తెలుగు సినిమాల్లో మహిళలు: నటనలోనే కాదు... సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు

ఫొటో సోర్స్, NandiniReddy/FB
- రచయిత, సౌమ్య ఆలమూరు
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలుగు సినిమా షూటింగుల్లో సాధారణంగా మహిళా సినిమాటోగ్రాఫర్లు కానీ ఇతర మహిళా టెక్నీషియన్లు కానీ కనిపించరు. లైట్ బాయ్ ఉంటాడు కానీ, లైట్ గర్ల్, కెమేరా వుమన్ అంటూ ఎవరూ ఉండరు.
అంతెందుకు, కొరియోగ్రాఫర్లు, రచయితలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లలో ఎంతమంది మహిళలున్నారు?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్న మహిళా టెక్నీషియన్లు ఎంతమంది?
దీనికి జవాబు మనకు చాలా నిరాశాజనకంగా అనిపించవచ్చు.
తొలి తెలుగు దర్శకురాలిగా గుర్తింపు పొందిన భానుమతీ రామకృష్ణ, అత్యధికంగా 42 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డ్ సృష్టించిన విజయనిర్మల లాంటి ప్రతిభావంతులు పని చేసిన పరిశ్రమలో ఇప్పటివరకు మెగాఫోన్ చేతబట్టిన మహిళలు పట్టుమని పది మంది కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించకమానదు.
ఇప్పటివరకూ తెలుగు సినిమా తెర వెనుక విభాగాల్లో పని చేసిన మహిళలను వేళ్లపై లెక్కించొచ్చు.

ఫొటో సోర్స్, Dr.BhanumatiRamakrishna Nalo nenu book
మహిళా దర్శకులు ఎంతమంది?
1953లో ‘చండీరాణి’ సినిమాకు దర్శకత్వం వహించిన పి. భానుమతి తొలి తెలుగు సినీ దర్శకురాలు.
ఈ సినిమాను ఏక కాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తీశారు. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేశారు.
అంతేకాకుండా, చండీరాణి సినిమా కథను అందించడంతో పాటు తన భర్త రామకృష్ణతో కలిసి నిర్మాణ సారథ్యం కూడా వహించారు.
1939లో వరవిక్రయం సినిమాతో నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన భానుమతి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సుమారు వంద చిత్రాల్లో నటించడమే కాక సుమారు 14 చిత్రాలకు దర్శకత్వం వహించారు. నేపథ్య గాయనిగా కొన్ని వందల పాటలు పాడారు.
నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా, కథా రచయితగా, నిర్మాతగా తెలుగు సినిమాలలో భానుమతిది ఒక ప్రత్యేక అధ్యాయం.
మెగాఫోన్ పట్టిన వరలక్ష్మి
ఆ తరువాత పదిహేనేళ్లకు 1968లో నటి జి. వరలక్ష్మి స్వయంగా కథ రాసి ‘మూగజీవులు’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు.
రంగస్థల నటి అయిన వరలక్ష్మి 1940లో సినీరంగ ప్రవేశం చేసి ఎన్నో సినిమాలలో హీరోయిన్‌గా, సహాయ నటిగా అనేక పాత్రలు పోషించారు.

ఫొటో సోర్స్, v.govindarao
మహిళల టీంతో సావిత్రి ప్రయోగం
అదే సంవత్సరంలో మహానటి సావిత్రి కూడా మెగాఫోన్ చేతబట్టి ‘చిన్నారి పాపలు’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విఫలమైనప్పటికీ, విమర్శకుల మెప్పు పొందింది.
ఆ ఏడాది రెండో ఉత్తమ చలన చిత్రంగా నంది అవార్డ్ అందుకుంది.
కాగా, చిన్నారి పాపలు చిత్రానికి తెర వెనుక విభాగాల్లో ఎక్కువమంది మహిళలే పనిచేయడం విశేషం.
