అనిల్ అంబానీని ఆదుకున్న ముఖేశ్ అంబానీ

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ తన సోదరుడు అనిల్‌ను జైలు శిక్ష నుంచి తప్పించేందుకు ఆర్థిక సాయం చేశారు.
ఈ డబ్బుతో ఆర్ కామ్ అధినేత అనిల్, స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్ సంస్థకు ఇవ్వాల్సిన బకాయిలు తీర్చేయడంతో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకున్నారు.
ఈ పరిణామాలతో ఇన్నాళ్లూ ఈ సోదరుల మధ్య ఉన్న వైరం కొత్తమలుపు తిరిగినట్లయింది.
ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ..'' క్లిష్ట పరిస్థితుల్లో నా వెన్నంటి నిలిచి.. ఆదుకున్న గౌరవనీయులైన అన్నగారు ముఖేశ్, ఆయన సతీమణి నీతాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు'' అని చెప్పారు. ఈ చర్య ద్వారా వారు కుటుంబ విలువల ప్రాధాన్యాన్ని రుజువు చేశారని చెప్పారు.
2002లో తండ్రి వీలునామా రాయకుండా చనిపోవడంతో ఈ సోదరుల మధ్య వివాదాలు తలెత్తాయి.
2005లో వీరి మధ్య వివాదం తీవ్రం కావడంతో రిలయన్స్ గ్రూపు రెండుగా విడిపోయింది.
సహజవాయువు విషయంలో వీళ్లు కోర్టుల్లోనూ న్యాయపోరాటాలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతకు ముందు అనిల్ అంబానీ, ఆర్.కామ్ సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల పట్ల యథాలాప వైఖరిని అవలంభించారని నిందించింది.
మరో నాలుగు వారాల్లో (మార్చి 19లోగా) స్వీడన్‌కు చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్‌కు రూ.453 కోట్ల బకాయి చెల్లించాలని, లేకుంటే అనిల్ అంబానీ మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఫిబ్రవరి 20న న్యాయస్థానం తేల్చి చెప్పింది.
అలాగే.. సుప్రీంకోర్టు న్యాయ సహాయ విభాగానికి అనిల్ అంబానీకి చెందిన మూడు కంపెనీలు కోటి రూపాయల చొప్పున నాలుగు వారాల్లో చెల్లించాలని, లేకుంటే నెల రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆదేశించింది.
కేసు పూర్వాపరాలు
రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ తన నెట్‌వర్క్ కార్యకలాపాలను కొనసాగించేందుకు, విస్తరించేందుకు ఎరిక్‌సన్ కంపెనీతో 2014లో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందానికి సంబంధించి ఆర్.కామ్ తమకు రూ.550 కోట్లు చెల్లించాల్సి ఉందని ఎరిక్‌సన్ గతేడాది సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఎరిక్సన్ సంస్థకు ఆ డబ్బును 120 రోజుల్లో చెల్లించాలని అప్పట్లో రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ను న్యాయస్థానం ఆదేశించింది.
కానీ, ఆ గడువులోగా ఆర్.కామ్ చెల్లించలేకపోయింది. తర్వాత మరో 60 రోజులు గడువును కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. అప్పుడు కూడా ఆర్.కామ్ విఫలమైంది.
అయితే, ఇప్పుడు గడువులోపే తమకు ఆర్.కాం చెల్లించిందని ఎరిక్సన్ వెల్లడించింది.
2007లో అంబానీ సోదరులు ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో అగ్రభాగంలో నిలిచారు. ముఖేశ్ అంబానీ 49 బిలియన్ డాలర్లతో దేశంలో అత్యధిక ధనవంతుల జాబితాలో ముందువరసలో నిలిస్తే ఆయన తర్వాతి స్థానంలో 45 బిలియన్ డాలర్లతో అనిల్ అంబానీ ఉన్నారు.
2008 నాటికి అనిల్ తన సోదరుడిని మించిపోతారని చాలా మంది భావించారు. రిలయన్స్ పవర్‌ను పబ్లిక్ ఇష్యూకు తీసుకరావడంతో అందరూ అలానే అంచనా వేశారు.
అనిల్ అంబానీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టులో ఒక్క షేరు ధర భవిష్యత్తులో రూ.వెయ్యికి చేరుతుందని చాలా మంది నమ్మారు. అది జరిగి ఉంటే, అనిల్ అంబానీ చాలా త్వరగానే ముఖేశ్ అంబానీని దాటిపోయేవారు. కానీ, అలా జరగలేదు.
