సారంగ దరియా: జానపదులు పాడుకునే ఈ పొలం పాట యూట్యూబ్ సెన్సేషన్ ఎలా అయింది?

ఫొటో సోర్స్, AdityaMusi/YouTube
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాత వరంగల్ జిల్లా కే సముద్రం మండలం ఇంటికన్నె గ్రామం. పొలాల్లో వరినాట్లు వేస్తున్నారు. నాట్లు వేస్తోన్న ఆడవాళ్లు వంగి పనిచేస్తూ కబుర్లాడుకుంటున్నారు. పక్కనే ఉన్న గట్టు మీద నుంచి అప్పుడే ఒకమ్మాయి నడుస్తూ వెళుతోంది. ఆ అమ్మాయి నడక చూసింది, పొలంలో పనిచేస్తోన్న పెద్దావిడ.. ఆ అమ్మాయిని ఆటపట్టించడానికి ఒక పాట పాడింది..
‘‘దాని జీన్సు పాంటు మీద మనసూ.. అది రమ్మంటే రాదుర చెలియ..’’ అని సాగుతుందా పాట..
అదే పొలంలో ఉన్న మరో పదిహేనేళ్ల అమ్మాయికి ఆ పల్లవి తెగ నచ్చింది. ఆ పాటపాడింది ఆమె అమ్మమ్మే.. ఆ పాట మళ్లీ పాడమని తన అమ్మమ్మను అడిగింది. ఆ పెద్దావిడ ఆ పాట అసలు లిరిక్స్ పాడింది ఈసారి.
‘‘దాని కుడి భుజం మీద కడవా..దాని పేరే సారంగ దరియా...’’
ఈ అమ్మాయికి ఆ ట్యూన్ పిచ్చిగా నచ్చేసింది. చేతిలో ఉన్న వరినారు కట్ట పక్కన పడేసి, అమ్మమ్మ దగ్గర చేరి పోయింది. ఆ పాట మొత్తం పాడు, వింటానంటూ గారం చేసింది. అమ్మమ్మ మొత్తం పాడింది. మనుమరాలు వంత పాడింది. అప్పటికి ఆమె దగ్గర ఫోన్ లేదు. మనసులోనే రికార్డింగు చేసుకుంది. లిరిక్స్ బట్టీ పట్టేసింది.

కోమల 2010లో పాడిన పాట...
ఆ అమ్మాయి పేరు కోమల.. ఇది జరిగింది 2008లో. రెండేళ్ల తరువాత 2010లో హెచ్ఎంటీవీ తెలుగు చానల్‌లో ప్రసారమైన 'మార్మోగిన పాట' కార్యక్రమంలో కోమల ఈ పాట పాడింది. ఆ పాట విన్న మరో అమ్మాయి టీ న్యూస్‌లో వచ్చిన 'రేలా రే రేలా' కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోమలకు సూచించింది. టీ న్యూస్‌లో కూడా ఈ పాట పాడింది కోమల.
అక్కడ ఆ కార్యక్రమానికి జడ్జిల్లో ఒకరు సుద్దాల అశోక్ తేజ. ఆయనకా పాట చాలా నచ్చింది. అప్పుడే ఆ అమ్మాయితో చెప్పారు. నీ పేరు కోమల కాదు కొడవలి అని సరదాగా అన్నారాయన. నీ పాటకు పట్టం కట్టిస్తా అని మాటిచ్చారు.
తరువాత కోమలకు పెళ్లయింది. అశోక్ తేజ కూడా ఆయన పనుల్లో పడిపోయారు. అప్పుడే మా టీవీలో జానపద పాటల కార్యక్రమం మొదలైంది. శిరీష అనే అమ్మాయి అదే పాట పాడింది. మళ్లీ సూపర్ హిట్.
తరువాత రోజుల్లో యూట్యూబ్ లో తెలంగాణ జానపదాల ట్రెండ్ మొదలైంది. అదోన్ స్టూడియోలో ఒక అమ్మాయి అదే పాట పాడింది.. అమూల్య స్టూడియో వాళ్లు మళ్లీ కోమలనే పిలిపించి ఆ పాట పాడించారు.

ఫొటో సోర్స్, ShekharKammula/FB
సినిమాలోకిఎలావచ్చింది?
ఆ పాట ఎలానో శేఖర్ కమ్ముల చెవిన పడింది. ఆయన, సుద్దాల అశోక్ తేజ కలిశారు. ఆ జానపదం పల్లవిని తీసుకుని, తమ సినిమాకు తగ్గట్టు చరణాలను తిరగరాయాలని నిర్ణయించుకున్నారు.
