ఆంధ్రప్రదేశ్: మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం.. అమరావతిలో నిరసనలు

ఫొటో సోర్స్, facebook/biswabhushan harichandan
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి బిల్లు-2020, ఏపీ సీఆర్‌డీఏ రద్దు బిల్లు-2020లకు రాష్ట్ర గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం పలికారు.
ఈ ఏడాది జనవరి నెలలో ఈ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం పలికింది. అయితే, శాసనమండలిలో ఈ బిల్లులను చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపించారు.
ఆ తరువాత జూన్ 17న శాసనసభ నుంచి రెండోసారి ఈ బిల్లులను మండలికి పంపించారు. అయితే, వీటిని ప్రవేశపెట్టడానికి ముందే మండలి ఆ రోజు నిరవధికంగా వాయిదా పడింది. దాంతో దానిపై ఎలాంటి నిర్ణయం వెలువడకుండా అలానే ఉండిపోయింది.
అయితే, మండలికి రెండుసార్లు పంపిన తరువాత నెల రోజుల గడువు పూర్తయితే అలాంటి బిల్లులు ఆమోదం పొందినట్లే పరిగణించొచ్చంటూ ప్రభుత్వం వాటిని ఇటీవల గవర్నరు ఆమోదానికి పంపించింది. గవర్నరు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

ఫొటో సోర్స్, FB/SUCHARITHA
ఇంతకీ బిల్లులో ఏముంది?
విశాఖపట్నాన్ని పరిపాలన, అమరావతిని శాసన, కర్నూలును న్యాయ రాజధానులుగా పరిగణిస్తూ ఈ బిల్లు రూపొందించారు.
సెక్రటేరియేట్, గవర్నర్ కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటవుతాయని, అసెంబ్లీ అమరావతిలో ఉంటుందని, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేస్తామని బిల్లులో వివరించారు.
జనవరి నెలలో ఈ బిల్లుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమై ఆమోదం పలికాక అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అక్కడ ఈ బిల్లు ఆమోదం పొందగా మండలిలో మాత్రం పాలక వైసీపీకి బలం తక్కువగా ఉండడంతో ఆమోదం దక్కలేదు.
లోకల్ జోన్లు, జోనల్ డెవలప్‌మెంట్ బోర్డులు ఏర్పాటు చేయాలని వికేంద్రీకరణ బిల్లులో ప్రతిపాదించారు.
"పరిపాలన సంబంధిత వ్యవహారాలు మొత్తం విశాఖ నుంచి జరుగుతాయి. రాజ్ భవన్, సచివాలయం, విభాగాల అధిపతుల(హెచ్‌వోడీ) కార్యాలయాలు విశాఖలో ఏర్పాటు చేయాలి. శాసన కార్యకలాపాలన్నీ అమరావతిలోనే సాగుతాయి. న్యాయ సంబంధిత కార్యకలాపాలు మొత్తం కర్నూల్ నగరం నుంచి జరుగుతాయి. న్యాయవ్యవస్థ ఆమోదం తెలిపిన తర్వాత అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలింపు మీద నిర్ణయం ఉంటుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలి" అని ఈ బిల్లులో పేర్కొన్నారు.
సీఆర్డీయే రద్దు బిల్లు ఏమిటి
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి ఏర్పాటు చేసిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ)ను రద్దు చేయడానికి ఉద్దేశించిన బిల్లు ఇది.
వికేంద్రీకరణ బిల్లును ఆమోదించినప్పుడే ఏపీ కేబినెట్, అసెంబ్లీ దీన్నీ ఆమోదించాయి.

ఫొటో సోర్స్, IANDPR
శాసనమండలిలో రగడ
ఆంధ్రప్రదేశ్‌లో కూడా దక్షిణాఫ్రికా తరహాలో మూడు రాజధానుల అవసరం ఉందని 2019 డిసెంబరులో జరిగిన శీతాకాలం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగన్ అసెంబ్లీ ప్రస్తావించారు.
ఆ సమావేశాల ముగింపులో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఆ వెంటనే జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ రావడం, బోస్టన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా పాలన వికేంద్రీకరణ బిల్లుతో పాటుగా సీఆర్డీయే రద్దు బిల్లు కూడా సిద్ధమైంది.
జనవరిలో మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఆ బిల్లుల ఆమోదానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అసెంబ్లీలో సునాయాసంగా బిల్లు ఆమోదించుకుని మండలిలో అడుగుపెట్టిన ప్రభుత్వం ఆశించిన దానికి భిన్నంగా జరిగింది.
అప్పట్లో చంద్రబాబు స్వయంగా మండలి గ్యాలరీ లో ఉన్నారు. వైసీపీ నేతలు కూడా మండలి గ్యాలరీ నుంచి ప్రోసీడింగ్స్‌ని ఫాలో అయ్యారు.
చివరకు మండలి చైర్మన్ తన విచక్షణాధికారం ప్రకారం బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు ప్రకటించారు.
దాంతో పాలకపక్షం నిరసన వ్యక్తం చేసింది. ఆ వెంటనే మండలి రద్దుకి అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకంగా కేంద్రానికి పంపించాలని నిర్ణయించి , అమలు చేసింది.

