బుట్టా రేణుక, వంగవీటి రాధ... భుజాల మీద మారిన కండువాల కలర్స్

ఫొటో సోర్స్, BUTTA RENUKA/NAGU/FB
ఆంధప్రదేశ్‌లో ఎన్నికల వేళ కండువాలు మార్చే నేతలతో వివిధ పార్టీలలో హడావిడి కనిపిస్తోంది. టికెట్ ఆశించి భంగపడిన వారు, అనుకున్న నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం దక్కని వారు పార్టీలు మార్చేస్తున్నారు.
‘టీడీపీ పాలన బాగుంది... టీడీపీలో గౌరవమే లేదు’
కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బుట్టా రేణుక ఐదేళ్లలో మూడుసార్లు పార్టీ మారారు. వైసీపీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె తర్వాత కాలంలో టీడీపీలో చేరారు. ఎన్నికల వేళ మళ్లీ వైసీపీకి వచ్చారు.
బుట్టా రేణుక 2014 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత కొద్దికాలానికే టీడీపీలోకి చేరారు.

ఫొటో సోర్స్, Butta renuka/fb
ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం దేశంలోని అత్యంత ధనిక ఎంపీలలో బుట్టా రేణుక కూడా ఒకరు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన తర్వాత ఆమె చంద్రబాబును ఒక ఇంటర్వ్యూలో ప్రశంసలతో ముంచెత్తారు.
చంద్రబాబు సీఎంగా తానేంటో నిరూపించుకున్నారని బుట్టా రేణుక అన్నారు. ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధిబాట పట్టిస్తున్నారని చెప్పారు.
ఇటీవల వైసీపీలో చేరిన అనంతరం ఆమె మాటమార్చారు. టీడీపీలో చేరి తప్పు చేశానని అన్నారు.
‘‘టీడీపీలో బీసీలకు న్యాయం జరగడం లేదు. అక్కడ గౌరవం కూడా దొరకలేదు. ఆ పార్టీలో మాటలే చెబుతారు. అక్కడ పారదర్శకత లేదు. పెద్దతప్పు చేశా. ఆ తప్పుకు శిక్ష కూడా అనుభవించి వస్తున్నా. ఎలాంటి షరతులు లేకుండా వైసీపీలో చేరుతున్నా. పార్టీ తరఫున పోటీ చేయడం లేదు. పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తా’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, vangaveeti/fb
'వచ్చేది జగన్ రాజ్యం.. జగన్ ఎప్పుడూ ప్రతిపక్షమే'
వంగవీటి రాధాకృష్ణ ఇటీవల వైసీపీని వదిలి టీడీపీలోకి వచ్చారు. కొంతకాలం నుంచి ఆయన వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
వంగవీటి 2004లో కాంగ్రెస్‌లో చేరారు. విజవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2009లో పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. విజవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
వైసీపీలో ఉన్నప్పుడు అమరావతిలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో రాధా మాట్లాడుతూ, వచ్చేది జగనన్న రాజ్యం అని పేర్కొన్నారు. మోసపూరిత హామీలతో చంద్రబాబు గద్దెనెక్కారని విమర్శించారు. వైఎస్ కుటుంబాన్ని చంద్రబాబు ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వంగవీటి రంగాను టీడీపీనే హత్య చేసిందని ఆరోపించారు.
టీడీపీలో చేరిన సందర్భంగా రాధ మాట్లాడుతూ, వైసీపీలో ఎన్నో అవమానాలు భరించానని అందుకే రాజీనామా చేశానని చెప్పారు. తమ్ముడూ అంటూనే జగన్ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. జగన్ మళ్లీ ప్రతిపక్షంలోనే ఉంటారని అన్నారు. పార్టీలోని కొందరు తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నా సరే భరించాననని ఇక తన వల్ల కాకపోవడంతో పార్టీని వీడానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ఏపీ ప్రజలు మరోసారి ప్రతిపక్ష నేతగా ఉంచేందుకు నిర్ణయించుకున్నారని అన్నారు.
ఇవి కూడా చదవండి
- ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూసుకోండి.. 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి
- ఈవీఎంలో ఓట్లు ఎలా లెక్కిస్తారు?
- దేశంలో అత్యంత సుదీర్ఘ ఎన్నికలు ఇవేనా.. ఇది బీజేపీకి లాభిస్తుందా?
- ఓటరు జాబితాలో మీ పేరు నమోదు చేసుకోవడం ఎలా?
- బాల్యవివాహాలను అరికట్టేవారికే నా ఓటు
- భారత్‌లో మహిళలు సురక్షితంగానే ఉన్నారా...
- ఎన్నికల్లో మహిళల విజయ శాతమే ఎక్కువ
- 'సర్కార్'లో చెప్తున్న సెక్షన్ 49(పి)తో దొంగ ఓటును గెలవడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








