కర్ణాటక: ఐస్‌క్రీముల్లో మత్తుమందు కలిపి పిల్లలకు ఎరవేస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆరోపణ- ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
కర్ణాటకలోని కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న ధనవంతుల పిల్లలను లక్ష్యంగా చేసుకుని కొందరు మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేశ్ కుమార్ ఆరోపించారంటూ ఈనాడు ఓ కథనం ప్రచురించింది.
బెంగళూరు నగరంలో పలు ముఠాలు పాఠశాలల వద్ద ఐస్‌క్రీముల్లో మత్తుమందు కలిపి విద్యార్థులకు ఇస్తున్నట్లు గుర్తించామని సురేశ్ కుమార్ తెలిపారు.
రాష్ట్రంలో పెరుగుతున్న డ్రగ్స్ వ్యాపారాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప సోమవారం హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రత్యేక బృందంతో ఈ వ్యాపారాలపై నిఘా పెంచాలని ఆదేశించారు.
మాదక ద్రవ్యాల రవాణా కేసులో ఇటీవల కన్నడ సినీ నటి రాగిణి ద్వివేది కూడా అరెస్టు అయ్యారు. ఆమెను పోలీసు కస్టడీ పంపించారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలుగు టీవీ సీరియల్ నటి ఆత్మహత్య
తెలుగు టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి మంగళవారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకున్నారని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.
హైదరాబాద్‌లోని మధురానగర్‌లో నివసిస్తున్న శ్రావణి బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో శ్రావణికి టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది.
అయితే గత కొంతకాలంగా శ్రావణిని దేవరాజ్ రెడ్డి వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావణి మంగళవారం రాత్రి సమయంలో బాత్రూంలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
బాత్రూంలోకి వెళ్లిన శ్రావణి ఎంతకీ రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు డోర్ పగలగొట్టి చూడగా శ్రావణి విగత జీవిగా పడి ఉన్నారు.
దేవరాజు రెడ్డి వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని శ్రావణి కుటుంబ సభ్యులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫొటో సోర్స్, PUBG
పబ్‌జీ కోసం తాత అకౌంట్ నుంచి రూ.2 లక్షలకు పైగా కాజేసిన 15ఏళ్ల మనవడు
పబ్‌జీ కోసం ఓ మనవడు తన 65 ఏళ్ల తాత అకౌంట్ నుంచి రూ.2,34,490 కాజేశాడని వెలుగు పత్రిక ఓ కథనం ప్రచురించింది.
దిల్లీల్లోని తిమార్‌పూర్‌కు చెందిన 15ఏళ్ల బాలుడికి పబ్‌జీ అంటే పిచ్చి. ఆ పిచ్చితోనే తన తాతకు తెలియకుండా మార్చి 7 నుంచి మే 8 మధ్యకాలంలో డెబిట్ కార్డ్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బుల్ని ట్రాన్స్ ఫర్ చేశాడు.
బాధితుడు తన అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవ్వడంపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ దర్యాప్తులో మనవడు పబ్‌జీ గేమ్‌లో ఎస్ ర్యాంక్ చేరుకునేందుకు ఎవరికో తన తాత డెబిట్ కార్డ్ అకౌంట్ నుంచి డబ్బుల్ని ట్రాన్స్ ఫర్ చేసినట్లు గుర్తించారు.
ఇలా మూడునెలల కాలంలో బాలుడు సుమారు రూ.2లక్షలకు పైగా డబ్బుల్ని పేటీఎం ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశాడని డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆంటో అల్ఫోన్స్ తెలిపారు. అంతేకాదు బాలుడు పబ్‌జీ ఎస్ ర్యాంక్ చేరుకున్న తరువాత పబ్జీ అకౌంట్‌ను బ్లాక్ చేసినట్లు గుర్తించామని వెల్లడించారు.
బాధితుడి డెబిట్ కార్డ్ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యే సమయంలో వచ్చే ఓటీపీ కోసం తన తాత మొబైల్ తీసుకునే వాడని, ఓటీపీ నెంబర్ యాడ్ చేసి ఆ వివరాలు డిలీట్ చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు.
డెబిట్ కార్డ్ నుంచి ట్రాన్స్ ఫర్ చేసిన పేటీఎం నెంబర్ ఎవరిదనే విషయంపై ఆరా తీస్తున్నట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆంటో అల్ఫోన్స్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో రెవెన్యూ కోర్టులు రద్దు
తెలంగాణలో ఇకపై రెవెన్యూ కోర్టులకు ఇక చెల్లుచీటీ పడనుందని సాక్షి ఓ కథనం ప్రచురించింది.
భూ వివాదాల పరిష్కారానికి ప్రతి శనివారం తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఈ రెవెన్యూ కోర్టులను నిర్వహించేవారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ సంప్రదాయానికి మంగళం పాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
బుధవారం శాసనసభ ముందుకు రానున్న భూ యాజమాన్య హక్కుల చట్టం-2020 (ఆర్‌ఓఆర్) బిల్లులో పొందుపరిచినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఇప్పటివరకు మండల స్థాయిలో తహసీల్దార్.. ఆపై అప్పిలేట్ అధికారిగా ఆర్డీవో.. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ భూ వివాదాలపై తీర్పులు చెప్పేవారు. ఈ క్రమంలో వివాదాల పరిష్కారానికి ఎడతెగని జాప్యం జరగడం, మితిమీరిన అవినీతి ఆరోపణలు రావడంతో వీటిని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రెవెన్యూశాఖ అధికారుల అధికారాలకు కత్తెరపడనుంది. ఈ క్రమంలోనే రెవెన్యూ కోర్టులను రద్దు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది?
- చైనా యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది... తరువాత ఏంటి?
- చైనా యాప్స్ బ్యాన్‌తో అయోమయంలో పడిన టిక్‌టాక్ స్టార్ భవితవ్యం
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం - ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది?
- గృహ హింస: ‘లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్‌లో రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులతో ‘పీప్లీ లైవ్’ను తలపిస్తున్న ఇల్లు
- ఎవరెస్ట్ ఎత్తు ఎంత? చైనా ఎందుకు మళ్లీ లెక్కిస్తోంది? 4 మీటర్ల తేడా ఎందుకు వచ్చింది?
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?కరోనావైరస్: సౌదీ అరేబియా ఎప్పుడూ లేనంత కష్టాల్లో కూరుకుపోయిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