మరోసారి 2018 ఫోర్బ్స్ ధనవంతుల జాబితాకు వస్తే ముఖేశ్ అంబానీ సంపద కాస్తంత తరిగింది. ప్రస్తుతం ఆయన సంపద 47 బిలియన్ డాలర్లగా ఉంది. కానీ, 12 ఏళ్ల కిందట 45 బిలియన్ డాలర్ల సంపద ఉన్న అనిల్ అంబానీ ఇప్పుడు బాగా వెనుకబడి పోయారు. ప్రస్తుతం ఆయన సంపద 2.5 బిలయన్ డాలర్లకు పడిపోయింది. బ్లూంబర్గ్ ఇండెక్స్ ఆయన ప్రస్తుత సంపదను 1.5 బిలియన్ డాలర్లగా లెక్కగట్టింది.
ధీరూభాయి అంబానీ వారసులు ఒకేలా ఉన్నారని నిరూపించడానికి ఇద్దరు సోదరులు మొదట్లో పోటీ పడ్డారు. కానీ, ఇప్పుడు రేసు ముగిసింది. అనిల్ అంబానీ పోటీ నుంచి వైదొలగారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇద్దరు సోదరుల మధ్య ప్రత్యేకత
ధీరూభాయి అంబానీ బతికి ఉన్నప్పుడు ఫైనాన్స్ మార్కెట్‌లో అనిల్ అంబానీని స్మార్ట్ ప్లేయర్‌గా అభివర్ణించేవారు. అప్పట్లో అన్న కంటే అనిల్‌కే ఎక్కువ పేరు ఉండేది.
అయితే, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ మీద దృష్టి పెట్టిన అనిల్... సోదరుడు ముఖేశ్ మాదిరిగా భారీ ప్రాజెక్టులను చేపట్టలేదని కొందరు విమర్శిస్తుంటారు.
రిలయన్స్ పవర్, టెలికాం రంగంలో అనిల్ చాలా సంపదను పోగొట్టుకున్నారు. కానీ, ఆయన దగ్గర ఉన్న రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్ఛర్ ఇప్పటికీ మంచి స్థితిలోనే ఉన్నాయి. వాటి షేర్లు కూడా మంచి ధరల్లో ఉన్నాయి. దీన్ని బట్టి అనిల్ అంబానీ పని అయిపోయిందని భావించడం సరికాదని చెప్పొచ్చు. ఇప్పటికీ ఆయన రేసులో ఉన్నారు.
ఆస్తి పంపకాల తగాదా సమయంలో ఇద్దరు సోదరులు ఒకరిపై ఒకరు బాగానే దాడి చేసుకున్నారు. ప్రభుత్వం, మీడియా కూడా చెరో వైపు ఉండేది. కానీ, నెమ్మదిగా మీడియాను ముఖేశ్ అంబానీ తనవైపు తిప్పుకున్నారు.
ఈ కొత్త యుద్ధంలో అనిల్ అంబానీ కొంతమంది కొత్త స్నేహితులను, కొత్త శత్రువులను సృష్టించుకున్నారు. కానీ, కీలకమైన రాజకీయ నేతలు, అధికారులు, పత్రికాధిపతులు ముకేశ్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
అనిల్ అంబానీ వైఫల్యానికి పరిస్థితులు, సొంత తప్పిదాలు ప్రధాన కారణంగా చెప్పొచ్చు.
ఇవి కూడా చదవండి
- ఆస్కార్స్ 2019: నామినేషన్ పొందిన సినిమాలు, దర్శకులు, నటులు
- ఇండియన్ ఆర్మీ: ‘‘కశ్మీర్ తల్లులకు విజ్ఞప్తి.. ఉగ్రవాదంలో చేరిన మీ పిల్లలు లొంగిపోవాలి.. లేదంటే చావక తప్పదు’’
- అంతర్జాతీయ న్యాయస్థానం: దేశాల మధ్య వివాదాలను ఎలా పరిష్కరిస్తుంది?
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- భారత్‌లో సౌదీ యువరాజు: ఈ రెండు దేశాల మధ్య స్నేహానికి అడ్డుగా నిలిచిందెవరు
- ఇయర్ ఫోన్స్ చెవిలో ఎంతసేపు పెట్టుకోవాలి
- పుల్వామా దాడి: రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
- ఇప్పుడు ప్రపంచ వింతలన్నీ దిల్లీలోనే చూడవచ్చు
- యూట్యూబ్: భూమి బల్లపరుపుగా ఉందని చెబుతోందా?
- ఇయర్ ఫోన్స్ చెవిలో ఎంతసేపు పెట్టుకోవాలి
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








