సంస్కృతం: భాష నేర్చుకోవడానికి భారత్ వచ్చి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన ఎయిర్ హోస్టెస్

ఫొటో సోర్స్, MD. MUQEEM
- రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
- హోదా, బీబీసీ హిందీ కోసం
సుమారు ఎనిమిదేళ్ల కిందట తాను చేస్తున్న ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి సంస్కృతం నేర్చుకునేందుకు స్పెయిన్ నుంచి భారత్ వచ్చారు మారియా రూయిజ్.
భాష నేర్చుకోవడానికి వచ్చారు కానీ ఏకంగా గోల్డ్ మెడలే సాధిస్తానని ఆమె అనుకోలేదు.
వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో జ్ఞానమీమాంస సబ్జెక్ట్‌లో జరిగిన ఆచార్య (ఎంఏ) పరీక్షలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యారామె.
ఇటీవల జరిగిన యూనివర్సిటీ కాన్వకేషన్‌లో మారియాకు త్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు.
సాధారణంగా ఎంఏలో జ్ఞానమీమాంస సజెక్ట్‌ను చాలా కొద్ది మాత్రమే ఎంచుకుంటారు.
"జ్ఞానమీమాంస గురించి సంస్కృతంలో అనేక పరిశోధనలు జరిగాయని భాషా శాస్రవేత్తలు, ఉపాధ్యాయులు చెప్పారు. నా ప్రశ్నలకు ఇందులో సమాధానాలు దొరుకుతాయని కూడా చెప్పారు. అందుకే సంస్కృతం చదువుకోవాలని నిర్ణయించుకున్నాను" అని మరియా బీబీసీకి చెప్పారు మారియా.

ఫొటో సోర్స్, MD. MUQEEM
భారతదేశంలో ప్రస్తుతం సంస్కృతం నేర్చుకుంటున్నవారి సంఖ్య చాలా తక్కువ. ఈ భాష ఉపాధికి పనికిరాదని అనేకమంది భావిస్తున్నారుగానీ మారియా ఇందుకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
"దీన్ని నేను ఉపాధి కోసం నేర్చుకోలేదు. జ్ఞానం కోసమే అభ్యసించాను. జ్ఞానం ముందు మిగతావన్నీ అల్పమే. ఉద్యోగమే కావాలనుకుంటే.. మిగతా భాషలకున్న అవకాశాలతో పోలిస్తే ఇందులో తక్కువేమీ లేవు" అని ఆమె అన్నారు.
ఇప్పుడు మారియా సంస్కృతంలో పీహెచ్‌డీ చేయాలని అనుకుంటున్నారు. అంతేకాకుండా, భారతదేశంలోనే ఉండిపోవాలని ఆలోచిస్తున్నారు.
మారియా ఎంఏ చేసేటప్పుడు గోడౌలియాలోని ఒక గురుకులంలో తన స్నేహితులతో పాటూ ఉండేవారు. భిన్న దేశాలకు చెందిన విద్యార్థులంతా ఇక్కడే బస చేస్తారు.
మారియా వేషధారణలో పూర్తి భారతీయురాలిలాగ కనిపిస్తారు. తన దినచర్య కూడా మిగతా గురుకుల విద్యార్థుల మదిరిగానే ఉంటుంది.
ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం కింద మారియా భారతదేశం వచ్చారు. మొదట సంస్కృతంలో ఒక సర్టిఫికెట్ కోర్స్ చేశారు.

ఫొటో సోర్స్, MD. MUQEEM
ఇక్కడకు రాక ముందు ఆమెకు స్పానిష్, జర్మన్, ఇంగ్లిష్ భాషలు వచ్చు. కానీ, హిందీ, సంస్కృతం ఒక్క ముక్క కూడా తెలియవు. కానీ ఇప్పుడామె ఆ రెండు భాషల్లోనూ అనర్గళంగా మట్లాడగలరు. ఆమె తన ఉపాధ్యాయులతోనూ, తోటి విద్యార్థులతోనూ సంస్కృతంలోనే మాట్లాడతారు.
మారియా ఉండే వేద గురుకులంలో సుమారు 50మంది పిల్లలు ఉంటారు. వారందరికీ ఆమె సంస్కృతంతో పాటూ ధ్యానం, యోగా కూడా నేర్పిస్తున్నారు.
అక్కడ వారి దినచర్య తెల్లవారుజామున మూడు గంటలకు మొదలవుతుందని, పదకొండు గంటలకు తాను యూనివర్సిటీకి వెళతానని మరియా చెప్పారు.
భాష నేర్చుకోవడానికి కృషి చేయాల్సి వచ్చింది కానీ కష్టంగా అనిపించలేదని ఆమె అన్నారు.
"అ, ఆ, ఇ, ఈ లతో మొదలుపెట్టి ఎంఏ వరకూ ఎలా చదివేశారని అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఇక్కడి భాష, సంస్కృతం నేర్చుకోగలనో లేదోనని నాకు కూడా మొదట్లో సందేహంగానే ఉండేది. కానీ చాలా సులువుగా నేర్చేసుకున్నాను. విశ్వవిద్యాలయంలో నా గురువులు నాకు చాలా సహాయం చేశారు. వారే లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు" అని మారియా చెప్పారు.

