ఉమామహేశ్వర ఉగ్రరూపస్య : మంచి బబుల్‌గమ్ లాంటి సినిమా - రివ్యూ

ఫొటో సోర్స్, facebook/venkatesh maha
- రచయిత, కె.సరిత
- హోదా, బీబీసీ కోసం
‘కేరాఫ్ కంచరపాలెం’ లాంటి ఫ్రెష్‌నెస్ ఉన్న ఫీల్‌గుడ్ సినిమా అందించిన ‘వెంకటేశ్ మహా’ రెండో ప్రయత్నం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.
సినిమా బానే ఉంది. శుభ్రమైన ఎంటర్టెయినర్. కాకపోతే తొలిభాగం ప్రామిసింగ్‌గా మొదలై రెండో అర్థభాగంలోకి వచ్చేసరికి సినిమా ఎపుడయిపోతుందా అని ఎదురుచూసేలా చేస్తుంది. బాగా సాగదీశారు.
సినిమా ఎలిమెంట్లోనే కొంత ఆ ఇబ్బంది ఉంది. ఇంకొంత ట్రీట్మెంట్‌లోనూ ఉంది.
వాస్తవానికి ఇది ‘మహేషింటే ప్రతీకారం’ అనే మళయాళం సినిమాకు రీమేక్. కాస్త ఓపిక కూడా ఉంటే మంచి కాలక్షేపమే.
కాకపోతే మళయాళం చూసిన కళ్లతో దీన్ని చూసి పోల్చుకోవడం అనవసరం. ఫాజిల్ చూసిన కళ్లతో ఎంత సత్యదేవ్ అయినా ఆనడం కష్టం.
అలా పోల్చుకోకుంటే సత్యదేవ్ ఫర్మార్మెన్స్‌కు మంచి మార్కులే పడతాయి.

ఫొటో సోర్స్, facebook/satyadev
థీమే కత్తి మీద సాము.
గూండా ఒక మంచోడ్ని కొడితే సదరు గూండాని తిరిగి కొట్టేంత వరకు కాళ్లకు చెప్పులేసుకోను అనే మంచివాడి శపథం ఉంది చూశారూ ఆ థీమే కత్తిమీద సాము.
చేస్తున్నదేమో ఫీల్ గుడ్ ఆఫ్ బీట్ సినిమా. థీమ్ ఏమో మాస్ లైన్. ఇది డీల్ చేయడం, నెరేషన్ బిగువుగా ఉండేలా చూడడం అంత మామూలు విషయం కాదు.
ఇదే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు ఫ్యాన్స్ మధ్యలో పోటీ సంభాషణ ఉంటుంది. అలాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోలతో తీసే మాస్ మసాలా థీమ్ అది.
జుత్తు కత్తిరించుకోననో మరోటో హీరో ప్రతిన బూనడాలు, లేక హీరో ఇంట్లో ఎవరో స్త్రీ ప్రతిన బూనడాలు, హీరోకు ప్రపంచంలో ఎక్కడ లేని అతీంద్రియ శక్తులను తెచ్చిపెట్టి వేలమంది గూండా గారి అనుచరులను చావబాది చివరకు విలన్ను అతను చావబాదడడాలు అక్కడ సర్వసాధారణమైన విషయం.
ఇది ఆఫ్ బీట్ కాబట్టి హీరోను అలా చూపించడం కుదరదు.. కామెడీ జానర్లో ధీమ్‌ను నడిపించడానికి బోల్డంత నైపుణ్యం కావాలి.
అందుకే ప్రతిన బూనేదాకా హైవే మీద ఆడికారులో సాగుతున్నట్టు అనిపించే సినిమా ప్రతిన బూనిన తర్వాత సింగిల్ రోడ్డుమీద ఎర్రబస్సు ప్రయాణంలా గతుక్కు గతుక్కుమంటూ సాగుతుంది.