ఫొటో సోర్స్, Tdp
అమరావతి కోసం ఉద్యమం
అదే సమయంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగింది. టీడీపీ , జనసేన కూడా మద్ధతు పలికాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్వయంగా రాజధాని అమరావతి ప్రాంతంలో నిరసనలకు హాజరయ్యారు. ఇతర విపక్ష నేతలు కూడా మద్ధతు పలికారు.
బీజేపీలో అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. రాజదాని తరలింపుని అడ్డుకుంటామని ప్రకటించారు.

ఫొటో సోర్స్, TWITTER/@IPR_AP
న్యాయ ఆటంకాలు, వివాదాలువాటికితోడుగా న్యాయపరమైన ఆటంకాలతో రాజధాని వ్యవహారం ఊగిసలాటలో పడింది. రాజధాని తరలింపు, అమరావతి అంశానికి సంబంధించి పలు పిటీషన్లు దాఖలయ్యాయి.
ప్రభుత్వాన్ని కోర్టు పలుమార్లు ప్రశ్నించింది. ఏపీ ప్రభుత్వం చివరకు స్పష్టతనిస్తూ శాసన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే రాజధాని విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని తేల్చేసింది. మరోవైపు సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు మండలి చైర్మన్ చేసిన ప్రకటనను కార్యదర్శి తోసిపుచ్చారు. సెలక్ట్ కమిటీకి బిల్లుని పంపించాలంటే దానికి ముందుగా జరగాల్సిన ప్రక్రియ ఏదీ జరగనందున అలాంటి అవకాశం లేదని తేల్చేశారు.
కార్యదర్శి తీరుని చైర్మన్ తప్పుబట్టారు. గవర్నర్ కి ఫిర్యాదు కూడా చేశారు.అ యినా ఫలితం దక్కలేదు. సెలక్ట్ కమిటీకి మండలిలోని అన్ని పక్షాలు తమ సభ్యుల జాబితా అందించగా, వైసీపీ మాత్రం నిరాకరించడంతో సెలక్ట్ కమిటీ ఏర్పాటు జరగలేదు.
అయితే చైర్మన్ ప్రకటన ఆధారంగా బిల్లులు సెలక్ట్ కమిటీ పరిధిలో ఉన్నట్టేనని టీడీపీ వాదిస్తోంది. దాని మీద టీడీపీ ఎమ్మెల్సీ దిలీప్ రెడ్డి వంటి వారు కోర్టుని ఆశ్రయించారు. చివరకు గత బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఈ రెండు బిల్లులు అసెంబ్లీలో రెండోసారి ఆమోదం పొంది మండలిలో చర్చకు సిద్దం అయ్యాయి.
కానీ విపక్షాలు అడ్డుపడడంతో కీలక బిల్లుల ఆమోదం లేకుండానే సభ నిరవధికంగా వాయిదా పడింది.
రూల్ బుక్ ఏం చెబుతోంది
అయితే నిబంధనల ప్రకారం రెండోసారి అసెంబ్లీ ఆమోదంతో మండలికి వచ్చిన బిల్లుని ఆమోదించకపోతే మనీ బిల్లు 14 రోజుల్లో, ద్రవ్యేతర బిల్లు 30 రోజుల్లో ఆమోదం పొందినట్టేనని రూల్ బుక్ చెబుతోంది.
దానిని ఉపయోగించుకుని ద్రవ్యవినిమయ బిల్లుని కూడా ఆ రీతిలోనే ఆమోదం దక్కించుకున్న జగన్ ప్రభుత్వం ఈనెల 18వ తేదీన గవర్నర్‌కు రెండు బిల్లులను పంపించారు.
సుమారు 13 రోజుల పాటు వివిధ వర్గాల అభిప్రాయాలను తీసుకున్న గవర్నర్ చివరకు ఆమోదం తెలపడంతో చట్టంగా మారాయి.
విపక్షం దీనిపై న్యాయపరంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది.

