రఫేల్ డీల్: అప్పుల ఊబిలో ఉన్న అనిల్ అంబానీ రఫేల్ విమానాలను ఎగరేయగలరా?

ఫొటో సోర్స్, European Photopress Agency
- రచయిత, ప్రశాంత్ చాహల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రైవేటు రంగానికి చెందిన యస్ బ్యాంక్ 892 కోట్ల రూపాయల అప్పును చెల్లించనందుకు అనిల్ అంబానీ గ్రూప్ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంది.
రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తాను తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించక పోవడంతో దక్షిణ ముంబయిలోని అనిల్ అంబానీకి చెందిన రెండు ఫ్లాట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆ బ్యాంక్ పత్రికల్లో ప్రకటన ఇచ్చింది.
అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ ADAGకు చెందిన దాదాపు అన్ని కంపెనీలు ముంబయి శాంతాక్రుజ్‌లో ఉన్న రిలయన్స్ సెంటర్ నుండి పనిచేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఆ గ్రూప్ కంపెనీల ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. కొన్ని కంపెనీలు దివాలా తీయగా, మరికొన్నింటి షేర్లను అమ్ముకోవాల్సి వచ్చింది.
బకాయిల గురించి అనిల్ అంబానీకి ఈ ఏడాది మే 6న యస్ బ్యాంకు నోటీసు ఇచ్చింది. నోటీసు తర్వాత 60 రోజుల గడువు ఉన్నప్పటికీ, అనిల్ అంబానీ సంస్థలు బాకీలు చెల్లించలేక పోయాయి. దీంతో జులై 22న ఈ మూడు ఆస్తులను యస్ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. ఈ ఆస్తులకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు చేయకూడదని యస్ బ్యాంకు ప్రకటించింది.
గత ఏడాది తన 21,432 చదరపు మీటర్ల కార్యాలయాన్ని లీజుకు ఇవ్వాలని అనిల్ అంబానీ భావించారు. తద్వారా తన అప్పులు తీర్చడానికి కొంత సొమ్మును సేకరించవచ్చన్నది ఆయన ఆలోచనగా పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

ఫొటో సోర్స్, European Photopress Agency
రఫేల్ విమానాల ఒప్పందం.. వివాదం
భారతదేశం రఫెల్ విమానాల ఒప్పందం, అందులో అనిల్ అంబానీ సంస్థ పాత్రపై ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ప్రజలు ఎక్కువగా ఆసక్తిని కనబరిచారు.
ఆస్తుల పంచుకున్నాక, అన్న ముకేశ్ సంపద పెరగగా, అనిల్ అప్పుల్లో కూరుకుపోయారు. అనిల్ ఏ వ్యాపారమూ వృద్ధికాలేదు. భారీగా అప్పులయ్యాయి. కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టే పరిస్థితిలో లేరు. ఉన్న వ్యాపారాలను ఇతరులకు అమ్మేయడమో, లేదంటే ఇతర కంపెనీలతో చేతులు కలపడమో చేస్తున్నారు అనిల్. రఫెల్ ఒప్పందంలో ఆయన కంపెనీ పాత్రపై వివాదం చెలరేగింది. ఇప్పుడు యస్ బ్యాంక్ రూపంలో మరో సమస్య వచ్చింది.
రఫెల్ విమానాలు తయారు చేసే ఫ్రెంచ్ సంస్థ దస్ ఏవియేషన్ అనిల్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్‌ను తన ఆఫ్‌సెట్ భాగస్వామిగా చేసుకుంది. అయితే, దీనిపై విమర్శలు చెలరేగాయి. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్థానంలో దివాలా తీసిన అంబానీ సంస్థతో రూ.30,000 కోట్ల ఒప్పందం ఎందుకు కుదుర్చుకున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
"ఈ ప్రశ్నలు ఇంతకు ముందే వినిపించాయి. ఇప్పుడు మరింత తీవ్రంగా మారాయి'' అన్నారు ఆర్ధిక వ్యవహారాల నిపుణులు, సీనియర్ జర్నలిస్ట్ అలోక్ జోషీ.
