కోవిడ్-19 వ్యాక్సీన్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రావడం సాధ్యమేనా?

ఫొటో సోర్స్, Getty Images / triloks
ప్రపంచ జనాభాలో అందరికీ వ్యాక్సీన్ ఇప్పించడం జీవన్మరణ సమస్య లాంటిది. ఇదంతా వివిధ సాంకేతిక ప్రక్రియలు, బహుళ జాతి సంస్థలు, ప్రభుత్వాల పరస్పర విరుద్ధమైన హామీలు, కేంద్రీకృత విధానాలు, నియంత్రణలతో కూడుకుని ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే ప్రపంచమంతటికీ వ్యాక్సీన్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనే విషయంపై స్పష్టమైన సమాధానం దొరకదు.
ఈ అంశంపై ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయు)లో గ్లోబల్ ఫోర్‌కాస్టింగ్ డైరెక్టర్ అగాథె డెమరి సమగ్రమైన అధ్యయనం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో వ్యాక్సీన్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం, ఆ దేశ జనాభా, వ్యాక్సీన్ ఇచ్చేందుకు వైద్య రంగంలో ఉన్న మౌలిక సదుపాయాలు, ఆర్ధిక స్థితిగతులు వంటి అంశాలను ఈఐయు పరిశీలించింది.
చాలా వరకు ఊహించినట్లుగానే ధనిక దేశాలు, పేద దేశాల మధ్య వ్యత్యాసాలు స్పష్టంగా కనిపించాయి.
ప్రస్తుతానికి అమెరికా, బ్రిటన్‌లకు వ్యాక్సీన్ అభివృద్ధికి పెట్టుబడి పెట్టగలిగే సామర్థ్యం మెరుగ్గా ఉండటంతో, మిగతా దేశాలతో పోల్చితే టీకా పంపిణీలో ఈ దేశాలు ముందున్నాయి.
ఈ విషయంలో కెనడాతో సహా , కొన్ని యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా కాస్త వెనుకబడే ఉన్నాయి.
కొన్ని అల్పాదాయ దేశాలు ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలే పెట్టలేదు.
ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సీన్ పంపిణీ జరిగే తీరును ఈ కింద పట్టికలో చూడవచ్చు.
జనాభాకు అవసరమైన దాని కంటే అయిదు రెట్లు ఎక్కువగా వ్యాక్సీన్ నిల్వలను కొనుగోలు చేసినందుకు కెనడా విమర్శలు ఎదుర్కొంది.
కానీ, వారింకా దీనిని అవసరమైన వారికి ఇవ్వడానికి సన్నద్ధంగా లేరు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు అమెరికా ప్రభుత్వం వ్యాక్సీన్ ఎగుమతులను నిషేధిస్తుందనే భయంతో కెనడా యూరోప్‌లో తయారై టీకాల వైపు మొగ్గు చూపింది.
వ్యాక్సీన్ సరఫరా చేసేందుకు యూరప్ సంస్థలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాయి. అలాగే కొన్ని యూరోపియన్ దేశాలు టీకాల ఎగుమతిని నిషేధిస్తామని బెదిరిస్తున్నాయి.
"యూరప్ అవసరాలు తీరేంత వరకూ, కెనడాకు వ్యాక్సీన్‌ను పంపే అవకాశం లేకపోవచ్చు" అని అగాథె డెమరి అంటున్నారు.
కానీ, కొన్ని దేశాలు ఊహించిన అంచనాల కంటే మెరుగ్గానే వ్యాక్సీన్ ప్రక్రియను అమలు చేస్తున్నాయి.
ఈ కథనం రాస్తున్న సమయానికి దేశ జనాభా ప్రకారం చూస్తే అత్యధికంగా వ్యాక్సీన్ పంపిణీ చేసిన దేశాలలో సెర్బియా 8వ స్థానంలో ఉంది. ఇది చాలా యూరోపియన్ దేశాల కంటే ముందంజలో ఉంది.