ఫొటో సోర్స్, kanakamedala ravindra kumar
అసలు ఈ బిల్లులు ఆమోదించే అధికారం రాష్ట్రానికి లేదు: టీడీపీ ఎంపీ కనకమేడల
ఏపీ పునర్విభజన చట్టానికి భిన్నంగా గవర్నరు నిర్ణయం తీసుకున్నారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ‘బీబీసీ’తో ఆయన మాట్లాడుతూ.. ‘‘పునర్విభజన చట్టంలోని అంశాలకు విరుద్ధంగా ఉన్న బిల్లులు ఆమోదించారు. ఇది కేంద్ర చట్టానికి విరుద్ధం. అసలు ఈ బిల్లులు పాస్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.
రాజధాని నిర్ణయించడానికి ఒకేసారి అధికారం ఉంది. దాని ప్రకారం కేపిటల్ ఏర్పాటు చేశారు. దాన్ని గుర్తించి ప్రధాని వచ్చి నిధులు ఇచ్చి, శంకుస్థాపన చేశారు. ఆరేళ్లుగా అక్కడే పాలిస్తున్నారు.
ఈ సమయంలో రాజధాని మార్పు బిల్లు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం. దానికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ కూడా రాజ్యాంగ విరుద్ధంగానే సాగింది. ఇప్పటికే ఈ అంశంపై కోర్టుల్లో పిటిషన్లు ఉన్నాయి. అక్కడేమో సెలెక్ట్ కమిటీలో ఉందని చెప్పారు. మండలిలో బిల్లు ప్రవేశ పెట్టలేదు అసలు. సాంకేతిక కారణాలు చూపించి పంపేశారు.
ఇక సీఆర్డీయే బిల్లు విషయంలో చట్ట ప్రకారం రైతులతో అగ్రిమెంట్లు చేసుకున్నారు. ప్లాట్లు, ప్లాన్లు ఇచ్చారు. షరతులతో కూడిన ఎగ్రిమెంటు చేసుకున్నారు. కానీ దాన్ని అమలు చేయకుండానే ఏకపక్షంగా సీఆర్డీయేని రద్దు చేశారు.
ఆ అగ్రిమెంట్లకు వ్యతిరేకంగా ఉన్న చర్య చెల్లదు. దానికితోడు రాజధానిపై ఇప్పటి వరకూ పెట్టిన 10 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. 33 వేల ఎకరాల భూముల్ని బీడు పరుస్తున్నారు. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాలు న్యాయ సమీక్ష ముందు నిలబడవు’’ అన్నారు.
ఇది బ్లాక్ డే: అనగాని సత్యప్రసాద్
''ఇది బ్లాక్ డే. గతంలో రాజధానిని అన్ని పార్టీలూ ఆమోదించాయి. ఒక్క తెలుగుదేశమే కాదు. బీజేపీ సహా అందరూ ఆమోదించారు.
ప్రధాని మోదీ గారు తిరుపతిలో కూడా చెప్పారు. జగన్ కూడా రాజధాని మార్చబోను అని చెప్పే ఎన్నికలకు వెళ్లారు. విశాఖపట్నం అభివృద్ధి ముఖ్యమే. కానీ ఇక్కడ ప్రజలను మాత్రం మోసం చేశారు.
ఇది ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో బ్లాక్ డే. ఎదిగే పాపను ముక్కలు చేయడమే. భవిష్యత్తరాలను ఇబ్బందుల్లోకి నెట్టారు.'' అన్నారు తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్.
వికేంద్రీకరణ మంచి నిర్ణయం: ఉండవల్లి శ్రీదేవి
''సీఆర్డీయే బిల్లు రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ చట్టాలను గవర్నర్ ఆమోదం పొందినందుకు నేను సంతోషిస్తున్నాను.
గత సీఎం బాహుబలి 5 లాంటి రాజధాని కలగంటే, నేటి సీఎం బహు నగరాల రాజధాని కలగన్నారు. వికేంద్రీకరణ మంచి ఆదర్శం.
పైగా ఈ డిజిటల్ యుగంలో పాలన, వ్యవహారాలు ఎక్కడి నుంచైనా చక్కబెట్టవచ్చు.
పలు ప్రాంతాలకు దగ్గరలో పెద్ద నగరాలు ఉంటే వారికి భరోసా ఉంటుంది. అదే విషయం అన్ని కమిటీలు, హైపవర్ కమిటీ చెప్పింది. ఇక ప్రస్తుత అమరావతిని హైటెక్ ఎగ్రి జోన్ గా లేదా ఫుడ్ ప్రొసెసింగ్ జోన్ గా చేయవచ్చు.
ఎడ్యుకేషన్ హబ్ గా చేయవచ్చు. రాజధానికి ఖర్చు పెట్టాలనుకున్న డబ్బు ఇరిగేషన్లో పెట్టొచ్చు.'' అన్నారు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.
ఇవి కూడా చదవండి:
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