సుద్దాల కలం కదిలింది.. ‘‘శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ వ్యక్తిత్వానికి తగినట్టుగా చరణాలు మార్చాను’’ అన్నారు సుద్దాల అశోక్ తేజ. అదే రాగానికి ఆధునిక హంగు కల్పించారు సంగీత దర్శకులు సిహెచ్ పవన్. మంగ్లీ గొంతు పాటకు కొత్త ఊపు తెచ్చింది. అంతే, యూట్యూబ్‌లో ఆ పాట సూపర్ హిట్. కేవలం ఐదు రోజుల్లో రెండు కోట్ల ఇరవై లక్షల మంది చూశారు సారంగ దరియా పాటను.
ఈ పాట చరణాలు మొత్తం అమ్మాయి అందంతో పాటూ, ఆమె వ్యక్తిత్వాన్ని వర్ణిస్తూ రాశానంటూ చెప్పుకొచ్చారు సుద్దాల అశోక్ తేజ. సుర్మా పెట్టిన చురియా అంటే కాటుక పెట్టిన కత్తి అని అర్థం. ఆమె వ్యక్తిత్వం అలాంటిది. అంటూ ఒక్కో చరణాన్నీ, దాని భావాన్నీ వివరించారు.
‘‘గజ్జెలు ఘల్లు ఘల్లు మన్నాయని అందరూ అంటారు.. కానీ, కాళ్లకు వెండి గజ్జెలు లేకున్నా నడిస్తే ఘల్ ఘల్ / కొప్పున మల్లె దండలు లేకున్నా చెక్కిలి గిల్ గిల్... అంటే ఆమెకు బాహ్య అలంకారాలు లేకపోయినా ఆమె అందం అంతకంటే ఎక్కువగా ఉందనీ, ఆమెకు ఏ ఆభరణాలు, అలంకారాలు లేకపోయినా అంతే ఆకర్షణీయంగా ఉందనీ చెప్పడం ఉద్దేశం’’ అంటూ వివరించారు అశోక్ తేజ.
తమలపాకులు, తాంబూలం లేకపోయినా, ఆమె ముని పంటితో పెదవి కొరికితే మన దిల్ ఎర్రగా అవుతుంది అంటూ సాగుతుంది ఈ చరణం.
‘‘శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్ పాత్ర వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. తెలంగాణ పల్లె పడుచుల వ్యక్తిత్వం కూడా అంతే గొప్పగా ఉంటుంది. అందుకే, ఆ మేళవింపు రెండో చరణంలో ఉంటుంది.’’ అన్నారు అశోక్ తేజ.
‘‘ఈ పాట చిన్నప్పుడు నేను మా అమ్మ దగ్గర విన్నాను. తరువాత మా వదిన వాళ్లు కూడా చిన్నప్పుడు పాడుకునే వాళ్లం అని చెప్పారు. చాలా కాలం తరువాత టీ న్యూస్ లో కోమలి పాడినప్పుడు విన్నాను. మొన్న శేఖర్ కమ్ముల గారు ఈ పల్లవి చెప్పి, మిగతాది మనం రాయాలి అన్నారు. ఆ పల్లవి పదాలు తీసుకుని నేను పాట అల్లాను.’’ అన్నారు అశోక్ తేజ.
గతంలో, 'నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను' అనే శ్రీశ్రీ కవితా వాక్యాలను పల్లవిగా తీసుకుని ఠాగూర్ సినిమాలో పాట రాశారు సుద్దాల. ‘‘అగ్నినేత్ర మహోగ్రజ్వాలా దాచిన ఓ రుద్రుడా, అగ్నిశిఖలను గుండెలోనా అణచిన ఓ సూర్యుడా’’ అని సాగే ఆ పాటకు ఆయనకు జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డు వచ్చింది.
‘‘పల్లె పదాల స్థాయిలో పల్లె స్త్రీల హృదయాల స్థాయిలో మమేకం అయి వాళ్లే మళ్లీ పాట అల్లుకుంటే ఎలా రాస్తారనేది ఆవహింపజేసుకుని రాశాను. తెలంగాణ జానపద స్త్రీలను హిమాలయాల స్థాయిలో వర్ణించాను. స్త్రీల అందం, ఒయ్యారంతో పాటు వ్యక్తిత్వాల మేళవింపు ఈ పాట. ఈ పాట విన్న చాలా మంది ఫోన్ చేసి మా మా అమ్మ కాలం, అమ్మమ్మ కాలం గుర్తొచ్చింది అని చెప్తున్నారు. శృంగారం, వ్యక్తిత్వాల మేలు కలయిక ఇది’’ అంటూ చరణాల గురించి వివరించారు అశోక్ తేజ.