ముఖ్యంగా పాటలు, ఫైట్స్ బాబోయ్ ఇకచాలు అనేట్టు చేస్తాయి. ముఖ్యంగా ఫ్లాష్ మాబ్ డాన్స్ సీన్లో అయితే ఈ పాటే ఆఖరు, వెంకటేశ్ మహా మనకి అన్యాయం చేయడు అని ఆశపడుతూ ఉంటాం. కానీ, అతను మన సహనాన్ని పరీక్షిస్తున్నట్టు ఉంటుంది.
సినిమా ఓటీటీ రిలీజ్ కాబట్టి ప్రేక్షకుల చేతిలో ఫార్వార్డ్ ఆప్షన్ ఉందిప్పుడు.

ఫొటో సోర్స్, facebook/karunakumar
చిన్న పాత్రయినా..
మధ్యలో సుహాస్ నటన కాస్త రిలీఫ్. పాత్ర అతి చిన్నదైనా గుర్తింపు తెచ్చుకోగలిగాడతను. చిన్న పాత్ర పోషించిన పలాస దర్శకుడు కరుణకుమార్‌ను కామెడీకి బాగానే వాడుకున్నారు.
రూప కొడువయూర్ చూడడానికి మన పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ...తన చలాకీతనం, నటన ప్రతిభతో ప్రేక్షకులకు దగ్గరైందని అనిపిస్తుంది.
నరేశ్ క్యారక్టర్ నటుడిగా కొంతకాలంగా బాగా రాణిస్తున్నారు. ఇందులోనూ చక్కగా ఇమిడిపోయారు.
కాకపోతేకొన్ని పాత్రల డైలాగులు నిజంగా ఆ పాత్ర అలాంటివి మాట్లాడుతుందా అని మనం నోరెళ్లబెట్టేలా చేస్తుంటాయి. కొన్ని పాత్రలకు నటుల ఎంపిక సరిగా లేదు.
'చిన్న' సినిమాలలో చాలా వాటికి ఉండే సమస్య అది. బడ్జెట్ పరిమితులు కావచ్చు. మరేదైనా కానీ ప్రేక్షకుల వైపునుంచి అది వెలితే.

ఫొటో సోర్స్, facebook/venkatesh maha
అవమానం నుంచి మొదలైన పగ
అరకు గ్రామంలో తండ్రి దగ్గరి నుండి వారసత్వంగా అందిపుచ్చుకున్న ఫోటోగ్రఫీని వృత్తిగా ఎంచుకుని,సొంతంగా ఒక ఫోటో స్టూడియో నడుపుతూ.. తనకంటూ మిగిలి ఉన్న ఒకేఒక్క బంధం తండ్రిని, తాను ఎంతగానో ఇష్టపడే బాల్య స్నేహితురాలు స్వాతి(హరిచందన కొప్పిశెట్టి)ని అమితంగా ప్రేమిస్తూ,అందరితో మంచితనంగా మెలిగే సర్వసాధారణమైన వ్యక్తి ఉమామహేశ్వరరావు.
అనుకోకుండా అతని ప్రమేయం ఏమాత్రం లేకుండానే ఒక అవమానానికి గురవుతాడు.అతడి స్వభావానికి విరుద్ధంగా ఆ వ్యక్తిపై పగబడతాడు.ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.
అదే సమయంలో ఎంతగానో ప్రేమించిన స్వాతి మరొకరిని వివాహం చేసుకుని వెళ్లిపోతుంది. కొంతకాలానికి జ్యోతి(రూప కొడువయూర్)అనే మరో అమ్మాయి అతని జీవితంలోకి వస్తుంది.
ఆ తరువాత పరిణామాలు ఏమిటి?ఉమామహేశ్వరరావు తన ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు?అనేదే సినిమా క్లైమాక్స్.
'నేచర్లో ఎక్కడో జరిగే చర్యకు, ఇంకెక్కడో ప్రతిఫలం ఉంటుంది' అనే కాన్సెప్ట్ ఆధారంగా వచ్చిన 'నాన్నకు ప్రేమతో' సినిమా గుర్తుకు వచ్చేలా ఉంటుంది ఈ సినిమాలో కీలక సన్నివేశం.
