ఎవరెస్టు మీద కరుగుతున్న మంచు: బయటపడుతున్న పర్వతారోహకుల మృతదేహాలు

ఫొటో సోర్స్, Frank Bienewald
- రచయిత, నవీన్ సింగ్ ఖడ్కా
- హోదా, పర్యావరణ ప్రతినిధి, బీబీసీ వరల్డ్ సర్వీస్
మౌంట్ ఎవరెస్ట్- భూమి మీద అత్యంత ఎత్తైన పర్వతం. దీనిని ఇప్పటివరకు 4,800 మందికి పైగా ఎక్కారు.
ఎవరెస్టును అధిరోహించడానికి తొలిసారిగా ప్రయత్నించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 300 మంది పర్వతారోహకులు దీనిపై ప్రాణాలు కోల్పోయారు. ఒక అంచనా ప్రకారం వీరిలో సుమారు 200 మంది మృతదేహాలు ఇప్పటికీ మంచు కిందే ఉండిపోయాయి.
హిమానీ నదాలు వేగంగా కరిగిపోతుండటంతో, ఇన్నాళ్లూ ఇలా ఉండిపోయిన మృతదేహాలు ఇప్పుడు బయటపడుతున్నాయి.

ఫొటో సోర్స్, ANG TASHI SHERPA
పర్వతంపై చైనా వైపున్న (ఉత్తర) ప్రాంతంలో కనిపించిన మృతదేహాలను చైనా యంత్రాంగం తొలగిస్తోంది. ఎవరెస్ట్ అధిరోహణ సీజన్ మొదలవుతున్న తరుణంలో ఈ కార్యక్రమం చేపట్టింది.
''భూగోళం వేడెక్కుతుండటం(గ్లోబల్ వామింగ్) వల్ల ఎవరెస్టుపై ఉన్న హిమానీనదాలు, మంచు ఫలకాలు వేగంగా కరిగిపోతున్నాయి. ఇంతకాలం మంచు కింద ఉండిపోయిన మృతదేహాలు ఇప్పుడు బయటకు కనిపిస్తున్నాయి'' అని నేపాల్ పర్వతారోహణ సంఘం(ఎన్‌ఎంఏ) మాజీ అధ్యక్షుడు ఆంగ్ షెరింగ్ షెర్పా చెప్పారు.
ఇటీవలి సంవత్సరాల్లో చనిపోయిన కొందరు పర్వతారోహకుల మృతదేహాలను తాము వెలికితీసి కిందకు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. అంతకుముందు మరణించినవారి మృతదేహాలు ఇప్పుడు బయటపడుతున్నాయని చెప్పారు.

