ఇందు హరికుమార్: ఈ బొమ్మలు స్త్రీ వక్షోజాల వెనకున్న కథలు

ఫొటో సోర్స్, INDU HARIKUMAR
స్త్రీ వక్షోజాలకు పురుషులు ఎంతలా ఆకర్షితులవుతారో మహిళల్లో ఎవ్వరిని అడిగినా చెబుతారు. కానీ మహిళలు కూడా తమ వక్షోజాలను చాలా ఇష్టపడతారని భారతీయ చిత్రకారిణి ఇందు హరికుమార్ చెబుతున్నారు.
గత రెండు నెలలుగా 'ఐడెంటిటీ' అనే ప్రాజెక్టుపై ఇందు పని చేస్తున్నారు. పలకడం వరకు ఈ పేరును ఐడెంటిటీగానే పలుకుతారు. కానీ రాసేటపుడు మాత్రం వీరు.. 'ఐడెంటిట్టీ'(Identitty) అని రాస్తున్నారు. పేరులోని చివరి 5 ఇంగ్లీష్ అక్షరాలు ఆ ప్రాజెక్టును ప్రతిబింబిస్తాయి.
''సంవత్సరం కిందట ఇన్స్టాగ్రామ్‌లో ఓ మహిళతో చాట్ చేస్తున్నాను. మా సంభాషణ వక్షోజాల వైపు మళ్లింది. తన బ్రెస్ట్ సైజు పెద్దగా ఉంటుందని, బయటకు వెళ్లినపుడు మగవాళ్లు.. పెద్దగావుండే తన వక్షోజాలవైపు ఎలా చూస్తారో చెప్పసాగింది. కానీ నా అనుభవం అందుకు భిన్నమైనది. ఎందుకుంటే.. నా బ్రెస్ట్ పెద్దగా ఉండదు. అలా టీనేజ్‌లో నా అనుభవాలను కూడా ఆమెతో పంచుకున్నాను’' అని ఇందు హరికుమార్ గుర్తుచేసుకున్నారు.
''మా అనుభవాలు భిన్నమైనవి. కానీ వీటి మధ్య దగ్గరగ పోలికలు ఉన్నాయి. ఇలాంటి అనుభవాలతో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు ప్రారంభిస్తే ఎలావుంటుందని ఆమెను అడిగాను. వెంటనే ఆమె ఓకే చెప్పేసింది. తమ అనుభవాలను పంచుకోవడానికి మరికొందరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అప్పుడే మా ప్రాజెక్టు బీజం పడింది.

ఫొటో సోర్స్, INDU HARIKUMAR
ఐడెంటిటీ ఎందుకు?
''ప్రాజెక్టుకు ఏపేరు పెడితే బాగుంటుందని అందర్నీ అడిగినపుడు, 'Identitty'(ఐడెంటిటీ) అన్న పేరును ఒక ఫ్రెండ్ సూచించింది. అయితే ఇంగ్లీష్ స్పెల్లింగ్‌లోని చివరి ఐదు అక్షరాల(titty) అర్థం ప్రాజెక్టు భావాన్ని ప్రతిబింబిస్తుందని ఆ పేరునే సెలెక్ట్ చేశాం.''
ముంబైకి చెందిన ఈ చిత్రకారిణి, జనవరి నెలలో ఇన్స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. వక్షోజాల విషయంలో తమకు ఎదురైన సంతోషాలు, అవమానాలు, బాధలను మహిళలు తమతో పంచుకోవాలని ఆ పోస్టులో కోరారు.
అంతేకాకుండా, తమ వక్షోజాల ఫొటోలను కూడా షేర్ చేసుకోవాలని చిత్రకారిణి అడిగారు. ‘‘ఎటువంటి ఆచ్ఛాదనంలేని వక్షోజాల ఫొటోలు పంపవచ్చు, గోరింటాకు వేసుకున్న వక్షోజాల ఫొటోలు పంపొచ్చు, బ్రా లేదా ఏదేనీ గుడ్డ కప్పుకుని కూడా పంపొచ్చు. అది వారి ఇష్టం. ఫొటోల్లో ముఖం కనిపించడం, కనిపించకపోవడం కూడా వారిష్టమే..’’ అని చెప్పారు.
