'ఛాతిపై టాటూ వేయించుకున్నానని, తోడు పెళ్లికూతురిగా కూర్చోవద్దన్నారు'

కేలీ పీచ్

ఫొటో సోర్స్, EMMA LYNCH/BBC

'జ్ఞాపకాలను టాటూల రూపంలో శరీరంపై వేయించుకోవడం ఎంతో బావుంటుంది..' అంటున్నారు కేలీ పీచ్. టాటూ కళలో శిక్షణ మొదలుపెట్టిన మొదటి రోజే.. ఈ రంగంలో విజయం సాధించాలని కేలీ నిర్ణయించుకున్నారు. అదే రోజున 'CURSED'అన్న పదాన్ని తన కనుబొమ్మ పైభాగంలో టాటూ వేయించుకున్నారు. CURSED అంటే తెలుగులో 'శపించబడ్డ' అని అర్థం. ఇంకేముంది.. ముఖంపై టాటూ వేయించుకుంటే ఎవరన్నా పిలిచి ఉద్యోగమిస్తారా? అని భయపడ్డారు కూడా.

26ఏళ్ల కేలీ బర్మింగ్‌హామ్‌కు చెందినవారు. ఈ యువతి శరీరంలో 60శాతం టాటూలతో నిండిపోయింది. టాటూలు తన జీవితాన్ని ఏవిధంగా మార్చేశాయో కేలీ చెబుతున్నారు.

కేలీ పీచ్

ఫొటో సోర్స్, THOM BARTLEY

'నా ఛాతిపై టాటూ వేయించుకున్నందుకు, నన్ను తోడుపెళ్లికూతురిగా కూర్చోవద్దన్నారు'

బయటకు వెళ్లినపుడు అందరూ నన్నే చూస్తుంటే.. 'వీళ్లంతా నన్నెందుకలా చూస్తున్నారు..' అనిపిస్తుంది. నా ఒంటిపై ఉన్న టాటూలను మరిచిపోతుంటాను.

నా ముఖంపై ఉన్న టాటూల గురించి చాలామంది చాలాసార్లు అడిగారు. ముఖం, మెడపై టాటూలు వేయించుకోవడం వారికి అతిశయం అనిపిస్తుంది.

ఒక్కోసారి.. 'నువ్వు చాలా కటువుగా కనిపిస్తున్నావు..' లాంటి విమర్శలనూ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒళ్లంతా టాటూలు ఉండటం వారిని భయపెడుతుంది అనుకుంటా.. బహుశా అంతకంటే ఎక్కువేనేమో! మా ఇంట్లోవాళ్లకూ టాటూలంటే పెద్దగా ఇష్టం లేదనుకోండి..

మా నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అంతకు కొద్దిరోజుల క్రితమే నా ఛాతిపై ఓ పెద్ద టాటూ వేయించుకున్నాను. అందుకని, తన పెళ్లిలో నన్ను తోడుపెళ్లికూతురుగా ఉండనివ్వలేదు.

కానీ నేను టాటూ ఆర్టిస్ట్ అయ్యాక, ఆయన వైఖరి మారింది. తర్వాత ఆయనకూ ఓ టాటూ వేశాను. నాన్నకు టాటూ వేశాక, ఆయన చేతి రాతతో 'Dad'(నాన్న) అని రాయించి, ఆ అక్షరాలను ఆయన చేతులతోనే నా ఒంటిపై టాటూ వేయించుకున్నాను.

కేలీ పీచ్

ఫొటో సోర్స్, LUKE HAYFIELD

'నేను శాపగ్రస్తురాలిని..'

18ఏళ్ల వయసులో మొదటిసారి టాటూ వేయించుకున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటిపేరును నా కాలి చీలమండపై టాటూ వేయించుకున్నాను. నా పేరును కూడా అతను టాటూ వేయించుకున్నాడు. ఇప్పుడు నా శరీరంపై 60శాతం టాటూలే..!

24ఏళ్ల వయసులో టాటూ అప్రెంటిస్‌గా శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాను. అప్రెంటిస్ మొదటిరోజునే తొలిసారిగా నా ముఖంపై టాటూ వెలిసింది.

అలా.. 'CURSED'(శపించబడ్డ) అన్న అక్షరాలను నా కనుబొమ్మపైన టాటూగా వేయించుకున్నా. ముఖంపై టాటూ ఉండటంతో నాకెవ్వరూ ఉద్యోగం ఇవ్వరని, ఇక నేను టాటూ ఆర్టిస్ట్‌గానే కొనసాగాలని నిశ్చయించుకున్నా.

అప్పట్లో నన్ను నిరాశ ఆవరించి ఉండేది. నా జీవితంలో జరిగిన సంఘటనలకు నన్ను నేను మానసికంగా శిక్షించుకోవాలని ఆలోచించేదాన్ని.

అప్పుడు.. నా ముఖంలో ఒకవైపు గులాబి పువ్వు టాటూను వేయించుకుని, మరోవైపును.. కొత్త జీవితానికి స్వాగత చిహ్నంగా అలానే ఖాళీగా వదిలేశాను.

కేలీ పీచ్

ఫొటో సోర్స్, LUKE HAYFIELD

'డ్రింక్ చేయడానికి రమ్మనేవాళ్లు..'

