K2: చలికాలంలో కే2 పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన నేపాలీలు

ఫొటో సోర్స్, Nimsdai Purja
ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన శిఖరాల్లో రెండోదైన కే2ను శీతాకాలంలో అధిరోహించి పది మంది నేపాలీ పర్వతారోహకులు చరిత్ర సృష్టించారు.
స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్ర 5 గంటలకు కే2 శిఖరాన్ని చేరుకున్నామని, శీతాకాలంలో ఈ పర్వతాన్ని తొలిసారి అధిరోహించింది తామేనని పర్వతారోహకుల్లో ఒకరైన సిమ్స్‌దాయి పూర్జా చెప్పారు.
8,611 మీటర్ల ఎత్తైన ఈ పర్వతాన్ని శీతాకాలంలో అధిరోహించేందుకు గతంలోనూ చాలా మంది ప్రయత్నించారు.
ఈ ప్రయత్నంలోనే గతవారం ఓ స్పెయిన్ పర్వతారోహకుడు మరణించారు. పైకి ఎక్కేటప్పుడు కాలు జారడంతో ఆయన కిందపడిపోయారు.
ఎవరెస్ట్ శిఖరం కంటే కే2 పొడవు కేవలం 200 మీటర్లు మాత్రమే తక్కువ. పాక్-చైనా సరిహద్దుల్లోని కారాకోరం పర్వత శ్రేణుల్లో ఇది ఉంది.
8000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుండే పర్వతాల్లో కే2 కూడా ఒకటి. శీతాకాలంలో దీన్ని అధిరోహించడం అంటే చాలా కష్టం.
‘‘ఇది అత్యంత ప్రాణాంతక పర్వతం’’అని అమెరికా పర్వతారోహకుడు జార్జ్ బెల్ అభివర్ణించారు. 1953లో ఆయన దీన్ని ఎక్కేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ యాత్రలో చనిపోయే ముప్పు చాలా ఎక్కువని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Alex Gavan
ఈ పర్వత మార్గం ఇరుకుగా ఉండటంతోపాటు ప్రమాదాలు ఒక్కసారిగా వచ్చిపడుతుంటాయి.
2008లో మంచు చరియలు విరిగిపడటంతో 11 మంది పర్వతారోహకులు మరణించారు.
మొదటగా మూడు, నాలుగు బృందాల్లో మొత్తంగా 60 మంది కే2ను అధిరోహించాలని నేపాలీ పర్వతారోహకులు ప్రణాళికలు వేసుకున్నారు. కానీ చివరికి పది మంది ఒకే బృందంగా బయలుదేరారు.
కే2పై సంబరాలు చేసుకుంటున్నట్లు కనిపిస్తున్న ఒక చిత్రాన్ని పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా షేర్ చేశారు. ఆయన బ్రిటన్ స్పెషల్ బోట్ సర్వీస్‌లోనూ పనిచేశారు. తాజా రికార్డును పర్వతారోహక సంస్థ సెవెన్ సమిట్ ట్రెక్స్ కూడా ధ్రువీకరించింది.
‘‘మానవ చరిత్రలో ఒక మైలురాయి దాటిన ఘట్టంలో భాగస్వామ్యం కావడంతో చాలా సంతోషంగా ఉంది. బృంద స్పూర్తి, పాజిటివ్ యాటిట్యూడ్‌తో మనం ఏదైనా చేయగలం’’అని పూర్జా వ్యాఖ్యానించారు.
1987, 88లో తొలిసారిగా శీతాకాలంలో కే2ను అధిరోహించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే పర్వతారోహకులు 7650 మీటర్లకు మించి పైకి వెళ్లలేకపోయారు.
హిమాలయాలతోపాటు చుట్టుపక్కల ఉండే శిఖరాలను అధిరోహించేందుకు నేపాలీ గైడ్‌ల అవసరం చాలా ముఖ్యం. ముఖ్యంగా విదేశీ పర్వతారోహకులు యాత్రలు మొదలుపెట్టేటప్పుడు ఎక్కువగా నేపాలీ షేర్పాల సాయమే తీసుకుంటుంటారు.
నేపాలీ బృందం తాజా రికార్డుపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘‘హిమాలయాల్లోని భారీ శిఖరాలు అధిరోహించడంలో పర్వతారోహకులకు నేపాలీలు దశాబ్దాల నుంచీ సాయం చేస్తున్నారు. అయితే మాకు తగిన గుర్తింపు మాత్రం రావడంలేదు’’అని ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో కామి రీతా చెప్పారు.

‘‘ఈ రోజు పది మంది నేపాలీలు కే2ను అధిరోహించి చరిత్ర సృష్టించడంతో గర్వంగా అనిపిస్తోంది’’అని ఆయన అన్నారు. ఆయన ఎవరెస్టును 24సార్లు ఎక్కారు.
ఒకవైపు నేపాలీల తాజా రికార్డుపై వార్తలు వస్తుంటే.. మరోవైపు పర్వతారోహకుడు సెర్జీ మింగోటే కాలు జారిపోవడంతో కన్నుమూశారు.
49ఏళ్ల సెర్జీ మరో బృందంలో ఉన్నారు. కే2 బేస్ క్యాంప్‌కు వస్తున్న సమయంలో ఆయన కిందపడి మరణించారు.
పర్వతారోహణలో సెర్జీకి మంచి అనుభవముంది. ఎవరెస్ట్ సహా 8000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుండే ఏడు పర్వతాలను ఆయన అధిరోహించారు.
ఆక్సిజన్ లేకుండా కే2ను అధిరోహించాలని ఆయన ప్రయత్నించారు. అయితే అనారోగ్యానికి గురికావడంతో యాత్రను మధ్యలోనే వదిలి వెనక్కి వచ్చేయాలని భావించారు. అలా వచ్చే క్రమంలోనే ఆయన ప్రమాదవశాత్తు మరణించారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ వ్యాక్సీన్: భారత్‌లో మొదటి రోజు 1.91 లక్షల మందికి కోవిడ్ టీకాలు
- అమెరికా: జో బైడెన్, కమలా హారిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎలా జరుగుతుంది?
- 'నో' అని చెబుతూనే నొప్పించకుండా మెప్పించడం ఎలా?
- కోవిన్ (Co-Win) యాప్: దీన్ని ఎవరెవరు ఉపయోగించుకోవచ్చు? వ్యాక్సీన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- ట్రంప్ అభిశంసన: బైడెన్ మీద, అమెరికా మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- కరోనా వ్యాక్సీన్ కోసం చైనాను నమ్ముకున్న పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది?
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్‌కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- నెల్లూరు పల్లెలో అంతరిక్ష పరిశోధన... ఒక సైన్స్ టీచర్ ప్రేరణతో విద్యార్థుల ప్రయోగాలు
- రాయల్ ఎన్ఫీల్డ్ బాటలో భారత్‌లోకి ‘బుల్లెట్’లా దూసుకొస్తున్న బ్రిటిష్ బైక్‌లు
- భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. చికెన్ తింటే వస్తుందా.. లక్షణాలు ఏమిటి.. మరణం తప్పదా
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