ఇందు హరికుమార్ ప్రతిపాదనకు విశేష స్పందన వచ్చింది.
అందుకు కారణం.. ప్రతి మహిళకు, తమ వక్షోజాల విషయంలో ఓ కథ ఉండేవుంటుందని ఇందు చెబుతున్నారు.
మీ వక్షోజాల సైజు, ఆకారం కీలకపాత్ర పోషిస్తాయని ఆమె అంటున్నారు.

ఫొటో సోర్స్, INDU HARIKUMAR
నేను ప్రేమకు అనర్హురాలినా?
ఈ విషయంలో ఓ మహిళ అనుభవాన్ని ఇందు ఇలా వివరించారు.
''టీనేజ్‌లో నేను చాలా సన్నగా ఉండేదాన్ని. నా వక్షజాలు ఎప్పుడు పెరుగుతాయా అని ఆలోచించేదాన్ని. వక్షోజాలు పరిపూర్ణంగా ఏర్పడిన అమ్మాయిలంటే టీనేజ్ అబ్బాయిలకు చాలా ఇంట్రెస్ట్. కానీ, వక్షోజాలు పెరగని నాలాంటివారు.. 'ఇక మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు?' అని విచారించేవాళ్లం'' అని ఆమె అన్నారు.
''తన శరీరంలో ఏదో లోపం ఉందని, ప్రేమను పొందే అర్హత తనకు లేదని ఆమె భావించేవారు. ఈ పరిస్థితి.. చెడుసావాసాలకు దారి తీసింది. ఇప్పుడు తన వయసు 30ఏళ్లకు పైనే. ప్రస్తుతం.. తనకు అందమైన శరీరం ఉందని ఆమె ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. కానీ ఈ నమ్మకం కలగడానికి ఆమెకు చాలాకాలం పట్టింది.''
అందుకే, వక్షోజాలు చిన్నగా ఉన్న కారణంగా తాము పరిపూర్ణంగా కాక, 'సగం మనిషి'లా ఫీలవుతున్న మహిళలతో తాను వెంటనే కనెక్ట్ అవుతానని ఇందు అంటున్నారు.
తమ శరీరాకృతి పట్ల అసంతృప్తిగా ఉన్న మహిళలకు, వక్షోజాల సైజు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. బ్రిటన్‌లో 384మంది మహిళలపై చేసిన ఓ అధ్యయనంలో, 44%మంది మహిళలు తమకు పెద్దసైజు వక్షోజాలు కావాలన్నారు. 31%మంది మాత్రం, తమకు వక్షోజాలు చిన్నవిగా ఉంటే ఇష్టమని అన్నారు.

ఫొటో సోర్స్, INDU HARIKUMAR
‘వక్షోజాలు పెద్దగా ఉండటం ఆకర్షణీయం అనడం ఓ క్రూరమైన అబద్ధం..’
వక్షోజాలు చిన్నవిగా ఉండటం తమకు చాలా అసంతృప్తిగా ఉందని, కొందరు తమ అనుభవాలను రాస్తే, పెద్దగా ఉన్న వక్షోజాలతో తమకు చాలా ఇబ్బందిగా ఉందని, సిగ్గుగా ఉందని, తమ అనుభవాలను రాస్తూ ఇందు హరికుమార్‌కు పంపుతున్నారు.
''ఒక మహిళ వక్షోజాల సైజు 36-డి. ఆమె ఎప్పుడూ టీ-షర్ట్ వేసుకోలేకపోయింది. వక్షోజాలు చిన్నవిగా కనిపించడంకోసం ఎప్పుడూ బిగుతుగా ఉండే బ్రాలనే వాడుతానని నాతో అన్నారు. ఎందుకంటే, తన బ్రెస్ట్ అందరి దృష్టిని ఆకర్షించడం ఆమెకు ఇష్టం లేదు'' అని ఒకరి అనుభవాన్ని ఇందు వివరించారు.
ఇందు హరికుమార్ 'ఇన్స్టాగ్రామ్ ఫీడ్'లో ఓ మహిళ తన అభిప్రాయాన్ని ఇలా రాశారు..