ఫొటో సోర్స్, AFP/Getty
ఇటీవలి కాలంలో ఎవరెస్టుపై వివిధ ప్రదేశాల్లో తన ఆధ్వర్యంలోనే ఇంచుమించు 10 మృతదేహాలను వెలికితీశామని, ఇప్పుడు మరిన్ని మృతదేహాలు బయట పడుతున్నాయని ఎవరెస్టు మీద సమన్వయ అధికారిగా పనిచేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగి వెల్లడించారు.
మృతదేహాల వెలికితీత, తరలింపు అంత సులభం కాదని 'ఎక్స్‌పెడిషన్ ఆపరేటర్స్ అసోసియేష్ ఆఫ్ నేపాల్(ఈవోఏఎన్)' అధికారులు చెప్పారు.
ఈ విషయంలో నేపాల్ చట్టం ప్రకారం ప్రభుత్వ సంస్థల అనుమతి తీసుకొన్న తర్వాతే చర్యలు చేపట్టాల్సి ఉంటుందని, ఇది సవాలుతో కూడుకొన్నదని వారు వ్యాఖ్యానించారు.
ఈ అంశానికి ప్రభుత్వం, పర్వతారోహణ రంగం ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని ఈవోఏఎన్ అధ్యక్షుడు డాంబ్ పరౌజులి తెలిపారు. టిబెట్ వైపు సంబంధిత ప్రభుత్వం ఈ పని చేయగలిగితే, నేపాల్ వైపు కూడా చేయొచ్చని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, DOMA SHERPA
2017లో ఎవరెస్టుపై క్యాంప్ 1 వద్ద, చనిపోయిన ఒక పర్వతారోహకుడి చెయ్యి బయటకు కనిపించింది.
అప్పుడు భౌతిక కాయాన్ని కిందకు తరలించేందుకు షెర్పా సమూహానికి చెందిన నిపుణులైన పర్వతారోహకులను నియమించామని ఈవోఏఎన్ నిర్వాహకులు చెప్పారు.
2017లోనే ఖుంబూ హిమానీ నదం ఉపరితలంపై మరో మృతదేహం కనిపించింది.
ఈ హిమానీ నదం ఉన్న ప్రాంతాన్ని 'ఖుంబూ ఐస్‌ఫాల్' అని కూడా పిలుస్తారు. ఈ మధ్య కాలంలో ఇక్కడే ఎక్కువ మృతదేహాలు బయటపడ్డాయని పర్వతారోహకులు తెలిపారు.
క్యాంప్ 4 ప్రాంతంలోనూ మృతదేహాలు కనిపిస్తున్నాయి. దీనిని సౌత్ కోల్ అని కూడా పిలుస్తారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇందులో చదునుగా ఉండే ప్రాంతం ఎక్కువ.
గత కొన్నేళ్లలో బేస్ క్యాంప్ వద్ద కూడా చనిపోయినవారి చేతులు, కాళ్లు కనిపించాయని ఈ ప్రాంతంలో పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన ఓ అధికారి వెల్లడించారు.
బేస్ క్యాంప్ పరిసరాల్లో మంచు స్థాయి తగ్గిపోతోందని, అందువల్లే మృతదేహాలు బయటపడుతున్నాయని ఆయన తెలిపారు.
పెద్దవవుతున్న మడుగులు
హిమాలయాల్లోని అత్యధిక ప్రాంతాల్లో మాదిరే ఎవరెస్టు ప్రాంతంలోనూ హిమానీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయని, మందం తగ్గి పలుచబడిపోతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఖుంబూ హిమానీనదంపై ఉన్న మడుగులు పెద్దవవుతున్నాయని, ఒక దానితో మరొకటి కలిసి పోతున్నాయని, అక్కడ మంచు వేగంగా కరిగిపోతుండటమే దీనికి కారణమని 2015లో ఒక అధ్యయనం వెల్లడించింది.
ఎవరెస్టు శిఖరాన్ని చేరుకోవాలంటే వీటిని దాటి వెళ్లాలి.

ఫొటో సోర్స్, AFP
మంచు ఉష్ణోగ్రతలో మార్పు
ఎవరెస్టు పర్వతానికి సమీపంలో ఇమ్జా సరస్సు ఉంటుంది. సరస్సులో నీరు ప్రమాదకర స్థాయికి చేరడంతో 2016లో నేపాల్ సైన్యం నీటిని తోడేసింది. హిమానీ నదాలు వేగంగా కరగడం వల్లే అందులో నీరు ప్రమాదకర స్థాయికి చేరింది.
బ్రిటన్‌లోని లీడ్స్, అబెరిస్ట్‌విత్ విశ్వవిద్యాలయాల పరిశోధకులు, ఇతర పరిశోధకులతో కూడిన బృందం 2018లో పరీక్షల్లో భాగంగా ఖుంబూ హిమానీ నదంపై డ్రిల్లింగ్ చేసింది. అక్కడి మంచు ఉష్ణోగ్రత ఉండాల్సినంత తక్కువగా లేదని వారు తేల్చారు.
మంచు కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్ 3.3 డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉందని పరిశోధకులు గుర్తించారు. అత్యధిక చల్లదనమున్న మంచు ఉష్ణోగ్రత వార్షిక సగటు ఉష్ణోగ్రత కన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా ఉందని తేల్చారు.
కొత్తగా బయటపడ్డ మృతదేహాల్లో అన్నీ కేవలం హిమానీ నదాలు వేగంగా కరిగిపోవడం వల్ల బయటపడ్డవే కాదు.
కొన్ని మృతదేహాలు కొత్తగా బయటకు కనిపించడానికి కారణం ఖుంబూ హిమానీ నదం కదలికేనని పర్వతారోహకులు తెలిపారు.
ఇలాంటి దృశ్యాలకు అత్యధిక పర్వతారోహకులు మానసికంగా సిద్ధమయ్యే ఉంటారని నేపాల్ జాతీయ పర్వత గైడ్స్ సంఘం ఉపాధ్యక్షుడు షెరింగ్ పాండే భోతె చెప్పారు.