"ఇవ్వడానికి తన దగ్గర ఏమీలేవని లండన్ కోర్టులో అనిల్ అంబానీ చేసిన ప్రకటన సరి పోతుంది. ఇంత కీలకమైన రక్షణ ఒప్పందంలో అనిల్ ఎలా భాగస్వామి అయ్యారు? దివాలా తీసిన వ్యక్తులను ఈ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధించాలి " అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రక్షణ రంగంలో ఏమాత్రం అనుభవంలేని అనిల్ అంబానీ సంస్థ ఈ ఒప్పందంలో భాగస్వామి అయినప్పుడు కలకలం రేగింది. ఇది అవినీతిని ప్రోత్సహించడమేనని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రభుత్వం మాత్రం దస్ ఏవియేషన్ కేవలం అంబానీ కంపెనీకే కాదని, భారతదేశంలో అనేక కంపెనీలకు భాగస్వామ్యం కల్పించిందని చెప్పింది. తాము ఈ ప్రాజెక్టులో కీలక భాగస్వాములమని అనిల్ సంస్థ ప్రకటించుకుంది.
ఈ మొత్తం బిజినెస్ డీల్‌లో భారత ప్రభుత్వం పాత్ర ఏంటో మోదీ బృందం వివరించలేదు. ఇది చాలా పవిత్రమైన ఒప్పందమని ప్రభుత్వం చెప్పుకుంది. దేశ రక్షణకు సంబంధించిన కొన్ని ఒప్పందాలను బైటపెట్టలేమని సర్కారు స్పష్టం చేసిది. అయితే ఇది అంత ముఖ్యమైన వ్యవహారమైతే మునిగిపోతున్న సంస్థను ఎందుకు ఈ ఒప్పందంలో భాగం కల్పించారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
"ప్రధానమంత్రి విదేశీ యాత్రలకు వెళ్లినప్పుడు ఆయనతోపాటు కొంతమంది వ్యాపారవేత్తలు కూడా వెళతారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో జిందాల్, అదానీ, అంబానీల్లాంటి వారు కనిపిస్తారు. కానీ ప్రధాని మాత్రం ఆ ఒప్పందాలలో తన పాత్ర ఏమీ లేదంటారు. ఇది ఆశ్చర్య కలిగించే అంశం'' అని అలోక్ జోషీ అన్నారు.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను కాదని, నష్టాల్లో ఉన్న అంబానీ కంపెనీని ఈ డీల్‌లో ఎలా భాగస్వామ్యులను చేస్తారంటూ ప్రతిపక్షాలు గత రెండేళ్లుగా ప్రశ్నిస్తున్నాయి. "యస్ బ్యాంక్ స్వాధీనం చేసుకున్న భవనాన్ని అంబానీ బీఎస్‌ఎస్ విద్యుత్ సంస్థ నుంచి కొన్నారు. బెస్ట్, టాటా కంపెనీలతోపాటు ముంబయికి విద్యుత్ సరఫరా చేసే సంస్థల్లో రిలయన్స్ పవర్ కూడా ఒకటి. దాన్ని ఇప్పుడు అదానీ కొన్నారు. ఈ వ్యాపారవేత్తలంతా ప్రభుత్వంతో కలిసి తిరుగుతుంటారు. వారి మధ్య ఒప్పందాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి లోపల ఏమి జరుగుతుందో చెప్పడం కష్టం.
కానీ, రఫెల్ విషయంలో రేపు ప్రభుత్వం ముందు ప్రశ్నలు తలెత్తితే, అంబానీ ఇబ్బందుల్లో పడితే అప్పుడు దస్ ఏవియేషన్ ఆందోళన చెందాల్సి ఉంటుంది. లేదంటే అంబానీ ఆ డీల్‌ను వేరొకరికి అమ్ముకోవాలి'' అని అలోక్ జోషీ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒకప్పుడు అన్నను మించిన తమ్ముడు...
ముకేశ్, అనిల్ అంబానీ విడిపోయిన తర్వాత రెండు సంవత్సరాల వరకు అంటే 2007 ఫోర్బ్స్ జాబితాలో కూడా సోదరులిద్దరూ సంపన్నుల జాబితాలో కనిపించారు. అప్పట్లో అనిల్ అంబానీకంటే అన్న ముకేశ్ కొంచెం ఎక్కువ ధనవంతుడు. ఆ సంవత్సరం ఫోర్బ్స్ జాబితా ప్రకారం అనిల్ అంబానీ ఆస్తి 45 బిలియన్ డాలర్లు కాగా, ముకేశ్ ఆస్తుల విలువ 49 బిలియన్ డాలర్లు.
