డ్రగ్స్ స్కాంలో దక్షిణాది సినీ తారలకు బిగుస్తున్న ఉచ్చు... ఇంకా చాలా పేర్లు బయటకు వస్తాయా?

రాగిణి ద్వివేది

ఫొటో సోర్స్, FACEBOOK/SPOTLIGHT.RAGINIDWIVEDI

ఫొటో క్యాప్షన్, రాగిణి ద్వివేదితో పాటు మరో నటిని కూడా బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

ఒకవైపు బాలీవుడ్‌లో డ్రగ్స్ ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తోంటే.. మరోవైపు దక్షాణాదిలో కన్నడ చిత్రసీమను సినీ రంగాన్ని కూడా డ్రగ్స్ దందా ఆరోపణలు చుట్టుముడుతున్నాయి.

సినీతారలు రాగిణి ద్వివేదీ, సంజనా గల్రానీ సహా నలుగురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పడు లాగింది తీగ మాత్రమేనని, ఇంకా డొంక కదలాల్సి ఉందని వారు చెప్తున్నారు.

సంజనా గల్రానీ కన్నడతో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లోనూ నటించారు. ‘బుజ్జిగాడు... మేడ్ ఇన్ చెన్నై’ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

రాగిణి ద్వివేది కన్నడ, మలయాళం, తమిళం చిత్రాల్లో నటించారు. తెలుగులో ‘జెండాపై కపిరాజు’ అనే చిత్రం చేశారు.

అరెస్టైన వారిలో ఈ ఇద్దరూ ఉండటంతో కన్నడ చిత్ర పరిశ్రమ షాక్ తింది.

బెంగళూరులోని రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (ఆర్‌టీఓ) ఉద్యోగిని బెంగళూరు పోలీస్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు విచారించగా, నగరంలో హైప్రొఫైల్ పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ఈవెంట్ మేనేజర్ గురించి వెలుగుచూసింది.

ఆ ఈవెంట్ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేసి, విచారించారు. రాగిణి, సంజనా పేర్లు ఈ విచారణలోనే బయటకువచ్చాయి.

‘బెంగళూరులోని సినీ నటులు, మ్యుజీషియన్లు కూడా డ్రగ్స్ తీసుకున్నవారిలో ఉన్నారు’

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ‘బెంగళూరులోని సినీ నటులు, మ్యుజీషియన్లు కూడా డ్రగ్స్ తీసుకున్నవారిలో ఉన్నారు’

డ్రగ్స్ దందాకు సంబంధించి ఆర్.రవీంద్రన్, మహమ్మద్ అనూప్‌లతో పాటు అనిఖా అనే మహిళను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసింది. ఎమ్‌డీఎమ్‌ఏ మాత్రలు, ఎల్‌ఎస్‌డీ బిళ్లల్లాంటి సింథటిక్ డ్రగ్స్‌ను వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకుంది.

మొదటగా అనిఖా ఫోన్ కాంటాక్ట్స్‌లోనే రాగిణి పేరు ఎన్‌సీబీకి కనిపించింది. మరోవైపు అనూప్ ఫోన్‌లో కేరళం సీపీఎం జనరల్ సెక్రటరీ కొడియెరి బాలకృష్ణన్ కొడుకు కొడియెరి బినీష్ కాంటాక్ట్‌ను గుర్తించింది.

‘‘సమాజంలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తులకు వీళ్లు డ్రగ్స్ సరఫరా చేసేవారని ప్రాథమిక విచారణలో తేలింది. బెంగళూరులోని సినీ నటులు, మ్యుజీషియన్లు కూడా వీరి నుంచి డ్రగ్స్ పొందినవారిలో ఉన్నారు. కాలేజీ విద్యార్థులు, గ్యాంగ్‌స్టర్లకు కూడా వీరు సరఫరా చేసేవారు’’ అని ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ అమిత్ ఘవాటే ఓ ప్రకటనలో తెలియజేశారు.

ఈ ప్రకటన తర్వాత కన్నడ సినీ డైరెక్టర్ ఇంద్రజీత్ లంకేశ్.. కన్నడ చిత్ర సీమలో డ్రగ్స్ దందాతో సంబంధమున్న వ్యక్తులుగా ఆరోపిస్తూ 15-20 మంది పేర్లతో కూడిన జాబితాను పోలీసులకు అందజేశారు.

‘‘ఎల్‌ఎస్‌డీ, కొకైన్ లాంటి డ్రగ్స్ ఇప్పుడు స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న పిల్లలకు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరం. అందుకే నేను ఈ పని చేశా’’ అని లంకేశ్ బీబీసీతో చెప్పారు.