రచన, నిర్మాణ సారథ్యాన్ని సరోజిని చేపట్టగా, ప్రముఖ నేపథ్య గాయని పి.లీల సంగీత దర్శకత్వం వహించారు. కళా దర్శకత్వం, నృత్య దర్శకత్వాలను వరుసగా మోహన, రాజసులోచన నిర్వహించారు.
ఆ తరువాత, సావిత్రి తెలుగు, తమిళ భాషల్లో మరో ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఫొటో సోర్స్, FACEBOOK/NARESH
42 చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ నిర్మల
1972లో 'కవిత’ అనే మలయాళ సినిమాతో దర్శకత్వ శాఖలోకి అడుగుపెట్టిన విజయనిర్మల తెలుగులో తీసిన తొలి సినిమా ‘మీనా’ (1973).
మలయాళ చిత్రసీమలో తొలి మహిళా దర్శకురాలు ఆమె.
1953లో బాల నటిగా సినిమాల్లోకి వచ్చిన విజయనిర్మల తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో 200లకు పైగా చిత్రాల్లో నటించారు.
దర్శకత్వం మీద మక్కువతో మెగాఫోన్ పట్టుకుని ఏకంగా 42 చిత్రాలకు దర్శకత్వం వహించారు. దాంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆమె చోటు సంపాదించుకున్నారు.

ఫొటో సోర్స్, facebook
బి.జయ, జీవిత, సుచిత్ర చంద్రబోస్
ఈ వరుసలో తరువాత వచ్చిన దర్శకురాలు బి. జయ. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన జయ 2003లో ‘చంటిగాడు’ సినిమాతో దర్శకత్వంలోకి అడుగుపెట్టారు.
ఈ సినిమా సూపర్ హిట్ అయి 100 రోజులు ఆడింది. తరువాత గుండమ్మగారి మనవడు (2007), లవ్లీ (2012) చిత్రాలతో సహా ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించారు.
నటి జీవిత 2002లో ‘శేషు’ సినిమాతో దర్శకురాలిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తరువాత ఎవడైతే నాకేంటి (కో డైరెక్టర్), సత్యమేయ జయతే, మహంకాళి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
కొరియోగ్రాఫర్‌గా పలు చిత్రాలను నృత్య దర్శకత్వం వహించిన కే సుచిత్రా చంద్రబోస్ 2004లో ‘పల్లకిలో పెళ్లికూతురు’ చిత్రానికి కథ, దర్శకత్వం అందించారు.

ఫొటో సోర్స్, facebook/nandini reddy
నందిని రెడ్డి
కొత్త తరం మహిళా దర్శకుల్లో వరుస హిట్లతో నందినీ రెడ్డి ముందుకు దూసుకుపోతున్నారు.
2011లో విడుదలైన ‘అలా మొదలైంది’ చిత్రంతో దర్శకురాలిగా తెలుగు తెరకు పరిచయమైన నందిని జబర్దస్త్ (2013), కల్యాణ వైభోగమే (2016), ఓ బేబీ (2019) సినిమాలకు దర్శకత్వం వహించారు.
వీటిల్లో ఓ బేబీ బ్లాక్ బస్టర్ హిట్టన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘పిట్టకథలు’ సినిమాకు దర్శకత్వం వహించిన ఐదుగురిలో నందిని ఒకరు.
మంజుల, సుధ కొంగర..
అతి కొద్ది చిత్రాల్లో మాత్రమే నటించిన మంజుల ఘట్టమనేని 2018లో ‘మనసుకు నచ్చింది’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఐదు చిత్రాలకు నిర్మాణ సారథ్యం వహించారు. ఆమె ప్రొడ్యూస్ చేసిన షో (2002) సినిమాకు తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది.
తమిళ దర్శకుడు మణిరత్నం దగ్గర ఏడేళ్లు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన సుధ కొంగర 2008లో ‘ఆంధ్రా అందగాడు’ సినిమాతో దర్శకత్వంలోకి అడుగుపెట్టారు. తెలుగులో గురు (2017) సినిమాతో హిట్టు కొట్టారు. ఇప్పటివరకు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏడు చిత్రాలకు దర్శకత్వం వహించారు.