'టాటూ ఆర్టిస్ట్' అవ్వడానికి ముందు, ఓ పబ్‌ మేడపై ఉన్న ఇంట్లో ఉండేదాన్ని. ఆ సమయంలో ఎక్కువగా పార్టీలు చేసుకునేవాళ్లం. ఇంటిలోకి వెళ్లాలంటే పబ్ నుంచీ వెళ్లాల్సివచ్చేది.

అలాంటపుడు అందరూ నన్ను చూసి, తమతో డ్రింక్ చేయడానికి రమ్మని పిలిచేవాళ్లు. దాంతో ఆ ఇల్లు ఖాళీ చేశా.

టాటూలు వేయడం మొదలుపెట్టాక, 6నెలలపాటు వేరే ఎలాంటి ఆలోచనలూ లేకుండా ఈ కళపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నా. అప్పటినుంచి నా జీవితంలో మార్పు వచ్చింది.

ఈ వృత్తిలో పూర్తిగా మునిగిపోయా. పగటిపూట చేస్తున్న అన్ని ఉద్యోగాలనూ పక్కనపెట్టేశా. తాను చూసిన జూనియర్ ఆర్టిస్టుల్లో.. అందరికంటే బిజీగా ఉన్నవాళ్లలో నేనూ ఒకదాన్నని మా బాస్ చెబుతారు.

టాటూ కోసం వచ్చేవారితో మన ప్రవర్తన ఎలా ఉంటుందన్నది చాలా ముఖ్యం. కేవలం మీ పనితనం కోసమే వాళ్లు రారు. మీరు పనిచేసే వాతావరణం, మీ వ్యక్తిత్వం కూడా ముఖ్యమైన అంశాలే.

సౌకర్యవంతంగా జీవించడానికి సరిపడా సంపాదన వస్తోంది.

కేలీ పీచ్

ఫొటో సోర్స్, EMMA LYNCH/BBC

'బాధలో ఉన్న వారికి నేను సాయం చేస్తా'

టాటూలు వేయడమంటే నాకు చాలా ఇష్టం. ఆలోచనలు ఎప్పుడూ ఒకేచోట ఆగిపోకూడదు. ఏదో ఒకటి కొత్తగా సృష్టిస్తూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ, కొత్త వ్యక్తులను కలుస్తూ ఉండాలి.

మనుషులతో మాట్లాడుతూ ఉంటే, బాధలో ఉన్నవారు తమ సమస్యలను మీతో పంచుకుంటారు. వారికి కాస్తంత ఉపశమనం కావాలి. కొందరు మానసికంగా బలహీనంగా ఉంటారు.

అలాంటివారికి సాయం చేస్తాను. నేను టాటూలు వేసిన వాళ్లలో కొందరి జీవితాలు హృదయవిదారకంగా ఉంటే, మరికొందరి జీవితాలు ఎంతో సంతోషంగా ఉండటం నాకు తెలుసు.

ఈ జీవన విధానంలో.. జీవితంలో ఏది ముఖ్యం అన్న విషయంలో ఓ స్పష్టత వస్తుంది. ఇప్పుడు జీవితం పట్ల నాకు సానుకూల దృక్పథం ఏర్పడింది.

తమ శరీర భాగాల పట్ల అసంతృప్తి, ఒంటిపై మచ్చలు, చారలతో ఇబ్బందిపడేవారికి నేను సాయం చేస్తాను. మీ శరీరంలో మీకు నచ్చనిచోట, ఓ అందమైన టాటూ వేసుకుంటే.. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీరు ఆనందంగా ఉంటారు కూడా.

కేలీ పీచ్

ఫొటో సోర్స్, LEE WILLIAMS

'టాటూలు వేయడం, మోడలింగ్ నాలో విశ్వాసాన్ని నింపాయి'

చిన్నప్పుడు నేను చాలా పిరికిదాన్ని. చాలా సైలెంట్‌ అమ్మాయిని కూడా. కానీ టాటూలు నాలో విశ్వాసాన్ని పెంచాయి. మీకిష్టమైన జ్ఞాపకాలు మీ ఒంటిపై టాటూలుగా మారిపోతే, మిమ్మల్ని మీరు కౌగిలించుకున్నట్లు ఉంటుంది.

19ఏళ్ల వయసు నుంచి నేను మోడలింగ్ చేస్తున్నాను. ఓ మ్యూజిక్ వీడియోలో, 'స్కిన్ డీప్ మేగజీన్'లో నన్ను నేను చూసుకోవడం నమ్మలేకుండా ఉంది.

నా ముఖంపై ఉండే టాటూలు.. నన్ను చాలా ప్రత్యేకంగా నిలబెడతాయి. వృద్ధాప్యంలో కూడా ఈ టాటూలతో నా ముడతల చర్మం అందంగానే కనిపిస్తుంది.

కేలీ పీచ్

ఫొటో సోర్స్, EMMA LYNCH/BBC

చర్మాన్ని అందమైన చిత్రమాలికగా మలుచుకోవడం బాగుంటుంది. ఒక్కో టాటూను తడిమినపుడు, దాని వెనకున్న జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటీ కదులుతాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)