రజిని చాండీ: 'సెక్సీ ఫొటోలు' షేర్ చేస్తారా అంటూ 69 ఏళ్ల సినీ నటిని ట్రోల్ చేస్తున్నారు

రజిని చాండీ

ఫొటో సోర్స్, Athira Joy

మలయాళీ నటి 69 ఏళ్ల రజిని చాండీ తన ఫొటోషూట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఈ మధ్యే ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. అయితే, ఆ ఫొటోలు వైరల్ అవుతాయని, వాటిని విపరీతంగా ట్రోల్ చేస్తారని ఆమె ఊహించలేదు.

గృహిణిగా ఉంటూ సినీ నటిగా మారిన రజిని సాధారణంగా చీరల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటారు. కానీ, ఆమె షేర్ చేసిన ఫొటోల్లో జంప్‌సూట్, పొడువైన గౌన్లు, పాత చిరిగిన జీన్స్, పొట్టి డెనిమ్ గౌనులో కనిపించారు. కొన్ని ఫొటోల్లో తోటనుంచీ తాజాగా కోసుకొచ్చిన తెల్లని పూవులను తలచుట్టూ కిరీటం లాగ పెట్టుకుని కనిపించారు.

కేరళకు చెందిన రజిని ఫొటోలను అందం, ఆత్మవిశ్వాసంతో నిండినవాటిగా అభివర్ణిస్తూ "బోల్డ్ అండ్ బ్యూటిఫుల్" అని స్థానిక మీడియా ప్రశంసించింది.

అయితే, సంప్రదాయ దుస్తులు అధికంగా ధరించే కేరళ రాష్ట్రంలో రజిని ఫొటోలు తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి.

రజిని చాండీ

ఫొటో సోర్స్, Athira Joy

ఫొటో క్యాప్షన్, ఈ ఫోటో షూట్ సరదాగా చేశానని చెప్పిన రజిని చాండీ

ఈ ఫొటోషూట్‌ను 29 ఏళ్ల ఆతిరా జాయ్ నిర్వహించారని రజిని చాండీ బీబీసీకి తెలిపారు. ఆతిరా ఎక్కువగా సాంప్రదాయేతర ఫొటోలు తీస్తుంటారు.

ఇంచుమించు అదే వయసున్న తన తల్లికన్నా రజిని విభిన్నంగా కనిపించారని, అందుకే ఆమె ఫొటో షూట్ చేయాలనుకున్నానని ఆతిరా తెలిపారు.

"సాధారణంగా భారతీయ మహిళలు, పెళ్లి తరువాత పిల్లలు అంటూ ఆ బంధాల్లోనే చిక్కుకుపోతారు. 60 ఏళ్ల తరువాత ఇంక వారికి జీవితం మీద ఆశ పోతుంది. మనవలు, మనవరాళ్లను చూసుకుంటూ శేష జీవితం గడిపేస్తారు.

మా అమ్మకు 65 ఏళ్లు. ఆమె ఒక సాధారణ భారతీయ మహిళ. 60 ఏళ్ల తరువాత వచ్చే అన్ని రకాల ఆరోగ్య సమస్యలతోనూ సతమతమవుతున్నారు.

కానీ, రజిని అలా కాదు. తను గురించి తాను శ్రద్ధ తీసుకుంటారు. అందంగా, ఆరోగ్యంగా ఉన్నారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం నిండిన మహిళ, ఫ్యాషనబుల్‌గా కూడా ఉంటారు. ఆమెకు 69 ఏళ్లు. కానీ ఆమె మనసులో ఆమెకు 29 ఏళ్లే... అచ్చం నాలాగే" అని ఆతిరా అన్నారు.

సంప్రదాయ కేరళ సమాజంలో రజిని రజిని చాండీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. మొదట్లో రజిని దంపతులు ముంబైలో నివాసం ఉండేవారు. ఆమె భర్త ఒక విదేశీ బ్యాంకులో పనిచేసేవారు. 1995లో ముంబై నుంచి కేరళకు తిరిగి వచ్చిన తరువాత రజిని జీన్స్ ధరించి, లిప్‌స్టిక్ పూసుకుని బయటకు వస్తే జనం వింతగా చూసేవారు.

రజిని చాండీ

ఫొటో సోర్స్, Athira Joy

ఒకసారి స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుంటే అందరూ మందలించారని రజిని చెప్పారు.

అయితే, తన సాహసిక నిర్ణయాలతో రజిని గత కొన్నేళ్లుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

2016లో 65 ఏళ్ల వయసులో సినీనటిగా రంగప్రవేశం చేశారు. 'ఒరు ముత్తాసి గద’ అనే మలయాళ సినిమాలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

తరువాత మరో రెండు సినిమాల్లో నటించడమే కాకుండా, మలయాళ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.

వయసు పైబడిన తరువాత కూడా జీవితాన్ని ఎంతో బాగా ఆస్వాదించొచ్చు అని వృద్ధులకు నమ్మకం ఇవ్వడానికే ఈ ఫొటోషూట్ చేశానని రజిని చెప్పారు.