1970ల నుంచీ 90ల వరకూ అనేక తెలుగు చిత్రాల్లో నటించిన శ్రీ ప్రియ తెలుగులో సూపర్ హిట్ అయిన మలయాళ రీమేక్ దృశ్యం (2014) సినిమాకు దర్శకత్వం వహించారు.
ఇంకా, శ్రీవిద్య బసవ (మధ), శశి కిరణ్ నారాయణ (సాహెబా సుబ్రమణ్యం), మధుమిత (మూడు ముక్కల్లో చెప్పాలంటే), శ్రీ రంజని (రంగుల రాట్నం), చునియా (పడేసావే), సంజనా రెడ్డి (రాజుగాడు).. ఇలా నవతరం అమ్మాయిలు దర్శకత్వంలోకి అడుగుపెడుతున్నారు.
తెలుగు సినిమాల్లో ఒక్క మహిళా ఎడిటర్ కూడా లేరు
1931లో తొలి తెలుగు టాకీ సినిమా విడుదల అయిన దగ్గరనుంచీ ఇప్పటివరకూ తెలుగు చిత్రసీమలో ఒక్క మహిళా ఎడిటర్ కూడా లేరు.
అలాగే సినిమాటోగ్రఫీలో కూడా మహిళలు లేరు.
గత కొద్ది కాలంగా హిందీ, తమిళ సినీ రంగాల్లో మహిళా ఎడిటర్లు, సినిమాటోగ్రాఫర్లు తమ సత్తా చాటుకుంటున్నారు. కానీ తెలుగులో ఇంకా ఈ విభాగాల్లో మహిళలు అడుగు పెట్టాల్సి ఉంది.

ఫొటో సోర్స్, chaitnya pingali
సినీ గేయ సాహిత్యంలో తొలి అడుగు
తెలుగు సినిమాల్లో పాట రాసిన తొలి మహిళ శ్రేష్ఠ.
2012లో ‘ఒక రొమాటిక్ క్రైం కథ’ చిత్రం ద్వారా శ్రేష్ఠ పాటల రచయిత్రిగా పరిచయమయ్యారు. పెళ్లి చూపులు (2016), అర్జున్ రెడ్డి (2017) లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ఆమె పాటుల రాశారు.
‘చినుకు తాకే’ (పెళ్లిచూపులు), ‘మధురమే’ (అర్జున్ రెడ్డి), ‘కళ్లల్లో కలవరమై’ (దొరసాని) పాటలతో ఆమె అనేకమంది అభిమానులను సంపాదించుకున్నారు.
గత నాలుగేళ్లుగా సినీ గేయ సాహిత్యంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మి ప్రియాంక.. సప్తగిరి ఎల్ఎల్‌బీ (20017), గౌతమి (2018), సూపర్ స్కెచ్ (2018), హవా (2019) చిత్రాలకు పాటలు అందించారు.
శేఖర్ కమ్ముల టీమ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న చైతన్య పింగళి.. ఫిదా (2017) సినిమాలో ‘ఊసుపోదు ఊరుకోదు’ పాటతో సినీ గేయ రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఫొటో సోర్స్, facebook/mm srilekha
సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీ లేఖ
తెలుగు సినిమాల్లో అలనాటి హీరోయిన్లు తాము పాడిన పాటలకు బాణీలు కట్టిన సందర్భాలు ఉన్నాయిగానీ సినిమాలకు పూర్తి స్థాయి సంగీత దర్శకులుగా వ్యవహరించినవారు లేరు.
ఆ ఘనత ఎంఎం శ్రీలేఖకే దక్కుతుంది.
తెలుగు సినీ పరిశ్రమలో ఏకైక సంగీత దర్శకురాలిగా గుర్తింపు పొందిన శ్రీలేఖ 50కి పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.
మహిళా కొరియోగ్రాఫర్లు
తెలుగు సినిమాల్లో మహిళా కొరియోగ్రాఫర్లు చాలా కొద్దిమందే ఉన్నారు.
