లీకి ఎంతో దూరంలో లేని సింఘూ సరిహద్దులో వేలాది మంది రైతులు గత నవంబరు చివర్లో నిరసన ప్రారంభించటేటప్పటికి.. నోదీప్ కౌర్ కుండ్లీలో పనిచేయటం మొదలుపెట్టి కొన్ని నెలలే అయింది.
వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం, ధరలు, నిల్వలకు సంబంధించిన నిబంధనలను సడలించే కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనల్లో నోదీప్, ఆమె సహచరులు కూడా పాల్గొనటం ప్రారంభించారు.
ఈ రైతుల నిరసనలు ఇప్పుడు మూడో నెలలోకి ప్రవేశించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద సవాలుగా మారింది. కొత్త వ్యవసాయ చట్టాల అమలును 18 నెలల పాటు నిలిపివేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ వాటిని రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుపడుతున్నారు.
ఈ కొత్త చట్టాలు కేవలం రైతులనే కాక, కార్మిక వర్గానికి కూడా హాని కలిగిస్తాయని నోదీప్, ఆమె సహ కార్మికులు భావిస్తున్నారు. వ్యవసాయం ప్రైవేటీకరణ వల్ల ఆహార వస్తువుల ధరలు పెరుగుతాయని, దానివల్ల తమ కష్టాలు మరింత పెరుగుతాయని వారు నమ్ముతున్నారు.
రైతుల నిరసనల్లో పాల్గొన్నందుకు గాను నోదీప్ కౌర్ డిసెంబర్ ఆరంభంలో గ్లాస్ ఫ్యాక్టరీలో తన ఉద్యోగం కోల్పోయారు.
ఆమెను అరెస్ట్ చేయటం.. పంజాబ్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, హరియాణాలోని బీజేపీ ప్రభుత్వానికి మధ్య రాజకీయ వాగ్వాదానికీ దారితీసింది.
హరియాణాలోని ‘రైతు వ్యతిరేక’ బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున నోదీప్ కౌర్‌ను అరెస్ట్ చేసిందని పంజాబ్ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అరుణా చౌదరి గత వారంలో ఆరోపించారు. ఆమెకు పంజాబ్ న్యాయ సహాయం అందిస్తుందని చెప్పారు.
నోదీప్ కౌర్ ఇప్పుడు ఎక్కడున్నారు?
నోదీప్ కౌర్‌ను అరెస్ట్ చేసినప్పటి నుంచీ.. హరియాణాలోని ఒక జైలులో కస్టడీలో ఉన్నారు. పోలీసులు ఆమె మీద.. హత్యాయత్నం, బెదిరింపు వసూళ్లకు పాల్పడటం, అధికారిక పత్రాలను తస్కరించటానికి ప్రయత్నించటం, పోలీసుల నుంచి తుపాకీ లాక్కోవటానికి ప్రయత్నించటం’’ అనే పలు నేరాలను నమోదుచేశారు.
‘‘ఈ నేరాల్లో కొన్ని చాలా తీవ్రమైనవి. అందుకు పదేళ్ల నుంచి 14 ఏళ్ల వరకూ జైలు శిక్ష ఉంటుంది’’ అని నోదీప్ కౌర్ తరఫున వాదిస్తున్న న్యాయ బృందం సభ్యుడు హరీందర్ సింగ్ బెయిన్స్ బీబీసీతో చెప్పారు.
ఆమె మీద పోలీసులు మూడు క్రిమినల్ కేసులు పెట్టారని, అందులో రెండు కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసిందని ఆయన తెలిపారు. మూడో కేసులో బెయిల్ దరఖాస్తు మీద హైకోర్టు బుధవారం విచారిస్తుంది.
‘‘రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడితే పర్యవసానాలు ఉంటాయని మాకు తెలుసు. కానీ ఆమె మీద బూటకపు కేసులు పెట్టి, దాడి చేస్తారని మేం ఎప్పుడూ అనుకోలేదు’’ అని నోదీప్ కౌర్ చెల్లెలు హర్వీర్ పేర్కొన్నారు.
‘‘ఆమె చేసిందల్లా కార్మికులు తమ బకాయిలు పొందటం కోసం సాయం చేయటమే. కానీ ఆమె మీద హత్యాయత్నం కేసు, బలవంతపు వసూళ్ల కేసు నమోదు చేశారు. ఇది అన్యాయం’’ అన్నారామె.
కొన్ని రోజుల కిందట జైలులో నోదీప్ కౌర్‌ను కలిసి రాజ్‌వీర్ కౌర్.. తన సోదరికి అయిన గాయాలు మానుతున్నాయని, ఆమె ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు.
‘‘ఆమె చాలా ఉదారమైన వ్యక్తి. ఎప్పుడూ తన సొంత అవసరాలకన్నా ఇతరుల అవసరాలకే ప్రాధాన్యం ఇస్తారు. జైలులో కూడా తన సహ ఖైదీల గురించి ఆందోళన చెందుతున్నారు. కొందరు ఖైదీలకు ఇవ్వటం కోసం చలిని తట్టుకోవటానికి వెచ్చటి దుస్తులు, చెప్పులు, కప్పులు తీసుకురావాలని నాకు చెప్పారు’’ అని ఆమె వివరించారు.
‘‘గత శుక్రవారం నాడు ఆమెను కలిసినపుడు.. న్యాయ సాయం దక్కని ఖైదీల కోసం న్యాయవాదులను ఏర్పాటు చేయాలని ఆమె నాకు చెప్పారు. ‘ముందు నిన్ను బయటకు తేనివ్వు’ అని నేను ఆమెతో చెప్పాను’’ అని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:
- చైనా: ‘అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- ఉత్తరాఖండ్: వరద వేగానికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయ్
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