ఎక్కడో మొదలైన చిన్న గొడవ.. ఇంకెక్కడికో దారితీసి.. అలా అలా అది చివరగా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్‌గా కథనాయకుడి జీవితం మలుపు తిప్పుతుంది. హృదయాన్ని ద్రవింపజేసే మాటలు,కనులకు ఆహ్లాదకరంగా అనిపించే విజువల్స్, మెలోడిగా సాగే పాటలతో ప్రథమార్థమంతా ప్రశాంతంగా సాగుతూ...తరువాత ఏం జరుగుతుందోనన్న ఆసక్తిని క్రియేట్ చేస్తుంది సినిమా.
అలా ప్రశాంతంగా సాగే కథ ఒకానొక్క కీలక సన్నివేశంతో మలుపు తిరిగి..ఒక వ్యక్తి పై ప్రతీకారం తీర్చుకునే వరకు చెప్పులు వేసుకోనని కథనాయకుడు శపథం చేయడంతో సీరియస్‌నెస్ పెరుగుతుంది.
ద్వితీయార్థంలో మొదలయ్యే కథానాయకుడి రెండో ప్రేమకథను కూడా ఆసక్తిగా మలిచినప్పటికీ..కథకు కీలక సన్నివేశమైన.. అతడి అసలు లక్ష్యం పక్కకు వెళ్లిపోయినట్లుగా అనిపిస్తుంది.
ఉమామహేశ్వరరావు శపథం చేసే సన్నివేశంలో ఉన్న ఉద్ధృతి చూసినప్పుడు కథను ఏదో స్థాయిలో ఊహించుకునే ప్రేక్షకులకు ఆ తర్వాత అందులో ఏ మాత్రం ఇంటెన్సిటీ కనపడకపోవడంతో కథ తేలిపోయినట్లుగా అనిపిస్తుంది.
కమర్షియల్ సినిమాల్లోలాగా ఉమామహేశ్వరరావు విన్యాసాలు చేయాలని గానీ,లేదంటే మాస్ లుక్ పాటలతో డ్రామా పంచాలని గానీ ప్రేక్షకులు కోరుకోకపోయినా.. వాస్తవిక శైలిలో చెప్పే కథ అయినప్పటికీ ప్రేక్షకులు కథానుగుణంగా ఒక ఇంటెన్సిటీని కోరుకోవడంలో తప్పు లేదు కదా? సన్నివేశాల్లో తీవ్రత తగ్గిపోవడం..అసలు కథానాయకుడి శపథం గురించి అతడితో సహా ప్రేక్షకులు కూడా మరిచిపోయేలా సన్నివేశాలు బేలగా మారిపోవడం..ఎంతోగొప్పగా చూపిస్తున్న తండ్రి పాత్ర గురించి కొంతైనా కథ లేకపోవడం..హఠాత్తుగా క్లైమాక్స్ లో అంతవరకు ఎక్కడా కనిపించని కసి కథానాయకుడిలో చూపించి హడావుడిగా ఒక ఫైటింగ్ చేయించి..'మమా' అనిపించి ముగించినట్లుగా అనిపిస్తుంది.
"వెళ్లిపోవాలనుకున్న వాళ్లను వెళ్లనివ్వకపోతే ఉన్నా వెలితిగానే ఉంటుంది'' , ''నీకు టెక్నిక్ ఉంది, ఎమోషన్ లేదు'' లాంటి మాటలు మెరిశాయి. మ్యూజిక్ మాత్రం అనవసరమైన అప్ అండ్ డౌన్స్‌తో కాస్త విసిగిస్తుంది.
మహా తన మొదటి సినిమాలాగే ఓ సగటు మనిషి జీవితాన్ని వాస్తవికంగా కూసింత హాస్యస్ఫోరకంగా చిత్రించే మంచి ప్రయత్నం చేసినప్పటికీ నెరేషన్ సాగదీసినట్టుండడం వల్ల ప్రేక్షకుల ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్టయ్యింది.
సినిమా అంటే ఇంత నిడివి ఉండాలి, ఇన్ని రీళ్లు ఉండాలి అనేదాన్ని కొత్త దర్శకులైనా కాస్త సమీక్షించుకుని పునర్నిర్వచించుకోవాలేమో.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








