'క్రాక్'‌తో రవితేజ మళ్లీ ట్రాక్‌లో పడినట్లేనా - సినిమా రివ్యూ

రవితేజ

ఫొటో సోర్స్, facebook/gopichandmalineni

    • రచయిత, శతపత్ర మంజరి
    • హోదా, బీబీసీ కోసం

'రాజా ది గ్రేట్' సినిమా తరువాత చెప్పుకోదగ్గ హిట్ లేని రవితేజ.. రవితేజ పల్స్ తెలిసిన దర్శకుడిగా డాన్ శీను, బలుపు లాంటి సిమాలతో నిరూపించుకున్న గోపిచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన 'క్రాక్' సినిమా టీజర్, ట్రైలర్‌తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సంక్రాంతి బరిలో ముందుగా విడుదలైన క్రాక్ సినిమా రిలీజ్‌ టైమ్‌లో ఫైనాన్షియల్‌ ఇష్యూస్‌ ఎదుర్కొని కొన్నిచోట్ల షోలు వాయిదా పడ్డప్పటికీ ఎట్టకేలకు అన్ని చోట్లా విడుదలైంది.

ఇంతకు రవితేజ క్రాక్ సినిమాతో తిరిగి ట్రాక్ ఎక్కాడా? గోపిచంద్ మలినేని తన మినిమం గ్యారెంటీ మార్క్ ను నిలబెట్టుకున్నారా? అనే విషయాలు చూద్దాం.

క్రాక్ టీమ్

ఫొటో సోర్స్, facebook/raviteja

పోత రాజు వీర శంకర్ (రవితేజ) అనే పోలీసాఫీసర్, ఆయనకు భార్య(శృతిహాసన్), కొడుకు.. వాళ్ల మధ్య జరిగే హాస్య సన్నివేశాలు.. సలీమ్(చిరాగ్ జాని), కటారి కృష్ణ(సముద్రఖని), కడప రెడ్డి(రవిశంకర్) అనే ముగ్గురు విలన్లకు, పోతరాజు వీర శంకర్‌కు మధ్య జరిగే తతంగమే ఈ సినిమా సారాంశం.

ఆంధ్రప్రదేశ్ లోని మూడు వేర్వేరు నగరాలలో జరిగే సంఘటనలన్నీ ఒకే కథలో ఎలా ఇమిడాయి?అసలీ ముగ్గురు విలన్లకు మధ్య ఉన్న కామన్ విషయం ఏమిటి?

సినిమా ఇంట్రడక్షన్‌లో చూపించే యాభై రూపాలయల నోటు మీద మామిడి కాయ, మామిడికాయను గుచ్చుకుని ఉన్న మేకు దేనికి సంకేతం?

జయమ్మ అనే పాత్రలో వరలక్ష్మి శరత్ కూమార్ ఎంతవరకు మెప్పించింది. శృతిహాసన్‌ది గ్లామర్ డాల్ పాత్రనా? లేదంటే ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ ఏమైనా కనబరిచిందా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

రవితేజ

ఫొటో సోర్స్, facebook/gopichandmalineni

'విక్రమార్కుడు' నుంచి..

విక్రమార్కుడు సినిమా తరువాత నుండి రవితేజ పోలీస్ పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోతాడనే ఇమేజ్ సంపాదించుకున్నాడు.

ఆ తరువాత గమనిస్తే ఆయన చేసిన చాలా సినిమాల్లో పోలీస్ పాత్రలలోనే కనపించాడు.

ఈ సినిమా కథలో గానీ, కథనంలో గానీ ఎలాంటి కొత్తదనం లేదు. ఇది కేవలం రవితేజను అభిమానించే మాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తీసిన సినిమా అని ప్రేక్షకులకు ఇట్టే అర్థమైపోతుంది.

డాన్ శీను,బలుపు సినిమాల సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు ప్రతి ఫ్రేమ్ తీర్చిదిద్దుకున్నట్లుగా ఉంది.

రవితేజ అభిమానులతో విజిల్స్ వేయించడమే దర్శకుడి ఏకైక లక్ష్యంగా అనిపిస్తుంది.

సినిమా ఆసాంతం రవితేజ వన్ మ్యాన్ షో లాగా సాగుతుంది.

సినిమా ఇంట్రడక్షన్ లో ఓ 50 రూపాయల నోటు, దాని మీద మామిడికాయ చూపించి ప్రేక్షకులలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలనుకునే దర్శకుడి అత్యాశ నవ్వు తెప్పిస్తుంది.