''వక్షోజాలు పెద్దవిగా ఉండటం చాలా ఆకర్షణీయంగా ఉంటుందనడం ఓ క్రూరమైన అబద్ధంలా నాకు అనిపిస్తుంది. పరిగెత్తేటపుడు, జిమ్‌లో వ్యాయామం చేసేటపుడు, కొన్ని యోగా ఆసనాలు వేసేటపుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు నేను నా బిడ్డకు పాలు ఇస్తున్నాను. బ్రెస్ట్ సైజు ఇంకా పెరిగింది.''
ఇలాంటి ఇబ్బందులు, సిగ్గు కలిగే అనుభూతులతోపాటు, తమ వక్షోజాలను చూసినపుడు మహిళల్లో కనిపించే గర్వం, సంతోషాన్ని కూడా పెయింటింగ్స్ ప్రతిబింబిస్తాయని ఇందు అంటున్నారు.
''బెడ్రూంలో పడుకున్నట్లుగా, తమ వక్షోజాల పెయింటింగ్ వేయాలని నన్నడిగే మహిళలకు, పురుషులపై తమ వక్షోజాల అందం ఎలా ప్రభావం చూపుతాయో స్పష్టంగా తెలుసు'' అని ఇందు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, INDU HARIKUMAR
బ్లౌజు దాటి బ్రా కనిపించినా తప్పే..!
ఆడవారు ఒళ్లంతా కప్పుకుని ఉండాలనే భారతీయ సంప్రదాయిక సమాజం ఇంకా భావిస్తోంది. పెద్దపెద్ద నగరాలను మినహాయిస్తే, స్త్రీల దుస్తులు పైన మెడవరకు, కింద కాళ్ల వరకూ ఉంటాయి.
పొరబాటున బ్రా స్ట్రిప్ బ్లౌజు నుంచి బయటకు వచ్చినా కూడా తప్పే. ఇక వక్షోజాల మధ్య భాగం కనిపించేలా ప్రవర్తించడం సాహసమే!
ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పటి నుంచి ఇందు హరికుమార్ మెయిల్ బాక్సు మెసేజ్‌లతో నిండిపోయింది. రెండు నెలలకన్నా తక్కువ సమయంలోనే, దాదాపు 50-60 మహిళల అనుభవాలు, ఫొటోలు ఇందుకు అందాయి. వాటిల్లో ఇందు ఇప్పటిదాకా 19 పెయింటింగ్స్‌ను పూర్తి చేశారు.
భారతదేశవ్యాప్తంగా స్పందన కనిపిస్తోందని, పెద్ద నగరాలు, చిన్నచిన్న పట్టణాల నుంచి, 18-50ఏళ్ల మధ్య వయసున్న స్త్రీలు తమ ఫొటోలను పంపుతున్నట్లు చెబుతున్నారు.
ఈ పెయింటింగ్స్‌లో సదరు వ్యక్తి ముఖం, ఆమెకు చెందిన మరి ఏ ఇతర ఆనవాళ్లు కనిపించవు. కేవలం ఆ వ్యక్తి పొందిన అనుభూతి మాత్రమే పెయింటింగ్స్‌లో ప్రతిఫలిస్తుంది. మహిళల నుంచి వస్తున్న స్పందన.. ఇందు ప్రాజెక్టుకు ఊతం ఇస్తోంది.
''నా ప్రేమికుల శరీరాలను కూడా, ఈ ఫొటోలను చూసినంత శ్రద్ధగా ఎప్పుడూ చూడలేదు..'' అని ఇందు హరికుమార్ నవ్వేశారు.
ఇవి కూడా చదవండి
- ఆ సమయంలో తలనొప్పి వస్తే.. అశ్రద్ధ చేయకూడదు
- ‘నల్లగా వంకాయలా ఉన్నావు.. నీకు మొగుడిని ఎలా తేవాలి అని వెక్కిరించారు’
- మొబైల్ డేటా: ప్రపంచంలో అత్యంత చౌక భారతదేశంలోనే... మున్ముందు ధరలు పెరిగిపోతాయా...
- ఆర్మ్ రెజ్లింగ్: బలవంతులైన అబ్బాయిలు కూడా ఈ చేతులతో తలపడటానికి భయపడతారు
- సిత్రాలు సూడరో: కండువాల కలర్స్ మారుతున్నాయి...
- ఈయన చీర ఎందుకు కట్టుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