అయితే, ఈ దేశం సమర్ధవంతంగా టీకా పంపిణీని అమలు చేయడంతో, వ్యాక్సీన్ విషయంలో తూర్పు యూరప్‌లో చైనా- రష్యాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన పోరును కూడా తనకు అనుకూలంగా మలచుకుంది. ఈ దేశంలో రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సీన్ స్పుత్నిక్- వి, చైనా సినోఫార్మ్ కూడా అందుబాటులో ఉన్నాయి.
సెర్బియా ప్రజలకు వ్యాక్సీన్ ఇచ్చే ముందు ఫైజర్, స్పుత్నిక్, సినోఫార్మ్ సంస్థలలో ఏ వ్యాక్సీన్ కావాలో ఎంచుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చారు. నిజానికి ఇక్కడ ఎక్కువ మందికి చైనా వ్యాక్సీన్ ఇస్తున్నారు.
ఈ దేశంపై చైనా ప్రభావం దీర్ఘకాలికంగా ఉండే అవకాశం ఉంది. సినోఫార్మ్ నుంచి తొలి రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్న దేశాలు బూస్టర్ డోసుల కోసం కూడా చైనా వైపే చూస్తున్నాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా సినోఫార్మ్ వ్యాక్సీన్ పైనే ఆధారపడింది. ఈ దేశంలో ఇప్పటి వరకు ఇచ్చిన 80 శాతం టీకాలు ఈ కంపెనీకి చెందినవే. సినోఫార్మ్ సంస్థ యూఏఈలో టీకా ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది.
"చైనా కూడా మరిన్ని ఉత్పత్తి కేంద్రాలతో, శిక్షణ పొందిన సిబ్బందితో దూకుడుగా వెళ్తోంది. ఇది దీర్ఘకాలంలో చైనాకు ప్రాముఖ్యతను పెంచుతుంది" అని అగాథె అభిప్రాయపడ్డారు.
"దీంతో, వ్యాక్సీన్ కొనుగోలు చేస్తున్న దేశాలకు భవిష్యత్తులో చైనాకు మరే విషయంలోనైనా అభ్యంతరాలు చెప్పడం చాలా చాకచక్యమైన వ్యవహారంగా మారిపోతుంది" అని ఆమె అన్నారు.
అంతర్జాతీయంగా వ్యాక్సీన్ సూపర్ పవర్ అయినంత మాత్రాన ఆ దేశ జనాభా మొత్తానికీ వ్యాక్సీన్ ముందుగా చేరుతుందని చెప్పలేం.
ప్రపంచంలో వ్యాక్సీన్ ఉత్పత్తి చేస్తున్న రెండు శక్తివంతమైన దేశాలు భారత్, చైనా. అయితే, అత్యధిక జనాభా కారణంగా 2022 వరకు వ్యాక్సీన్ ప్రక్రియను ఈ దేశాలు పూర్తిగా అమలు చేయలేవని ఈయూఏ అధ్యయనం అంచనా వేస్తోంది. అంతే కాకుండా ఈ దేశాలలో వైద్య సౌకర్యాల కొరత కూడా ఉంది.
కోవిడ్ వ్యాక్సీన్ విషయంలో భారతదేశం సాధించిన విజయం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ అధినేత అదర్ పూనావాలాకు దక్కుతుంది. ఈ సంస్థ ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో వ్యాక్సీన్ ఉత్పత్తి చేస్తోంది.
కానీ, గత సంవత్సరం మధ్యలో ఆయన కుటుంబం మాత్రం ఆయనకు మతి తప్పిందని భావించారు.
ఆయన వ్యాక్సిన్లపై వేల కోట్ల రూపాయలు పందెంగా పెట్టడం మొదలుపెట్టారు. అప్పటికి అవి పని చేస్తాయో లేదో కూడా తెలియదు.
జనవరిలో ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారు చేసిన వ్యాక్సీన్లను ఆయన భారత ప్రభుత్వానికి అందచేశారు. ప్రస్తుతం ఆయన సంస్థ రోజుకు 24 లక్షల డోసుల టీకాను ఉత్పత్తి చేస్తోంది.