సింబాలిక్ షాట్స్ అవసరమే గానీ ఇంత సిల్లీ పాయింటా...అనిపించకూడదు కదా!

వేట పాలెంలో గాడిదల నెత్తురు తాగే క్రూరమైన రౌడీలను చూపించి ప్రేక్షకుల ఒళ్లు గగుర్పొడిపించడంలో కూడా దర్శకుడు ఆకట్టుకోలేకపోయాడు.

కటారి కృష్ణ, జయమ్మ కాంబినేషన్ భలే ఉంది కదా అనిపిస్తుంది.

అయితే అంతలోనే వరలక్ష్మి పాత్రలో ఏదో డివైడేషన్ కనపడి ఆ పాత్ర తీవ్రతను తగ్గిస్తుంది.

హీరోయిన్ పాత్ర బొత్తిగా గ్లామర్‌కే అంకితమైపోయింది అనిపించి కాబోలు సెకండాఫ్‌లో ఐదునిమిషాలు ఓ పది ఎఫెక్ట్స్ వేశారు. పోని హీరోయిన్నీ అందంగానైనా చూపించారా అంటే అది కూడా కనపడదు. కామెడీ పేరిట కుటుంబ నేపథ్యంలో సాగే సన్నివేశాలకు విసుగొస్తుంది.

రవితేజ

ఫొటో సోర్స్, facebook/gopichandmalineni

ఒకప్పటి రవితేజ రఫ్ లుక్ స్థానంలో సాఫ్ట్ లుక్‌లో కనిపించినా ఈ సినిమాలో తనదైన మాస్ మ్యానరిజమ్, డైలాగ్ డెలివరీలతో ఆకట్టుకున్నాడు.

రవితేజ తరువాత చెప్పుకోదగ్గ పాత్ర సముద్రఖనిది.

సముద్రఖని సినిమా సినిమాకు తన విలనిజంలో వెరియేషన్స్ చూపిస్తూ... చూస్తున్నంత సేపు తన నటనను అద్భుతంగా పదును పడుతున్నాడనిపిస్తుంది.

వరలక్ష్మి శరత్ కుమార్ మాస్ లుక్కులో బాగుంది. శృతిహాసన్ ఏమి చేయడానికి స్కోప్ లేకపోవడంతో కొన్ని పాటలకు సెకండాఫ్ లో కొన్ని ఎఫెక్ట్ షాట్స్ తో సరిపెట్టుకుంది.

రవితేజ కొడుకు పాత్రలో గోపిచంద్ మలినేని కొడుకు మెరుస్తాడు. రవిశంకర్ తన పాత్రకు న్యాయం చేసాడు. చిరాగ్ జానిని పెద్ద విలన్ గా చూపించి విషయమేమీ లేకపోవడం నిరుత్సాహం కలిగిస్తుంది. అలీ, సప్తగిరి, అవినాష్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పటికీ కామెడీ లేని లోటు తెలుస్తోంది.

థమన్, రవితేజ

ఫొటో సోర్స్, facebook/raviteja

బూతు డైలాగ్స్‌కు విజిల్స్

విష్ణు సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయ్యింది. ప్లస్ అంటే ఈ రొటీన్ మసాలా స్టఫ్ ఇష్టపడే ప్రేక్షకులను అలరిస్తుంది. రక్తపాతం,కన్విన్స్ అవ్వలేని ఫైట్లు ఇష్టపడని వారికి నచ్చకపోవచ్చు. రవితేజను పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకుంటాడు. విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌‌కు బాగా సానపట్టాడు. ఇక తమన్ నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ అయ్యింది.

రవితేజ ఎలివేషన్స్ షాట్స్‌కి బిజియం అదిరింది.

సినిమా కథ,కథనంతో పాటు ఫైట్లు,పాటలు అన్నింటికీ మాస్ ప్రేక్షకులే టార్గెట్.

బుర్రా సాయి మాధవ్ డైలాగ్‌లకు థియేటర్స్‌లో విజిల్స్ పడ్డాయి.

అంటే కావాల్సినంత బూతు సాహిత్యం పండిందన్నమాట.

నవీన్ నూలి తన కత్తెరకు పని చెప్తే ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండేదేమో అనిపిస్తుంది.

మొత్తానికి సంక్రాంతి బరిలో మొదట మాస్ ప్రేక్షకుల కోరిక కొంత వరకు తీరినట్లుగా అనిపిస్తుంది.పండగ సందడి మొదలైన ఫీలింగ్ తెప్పిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)