2008లో అనిల్ తన అన్నను దాటిపోతారని చాలామంది అనుకున్నారు. ముఖ్యంగా రిలయన్స్ పవర్ పబ్లిక్ ఇష్యూ ముందు ఈ ఊహాగానాలు ఎక్కువగా వినిపించాయి.
అనిల్ అంబానీ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో షేర్ విలువ వేయి రూపాయలకు చేరుతుందని చాలామంది భావించారు. నిజంగా అదే జరిగితే అనిల్ ముకేశ్‌ను దాటేవారు.
పదేళ్ల కిందట అనిల్ అంబానీ అత్యంత ధనవంతుడైన భారతీయుడిగా అవతరించబోతున్నట్లు కనిపించారు.. అతని వ్యాపారం కొత్త కొత్త వెంచర్లతో దూసుకుపోయింది. అనిల్‌కు దూరదృష్టి, ఉత్సాహం ఎక్కువని, ఆయన 21వ శతాబ్దపు వ్యాపారిగా నిలిచారని, ఆయన నాయకత్వంలో భారతదేశం నుండి ఒక మహత్తర బహుళజాతి సంస్థ ఉద్భవిస్తుందని ఆర్థిక వ్యవహారాల నిపుణులు అప్పట్లో ఊహించారు. అనిల్ తన విమర్శకులను, అన్నయ్య ఆలోచనలను తప్పుగా నిరూపించబోతున్నాడని చాలామంది భావించారు. కానీ, ఇది జరగలేదు.
ధీరూభాయ్ జీవించి ఉన్నప్పుడు అనిల్ అంబానీని ఫైనాన్స్ మార్కెట్‌లో స్మార్ట్ ప్లేయర్‌గా పరిగణించేవారు. మార్కెట్ వాల్యుయేషన్‌లో ఆయన నిపుణుడని, తెలివిగా ఆలోచిస్తారని అప్పట్లో అనుకునేవారు. ఆ రోజుల్లో అన్న ముకేశ్‌కన్నా పేరుకన్నా ఆయన పేరే ఎక్కువగా వినిపించేది.

ఫొటో సోర్స్, Getty Images
పెరిగిన రుణభారం
2002లో అనిల్ అంబానీ తండ్రి ధీరు భాయ్ అంబానీ మరణించారు. ఆయన కాలంలో సంస్థ వేగంగా అభివృద్ధి చెందడానికి నాలుగు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. పెద్ద ప్రాజెక్టులను విజయవంతంగా నడిపించడం, ప్రభుత్వాలతో సమన్వయం, మీడియా మేనేజ్‌మెంట్, పెట్టుబడిదారుల అంచనాలను అందుకోవడం అనేవి ఈ కీలకాంశాలు.
ఈ నాలుగు విషయాలపై పూర్తి నియంత్రణ తీసుకోవడం ద్వారా ధీరుభాయ్ యుగంలోనూ, ఆ తర్వాతా కంపెనీ వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. ముకేశ్ అంబానీ ఈ నాలుగు విషయాలను దృష్టిలో ఉంచుకున్నారు. కానీ, అనిల్ వీటిని పక్కనబెట్టారు.
1980-90ల మధ్య ధీరుభాయ్ రిలయన్స్ గ్రూప్ కోసం మార్కెట్ నుంచి డబ్బును సేకరిస్తూనే ఉన్నారు. ఆయన స్టాక్ ధరలు ఎప్పుడూ మంచి లాభాలను చూపి, పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచాయి.
ముకేశ్ అంబానీ గత దశాబ్దంలో తన వ్యాపారాన్ని బాగా విస్తరించారు. ఇటు 2010లో గ్యాస్ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం అనిల్ అంబానీకి వ్యతిరేకంగా వచ్చింది. రిలయన్స్ పవర్‌ను రక్షించుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో దేశ, విదేశాలకు చెందిన బ్యాంకులు, ఆర్ధిక సంస్థల నుంచి అనిల్ అప్పులు చేయక తప్పలేదు.