ఫొటో సోర్స్, C. SCOTT WATSON/UNIVERSITY OF LEEDS
మైలురాళ్లు
ఎవరెస్టుపై ఎక్కువ ఎత్తులోని వివిధ సెక్టర్లలో ఉన్న మృతదేహాలను పర్వతం ఎక్కేవారు మైలురాళ్లుగా కూడా వ్యవహరిస్తారు.
శిఖరానికి దగ్గర్లో ఇలాంటి మైలురాయి ఒకటి ఉంది. దీనిని 'గ్రీన్ బూట్స్' అంటారు. అక్కడున్న మృతదేహం కాళ్లకు ఆకుపచ్చ రంగు బూట్లు ఉంటాయి. అందుకే ఆ ప్రదేశాన్ని గ్రీన్ బూట్స్ అంటారు.
ఎక్కువ ఎత్తులో ఉన్న క్యాంపుల నుంచి మృతదేహాలను కిందకు తీసుకురావడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది.
ఒక్కో భౌతిక కాయాన్ని కిందకు తీసుకురావడానికి 40 వేల డాలర్ల నుంచి 80 వేల డాలర్లకు వరకు ఖర్చవుతుందని నిపుణులు చెబుతారు.
శిఖరానికి దగ్గర్లో 8,700 మీటర్ల ఎత్తు నుంచి ఒక మృతదేహాన్ని కిందకు తీసుకొచ్చారని, అది సవాలుతో కూడుకున్న పని అని నేపాల్ పర్వతారోహణ సంఘం(ఎన్‌ఎంఏ) మాజీ అధ్యక్షుడు ఆంగ్ షెరింగ్ షెర్పా తెలిపారు.
''అక్కడ ఆ మృతదేహం పూర్తిగా గడ్డకట్టుకుపోయి ఉంది. బరువు 150 కేజీలు ఉంది. అంత ఎత్తులోని కష్టమైన ప్రదేశంలోంచి దానిని కిందకు తీసుకొచ్చారు'' అని ఆయన వివరించారు.
పర్వతారోహకులు ఎవరైనా ఎవరెస్టుపై చనిపోతే, అతడి మృతదేహం విషయంలో ఏంచేయాలనేది సంబంధీకుల వ్యక్తిగత నిర్ణయమని నిపుణులు తెలిపారు.
పర్వతారోహకుల్లో అత్యధికులు తాము పర్వతం ఎక్కుతుండగా చనిపోతే తమ మృతదేహాన్ని అక్కడే వదిలేయాలని కోరుకొంటారని ప్రముఖ పర్వతారోహకుడు ఆల్ ఆర్నెటే చెప్పారు. మార్గంలో అడ్డుగా ఉంటేనో, లేదా కుటుంబ సభ్యులు కోరుకుంటేనో తప్ప భౌతిక కాయాన్ని పర్వతంపై నుంచి తొలగించడం పర్వతారోహకుడిని అగౌవపరిచినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు.
పర్వతారోహణపై ఆయన రచనలు కూడా చేస్తుంటారు.
ఇవి కూడా చదవండి:
- 64 ఏళ్ల మిస్టరీని సోషల్ మీడియా సాయంతో ఛేదించిన ఇటలీ అధికారులు
- థాయ్లాండ్: గుహ నుంచి ఆస్పత్రి వరకూ.. పలు ప్రశ్నలకు సమాధానాలు
- బరువు పెరిగితే.. క్యాన్సర్ ముప్పు
- యువతను శాకాహారం వైపు నడిపిస్తున్న 7 అంశాలు
- ‘కేజీ టమోటా పాకిస్తాన్లో రూ.300, భారత్లో రూ.20’
- గంగా మైదానంలో ‘హిందుత్వ’ పరిస్థితి ఏమిటి?
- ఎన్టీఆర్ ఫొటో ఎంత పని చేసిందంటే...
- 'ఇమ్రాన్ ఖాన్ ఉద్దేశం మంచిదే... కానీ, మోదీ ఎలా ఉన్నారంటే...' - పర్వేజ్ ముషారఫ్తో బీబీసీ ఇంటర్వ్యూ
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- మహిళలకు పురుషులతో సమానంగా ఆర్థిక హక్కులు అందిస్తున్న దేశాలెన్ని...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