ఫొటో సోర్స్, MD. MUQEEM
మారియా కుటుంబం స్పెయిన్‌లోనే ఉంది. ఆమెకు ఇద్దరు సోదరులు ఉన్నారు. ఒకరు ఇంజినీర్, మరొకరు ఇంకా చదువుకుంటున్నారు.
వారణాసి రాక ముందు మారియా బ్రిటిష్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పని చేసేవారు. అందులో ఆమెకు మంచి జీతమే వస్తుండేది.
స్పెయిన్‌లో ఆమె సోషల్ వర్క్‌లో గ్రాడ్యువేషన్ చేశారు. వారణాసిలో శాస్త్రి (బీఏ), ఆచార్య (ఎంఏ) పూర్తి చేశారు.
"ఇక్కడ భారతీయ విద్యార్థులు, విదేశీ విద్యార్థులు సమానంగా చదువుతారు. మేము కూడా అందరినీ సమానంగానే చూస్తాం. విదేశీ విద్యార్థులకు ప్రారంభంలో భాషా సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వాటిని అధిగమించడానికి ఉపాధ్యాయులుగా మేము మా పూర్తి సహకారం అందిస్తాం" అని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో జ్ఞానమీమాంస విభాగం అధిపతి ప్రొఫెసర్ కమలకాంత్ త్రిపాఠి తెలిపారు.
"మారియా పట్టభద్రురాలైన జ్ఞానమీమాంస సబ్జెక్ట్‌ను భారతీయుల్లో కూడా చాలా తక్కువమందే అభ్యసిస్తారు. 200 ఏళ్ల విశ్వవిద్యాలయ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక విదేశీ విద్యార్థి టాపర్ అయ్యారు. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జ్ఞానమీమాంసలో వేదకాలం నాటి ఆచారాలు, తత్వశాస్త్రాన్ని అభ్యసిస్తారు. ఇది చాలా కష్టం. వాటిని మరియా బాగా అర్థం చేసుకోవడమే కాకుండా అందులో ప్రథమ షానం పొందారు" అని విశ్వవిద్యాలయంలో సాహిత్యం, తత్వశాస్త్రం బోధించే డా. దేవాత్మా దుబే అన్నారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: 'చీకటి పడిన తరువాత ఇక్కడికి రావాలంటే మగవాళ్లమే భయపడతాం.. అలాంటిది ఆమె ఇక్కడ ఉంటోంది'
- సంచయిత గజపతిరాజు ఇంటర్వ్యూ: 'గుడికి వెళ్తే చీర కట్టుకుని, బొట్టు పెట్టుకుని వెళ్తా.. సినిమాకి వెళ్తే ప్యాంట్, షర్ట్ వేసుకుంటా'
- తెలుగు సినిమాల్లో మహిళలు: నటనలోనే కాదు... సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు
- కుక్కను తోడేలుగా చూపేందుకు ప్రయత్నించిన జూ... వీడియో వైరల్
- భారత్ సాయం లేకుండా ప్రపంచ కోవిడ్ వ్యాక్సీన్ కల నెరవేరదు... ఎందుకంటే...
- ఇంటి పని ఆడవాళ్లే చేయాలా.. వేతనం లేని ఈ పని మానేస్తే ఏం జరుగుతుంది
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- చింతల వెంకటరెడ్డి: మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- అక్షర్ పటేల్: ఒకప్పటి ఫాస్ట్‌బౌలర్ ఇప్పుడు సంచలన స్పిన్నర్‌గా ఎలా మారాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