గత దశాబ్దంలో అన్న వ్యాపారం దూసుకుపోగా, తమ్ముడి కంపెనీలు అప్పుల్లో కూరుకు పోయాయి. ఫోర్బ్స్ జాబితా ప్రకారం ముకేశ్ అంబానీ గత పదేళ్ళుగా భారతదేశపు అత్యంత సంపన్నుడు.

ఫొటో సోర్స్, Getty Images
అనిల్ అంబానీ మునక చిన్న ప్రమాదం కాదు
ఇప్పుడు ఆయన కంపెనీలు కొన్ని తమను దివాలా తీసిన కంపెనీలుగా గుర్తించాలని దరఖాస్తులు పెట్టుకున్నాయి. 61 ఏళ్ల అనిల్ అంబానీ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఆరోవాడు కాగా, ఇప్పుడాయన విలువ సున్నాకు పడిపోయింది.
నిన్న మొన్నటి వరకు బలమైన కంపెనీలు, రాజకీయ పార్టీలకు చెందిన సంస్థలు అప్పులు చెల్లించడానికి కొంత సమయం అడిగేవి. అయితే దివాలా తీసిన కంపెనీగా ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వ్యవహారంగా తయారైంది. బ్యాంకుల పరిస్థితి దుర్భరంగా మారింది. చట్టాలు కూడా మారిపోతున్నాయి.
ఇప్పుడు రుణగ్రహీతలు కంపెనీలను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ప్రకారం దివాలా తీసినట్లు ప్రకటించవచ్చు. చెల్లింపు విషయంలో రుణదాతను కోర్టుకు లాగవచ్చు. అనిల్ అంబానీకి తన కంపెనీలను అమ్మడం లేదా దివాలా తీసినట్లు ప్రకటించడం తప్ప వేరే మార్గం లేకపోవడానికి కారణం ఇదే.
రిలయన్స్ కుటుంబంపై సీనియర్ జర్నలిస్ట్ ఆలం శ్రీనివాస్, "అంబానీ వర్సెస్ అంబానీ: స్టార్మ్స్ ఇన్ ది సీ విండ్" అనే పుస్తకం రాశారు. "ధీరూభాయ్ నిజమైన వారసుడిని నేనేనని నిరూపించుకోడానికి ఇద్దరు సోదరులు ఒకప్పుడు పోటీపడ్డారు. కానీ, ఇప్పుడు ఆ పందెం ముగిసింది. అనిల్ తన అన్న ముకేశ్‌కంటే చాలా వెనుకబడి ఉన్నారు. ఏదో అద్బుతం జరిగి అనిల్ అంబానీ కోలుకోకపోతే అతను భారతదేశంలో విఫలమైన వ్యాపారిగా మిగిలిపోతారు. ఒకప్పుడు అతని ఆస్తి 45 బిలియన్ డాలర్లు. ఆయన వ్యాపారం కుప్పకూలడం చిన్న ప్రమాదం కాదు'' అని ఆయన అన్నారు.
"విడిపోయినప్పుడు అన్నదమ్ములిద్దరు ఒక్కరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. ప్రభుత్వం, మీడియాలో రెండువర్గాలు ఏర్పడ్డాయి. క్రమంగా ముకేశ్ అంబానీ మీడియా, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలకు దగ్గరయ్యారు. ఈ పోరాటంలో అనిల్ అంబానీ కొంతమంది కొత్త స్నేహితులను, కొంతమంది శత్రువులను కూడా సంపాదించుకున్నారు. మొత్తం మీద చాలా మంది ప్రభావవంతమైన నాయకులు, అధికారులు, సంపాదకులు ముకేశ్‌కు మద్దతివ్వడం మొదలుపెట్టారు. గతంలో అనురించిన విధానాల ద్వారా వీటిని తన కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు అనిల్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు" అని రాశారు.
ఇవి కూడా చదవండి:
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- దక్షిణ చైనా సముద్ర వివాదంలో భారత్‌ను అమెరికా ఓ అజేయ శక్తిగా ఎందుకు చూస్తోంది?
- వికాస్ దుబే ఎన్కౌంటర్, దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్.. రెండిటి మధ్య తేడా ఏమిటి?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్‌స్టర్' ఎలా అయ్యాడు?
- వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై ఎన్నెన్నో ప్రశ్నలు... అంతా సినిమా స్క్రిప్టులా ఎలా జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