భారత్‌కు వ్యాక్సీన్ డోసులను సరఫరా చేస్తున్న సంస్థల్లో సీరం ఒకటి. ఈ సంస్థ బ్రెజిల్, మొరాకో, బంగ్లాదేశ్, దక్షిణ ఆఫ్రికా దేశాలకు కూడా వ్యాక్సీన్ సరఫరా చేస్తోంది.
"టీకాతో అందరినీ సంతోషపెట్టడం ఇప్పుడు మా ముందున్న పెద్ద సవాలు" అని పూనావాలా అన్నారు.
"వ్యాక్సీన్ సరఫరా చేసేందుకు చాలా మంది ఉత్పత్తిదారులు ఉంటారని అనుకున్నాను. కానీ, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కాదు కదా రెండవ త్రైమాసికానికి కూడా అందరికీ వ్యాక్సీన్ అందించేందుకు తగిన విధంగా సరఫరాలో గణనీయమైన మార్పులేమీ కనిపించవు" అని ఆయన అన్నారు.
రాత్రికి రాత్రే ఉత్పత్తిని పెంచలేమని ఆయన అంటున్నారు. "దీనికి సమయం కావాలి. సీరం ఇన్‌స్టిట్యూట్ దగ్గర ఏదో మాయాజాల ద్రవం ఉందని ప్రజలు అనుకుంటారు. మేము చేసే పనిలో మేము నిష్ణాతులమే కానీ, మా దగ్గర మాయాజాలం ఏమీ లేదు" అని ఆయన చెప్పారు.
ఆయన గత మార్చి నుంచే ఉత్పత్తి కేంద్రాలను సిద్ధం చేయడం మొదలుపెట్టడంతో పాటు ఆగష్టు నుంచి కొన్ని రకాల రసాయనాలు, గ్లాస్ వైల్స్‌ని స్టాక్ చేయడం మొదలు పెట్టడంతో ఆయనిప్పుడు మిగిలిన వారి కంటే చాలా ముందున్నారు ఉన్నారు.
వ్యాక్సీన్ ఉత్పత్తిని ఇప్పుడిప్పుడే మొదలుపెడుతున్న సంస్థలకు మాత్రం ఇది తయారు చేయడానికి చాలా రోజులు పట్టవచ్చు.
కొత్త వేరియెంట్స్‌తో పోరాడటానికి తయారు చేసే బూస్టర్ డోసులు తయారు చేయడానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.
ఈ వ్యాక్సీన్‌ని ముందుగా భారతదేశానికి, ఆ తర్వాత ఆఫ్రికాకు పంపిణీ చేసేందుకు కట్టుబడి ఉన్నామని పూనావాలా చెప్పారు.
ప్రపంచంలో ప్రతి దేశానికీ వ్యాక్సీన్ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో గవి, వ్యాక్సీన్ అలయన్స్, ది సెంటర్ ఫర్ ఎపిడెమిక్ ప్రెపేర్డ్‌నెస్ కలిసి 'కోవాక్స్'ని ప్రారంభించాయి.
టీకాలను కొనుగోలు చేసేందుకు తగిన సామర్ధ్యం లేని దేశాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిధుల ద్వారా వ్యాక్సీన్‌ని ఉచితంగా అందిస్తారు. మిగిలిన దేశాలు మాత్రం వ్యాక్సీన్ కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈ కూటమి ద్వారా వ్యాక్సీన్ సమకూర్చుకోగలిగితే వారికి వ్యాక్సీన్ సరసమైన ధరకు లభిస్తుంది.
ఫిబ్రవరి చివరి నాటికి వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు కోవాక్స్ ప్రణాళికలు చేస్తోంది. కానీ, ఇందులో భాగస్వాములైన దేశాలు కూడా వ్యాక్సీన్‌ను సమకూర్చుకోవడం కోసం సంప్రదింపులు జరుపుతున్నాయి.
ఈ భూభాగంపై ఉన్న ప్రతి ఆఫ్రికా నాయకుడూ వ్యాక్సిన్లను స్వతంత్రంగా సమకూర్చుకునేందుకు తనను సంప్రదిస్తున్నారని పూనావాలా చెబుతున్నారు. యుగాండా గత వారం సీరం ఇన్స్టిట్యూట్ నుంచి ఒక డోసుకు 7 డాలర్ల చొప్పున కోటి 80 లక్షల డోసులను సమకూర్చుకున్నట్లు ప్రకటించింది. కోవాక్స్‌కి ఇచ్చే ధర అయితే 4 డాలర్లు ఉంటుంది.
