మిస్ ఇండియా సినిమా రివ్యూ: కళతప్పిన కేరెక్టర్లు

మిస్ ఇండియా

ఫొటో సోర్స్, @trendskeerthy

    • రచయిత, శతపత్ర మంజరి
    • హోదా, బీబీసీ కోసం

"ఒక అమ్మాయికి ఏం తెలుసు" అన్న వాక్యం కేవలం సందేహం మాత్రమే అయితే చాలా ఉదాహరణలు చెప్పవచ్చు. కానీ అదే ధిక్కారమైతే.. సమాధానం కేవలం విజయం ద్వారా మాత్రమే తెలుస్తుంది.. అన్నదానికి దృశ్య రూపమే "మిస్ ఇండియా" సినిమా.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్, నరేంద్ర నాథ్ దర్శకత్వంలో, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఈ సినిమా వచ్చింది.. మహానటి తరువాత కీర్తి సురేష్ నటించబోయే తెలుగు సినిమా ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠను ఆమె అభిమానులకు కలుగజేసిన ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లో గురువారం విడుదలయింది.

సినిమా ఎలా ఉంది?

మానస సంయుక్త (కీర్తి సురేశ్‌)కు గ్రేట్ బిజినెస్ పర్సన్‌గా ఎదగాలన్నది చిన్నప్పటి నుండి బలంగా వేళ్ళూనుకున్న కోరిక. ఆ కోరిక ఆమెలో జనించడానికి తాత (రాజేంద్రప్రసాద్) మోటివేటర్. లమ్మసింగి అనే చిన్న గ్రామంలో ఒక సాధారణమైన బ్యాంకు ఉద్యోగి (నరేష్) కూతురు మానస సంయుక్త.

అలాంటి మధ్యతరగతి కుటుంబంలో ఇంటి పెద్ద అయిన తండ్రి ఆల్జీమర్స్ అనే వ్యాధి బారిన పడడంతో కుటుంబం ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది(?) "నేను గొప్పదాన్ని అవ్వడం కాదు తాతయ్య... నువ్వు ఎంత గొప్పవాడివో ఈ ప్రపంచానికి తెలియజేస్తా'' అన్న మానస సంయుక్త ఆ తాత గొప్పతనాన్ని ఖండాంతరాలు దాటించి అమెరికాలో ఎలా నిరూపిస్తుంది?

ఆ ప్రయాణంలో కైలాష్ శివకుమార్ (జగపతిబాబు), విజయ్ (నవీన్ చంద్ర), విక్రమ్ (సుమంత్ శైలేంద్ర) లాంటి పాత్రలు ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతాయి? లాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిస్ ఇండియా సినిమా నేపథ్యం.

మిస్ ఇండియా

ఫొటో సోర్స్, @trendskeerthy

తెలుగు సినిమాలలో ఎందుకు నెలకొన్నదో తెలియదు కానీ ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి నెలకొన్నది. అదేమిటంటే లేడీ ఓరియంటెడ్ మూవీ అనగానే అయితే పోలీస్ పాత్ర లేదంటే ఎవరైనా సెలబ్రెటి ఆత్మకథ. ఆ ఔట్ డేటెడ్ ఫార్ములాను బ్రేక్ చేసి కెరియర్ నచ్చినట్లు బిల్డ్ చేసుకున్నట్లుగా చూపించడం హర్షంచదగిన విషయం.

"ఒక అమ్మాయికి ఇల్లు ఇస్తే కుటుంబాన్నిస్తుంది. కిరాణా సరకులు ఇస్తే మంచి భోజనం పెడుతుంది. ఆనందాలను ఇస్తే ప్రేమను పంచుతుంది. మోజు తీర్చుకుంటే పవిత్రమైన ఒక శిశువుకు జన్మనిస్తుంది. ఆమెకు ఏది ఇచ్చినా తిరిగి రెట్టింపులో ఇస్తుంది. అది మంచైనా, చెడైనా..." అంటుంది కీర్తి సురేష్ సినిమాలోని ఒక సంధర్భంలో. ఆ మాటలు స్త్రీ సాధికారతకు అద్దం పడతాయి.

ఒక ఇంట్లో బెస్ట్ పేరెంటింగ్ ఉంటే పిల్లలు ఎంతటి బలమైన వ్యక్తిత్వాలుగా రూపుదిద్దుకుంటాయో తెలియజేస్తుంది ఈ సినిమా. "మిస్ ఇండియా" అనగానే ఇదేదో అందాల పోటీకి సంబంధించిన సినిమానేమో అని అనుకుంటే పొరపాటే. అమ్మాయిల కెరియర్ అనగానే కేవలం శరీరకొలతలు, రంగు, హంగుగా... ట్యూన్ చేసి ఉన్న సమాజంలో మిస్ ఇండియా అంటే "ప్రతి మనిషి జీవితానికో లక్ష్యం ఉండాలని.. దానికోసం కష్టపడాలి" అని తెలుపుతుంది.

ఇండియాలో ఒక సాధారణమైన యువతిగా తొణకని నటనను కనబరిచిన మానస సంయుక్త, అమెరికాలో టాప్ వన్ బిజినెస్ పర్సన్‌తో తలపడేప్పుడు కూడా అంతే సెటిల్డ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తుంది. అయితే చిన్నతనంలో ఇంటి వాతావరణం, ఆ పాత్రల మధ్య సంభాషణలు సహజంగా కాకుండా ఎవరినో అనుకరిస్తున్నట్లుగా ఉంటాయి.

