‘మొరాకోలో మొదటి మహిళా ట్రెక్కింగ్ గైడ్ నేనే’

మహిళా పర్వతారోహక గైడ్

ట్రెక్కింగ్... పర్వతారోహణ అనేది చాలా కష్టమైన ప్రక్రియ. దీనిలో ఎన్నో రకాల అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. సాధారణంగా ఈ రంగంలో ఎక్కువగా పురుషులే ఉంటుంటారు.

కానీ, హఫీదా డౌబానె మొరాకోలోని 10మంది మహిళా ట్రెక్కింగ్ గైడుల్లో ఒకరిగా ఎంతో గుర్తింపు పొందారు.

"నేను 1994లో పర్వతారోహక గైడు శిక్షణ పూర్తిచేసి మొరాకోలోనే మొదటి మహిళా గైడ్‌గా గుర్తింపు పొందాను" అంటారు హఫీదా.

"డిప్లొమా పరీక్ష పాసై నేను మహిళా ట్రెక్కింగ్ గైడునయ్యా. కానీ శిక్షణా సంస్థలో ఉన్న ఏకైక మహిళను నేనే. నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు" అని ఆమె తన అనుభవాలను చెబుతుంటారు.

ఈ రంగంలో మరింత మంది మహిళలకు అవకాశం కల్పించేందుకు ఇక్కడ పర్యాటక గైడ్ పరీక్షను మహిళలకు ప్రత్యేకంగా, సులభంగా చేశారు.

వీడియో క్యాప్షన్, వీడియో: మొరాకోలో మొదటి మహిళా ట్రెక్కింగ్ గైడ్

పర్వతారోహణకు వచ్చేవారిలో కేవలం మహిళల బృందాలకే హఫీదా యాత్రలు ఏర్పాటు చేస్తారు.

"గైడుగా మహిళ ఉండటం వల్ల ఇతర మహిళలతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా మాట్లాడటానికి, వారి అవసరాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొందరు మహిళలు కొత్తవారితో తొందరగా మాట్లాడరు, సిగ్గు ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికి హఫీదా లాంటి వారి అవసరం చాలా ఉంటుంది" అని శిక్షణా సంస్థ నిర్వాహకులు అంటున్నారు.

లింగ వివక్ష ఎక్కువగా ఉన్న మొదటి 10 దేశాల్లో మొరాకో ఒకటి అని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నివేదిక వెల్లడించింది.

మొరాకో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో 80శాతం మంది నిరక్షరాస్యులే.

"యాత్రల్లో భాగంగా గ్రామాల్లో ఆగినప్పుడు.. ఈ అమ్మాయిలంతా చదువుకోవాలి అని ఎప్పుడూ చెబుతూ ఉంటాను" అంటారు హఫీదా.

"మనందరం కలిసి చదువుకుందాం. మనం కలిసి ఉంటే ఏదైనా సాధించగలం" అని ఆమె తరచూ చెబుతారు.

"ఇదంతా నేను ఏదో సరదాగా చెబుతున్నది కాదు. వారి జీవితాలు మారాలి. నేనింకా ఇక్కడే ఉన్నా. చనిపోయే వరకూ పర్వతాలు ఎక్కుతూనే ఉంటా" అంటున్నారు హఫీదా.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)