తెలుగు సినిమాల్లో కొత్త ట్రెండ్
తెలుగు సినిమాల్లో ఇలా శాస్త్రీయ సంగీతం, జానపదాలు లేదా ఆధునిక కవిత్వంలోని పంక్తులను పల్లవిగా తీసుకుని పాటలు రాసే ధోరణి బాగా ఉంది. ఆ కోవలో తాజా హిట్ సారంగ దరియ.
సారంగ దరియ పాటలో వరంగల్ ప్రాంతంలో సేకరించిన చరణాలు ప్రస్తుత సినిమా పాట కంటే కాస్త భిన్నంగా ఉంటాయి.
దాని శిగలో ఉన్నది ఒక పువ్వు, దాని పువ్వులో నాదొక్క నవ్వు
దాని ఇంటి ముందరొక వేప.. ఆ వేపలో నాదొక్క పాప..
ఇలా సాగుతాయి ఆ చరణాలు..

ఫొటో సోర్స్, Mangli/Facebook
‘‘ప్రోమో చూశాక చాలామంది ఫ్రెండ్స్ ‘నీ పాట సినిమాలో వస్తోంది. మంగ్లీ పాడింది. సాయి పల్లవి డాన్స్ చేసింది’ అని చెప్పారు. ఈ పాట గురించి శేఖర్ కమ్ముల గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. కానీ, నా గొంతు ప్రస్తుతం బాలేకపోవడం వల్ల నాకు పాడే అవకాశం దొరకలేదు. గొంతు బాగయ్యే వరకూ ఆగుదాం అనుకుంటే, సినిమా షెడ్యూల్ సమయం లేదన్నారు. అయితే, సినిమా ఈవెంటులో మాత్రం నా చేత పాడిస్తానని శేఖర్ కమ్ముల గారు ఫోన్లో చెప్పారు’’ అంటూ చెప్పుకొచ్చారు కోమల.
కోమల ఆ పాట ఎక్కడ పాడినా తన అమ్మమ్మ దగ్గర నుంచి అందిన లిరిక్సే పాడుతుంది. అందులోనే పాతదనం ఉందని ఆమె అంటుంది.
ప్రస్తుతం తన అత్తగారి ఊరు జానకీపురంలో వ్యవసాయం చేస్తోన్న కోమల, కుటుంబ పరిస్థితుల వల్ల పాటలకు దూరం అయింది. కానీ, జానపదాల మీద ఆమెకు ఆసక్తి పోలేదు. ఇప్పటికీ పొలంలో కూలీకి వచ్చే మహిళల దగ్గర కూర్చుని పాటలు సేకరిస్తున్నట్టు చెప్పారు. చుట్టుపక్కల ఏదైనా ఊళ్లో బాగా పాడే వారు ఉంటే వారి దగ్గరకు వెళ్ల మరీ జానపదాలు సేకరిస్తున్నట్టు వివరించారు.
‘‘నేను ఫోన్లో రికార్డు చేయను. ఎందుకంటే నేను మళ్లీ పాడాలంటే నా దగ్గర ఫోన్ లేకపోతే ఇబ్బంది. అందుకే ప్రతీ పాటా వంట పట్టించుకుంటాను. పాట మొత్తం గుర్తు పెట్టుకుంటాను. మనసులోనే రికార్డు చేసుకుంటాను’’ అన్నారు కోమల.
కుటుంబ బాధ్యతల నుంచి కుదుటపడుతూ ఇప్పుడిప్పుడే ఆమె మళ్లీ పాటల వైపు దృష్టి పెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమా ఈవెంట్లో తనకు పాడే అవకాశం ఇస్తానని శేఖర్ కమ్ముల హామీ ఇవ్వడంతో ఆమె ఎంతో సంతోషంగా ఉన్నారు.
‘‘నేను వంద వరకూ పాటలు సేకరించాను. జానపదాలు నా సొంతమూ కాదు, ఎవరి సొంతమూ కాదు. నేను కూడా వాటిని సేకరించి వెలుగులోకి తెచ్చాను అంతే. ఆ రోజు సుద్దాల అశోక్ తేజ గారు ఆ పాట గురించి నన్ను పొగిడారు. కానీ తరువాత మర్చిపోయుంటారు అనుకున్నాను. కానీ, ఆయన ఆ పాటను ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. చాలా సంతోషంగా ఉంది.’’ అంటూ చెప్పుకొచ్చారు కోమల.

సారంగ దరియ అంటే..?
సారంగ దరియ అనే పదానికి అర్థం ఏంటనే విషయంలో ఎవరి దగ్గరా స్పష్టమైన సమాధానం లేదు. సారంగ అనే సంస్కృత పదానికి 30కి పైగా అర్థాలున్నాయి. ఈ పాట సందర్భానికి సరిపోయేవి కూడా చాలానే ఉన్నాయి.