ఆఖరి పోరాటం (1988) నుంచీ గోపాలా గోపాలా (2015) వరకూ ఎన్నో చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించిన సుచిత్రా చంద్రబోస్, చిలకపచ్చ కాపురం (1995) నుంచీ గౌతమీపుత్ర శాతకర్ణి (2017) వరకూ పలు సూపర్ హిట్ చిత్రాలకు డాన్స్ మాస్టర్‌గా పనిచేసిన స్వర్ణ మాస్టర్ వీరిలో ప్రముఖులు.
అలాగే బృందా మాస్టర్, తార మాస్టర్, రేఖా మాస్టర్, వైభవి మర్చంట్, పోనీ వర్మ, ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్లు సరోజ్ ఖాన్, ఫరా ఖాన్ కూడా కొన్ని తెలుగు చిత్రాల్లోని పాటలకు నృత్య దర్శకత్వం వహించారు.
నవతరానికి ప్రతినిధిగా ఆనీ మాస్టర్ (అనితా లామా) ఇప్పుడిప్పుడే కొరియోగ్రఫీలో కుదురుకుంటున్నారు. డార్జిలింగ్‌కు చెందిన అనితా లామా హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. 13 ఏళ్లకే జెమినీ టీవీలో వచ్చే ‘డాన్స్ బేబీ డాన్స్’ ప్రోగ్రాంలో పాల్గొని ఫైనల్లో గెలిచారు. డాన్స్ మీద ఆసక్తితో సినిమాల్లో వచ్చారు. 300లకు పైగా చిత్రాలకు నృత్య విభాగంలో అసిస్టంట్‌గా పని చేశారు. ఎట్టకేలకు, జ్యోతిలక్ష్మి (2015) సినిమాతో కొరియోగ్రాఫర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Neeraja kona
డబ్బింగ్ ఆర్టిస్టులు, కాస్ట్యూం డిజైనర్లు
డబ్బింగ్‌నే తన ఇంటి పేరుగా చేసుకున్న జానకి, ఎస్పీ శైలజ, శిల్ప మొదలుకొని సింగర్ సునీత, సవితా రెడ్డి, చిన్మయి వరకూ తెర వెనుక తమ గొంతులతో తెరపై పాత్రలకు ప్రాణం పోస్తున్న వారున్నారు.
ముఖ్యంగా సవితా రెడ్డి, చిన్మయిలాంటివారు డబ్బింగ్‌కు ఒక క్రేజ్ తీసుకొచ్చారు.
కాస్ట్యూం డిజైనర్లలో.. హైదరాబాదీ డిజైనర్ అస్మిత మార్వ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టిన తొలి హైదరాబాదీ కాస్ట్యూం డిజైనర్ ఆమె. 1990లలో ఆమె అనేకమంది తెలుగు హీరో హీరోయిన్లకు కాస్ట్యూం డిజైనర్‌గా వ్యవహరించారు.
నీరజ కోన.. బాద్షా (2013), గుండెజారి గల్లంతయ్యిందే (2013), అత్తారింటికి దారేది (2013), ఎవడు (2014)తో సహా పలు చిత్రాలకు స్టైలిస్ట్‌గా పని చేశారు. ఈమె హీరోయిన్ సమంతకు వ్యక్తిగత స్టైలిస్ట్ కూడా.
రూప వైట్ల.. దూకుడు (2011), బాద్షా (2013), జబర్దస్త్ (2013), ఆటోనగర్ సూర్య (2014), ఆగడు (2014) చిత్రాలకు కాస్ట్యూం డెజైనర్‌గా పని చేశారు.
దీపా చందర్.. మిస్సమ్మ (2003) సినిమాలో భూమికకు కాస్ట్యూం డిజైనర్‌గా తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టారు. అనసూయ (2007), కంత్రి (2008), శంకర్ దాదా జిందాబాద్ (2007), అరుంధతి (2009)తో సహా పలు చిత్రాలకు స్టైలిస్ట్‌గా వ్యవహరించారు.