"వయసులో ఉన్నప్పుడు పెళ్లి, పిల్లలతోనే జీవితం గడిచిపోతుంది. పిల్లలని పెంచడంలో నిమగ్నమైపోయి తమ ఆశలను, కలలను బీరువాలో పెట్టి తాళం వేసేస్తారు. బాధ్యతలు తీరేటప్పటికి వయసు మీద పడిపోతుంది. సమాజం ఏమనుకుంటుందో అనే భయంతో తమకు నచ్చిన పనులు చేయడానికి వెనుకాడతారు. ఎవరినీ బాధపెట్టకుండా ఉన్నంతవరకూ మనకు నచ్చిన విధంగా మనం బతకొచ్చు అని నేను నమ్ముతాను.

నాకు జీవితంలో బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు ఖాళీ సమయం దొరికింది. నాకు ఏది ఆనందాన్ని ఇస్తుందో అది చేస్తున్నాను. డ్రమ్స్ వాయించడం నేర్చుకుంటున్నాను. ఇది నేర్చుకుని కచేరీలు చేసేయాలని కాదు. ఊరికే సరదాకి నేర్చుకుంటున్నాను" అని రజిని చెప్పారు.

ఫొటోషూట్ కూడా సరదాకే చేశాను అని ఆమె చెప్పారు. "ఫొటో సూట్ చేస్తారా అని డిసెంబర్‌లో ఆతిర నన్ను అడిగారు. ఆధునిక దుస్తులు ధరించాల్సి ఉంటుంది, మీకేమైనా అభ్యంతరమా అని అడిగారు. అలా ఏం లేదు, నేను వయసులో ఉన్నప్పుడు మోడర్న్ దుస్తులే ధరించేదాన్ని అని చెప్పాను. నా దగ్గర స్విమ్ సూట్‌లో తీసుకున్న ఫొటో కూడా ఉంది" అని రజిని తెలిపారు.

ఆతిర ప్రతిపాదన తనకు ఆసక్తికరంగా అనిపించిందనీ, విదేశాలు వెళ్లినప్పుడు అక్కడి వృద్ధులు మోడర్న్ దుస్తులు వేసుకుని, స్టయిల్‌గా కనిపిస్తే ముచ్చటగా ఉండేదని రజిని చెప్పారు.

"కానీ, నా భర్త ఒప్పుకుంటేనే ఫొటోషూట్ చేస్తానని ఆతిరకు చెప్పాను. తను నా భర్తతో మాట్లాడారు. ఇది తన జీవితం, తన ఇష్టం...రజినికి ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు అని ఆయన చెప్పారు.

ఆతిర తీసుకొచ్చిన బట్టలు చూసి మొదట షాక్ అయ్యాను. ఇలాంటి బట్టలు వేసుకుని, ఇంత సెక్సీగా కనిపించి చాలా కాలమైంది. కానీ, ఒకసారి వేసుకున్నాక, నాకు సౌకర్యంగానే అనిపించింది" అని రజిని చెప్పారు.

రజిని మహిళాలోకానికి స్ఫూర్తి అని ఫోటోగ్రాఫర్ అతిరా అన్నారు

ఫొటో సోర్స్, Athira Joy

ఫొటో క్యాప్షన్, రజిని మహిళాలోకానికి స్ఫూర్తి అని ఫోటోగ్రాఫర్ అతిరా అన్నారు

డిసెంబర్ చివర్లో కొచ్చిలో ఉన్న రజిని సొంత ఇంట్లో ఫొటోషూట్ చేశారు. 20 ఫొటోలు తీశారు. ఆ ఫొటోలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలలో పోస్ట్ చేశాక అభినందనలు, విమర్శలు కూడా వెల్లువెత్తాయి. స్థానిక మీడియా వాటిని ప్రచురించింది.

రజినికి అనేక ప్రశంసలు వచ్చాయి. వయసు ఒక అంకె మాత్రమేననీ మీరు నిరూపించారని, అందంగా ఉన్నారని, ధైర్యసాహసాలు కలిగినవారని, హాట్‌గా ఉన్నారని కూడా పొగిడారు.

తన ఆత్మవిశ్వాసాన్ని పలువురు కొనియాడారు. అభిమానులు రజిని ఫోన్ నంబర్ కనుక్కుని వాట్సాప్‌ ద్వారా ఫోన్ చేసి "మీరు చాలా బావున్నారు ఆంటీ" అని ప్రశంసించారు.

అయితే, వెనువెంటనే విమర్శలు, తిట్లు కూడా రావడం మొదలయ్యాయి.

"నన్ను అసభ్య పదజాలంతో తిట్టారు. నువ్వు ఇంకా చచ్చిపోలేదా? అని అడిగారు. ఇంట్లో కూర్చుని బైబిల్ చదువుకోమని సలహాలిచ్చారు. ఈ వయసులో ఒళ్లు చూపించుకుంటూ తిరగకుండా ఇంట్లో కూర్చుని పూజలు పునస్కారాలు చేసుకోవాలని అన్నారు. నేనొక పాత ఆటో రిక్షాలాంటిదాన్ని అనీ, రంగు వేసినా సరే పాతదే అవుతుందిగానీ కొత్తది అయిపోదని ఒకరు కామెంట్ చేశారు" అని రజిని చెప్పారు.