శ్రీమహా విష్ణువు చేతిలోని విల్లు. దీన్నే కోదండం అని కూడా అంటారు. తమిళనాడులో సారంగపాణి పేరుతో విష్ణు ఆలయం ఉంది. రాజస్థాన్ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే వీణ లాంటి ఒక సంగీత పరికరం పేరు కూడా సారంగయే. సారంగం అంటే రంగురంగులు, చిత్రవర్ణములు కలది అనే అర్థం ఉంది. సంప్రదాయ సంగీతంలో ఒక రాగం పేరు కూడా సారంగమే. అలాగే హిందూ పురాణాల్లో మన్మథుణ్ణీ సారంగుడు అంటారు. లేడి, రాజహంస, కోకిల, నెమలి, గంధం, సింహం, ఏనుగు, చాతక పక్షి, పెద్దగడిలో సన్నగళ్లు నేసిన చీర, తుమ్మెద... ఇలా ఆ పదానికి చాలా అర్థాలున్నాయి.
దరియ అంటే హిందీలో నది అని అర్థం ఉంది. దరయాయీ అంటే పార్శీ - ఉర్దూలో ఒకరకమైన పట్టు వస్త్రం అనే అర్థం ఉంది. ఇక దరియా పేరుతో ఉత్తర భారతంలో చాలా ఊళ్లు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో చీరలో దరి అనే పదం కూడా ఉంది.
దరియా అంటే నది ఒడ్డు అనే అర్థం కూడా వస్తుందని వివరించారు అశోక్ తేజ. ధరించినది ధారి కాబట్టి, అది వ్యవాహారికంలో దరియా అయ్యుండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు సుద్దాల అశోక్ తేజ. ఇక రాజరాజనరేంద్రుడు కొడుకు సారంగధరుడు, చిత్రాంగి పేరుతో కథలు కూడా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
దాని కుడి భుజం మీద కడవ, దాని గుత్తెపు రైకలు మెరియ
అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సారంగ దరియ
దాని ఎడం భుజం మీద కడవ, దాని ఎజెంటు రైకలు మెరియ
అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సారంగ దరియ
సారంగ, దరియ - రెండు పదాలకూ ఉన్న ఒక్కో అర్థాన్నీ కలిపితే ఒక్కో భావన వస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే చాలా పదాలు ఈ పాట సందర్భానికి సరిపోయేవే ఉన్నాయి.
ఒయ్యారంగా కడవ మోసుకెళ్లే అమ్మాయి కావచ్చు, పెద్ద గళ్ల చీర కట్టిన అమ్మాయి కావచ్చు, లేడి వంటి నడక కలిగిన అమ్మాయి కావచ్చు, సారంగను చేతితో పట్టుకుని వయ్యారంగా మీటుతూ నడిచే అమ్మాయి కావచ్చు.. ఇలా చాలా ఉన్నాయి.
వాస్తవంగా మొదటిసారి ఈ పాటను అల్లి, రాగం కట్టిన వారు, సారంగ పదాన్ని ఏ అర్థంలో వాడారో, దరియా అనే పదాన్ని ఏ భావనలో వాడారో స్పష్టత లేదు. కానీ ఈ పాట సందర్భానికి పైన చెప్పిన చాలా అర్థాలు సరిపోతాయి.. తెలంగాణ ప్రాంతంలో తెలుగుపై వివిధ భాషల ప్రభావం లేదా, వివిధ సంస్కృతుల ప్రభావం ఈ పాట పల్లవిపై పడి ఉండొచ్చు.
ఇక గుత్తెపు రైకలు మెరియ అంటే, గుత్తెపు అంటే బిగువుగా ఉన్న అర్థం. అంటే బిగుతుగా ఉన్న బ్లౌజ్ లేదా జాకెట్.ఏజెంటు రైక అనే పదానికి సరైన అర్థం ఏంటి అనేది ఎవరి దగ్గరా స్పష్టత లేదు. ఏజెంటు అనేది ఒక రంగు కావచ్చని కొందరు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- నరసరావుపేట అనూష హత్య: నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడా... పరారీలో ఉన్నాడా?
- సద్దాం హుస్సేన్ కూతురు రగద్: 'నా భర్తను మా నాన్నే చంపించారు'
- దేశద్రోహ చట్టం: అసమ్మతిని అణచివేయడానికి ప్రయోగిస్తున్న అస్త్రం
- గ్యాంగ్ రేప్ నిందితుడు పోలీసులకు దొరక్కుండా 22 ఏళ్లు ఎలా తప్పించుకు తిరిగాడు?
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: తప్పెవరిది, అమ్మాయిలదా.. తల్లిదండ్రులదా.. సమాజానిదా? :అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