అలాగే, దర్శకుడు రాజమౌళి చిత్రాలకు రమా రాజ మౌళి, సినీ నటుడు పవన్ కల్యాణ్ చిత్రాలకు రేణూ దేశాయ్ కాస్ట్యూం డిజైనర్లుగా వ్యవహరించారు.
మహిళా నిర్మాతలు
తెలుగు సినిమాల్లో మహిళా ప్రొడ్యూసర్ల గురించి చెప్పాలంటే పాత తరం నటి కన్నాంబ నుంచీ మొదలుపెట్టాలి.
తెలుగు సినిమా తొలినాళ్లల్లో వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన పసుపులేటి కన్నాంబ తన భర్త కడారు నాగభూషణంతో కలిసి సుమారు 30 చిత్రాలను నిర్మించారు.
1935లో విడుదలైన ‘హరిశ్చంద్ర’ సినిమాలో చంద్రమతి పాత్రతో కన్నాంబ నాటక రంగం నుంచీ సినీ రంగానికి చేరుకున్నారు. అప్పటినుంచీ తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సుమారు 150 చిత్రాల్లో నటించారు. ఆమె గాయని కూడా. తనకే సొంతమైన కంచు కంఠంతో ఎన్నో పాటలు, పద్యాలు పాడారు.
1941లో రాజరాజేశ్వరీ ఫిల్మ్స్ సంస్థను స్థాపించి పలు చిత్రాలకు నిర్మాణ సారథ్యాన్ని వహించారు.
అదే కోవలో అలనాటి నటి లక్ష్మీరాజ్యం కూడా 1951లో రాజ్యం పిక్చర్స్ నిర్మాణ సంస్థను నెలకొల్పి 11 సినిమాలు నిర్మించారు. వీటిల్లో ఎన్.టి. రామారావు నటించిన రాజు పేద (1954), నర్తనశాల (1963), విమల (1960) ప్రముఖమైనవి.
తరువాత చెప్పుకోవల్సింది ఆనాటి ఫేమస్ హీరోయిన్ అంజలీదేవి గురించి. 1953 నుంచీ తమ అంజలీ పిక్చర్స్ సంస్థ ద్వారా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 25కు పైగా చిత్రాలను నిర్మించారు. వాటిల్లో చెప్పుకోదగ్గవి అనార్కలి (1955), సువర్ణసుందరి (1957), భక్త తుకారాం (1973).
అలాగే 1930ల నుంచీ 1950ల దాకా పలు చిత్రాల్లో నటించిన సి. కృష్ణవేణి కూడా శోభనాచల స్టూడియోస్ పేర ఒక అరడజను చిత్రాలను నిర్మించారు. వీటిల్లో ఎన్.టి. రామారావు నటించిన తొలి సినిమా మనదేశం (1949) కూడా ఒకటి.
ఈ మధ్య కాలంలో ప్రొడక్షన్ పగ్గాలు పుచ్చుకున్నవారు.. మంచు లక్ష్మి (జుమ్మంది నాదం, ఊ కొడతారా..ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి), సునీత తాటి (ఓ బేబీ, కొరియర్ బాయ్ కల్యాణ్), స్వప్న దత్ (మహానటి, ఎవడే సుబ్రమణ్యం, సుభాష్ చంద్రబోస్), ప్రియాంక దత్ (బాణం, శక్తి, జాతిరత్నాలు).
కాలం మారుతోంది..
గత దశాబ్దకాలంగా తెలుగు సినీ పరిశ్రమలో మంచి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, తెర వెనుక వివిధ సాంకేతిక రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తోందని నవతరం మహిళా టెక్నీషియన్లు అంటున్నారు.