లంకేశ్ పోలీసులను కలిసిన తర్వాత డ్రగ్స్ దందాపై విచారణ తీవ్రమైంది. ఆర్‌టీఓ ఉద్యోగి శివ ప్రకాశ్ (రాగిణి స్నేహితుడు), రవిశంకర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాహుల్ శెట్టి (సంజనా గల్రానీ స్నేహితుడు)లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హైప్రొఫెల్ కేసులో మరింత మంది పేర్లు బయటకువచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

కన్నడ చిత్ర సీమలో డ్రగ్స్ దందాతో సంబంధమున్న వ్యక్తులుగా ఆరోపిస్తూ 15-20 మంది పేర్లతో కూడిన జాబితాను సినీ డైరెక్టర్ ఇంద్రజీత్ లంకేశ్ పోలీసులకు అందజేశారు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కన్నడ చిత్ర సీమలో డ్రగ్స్ దందాతో సంబంధమున్న వ్యక్తులుగా ఆరోపిస్తూ 15-20 మంది పేర్లతో కూడిన జాబితాను సినీ డైరెక్టర్ ఇంద్రజీత్ లంకేశ్ పోలీసులకు అందజేశారు

దిల్లీలో వీరేన్ ఖన్నా అనే వ్యక్తిని కూడా సీసీబీ అరెస్టు చేసింది. బెంగళూరులోని గేటెడ్ కమ్యూనిటీస్‌లో రహస్యంగా హైప్రొఫైల్ పార్టీలు వీరేన్ ఏర్పాటుచేసేవారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

వీరేన్ పోలీసు యూనిఫామ్‌తో ఉన్న ఓ ఫొటోను పోలీసులు గుర్తించారు. మొత్తంగా వీరేన్‌తో పాటు ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఆరుగురి పైనా కేసు పెట్టారు. నిందితుల్లో కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు.

ఈ డ్రగ్స్ దందా ఎంత పెద్దదన్న వివరాలు వెల్లడించేందుకు పోలీసు అధికారులు నిరాకరించారు. రాగిణి, సంజనా సహా అరెస్టైన వారి నివాసాల్లో ఏయే డ్రగ్స్ దొరికాయి, ఎంత మొత్తంలో దొరికాయి తదితర వివరాలు కూడా బయటపెట్టలేదు.

రాగిణి రిమాండు కోసం కోర్టుకు చేసిన దరఖాస్తులో రవిశంకర్‌, ఇంకా కొంతమందికి ఆమె ‘గుడ్ స్టఫ్’ (మంచి సరకు) కావాలంటూ ఫోన్‌లో సందేశాలు పంపినట్లు పోలీసులు ప్రస్తావించారు. డ్రగ్స్ కొనుగోలు చేయడం, కలిగి ఉండటం, కొకైన్ లాంటి సెకోపాథిక్, నార్కోటిక్ డ్రగ్స్ వాడటం, నేరపూరిత కుట్రకు పాల్పడటం వంటి అభియోగాలు ఆమెపై మోపారు.

‘‘చార్జ్ షీట్ ఫైల్ చేసేదాకా వివరాలన్నీ బహిర్గతం చేయలేం. ఇది ఒంటరిగా చేసిన పనో, ఈ ఒక్కసారి చేసిందో కాదు. ఉల్లిగడ్డ పొట్టు పొరలుపొరలుగా తీసుకుంటూ వెళ్లాలి. మేం కూడా జాగ్రత్తగా ఈ పనిచేస్తున్నాం’’ అని బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ బీబీసీతో అన్నారు.

ఈ అరెస్టులపై రాగిణి, సంజనాల న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

‘‘రాగిణి నివాసంలో గాలింపు చేపట్టిన పద్ధతి తప్పు. నిబంధనల ప్రకారం స్థానికంగా ఉండే ఇద్దరు గౌరవనీయ వ్యక్తుల సమక్షంలో గాలింపు చేపట్టాలి. అలా చేయలేదు. స్వాధీన పత్రం మీద రాగిణితో సంతకం పెట్టించడంలోనూ అక్రమాలు జరిగాయి. ఆ రిపోర్ట్ కన్నడలో ఉంది. ఆమెకు ఆ భాష చదవడం రాదు. మెమోను మేం పరిశీలించినప్పుడు కాంట్రాబాండ్ నార్కోటిక్స్ ప్రస్తావనే లేదు’’ అని రాగిణి న్యాయవాది పవన్ శ్యామ్ బీబీసీతో చెప్పారు.

‘‘సంజనా రిమాండు కోసం చేసిన దరఖాస్తులో ఆమె చేసిన నేరమేంటో పోలీసులు చెప్పలేదు. కనీసం ఆమెను నిందితురాలు అని కూడా పేర్కొనలేదు. అయినా, పోలీసులు ఆమె కస్టడీ కోరారు. మెజిస్ట్రేట్ మంజూరు చేశారు’’ అని సంజనా న్యాయవాది ఎస్ఎస్ శ్రీనివాస్ రావు బీబీసీతో అన్నారు.

తమ క్లయింట్లకు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించే యోచన చేస్తున్నట్లు పవన్ శ్యామ్, శ్రీనివాస్ రావు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)