మిస్ ఇండియా

ఫొటో సోర్స్, Netflix

ఇంకా మానస సంయుక్త అక్క ప్రేమ పెళ్ళి, బిజినెస్ పరమైన ఎత్తుగడలు కూడా నాటకీయంగా అనిపిస్తాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం తెలుగులో స్త్రీ ప్రధాన పాత్ర సినిమాలు చాలా అరుదని చెప్పుకోవాలి. అందులోనూ నటించి, మెప్పించి, ఒప్పించగల నటీమణులు బహు అరుదు. ఆ అరుదైన జాబితాలో మొదటి శ్రేణిలో కీర్తి సురేష్ పేరు ముందుండబోతున్నదని తన నటన ద్వారా ప్రతి సినిమాలో అంచెలంచెలుగా నిరూపించుకుంటోంది.

అయితే మోస్తరుకు మించి సన్నబడడం మూలాన అనుకుంటా.. కీర్తి సురేష్ మొహంలో ఇదివరకటి సినిమాలతో పోలిస్తే కళ తగ్గినట్లుగా కనపడుతుంది. అందుకు తగినట్లే మేకప్ కూడా బాలేదు. అలాగే భయానకమైన విలనిజంతో చాలా సినిమాలలో నటించి మెప్పించిన జగపతిబాబు లాంటి సీనియర్ విలన్ ఈ సినిమా పరిధికి మించినట్లుగా అనిపిస్తుంది. ఇక నవీన్ చంద్ర ప్రతి సినిమాలో ఒకేలాగ నటించాలన్న నియమం ఏదైనా పాటిస్తున్నాడేమోనన్న అనుమానం కలుగకమానదు.

గొప్పతనం అనేది ఒక లక్షణం... అది ఒకరు గుర్తించడం వల్ల రాదు.. ఒకరు గుర్తించకపోవడం వల్ల పోదు. ఎంత కష్టపడ్డామన్నది ముఖ్యం కాదు... ఎంత ఆనందంగా ఉన్నాం అనేదే ముఖ్యం... అని చిన్నతనం నుండి తాత చెప్పిన మాటలనే జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ... కాలంతోపాటు పరుగెత్తే యువతిగా కీర్తి సురేష్ బాగా నటించారు.

అలాంటి బలమైన పాత్రకు అంతే బలమైన ప్రత్యర్థిగా జగపతిబాబు, "కాంప్రమైజ్‌ అనేది మనల్ని ప్రతి రోజు పలకరించే క్లోజ్‌ ఫ్రెండ్‌, అబద్ధం అనేది మన పక్కనే ఉండే నెయిబర్‌, అడ్జస్ట్‌మెంట్‌ అనేది మనల్ని వదలని లవర్‌..." అన్న ఫిలాసఫీతో ఒక లిమిటెడ్ వ్యక్తిత్వంతో బతికే యువకుడిగా నవీన్ చంద్ర ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేయలేకపోయాడనిపిస్తుంది.

మిస్ ఇండియా

ఫొటో సోర్స్, Netflix

బిజినెస్ డీల్ లాంటిదే జీవితమని నమ్మే సుమంత్ శైలేంద్ర తన పరిధిలో పర్వాలేదనిపిస్తాడు. ఒక మారుమూల ప్రాంతంలో ఆయుర్వేద వైద్యుడిగా రాజేంద్రప్రసాద్ బాగా నటించినప్పటికీ ఆ పాత్ర ప్రవర్తన సహజంగా కాకుండా నాటకీయంగా అనిపించడం దర్శకుడి పొరపాటుగా చెప్పుకోవాలి. ఆల్జీమర్స్ పేషెంట్‌గా నరేష్, సాధారణమైన తల్లిగా నదియా, కమల్ కామరాజు, పూజిత పొన్నడ.. ఇలా ఎవరి పాత్రకు వాళ్ళు న్యాయం చేసారని చెప్పవచ్చు.

సాధారణమైన సంఘటనల నుండి అసాధారణమైన సంఘటనల వరకు (కొన్నిచోట్ల మినహాయిస్తే) నిలకడగా నడపడంలో దర్శకుడు నరేంద్రనాథ్ మెప్పించగలిగాడనే చెప్పాలి. చాలా చోట్ల సినిమా పరిధి మేరకు భావోద్వేగాలను పలికించగలిగినప్పటికీ.. కొన్ని చోట్ల మరీ తేలికగా పలుచగా అనిపిస్తాయి. చాలా చోట్ల తప్పులు దొర్లినప్పటికీ మంచి ప్రయత్నంగా భావించవచ్చు. కొంతమంది అమ్మాయిలైనా ఆత్మగౌరవంతో ధైర్యంగా బతకడానికి కావాల్సిన ఇన్‌స్పిరేషన్ కలుగచేస్తుందనడంలో సందేహం లేదు.

"అదేపనిగా చేస్తే చారిటీ.. మిగిలింది కదానని ఇస్తే హ్యుమానిటీ", "కష్టమనేది రెడీమేడ్ వస్తువు కాదు కొనుక్కొని మన సొంతం చేసుకోవడానికి.." లాంటి సంభాషణలు రచయితలుగా నరేంద్రనాథ్, తరుణ్‌కుమార్‌ల పెన్ పవర్ తెలియజేస్తుంది.

కేవలం సుజిత్ వాసుదేవ్ కెమెరా పనితనం వల్లే సినిమాలో రిచ్ లుక్ కనపడిందేమో అన్నట్లుగా ఉంటుంది. కొంతసేపే అయినప్పటికీ లమ్మసింగి అందాలను తాజా టీ అంత అందంగా పట్టించాడు. అలాగే అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథలో కూడా కెమెరా పనితీరు బాగా ఆకట్టుకుంటుంది. ఇంకా తమన్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)