"ట్రెండ్ మారుతోంది. ఇప్పుడు చాలామంది తాము చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి సినిమా మీద ఇష్టంతో ఇండస్ట్రీలోకి వస్తున్నారు. వారంతా మంచి సినిమాలు చేయాలని తపన పడుతున్నారు. ఆడ, మగ బేధాలు పక్కనపెట్టి అవుట్‌పుట్ మీదే దృష్టి పెడుతున్నారు. నేను వృత్తిపరంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అయినా కళల మీద మక్కువతో సినిమాల్లో పాటలు రాయడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాను. ఈ రంగంలో ఎంతోమంది సీనియర్లు, సహోద్యోగులు నాకు అండగా ఉంటున్నారు. అడిగినప్పుడల్లా మంచి సలహాలు ఇస్తున్నారు. నాకైతే ఏ ఇబ్బందీ లేదు" అని లక్ష్మీ ప్రియాంక చెప్పారు.
"శేఖర్ కమ్ముల ఎప్పటినుంచో అసిస్టెంట్ డైరెక్టర్లుగా మహిళలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఎక్కువమంది అమ్మాయిలు ఈ ఫీల్డ్‌లోకి ధైర్యంగా వస్తున్నారు. వారిని ప్రోత్సహించేలా పరిశ్రమ వాతావరణం కూడా మారుతోంది. రాబోయే పదేళ్లల్లో మహిళా టెక్నీషియన్ల సంఖ్య ఇంకా పెరుగుతుంది" అని చైతన్య పింగళి ఆశాభావం వ్యక్తం చేశారు.
“సినీ రంగంలో హీరోయిన్‌లే కాదు, ప్రతి ఒక్కరూ ఇబ్బందులకు గురవుతూనే ఉంటారు. బయటకు చెప్పకుండా లోలోపల కుమిలిపోతూ ఉంటారు. బయటకి చెబితే ఎటువంటి సమస్యలు తలెత్తుతాయో అని భయపడుతూ ఉంటారు. అసభ్యకర ప్రపోజల్స్ కారణంగా నేను ఒక సినిమాను మధ్యలో వదిలి పెట్టాల్సి వచ్చింది. సినిమాలోకి వస్తున్నారంటే అన్నిటికీ సిద్ధంగా ఉన్నారనే అభిప్రాయంతో ఉంటారు. నన్ను కూడా చాలా మంది.. ఇలా ఎంత రాసుకున్నా, నువ్వు పైకి ఎదగలేవు, నేను చెప్పినట్లు వింటే నీకు ఒక కార్ కొంటాను లేదా ఫ్లాట్ కొంటాను అని మొదలు పెట్టేవారు. దీంతో, నేను 2 సంవత్సరాలకు పైగా కెరీర్‌ను వదులుకున్నా. నన్ను ఇబ్బందికి గురి చేయని మనుషులు దొరికిన తరువాత నేను మళ్ళీ ఫీల్డ్‌కి వచ్చాను. నేను ఎవరినైతే కాదన్నానో, వారు నాకు అవకాశాలు ఇవ్వలేదు. ఇప్పుడు అలా కాదు. నన్నూ నా పనినీ గౌరవించేవాళ్లే ఇప్పుడు అవకాశాలు ఇస్తున్నారు. ఇక్కడ సెంటిమెంట్‌లకు ప్రాధాన్యం ఇస్తారు. ఒకరికి విజయం వస్తే ఎక్కడెక్కడినుంచైనా వచ్చి చుట్టూ చేరుతారు. కానీ ఒక్క ఓటమి దగ్గరి వారిని కూడా దూరం చేసేస్తుంది. విజయం వచ్చాక ఇటువంటి ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి" అని శ్రేష్ఠ గతంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- హాథ్రస్: అమ్మాయిని వేధించి జైలుకెళ్లారు.. తిరిగొచ్చాక ఆమె తండ్రి ప్రాణం తీశారు - గ్రౌండ్ రిపోర్ట్
- సిరాజ్: తండ్రి కల నెరవేర్చాడు.. కానీ చూసి సంతోషించడానికి ఆ తండ్రి ఇప్పుడు లేరు
- చైనా: ‘అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- ఉత్తరాఖండ్: వరద వేగానికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయ్
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