రజిని చాండీ

ఫొటో సోర్స్, Athira Joy

ఫొటో క్యాప్షన్, రజిని చాండీ

ముఖ్యంగా జీన్స్ వేసుకుని, కాళ్లు ఎడంగా పెట్టి కూర్చున్న ఫోటో... అందులో కాస్త క్లీవేజ్ కూడా కనిపిస్తూ ఉంది. రెండోది పొట్టి డెనిమ్ బట్టలు వేసుకున్న ఫొటో... ఈ రెండిటినీ విపరీతంగా ట్రోల్ చేశారు.

"నేను కాళ్లు చూపిస్తూ పొట్టి బట్టలు వేసుకోవడం సహించలేకపోయారు. నాకు మంచి, అందమైన కాళ్లున్నాయి, అందుకే అవి వేసుకోవడానికి నేను సంశయించలేదు" అని రజిని గట్టిగా నవ్వుతూ చెప్పారు.

అయితే, కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు తనను బాధించాయని, ముఖ్యంగా మహిళలనుంచి వచ్చిన విమర్శలకు తాను బాధపడ్డానని రజిని తెలిపారు.

"చాలామంది కుర్రాళ్లు వయసు పైబడిన మహిళలను కూడా లైంగిక వాంఛతో చూడడం కలవరపెడుతోంది. వాళ్లు తమను కోరికలు తీర్చే వస్తువుల్లాగ చూడాలని కోరుకోరు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మహిళలే నన్ను ఎక్కువగా తిట్టడం" అని రజిని అన్నారు.

"అసూయ వల్లే అలా చేస్తున్నారేమో అనిపిస్తోంది. 40,50 ఏళ్లున్న మహిళలు.. వాళ్ల గురించి వాళ్లు శ్రద్ధ తీసుకోరు. నాలాగ వయసు పైబడిన స్త్రీలు అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తే తట్టుకోలేక ఇలా ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది" అని రజిని అన్నారు.

"అసూయ కావొచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అందరు స్త్రీలూ స్త్రీవాదులు కారు. అనేకమంది మహిళలు పురుషస్వామ్య వ్యవస్థను భుజాలకు ఎత్తుకుని మోస్తుంటారు" అని 'ఆర్టికల్ 14' న్యూస్ వెబ్‌సైట్ జెండర్ ఎడిటర్ నమిత భండారే అన్నారు.

"ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు వృద్ధులయ్యేకొద్దీ మరింత ఎక్కువ వివక్ష ఎదుర్కొంటూ ఉంటారు. అయితే, పశ్చిమ దేశాల్లో మాదిరిగా ఇండియాలో వృద్ధ మహిళలను మనం పట్టించుకోకుండా వదిలేయం.

రజిని చాండీ

ఫొటో సోర్స్, Rajini Chandy

ఫొటో క్యాప్షన్, ఈ వయసులో ఇదేం పని అడిగిన వారి కోసం రజిని తాను గతంలో స్విమ్ సూట్‌లో దిగిన ఫోటోను షేర్ చేశారు

ఇండియాలో కొంతవరకూ వృద్ధాప్యం స్త్రీలకు ప్రయోజనాలను చేకూర్చి పెడుతుందనే అనిపిస్తుంది. కుటుంబంలో మన బామ్మలు, అమ్మమ్మలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే వాళ్లల్లో మూస ధోరణి ఎక్కువగా కనిపిస్తుంటుంది కాబట్టి వాళ్ల మాటలను మనం పెద్దగా లెక్క చేయం. వాళ్లు సంసారపక్షంగా బట్టలేసుకుంటారు. వితంతువులైతే తెల్లచీరలు కట్టుకుంటారు. వారిని లైంగిక వాంఛలతో చూడరు.

ఇలాంటి పరిస్థితులు ఉన్నచోట.. వయసు పైబడిన ఒక మహిళ క్లీవేజ్ చూపిస్తూ, ఆధునిక దుస్తులు ధరించి, కాళ్లు ఎడంగా పెట్టి కూర్చుని ఫొటోలకు ఫోజులిస్తే ఆమె గీత దాటినట్టు లెక్కేస్తారు. అలాంటి ఆమెను ఏమైనా అనొచ్చు అనుకుంటారు" అని నమిత భండారి అభిప్రాయపడ్డారు.

తన ఫొటోలు వైరలవుతాయని, తనను ఇంతలా ట్రోల్ చేస్తారని ఊహించలేదని రజిని చెప్పారు.

"నేను మొహమాటం లేకుండా సూటిగా మాట్లాడతాను. నా అభిప్రాయలను కచ్చితంగా చెప్తాను. అందుకే చాలామందికి నేను నచ్చనేమో. అయితే, నా మీద సమయం వృథా చేయకుండా దేశానికి లేదా ఈ భూమికి పనికొచ్చే పని ఏదైనా చేయమని వాళ్లకు నేను చెబుతూ ఉంటాను" అని రజిని చాండీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)