యుగాండాతో చర్చలు జరుపుతున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ తెలిపింది. కానీ, ఆ దేశంతో ఎటువంటి ఒప్పందంపై మాత్రం సంతకం చేయలేదని చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images / MARK FELIX
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఆమోదం రాగానే 200 మిలియన్ డోసుల ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌ను కోవాక్స్‌కి సరఫరా చేయనున్నట్లు పూనావాలా చెప్పారు.
ఆయన మరో 900 మిలియన్ డోసులను కూడా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, వాటిని ఎప్పటికి సరఫరా చేస్తారో మాత్రం చెప్పలేదు.
కోవాక్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన అంగీకరించారు. "కోవాక్స్ చాలా వ్యాక్సీన్ ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరుపుతోంది. చాలా సంస్థలు చెప్పే రకరకాల ధరలు, పంపిణీ చేసే సమయంలో చాలా వ్యత్యాసాలు ఉంటున్నాయి" అని ఆయన వివరించారు.
ఇలాంటి పరిస్థితుల్లో అంతా అనుకున్నట్టుగా జరిగినా సరే, ఈ ఏడాదిలో ఒక దేశ జనాభాలో 20 నుంచి 27 శాతం మందికి మాత్రమే వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తుందని అగాథె అన్నారు.
కొన్ని దేశాలు 2023 నాటికి కూడా పూర్తిగా వ్యాక్సీన్ ప్రక్రియను పూర్తి చేయలేవని ఆమె చెబుతున్నారు. ప్రతి దేశానికి వ్యాక్సీన్ పంపిణీ ప్రాముఖ్యమైన విషయం కాకపోవచ్చు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఉన్న దేశాలలో, కోవిడ్ బారిన పడే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది.
కానీ, అలా చేయడం వలన వైరస్ ఎక్కడో ఒక చోట ఉండిపోయి అది మరింత స్వరూపాన్ని మార్చుకోవడానికి కానీ, వ్యాపించడానికి కానీ వీలవుతుంది. వ్యాక్సీన్‌ని తట్టుకునే వైరస్ కూడా పెరగడం కొనసాగుతుంది.
ఇవన్నీ బాధపెట్టే విషయాలు కావు. గతంలో కంటే ఇప్పుడు వ్యాక్సిన్లను వేగంగా ఉత్పత్తి చేస్తున్నారు. కానీ, ప్రపంచ జనాభాకంతటికీ వ్యాక్సీన్ అందించే ప్రక్రియ మాత్రం చాలా విస్తృతమైన పని. ఇలాంటి పనిని గతంలో ఎప్పుడూ చేపట్టలేదు కూడా.
"ప్రభుత్వాలు చేయగలిగే పనుల గురించి ప్రజలతో నిజాయితీగా చెప్పాలి" అని అగాథె అన్నారు.
"కొన్ని సంవత్సరాల వరకు ప్రజలందరికీ వ్యాక్సీన్ ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదనే విషయాన్ని ప్రజలకు చెప్పడం ప్రభుత్వాలకు కష్టమైన పనే. ఇలా చెప్పడానికి ఎవరూ ఇష్టపడరు" అని ఆమె అన్నారు.
డేటా జర్నలిజం: బెకీ డేల్, నాసోస్ స్టైలినౌ
ఇవి కూడా చదవండి:
- మహాత్మా గాంధీ: పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఇవ్వాలన్న డిమాండే హత్యకు కారణమా?
- మెహులీ ఘోష్: జాతరలో బెలూన్లు కాల్చిన ఈ షూటర్ గురి ఇప్పుడు ఒలింపిక్స్‌పై
- గీతా గోపీనాథ్‌పై అమితాబ్ బచ్చన్ ప్రశంసల మీద ఎందుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్: హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు
- కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








